Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    నేను : ఒక్కసారి సరిగమలు అనరూ?
    బేగా : విను, స రి గ మ ప ద ని.
    నేను : ఊహు అంతేనా ? శ్రుతులు వేరుచేసి చూపాలి.
    బేగా : చాల సతాయిస్తావు. మీ గురువును అడుగకూడదు?
    నేను ; ఊహు మీరే చెప్పాలి.
    బేగా : సా   రి    గ    మ   ప   ద   ని.
       4 3 2 4 4 3 4
    చూశావా ఇరవై రెండు అయినాయి.
    నేను : (కొంటెగా) అయ్యో, వినలేదు మళ్ళీ.
    బేగా : అనను.
    నేను ; అనిపించందే కదలను.
    బేగా : (మళ్ళీ అనేసింది) విను, ఇక సతాయించకు.
    నేను : ఇప్పుడు సరిగ్గా ఇరవై రెండున్నాయి.
    బేగా ; సరే వెళ్ళు, రేపు రా.
    నేను : తంబూరా తెస్తాను ఒక్క పా ......
    బేగా : ఏం పాడాలి ?
    నేను : ధన్యాసి.
    బేగా : ఏం పాడాలి? ఆస్తాయీ, ధృపద్, తరానా?
    నేను : ధృపద్ పాడండి.
    బేగా : సరే విను.
       తన్ కీ తప్ తబ్ హి మిటే జబ్ ప్యార్ కూ దృష్ట్  భల్ దేఖ్ లూఁ
     జబ్ దర్శన్ పావూఁ గీ ఉస్ కీ తప్ హీ జనమ్ అప్నా దేఖూఁగీ
    అష్ట జామ్ మోహేనా కో రహత్ హై నజానే కబ్ దర్శన్ నీహుంగీ
    జో కో ప్రభూ ప్యార్ సే మిలాదే నాకే పాయన్ మే సీస్ టేకోఁ గీ.

    ఖానమ్ జాన్ వేశ్యలకు ఆటపాటలే కాక చదువు నేర్పే బడి కూడా ఉండేది. మౌల్వి సాహెబ్ కొలువు. మామూలు ప్రకారం నేను బడికి వెళ్ళాను. కాంతివంతమైన వదనం, తెల్లని కత్తిరించిన గడ్డం, సన్యాలు లాంటి దుస్తులు, వ్రేళ్ళకు వైడుర్యావర్ణపు నీలివర్ణపు ఉంగరాలు, వెండి పొన్ను గల అందమైన వంకర కర్ర, ఒక చేతిలో జపమాల, నల్లమందు డబ్బీ - ఇప్పటికీ ఆ రూపం కళ్ళ ముందున్నట్లుంటుంది.
    ఎంత నిర్మలమైన మనసు! మంచి నియమం గలవారు. బువాహుసేనీ తో ఆకస్మికంగా ఏదో జరిగిపోయింది. దాన్ని నేటివరకు నిలబెట్టారు. బువాహుసేనీ సైతం వారిని భర్తగా భావించేది. - వాచా , మనసా, ముసలివాళ్ళు చమత్కారంగా మాట్లాడుకునేవాళ్ళు , వారి మాటలు యువకులకు సైతం ఉత్తేజం కలిగించేవి. ఇల్లు ఎక్కడో జైద్ పురం వైపు. దేవుడిచ్చిన భూమి పుట్రా ఉన్నాయి. భార్యా, పెద్ద పెద్ద బిడ్డలూ ఉన్నారు. విద్యార్దియై లక్నో కు వేంచేశారు. ఇక్కడే ఉండిపోయారు. బహుశ మూడు నాలుగుసార్లు ఇంటికి వెళ్ళి ఉంటారు. మిత్రులూ, బంధువులూ ఇక్కడికే వచ్చేవారు. ఇంటి నుంచి కూడా అవీ ఇవీ వస్తుండేవి. ఖానమ్ పది రూపాయలిచ్చేవారు. అది బువాహుసేనీ చేతికి ఇచ్చేవారు. తిండి, త్రాగుడు , హుక్కా , నల్లమందు బువాహుసేనీ సమకూర్చేది . ఇంటి బాధ్యత బువాహుసేనీది . బట్టలు తేవడం కుట్టించడం కూడా ఆవిడే చేసేది. ఖానమ్ గారికి కూడా మౌల్వీ సాహెబ్ అంటే ఎంతో గౌవరం. వారి మూలాన బువాహుసేనీ ని కూడా గౌరవించేది.
    నా పోషణ భాద్యత బువాహుసేనీ వహించిందని చెప్పను. అందువల్ల మౌల్వీ సాహెబ్ నా విషయంలో ప్రత్యెక శ్రద్ధ తీసుకునేవారు. విశేషవాత్సల్యం కనబరచేవారు. వినయ విధేయతలు ప్రత్యేకం. ఇతరుల విషయంలో , నా విషయంలో కట్టుదిట్టాలు ఎక్కువగా ఉండేవి. పాషాణంలాంటి నన్ను మనిషినిగా తయారుచేసింది వారే. వారి పాదముల అనుగ్రహం వల్లనే ఎంత పెద్ద అమీర్ల, అధికారుల గోష్టికి వెళ్ళినా నా అంతస్తుకంటే ఎక్కువ గౌవరం లభించింది. వారి దయ వల్లనే మీలాంటి విద్యావంతుల సమావేశాల్లో పెదవి కదిపే ధైర్యం వచ్చింది. రాజుల దర్బారులలో పాల్గొనే అదృష్టం లభించింది. గొప్ప గొప్ప బేగముల సౌదాల్లో ప్రవేశం కలిగింది.
    మౌల్వీ సాహెబ్ ఎంతో శ్రద్ధతో నన్ను చదివించారు. " అలీఫ్ , బే " అక్షరాలు పూర్తీ ఆయిం తరవాత "కరిమా", మహమూద్ నామా" "సర్పేరవా" చదివించి "అహమద్ నామా" కంఠపాఠం చేయించారు. తరవాత "గులిస్తా" ప్రారంభించారు. రెండు పాదాలు చదివించి నోటికి జ్ఞాపకం చేయించేవారు. ప్రతిపద్యానికి ప్రతిపదార్ధ తాత్పర్యాలు చెప్పేవారు. చదవడం, వ్రాయడం విషయంలో కష్టపడ్డాను. ఉక్త్ లేఖనం, విషయంలో శ్రద్ధ చేశారు. ఉత్తరాలు వ్రాయించారు. గులిస్తా తరవాత పారసీక పుస్తకాలు నీళ్ళలా త్రాగేశాను. కొంత అరబ్బీ , కొంత తర్కం చదివాను. ఏడెనిమిది సంవత్సరాలు మౌల్వీ సాహెబ్ వద్ద చదివాను. కవిత్వంలో నా ఆసక్తి, దాని ప్రారంభ, పరాకాష్టలు మీకు తెలుసు. దాన్ని గురించి విన్నవించాల్సిన అవసరం లేదు.

                                    4


        చిలుక పల్కులు వల్లించిన రాచిల్కను కాను,
        వలపు బడిలో నా కొజ్జలు విశ్వాసం , అనుభవం!
    బళ్ళో నాతొ ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉండేవాళ్ళు. గోహర్ మిర్జా కొంటె కోణంగి , ఆ వెధవ ఎప్పుడూ ఆడపిల్లలను ఏడిపిస్తూ ఉండేవాడు. వెక్కిరించడం, కొక్కిరించడం , జడపట్టి లాగడం, చెవులు పిండడం , ఇద్దరు అమ్మాయిల జడలు ముడి పెట్టడం, ఇవీ వాడి వ్యవహారాలు. తలప్రాణం తోకకు వచ్చేదనుకోండి. అమ్మాయిలూ తిరగబడి బాదేవాళ్ళు. మౌల్వీసాహెబ్ దండించేవారు. అయినా వాడు తన ,మంకు వదిలేవాడు కాడు. నన్నే ఎక్కువ ఏడిపించేవాడు. మిగతా ఇద్దరు చాడీలు చెప్పడానికి వెరిచేవారు. నేను మౌల్వీసాహెబ్ తో చెప్పి బాధించేదాన్ని. అయినా కొంటె వేషాలు మానేవాడు కాడు. చాడీలు చెప్పి చెప్పి విసిగిపోయాను. పంతులుగారు నిర్దయగా శిక్షించినపుడు నాకే జాలివేసేది.
    గోహర్ మిర్జా చేరడానికి కారణం కూడా బువాహుసేనీ యే.
    నవాబ్ సుల్తాన్ అలీఖాను కులీన ప్రభువు. వారి దర్వాజాకు ఇరువైపుల ఫిరంగులు ఉండేవి. అతనికి "బన్నూ" తో సంబంధం. ఆవిడకు పుట్టినవాడే గోహర్ మిర్జా. కొంతకాలానికి బన్నూతో సంబంధం తెగిపోయింది. పిల్లావాడి పోషణకు గాను నెలకు పది రూపాయలు ఇస్తుండేవారు. బేగమ్ కు తెలియకుండా అప్పుడప్పుడూ వచ్చి పోతుండేవారు కూడా . బన్నూ "ఖాజీ" తోటలో ఉండేది. అక్కడే బువాహుసేనీ సోదరుని ఇల్లు. రెండిండ్లమధ్య దిడ్డి ఉండేది. చిన్నతనం నుంచే చిలిపి గోహర్ మిర్జా , వీధివీధంతా విసిగిపోయింది. ఒక ఇంట్లోకి రాళ్ళు విసిరేవాడు. ఒక కుర్రాణ్ణి అడిగి పంజరం తెప్పించేవాడు. మూత తీసి పక్షులను వదిలేసేవాడు. తల్లి విసిగిపోయింది. మసీదులో ఉండే పంతులు దగ్గర కూర్చుండ బెట్టింది. అక్కడా తన వ్యవహారాలు విడువలేదు. బళ్ళో పిల్లలందరినీ ఏడిపించాడు. ఒకని చొక్కాలో కప్పను వదిలేవాడు. ఒకని టోపీ లాక్కునేవాడు. ఒక అమ్మాయి బూటు తీసి బావిలో పడేశాడు.
    ఒకరోజు పంతులుగారు నమాజు చేస్తున్నారు. ఈ కొంటె కోణంగి వారి కొత్త బూటు నీటి తొట్టిలో వేశాడు. అది తెలియాడుతుంటే తమాషా చూస్తూ కూర్చున్నాడు. పంతులుగారి వళ్ళు మండింది. చావబాదారు, చెంపదెబ్బలతో ముఖం ఎర్రబడింది. చెవిపట్టి బన్నూ ఇంటికి లాక్కుపోయారు. వాకిట్లో నుంచుని "తల్లీ! ఇదిగో మీ సుపుత్రుడు! వీడికి నేను చదువు చెప్పలేను " అని పెద్దగ కేకవేసి చెప్పి కుర్రాణ్ణి అక్కడే వదలి వెళ్ళిపోయారు. గోహర్ మిర్జా పెద్దగా ఏడుస్తూ ఇంట్లో కెళ్ళాడు. లోపల బువాహుసేనీ బన్నూతో మాట్లాడుతోంది. గోహర్ మిర్జా చేష్టలు ఆవిడకేం తెలీవు. అతని స్థితి చూసి జాలిపడింది. పంతులు గారిని ఎన్నో మాటలు అనేసింది.
    బువాహుసేనీ : వాడెం పంతులా కసాయివాడా? అయ్యో ముఖం వాచేట్టు కొట్టేశాడు. ఇదిగో చెవులు కూడా ఎర్రబడినాయి. తల్లీ! ఇలాంటి పంతులు దగ్గర చదివించే రాక్షసి ఎవరమ్మా! మా మౌల్వీ సాహెబ్ కూడా చదువు చెపుతాడు. అయ్యో పాపం ఏదో అదిరించి బెదిరించి చెప్పాలి కాని - ఇలాగా.....
    బన్నూ: అయితే మీ మౌల్వీ గారి దగ్గరికే తీసికెళ్ళమ్మా! నీకు పుణ్యం ఉంటుంది.
    బువాహుసేనీ: మంచిది తీసికెళ్త. కాని చాల దూరం.
    బన్నూ: ఉదయం మీ అన్నతో పంపిస్తాను. సాయంకాలం అతని వెంటనే వచ్చేస్తాడు.
    బువాహుసేనీ : అయితే పంపించు.
    మౌల్వీ గారిని అడగవలసిన పని లేనందున తన ధర్మాన్ని నిర్వర్తించింది. మౌల్వీ గారు కాదనరని తెలుసు ఆవిడకు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.