Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
వ్యాసుడు తన దివ్యదృష్టివలన దుర్యోధనుని దుష్టయత్నమును గురించి తెలుసుకున్నాడు. ధృతరాష్ట్రుని వద్దకు వచ్చినాడు "ధృతరాష్ట్రా! పాండవులు అడవిలో ఒంటరిగా ఉన్నారు నీకొడుకు దుర్యోధనుడు వారి మీదికి దండెత్తుటకు సిద్ధమయినాడు. ఇది ధర్మము కాదు. పాండవులు సత్యవంతులు. పరాక్రమవంతులు. వారి మీదికి దండెత్తి దుర్యోధనుడు అవమానముల పాలగును. కావున నీ కొడుకును వారింపుము".
"తండ్రీ! వేదవ్యాస మునీంద్రా! నాకు, గాంధారికి, భీష్మ, ద్రోణ, విదుర, కృపాచార్యులకు ఇష్టములేకున్నను దుర్యోధనుడు మాయా జూదమున పాండవులను ఓడించినాడు. దుర్యోధనుడు దుర్మార్గుడు. అయినను పుత్ర వ్యామోహముచేత వానిని విడువలేకున్నాను. అందుకు నీవే ఉపాయమును ఉపదేశించవలెను" అని వేడుకున్నాడు ధృతరాష్ట్రుడు.
అందుకు వేదవ్యాసుడు ఉపాయము ఉపదేశించినాడు.
"నాకు పాండురాజు, నీవు, విదురుడు సమానులు. నీవును దుర్యోధనాదులను, పాండవులను సమానముగా చూడవలెను. సత్పురుషుల సహవాసమున దుర్మార్గులు మారవచ్చును. కావున రాజర్షి, శాంతచిత్తుడు అయిన ధర్మరాజు వద్దకు దుర్యోధనుని పంపుము. అందువలన సర్వజనులకు మేలు కలుగును".
"మహాత్మా! దుర్యోధనుడు నా మాటలు వినడు. మీరే వానిని శిక్షించి కురు కులమును రక్షించవలెను" అని తన భారమును వ్యాసునకు ఒప్పచెప్పి నమస్కరించినాడు ధృతరాష్ట్రుడు.
"దుర్యోధనుని శిక్షించుటకు త్వరలోనే మైత్రేయ మహాముని ఇచటికి రాగలడు" అని చెప్పి వ్యాసమహర్షి అంతర్ధానుడు అయినాడు.
కొంతకాలము గడచినది. మైత్రేయుడు వచ్చినాడు. ధృతరాష్ట్రుడు అతనిని పూజించినాడు. మైత్రేయుని యాత్రను గురించి అడిగినాడు. పాండవుల కుశలమును గురించి అడిగినాడు. అప్పటికి దుర్యోధనుడు కూడ అక్కడికి చేరినాడు.
మైత్రేయుడు వివరించినాడు:-
"నేను తీర్థయాత్రలకు బయలుదేరినాను. కురు జాంగల పుణ్యస్థలమునకు వెళ్లినాను. అక్కడ పాండవులను చూచినాను. వారు కృష్ణాజినములు ధరించి, కందమూలములు తినుచు ధర్మాత్ములయి, శక్తివంతులయి ఉన్నారు. ఎల్లపుడు మునులు, ఋషులు వారి దగ్గరికి వచ్చి ధర్మబోధ చేయుచున్నారు. మహర్షుల ఆశీస్సులు పొంది పాండవులు తేజోవంతులయి ప్రకాశించుచున్నారు. పాండవులు సత్యవ్రతులు వారు నియమములను తప్పిన సూర్యచంద్రాదులు గతులు తప్పుదురు. నీకొడుకు దుర్యోధనుడు నిష్కారణముగా పాండవులకు కీడు తలపెట్టినాడు" అని దుర్యోధనునకు హితవు చెప్పినాడు:-
"దుర్యోధనా! నీవు బుద్ధితెచ్చుకొనుము. పాండవులతో విరోధము మానుము. పాండవులు అమిత పరాక్రమవంతులు. వారు ఇంద్రునివంటి తేజోవంతులు. వారు యుద్ధమునందు అపేక్ష కలిగి ఉన్నారు. అధిక ఉత్సాహవంతులయి ఉన్నారు. వారిలో భీముడు అత్యంత పరాక్రమవంతుడు. అతడు బకాసుర హిడింబాసురులను యుద్ధమున చంపినాడు. జరాసంధుని ద్వంద్వయుద్ధమున వధించినాడు. ఈమధ్య కిమ్మీరుడు అను రాక్షసుని వధించినాడు.
"పాండవులకు శ్రీకృష్ణ ప్రద్యుమ్నులు సంబంధ సహాయులయి ఉన్నారు. కావున మానవ మాత్రులు పాండవులను ఎదిరించి జీవించజాలరు. అందువలన పాండవులతో స్నేహముగా ఉండుటకు సమ్మతింపుము".
మైత్రేయుడు చెప్పుచున్నంత సేపు దుర్యోధనుడు పరధ్యానము నటించినాడు. కాలిబొటనవేలితో వలయములు గీసినాడు. చేతులు పైకి ఎత్తి వెకిలిగా నవ్వినాడు.
మైత్రేయుడు అదిచూచి కోపించినాడు. "దుర్యోధనా! నీకు కొవ్వెక్కినది. పాండవులకు అపరాధము చేసినది చాలక పరిహసింతువా? రానున్న రణక్షేత్రమున భీముడు తన గదతో నీరెండు తొడలు విరుచునుగాక" అని ఉగ్రముగా శపించినాడు.
మైత్రేయుని శాపము విని దుర్యోధనుడు లేచి వెళ్లి పోయినాడు. ధృతరాష్ట్రుడు గడగడలాడినాడు. కోపము విడిచి శాపము మాన్పమని మైత్రేయుని ప్రార్థించినాడు. "దుర్యోధనుడు సమబుద్ధి కలిగిన నా శాపము తొలగును. కాకున్న అగ్నివలె అతనిని దహించును" అని వెళ్లిపోవుటకు లేచినాడు. ధృతరాష్ట్రుడు మైత్రేయుని వారించినాడు. భీముడు కిమ్మీర రాక్షసుని వధించిన కథ వినిపించమని ప్రార్థించినాడు. "కిమ్మీర వధకు సంబంధించిన కథ విదురునకు తెలియును. అతని నుండి తెలుసుకొనుము" అని మైత్రేయుడు వెళ్లిపోయినాడు.
విదురుడు ధృతరాష్ట్రునకు చెప్పిన కిమ్మీరుని వృత్తాంతము ఈ విధముగా ఉన్నది. అది దుర్యోధనుడు కూడ విన్నాడు.
పాండవులు "ప్రమాణము" అను మఱ్ఱిచెట్టు నుంచి కామ్యక వనమునకు బయలుదేరినారు. పాండవులు ముందునడచినారు. బ్రాహ్మణ సమూహములు వెనుకనడచినవి. ఒకనాటి రాత్రి వారు కామ్యక వనమునకు చేరినారు. అప్పుడు భయంకరుడు అయిన ఒక రాక్షసుడు కనిపించినాడు. వాని కాలి తాకిడికి భూమి అదిరిపోయినది. తీగలు తెగిపడినవి. చెట్లు కూకటి వేళ్లతో కూలినవి. వాడు రాక్షసమాయ కల్పించినాడు. కొండవలె దారికి అడ్డముగా నిలచినాడు.
వానిని చూచినది ద్రౌపది అదిరిపడినది. పాండవుల మధ్యకు ఉరికినది. అప్పుడు ఆమె పంచపర్వత మధ్యమున ఉన్న నదీ దేవత వలె ప్రకాశించినది. పాండవులు అయిదుగురు ఆమెను పట్టుకొని భయము లేకుండునట్లు ఊరడించినారు. ధౌమ్యుడు తన మంత్ర ప్రభావమున వాని రాక్షసమాయలు అంతమొందించినాడు. ధర్మరాజు రాక్షసుని చూచి "నీవు ఎవ్వరవు? ఈ వనమందు ఎందుకున్నావు?" అని అడిగినాడు.
"ఓరీ! మనిషీ! ఇది నా వనము. నా పేరు కిమ్మీరుడు. ఇక్కడి జంతువులను భక్షింతును. ఇచటనే ఉందును. ఇచటికి మనుషులు రారు. వారు నన్ను చూచి వెరతురు. వచ్చిన వారిని భక్షింతును. మీరు ఎవరు? ఈ వనములకు ఏల వచ్చినారు?
అందుకు ధర్మరాజు "కిమ్మీరా! నేను ధర్మరాజును. ఇతడు భీముడు. అతడు అర్జునుడు. వీరు నకుల సహదేవులు" అని మాట పూర్తిచేయకముందే "ఎవడు? వీడా భీముడు! వీడేనా నా అన్న బకాసురుని చంపినవాడు! వీడేనా నా మిత్రుడు హిడింబాసురుని చంపినవాడు! వీనిని చంపుదును" అని భీముని మీదకు ఉరికినాడు.
రెండు పర్వతములు ఎదుర్కొన్నట్లు భీమ, కిమ్మీరులు ఎదుర్కొన్నారు. యుద్ధము చేసినారు. ఇద్దరును చెట్లను పెరికినారు. తలలమీద కొట్టుకున్నారు. అవి ఏనుగు తలకు తగిలిన తామర తూండ్లవలె పగిలిపోయినవి. ఆవిధముగా రెండున్నర గడియలు కొట్టుకున్నారు. అప్పటికి అక్కడి చెట్లు వడిసి పోయినవి. అప్పుడు ఉభయులు రాళ్లు అందుకున్నారు. వారికి భయంకరము అయిన శిలా యుద్ధము జరిగినది. భీముడు ఒక పెద్ద రాతిని ఎత్తినాడు. కిమ్మీరుని గుండెకు గురిచూచి కొట్టినాడు. కిమ్మీరుడు దెబ్బతగిలి బలహీనుడు అయినాడు. అయినను సూర్యుని పట్టిన రాహువువలె భీముని పట్టినాడు. భీముడు వదిలించుకున్నాడు. కిమ్మీరుని బలహీనతను గ్రహించినాడు. తన రెండు చేతులతో వాని మెడపట్టుకొని క్రింద పడవేసినాడు భీముడు కిమ్మీరుని వెన్నెముక విరిచి బకాసురుని చంపినట్లు ఘోరముగా వధించినాడు. కొండవంటి కిమ్మీరుని కళేబరమును ఎత్తి ఆవల పారవేసినాడు. ఆ వనమునందు ఉండువారికి రాక్షసభయము పోగొట్టినాడు.





