Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    2. అగ్నిదేవా! మా అభీష్టములను గ్రహించుము. దేవతలకు ఎదురేగుము. వారికి యజమాని హవిస్సులు అర్పించుచున్నాడని చెప్పుము. మా కోరికలన్నియు ఫలించునట్లు చేయుము.

    3. అగ్నీ! నీవు యువతముడవు. బలపుత్రుడవు. దేవతలను ఆహ్వానించువాడవు. నీవే సత్యవంతుడవు. అందువలన యజ్ఞసాధనము అగుము.

    4. జ్వలించుచున్న ఈ అగ్ని శత, సహస్ర అన్నములకు ప్రభువు. అతడు మకుటాయమానుడు. విద్వాంసుడు. ఈ అగ్ని ధనదాత అగును గాత.

    5. అగ్నీ! నీవు అంగసౌష్ఠవము కలవాడవు. దేవతలను ఆహ్వానించు ఋత్విక్కులతో కూడినవాడవు. వడ్రంగి రథచక్రనేమిని - తన వశమున ఉంచుకొని - తిరుగునట్లు చేయును. అట్లే నీవు యజ్ఞమును స్వవశమున ఉంచుకొనుము. ఇచటికి చేర్చుము.

    6. అగ్నీ! నీవు వివిధరూపములవాడవు. దేవతలు సర్వత్ర స్ఫురించువారు. కోరికలు తీర్చువారు. వారిని మేము వేద మంత్రములచే స్తుతించుచున్నాము. మాస్తుతులను ఆయా దేవతలకు చేర్చుము.

    7. అగ్ని సర్వజ్ఞుడు - సర్వసేనాసమేతుడు. అతనికి తెలియక ఏ వ్యవహారమును నిర్వర్తించజాలము.

    8. పాలు చేపుచున్న గోవులు దూడలను వీడవు కదా! అట్లే సమస్త దేవతలు మమ్ము విడువకుందురు గాత.

    9. అతడు మతో సమానుడు. దుష్టబుద్ది కలవాడు. మమ్ము ద్వేషించువాడు. మాకు విరోధి. అయినను తరంగము వలన నావకు నష్టము కలుగనట్లు - మాకు అతని వలన హాని జరుగదు.

    10. అగ్నిదేవా! మానవులు నీ శక్తికి నమస్కరించుచున్నారు. కావున అపకారము తలపెట్టిన వానికి వ్యాధులు కలిగించుము. నాశనము చేయుము.

    11. అగ్నీ! మేము గోవులతో కూడిన ఇష్టిని చేయ తలపెట్టినాము. అందుకొరకు ధనమును వృద్ధి చెందించుము. నీవు అన్నింటిని పెంచగలవాడవు. మాకర్మ ఫలమును పెంపొందించుము.

    12. అగ్నీ! నీవు మాకు అందించునట్టి మహధనమున బరువులు మోయు ఎద్దులు ఉండవలెను. అంతే కాని పరాభవ కారణములు ఉండరాదు. నీవు మరల మరల ఎన్నో మారులు తెచ్చి మా ధనమును పెంచుచుండుము.

    13. ఈ రోగబాధ లన్నింటిని మా శత్రువులకు కలిగించుము. వారిని కదలనివ్వకుము. వారి రోగములను పెంచినట్లు మా బలములను వర్థిల్లచేయుము.

    14. వికలము కాని యజ్ఞము నిర్వహించువాడును నమస్కరించువాడును అగు యజమాని హవిస్సును అగ్ని స్వీకరించును. అట్టి యజమానిని ఈ అగ్ని ధనాదికములను వృద్ధి చేసి రక్షించుచున్నాడు.

    15. అగ్నీ! నీవు పవిత్ర యజ్ఞములకు అధిష్ఠాతవు. అట్లయ్యు మాకు ఎదురుగా విచ్చేయుము. మా దుఃఖములను తుడిచివేయుము. మా బంధువులను కూడ రక్షింపుము.

    16. అగ్నీ! లోకమున ముందు తండ్రి రక్షణలు తెలిసికొన్న విధముగ నీ రక్షణలు తెలిసికొన్నాము. అందువలన నీవు సంపాదించిన సుఖములను అనుభవించుచున్నాము.

    17. అగ్నీ! నీవు క్రూరుడగు రాజువలె హంతకులను హతమార్చువాడవు. వాడి కొమ్ముల మృగము వలె దావాగ్నివై వనములను కాల్చుచున్నావు. అందువలననే శత్రుపురములను దహించువాడవు అయినావు.

    18. మిత్రులారా! అగ్ని మీకు అభీష్టములు ప్రసాదించును గాత.

    అగ్నిక్షితులందు వరిష్ఠుడు. బలమును నశింపచేయని వాడు. స్వయముగా బలవంతుడు. మీరు కూడ అగ్నిని స్తుతించండి.

    19. అగ్నీ! నీవు కోరికలు తీర్చువాడవు. ఫలములను ఆర్జించుచున్నావు. యజమానికి ఇచ్చుచున్నావు. నీవు ఈశ్వరుడవు. పృథివీరూపమగు వేదిమీద ప్రజ్వరిల్లుచున్నావు.

    20. ప్రజాపతే అనుపదము ప్రజాపతే వత్వ దేవతావ్యవ్యః అను ప్రజార్థ హవిస్సునకు పురోనువాక్య. సంతాన కామియైనవాడు ప్రజాపతి దేవతాకమగు చరును నిర్వాపము చేయవలెనని విధించుచున్నది.

    'పవేద' అనునది ' 'పవేద పుత్రః పితరమ్' అను యాజ్యకు ప్రతీక.

    'సోమాపూషణా' యనునది పశ్వర్థమగు హవిస్సు యొక్క పురోనువాక్యకు ప్రతీక.

    'ఇమౌదివౌ' అనునది 'ఇమో దివౌ జయమానౌ' అను యాజ్యకు ప్రతీకము.

                                       పన్నెండవ అనువాకము

    1. అగ్నీ! మేము పితృదేవతలను పూజించదలచినాము. నిన్ను ఆహ్వానించుచున్నాము. పితృదేవతలను పూజించదలచినాము. నిన్ను ప్రజ్వలింప చేయుచున్నాము. నీవు పితరులను యజింపుము. యజమాని పితృదేవతలను హవిస్సులు అందుకొనుటకు ఆహ్వానించుము.

    2. సోమదేవా! నీవు మేధోవంతుడవు. సర్వము తెలిసిన వాడవు. చక్కని మార్గమును చూపువాడవు. పితృదేవతలు నిన్ను సేవించుచున్నారు. నీవలననే వారు దేవతల మధ్యన నిలిచినారు. రుచికర హవిస్సులను అందుకొనుచున్నారు.

    3. సోమమా! నీవు పవిత్రము చేయువాడవు. నీవు మా పూర్వజులగు పితృదేవతలను అనుగ్రహించినావు. అందువలన వారు కర్మలను ఆచరించినారు. ఆ కర్మఫలములను అనుభవించుచు ధీరులై ఉన్నారు. నీవు సహితము వాయువును అపేక్షించకుము. హవిస్సులు ఆరగించుము. అశ్వసహితుడవై పరిధులవంటి ఆటంకములను పడగొట్టుము. మఘవాభవావః - మాకొరకు ధనపతివి అగుము.

    4. సోమదేవా! నీవు పితృదేవతలతో ఉన్నవాడవు. వారితో సంభాషించువాడవు. ద్యావా పృథ్వులను విస్తారపరచిన వాడవు. "తస్మై తఇన్దో హవిషావిధేమ" అటువంటి సోమదేవతలకు హవిస్సులు అర్పించుచున్నాము. మేము ధనపతులము అగుదుముగాక.

    5. అగ్నిష్వాత్త పితరులారా! మేము మిమ్ము పూజించుచున్నాము. మా యజ్ఞమునకు విచ్చేయండి. ఆత్మీయమగు స్థానమును అలంకరించండి. మేము ఎంతో ప్రయత్నించి ఆర్జించిన హవిస్సులను స్వీకరించండి. తదుపరి ధనవంతుడు, కర్మకుశలుడగు పుత్రుని ప్రసాదించండి.

    (ఇహలోకమున యాగాదులు చేయక పితృలోకమునకు చేరినవారు అగ్నిష్వాత్తులు.)

    6. బర్హిషద పితరులారా! మేము మీ తరువాతి వారలము. మమ్ము రక్షించండి. మీ కొరకు హవిస్సులు సిద్ధము చేసినాము. రక్షణలతో రండి. హవిస్సులను ఆరగించండి. సుఖించండి. మాకు సుఖములు, దుఃఖరాహిత్యము, పాపరాహిత్యము కలిగించండి.

    (ఇహలోకమున యాగములు చేసి పితృలోకమునకు చేరినవారు బర్హిషదులు.)

    7. నేను యజమానిని. పితరుల విషయమున భక్తి శ్రద్ధలు కలవాడను. నాయజ్ఞము అంతట వ్యాపించి ఉన్నది. ఆటంకములు ఎరుగకున్నది. బర్హిషదులారా! ఈ యజ్ఞమునకు విచ్చేయండి. సోమముతో సమమగు రుచిగల హవిస్సును ఆరగించండి.

    8. పితృదేవతలు మమ్ము అనుగ్రహించువారు. వారి కొరకు యాగార్హము, తృప్తికరములగు హవిస్సులు ఏర్పరచినాము. వారిని ఆహ్వానించుచున్నాము. వారు రావలెను. మాస్తోత్రములు వినవలెను. యజమానిని 'భేష్' అనవలెను. ఆ పితృ దేవతలు మమ్ము రక్షింతురుగాక.

    9. తక్కువ పితరులు ఉత్తమ హవిస్సులు అందుకొందురుగాక. మధ్యమ పితరులు ఉత్తమ హవిస్సులు అందుకొందురుగాక.

    ఆ పితరులు మా మీద అనుగ్రహము కలవారు. తోడేళ్లవలె పీక్కొని తినువారుకారు. యజ్ఞము - సత్యమును బాగుగా ఎరిగిన వారు. వారు మా ప్రాణరక్షణకు విచ్చేసినారు. వారందరిని మేము ఆహ్వానించినాము. వారు మమ్ము రక్షింతురుగాక.

    10. ఈ యజమాని పుట్టక ముందుండిన అన్నలు పితృపితామహులు పితృలోకము చేరినారు. ఇతడు పుట్టిన తరువాత తమ్ములు, స్వపుత్రాదులు పితృలోకము చేరినారు. వారందరు ఈ కర్మయందు హవిస్సులు అందుకొనుటకు విచ్చేసినారు. ధన సమృద్ధి కలిగిన బంధువులు పితృరూపులై వచ్చియున్నారు. వారలందరకు నమస్కరించుచున్నాను.

    11. అగ్నీ! పూర్వకాలమున మా కన్న ఉత్కృష్టులు ఉండిరి. వారు పురాతనులు. మా పితరులు. వారు యజ్ఞఫలములను అనుభవించినారు. పరిశుద్ధమగు స్థానమునకు చేరినారు. మేము వారిని విశేష స్తోత్రములచే స్తుతించుచున్నాము. అందువలన మేము సహితము పరిశుద్ధమగు స్థానమును పొందగలముకదా!

    ఆ పితృదేవతలు ఆకలిని జయించినారు. తేజోరూప దేవతలందు చేరినారు.

    12. అగ్నీ! నీవు కవ్యవాహనుడవు. యజ్ఞ వర్ధకులగు పితృదేవతలకు కవ్యము వహించుచున్నావు. అట్లే దేవతలకును, పితరులకును హవిస్సులు వహించుము.

    (హవ్యము దేవతలకు ఇచ్చునది. కవ్యము పితృదేవతలకు ఇచ్చునది.)

    13. జాతవేద అగ్నీ! నిన్ను యజమాని స్తుతించినాడు. నీవు అతని హవిస్సులను పరిమళభరితము చేసినావు. తీసికొని పోయినావు. పితరులకు ఇచ్చినావు. ఆ పితృదేవతలు నీవు ఇచ్చిన స్వధాకార హవిస్సులను ఆరగింతురు గాక.

    అగ్నీ! నీవు కూడ - మేము ఎంతో ప్రయత్నించి - సమకూర్చిన హవిస్సును స్వీకరించుము.

    14. ఇంద్రుడు మాతలి రథసారథిగా కలవాడు. అతడు కవ్యయుతులగు పితృదేవతలతో కూడ వర్థిల్లుచున్నాడు. యముడు అంగిరులను పితృదేవతలతో కూడ వర్థిల్లుచున్నాడు. బృహస్పతి ఋక్కులచే ప్రతిపాదించబడిన పితృదేవతలతో కూడ వర్థిల్లుచున్నాడు.

    దేవతలు పితృ దేవతలను - పితృదేవతలు దేవతలను వర్థిల్లచేయుచున్నారు.

    దేవతలు 'స్వాహా' కారముతోను, పితరులు 'స్వధా' కారముతోను తృప్తి చెందుచున్నారు.

    15. యమదేవా! అంగిరులను పితృదేవతలతో కలసి ఈ యజ్ఞమునకు విచ్చేయుము. ఇచట ఆసీనుడవగుము. విద్వాంసులు మంత్రములు చదివి నిన్ను స్తుతించుచున్నారు. ఆలకించుము. గ్రహించుము.

    యమరాజా! ఈ హవిస్సులు అందుకొనుము. ఆనందించుము. ఈ యజమానిని ఆనందపరచుము.

    16. యమదేవా! అంగిరులు యజ్ఞయోగ్యులు. వివిధ రూపములవారు. వారితో కూడి విచ్చేయుము. ఈ యజ్ఞము నందు యజమానిని సంతోషపరచుము.

    యమరాజా! నీ తండ్రి యగు సూర్యుని ఈ యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాను. సూర్యుడు యజ్ఞమునకు వచ్చి, ఆసీనుడై యజమానిని సంతోషపరచును గాత.

    17. మా పితృదేవతలు అంగిరసులగుదురు. అథర్వాణులగుదురు. భృగువులు అగుదురు. వారు సోమార్హులు. యజ్ఞయోగ్యులు. వారు ఎల్లప్పుడు కొత్తవారివలె ప్రీతిని కలుగచేయుదురు.

    వారి అనుగ్రహము మాకు కలుగును గాత.
    వారు మాకు మంగళప్రదులు అగుదురు గాత.

    విద్వాంసుడు, బహు భాషావేత్త, కవి, కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, బాలసాహిత్యకారుడు, విమర్శకుడు, చలనచిత్ర రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు, వక్త, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రగతి పథగామి, ప్రసన్నుడగు దాశరథి రంగాచార్య విరచిత శ్రీ మదాంధ్ర వచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత యందలి రెండవకాండము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.