Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



                       జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                      ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||

                               ముప్పది అయిదవ అధ్యాయము

    (పితృమేధ సంబంధినో మన్త్రా ఉచ్యన్తే - పితృమేధ సంబంధ మంత్రములు చెప్పబడుచున్నవి)

1.    అపేతో యన్తు పణయ్కో సుమ్నా దేవపీయవః|
    అస్యలోకః సుతావతః|
    ద్యుభిరహోభిరక్తు భిర్వక్తం యమో దదాత్వవ సానమస్మై ||

    అసుఖకారులు, దేవహింసకులగు పణులు ఇచటి నుండి తొలగి పోవలెను. ఇదియే అభిషవకారి స్థానమగును. ఋతువులు, దివసములు, రశ్ములు యొక్క ఈ స్థానమును యముడు ఈ మృతునకు ప్రదానము చేయును గాత.

    2. మృతుడా! నీ  అంగముల కొరకు సవిత పృథ్వి లోపల స్థలము కోరును గాత. అందుకు ఎద్దులను కూర్చుము.

    3. ఈ స్థలమును వాయువు పవిత్రము చేయును గాత. సవిత పవిత్రము చేయును గాత. అగ్నితేజము, సూర్యుని కాంతి ఈ స్థానమును పావనము చేయుదురు గాత.

        (ఆ స్థలమున నాలుగు చాళ్లు నాగలి దున్నవలెను)

        ఎద్దులను నాగలి నుంచి విడువవలెను.

    4. (ఆ స్థలమును త్రవ్వి మృతుని అస్థికలను పాతి పెట్టవలెను.)

    ఓషధులారా! అశ్వత్ధమున మీరు ఆసీనులు అయి ఉన్నారు. పలాశపత్రములందు నివసించి ఉన్నారు. మీరు నరుని సేవించవలసి ఉన్నది. భూమిలోన చేరండి.

    5. మృతుడా! సవిత నీ అస్థికలను భూమి వడియందు చేర్చును గాత. భూదేవీ! ఈ  మృతుని కొరకు నీవు శాంతి దాయినివి అగుము.

    6. మృతుడా! నీటితావరము వద్ద నిన్ను ప్రజాపతి యందు చేర్చుచున్నాను. ఆ ప్రజాపతి మా పాపములను దహించును గాత.

    7. మృత్యువా! నీ మార్గము దేవయానము మాత్రముకాదు. మరేదైనా దూరపు మార్గమున తొలగిపొమ్ము. చెవులు కన్నులున్న నీతో చెప్పుచున్నాను. నీవు మా సంతానమును తాకకుము. మా వీరులను తాకకుము.

    8. మృతుడా! వాయువు నీకు సుఖకరుడు అగును గాత. సూర్యుడు సుఖంకరుడు అగును గాత. ఇటుకల సుఖంకరములు అగును గాత.

    (సమాధియందు ఇటుకలను పేర్చవలెను.)

    మృతజీవీ! ఈ పార్థివ అగ్నులు నీకు సుఖము కలిగించుము గాత. అవి నిన్ను దహనము చేయకుండును గాత.

    9.  నీ కొరకు దిశలు ఏర్పడును గాత. నీకు జలము అత్యంత సుఖదమగును గాత. నదులు నీకు సుఖములను ఇచ్చును గాత. అంతరిక్షము శుభప్రదమగును గాత. దిశలన్నియు నీకు వెల్లడి యగును గాత.

    10. బంధువులారా! ఇది గులకరాతి నది. సంబాళించుకొనండి. నిలదొక్కుకొనండి. దాటండి. అశుభములను అన్నింటిని ఈ నదిలో విడుచుచున్నాము. శుభంకరములు, పథ్యములగు అన్నములచే దాటుచున్నాము.

    11. అపామార్గమా! నీవు కిల్బిషము, కృత్య, దుష్ట స్వప్నమును మా నుండి తొలగించుము.

    12. జలము మరియు ఓషధులు మాతో నిజమైన స్నేహము చేయవలెను. మేము ద్వేషించువారికి- మమ్ము ద్వేషించువారికి జలములు, ఓషధులు శత్రు భావము వహించును గాత.

    13. మేము ఎద్దుతోకను పట్టి దానిని తాకుచున్నాము. ఈ వృషభము సురభి పుత్రుడగును. ఇది మాకు శుభములు సమకూర్చవలెను. దేవతలకు ఇంద్రుని వలె ఇది మాకు రక్షణ యగును.

    అగ్నిదేవా! హవిని అందించుము.

    14. అంధకారమునకు ఆవల స్వర్గీయ జ్యోతిని దర్శించినాము. దేవతలందు ఏకమాత్ర దేవతయగు సూర్యుని, అతని ఉత్తమ జ్యోతిని చేరుకున్నాము.

    15. (గ్రామ శ్మశానాన్తరే మర్యాదాలోష్టం నిదధాతి - గ్రామ శ్మశానమునకు అవతల లాంఛన ప్రాయమగు శిలను ఉంచవలెను.)

    ఇది - ఈశిల జీవించియున్నవారికి హద్దు అగుచున్నది. అన్య జీవితుడు ఎవడును మృత్యువాత పడరాదు. జీవులు మృత్యువును పర్వతపు చాటున దాచివేయుదురుగాక. జీవులందరు బహుకర్మవ్యాప్రుతులై 'శతం జీవంతు శరదః' - శతశరత్తులు జీవింతురు గాత.

    16. అగ్నీ! మా ఆయువులను పావనము చేయుము. మాకు వర్షము కలిగించుము. "ఆరే బాధస్వ దుచ్ఛునామ్" తుచ్ఛులను మాకు దూరమున హింసించుము.

    17. అగ్నీ! నీవు హవి వలన వర్ధిల్లువాడవు. ఘృతము వలన పరిపూర్ణ స్వరూపుడవు. ఘృతమున పుట్టి పెరిగెదవు. మధురము, రుచికరమగు గోఘృతమును పానము చేయుము. తండ్రి తన కొడుకువలె - మా పుత్రాదులను రక్షించుము. స్వాహా.

    18. ఇతడు గోదానము చేసినాడు. అగ్నికి ఆహుతులు అర్పించినాడు. దేవతలకు హవిని అందించినాడు.

    శ్మశానము నుండి తిరిగి వచ్చినవారిని ఏడిపించగలడు?

    19. పచ్చిమాంసము తిను అగ్నిని పారద్రోలుచున్నాను. అది పాపము మోసుకొని శ్మశానమునకు తరలునుగాక.

    ఇచట - ఈ యజ్ఞ గృహము నందలి - ఈ అగ్ని తద్భిన్నమైనది. ఇచట పుట్టినది. అతడు దేవతలను ఎరుగును. స్వాధికారమును ఎరుగును. "దేవేభ్యో హవ్యం వహతు' దేవతలకు హవిని వహించవలెను.

    20. అగ్నీ! నీవు జాతవేదివి. పితరులు దూరమున ఎచట ఉన్నారో నీకు తెలియును. వారి కొరకు వపను కొని పొమ్ము. ఆ పితరుల కొరకు మేద యొక్క నదులు ప్రవహించును గాత. "సత్యా ఏషామాశిషః సన్నమంతాం స్వాహా" వారి నిజమగు ఆశీస్సులు మాకు అందును గాత. స్వాహా.

    21. భూమీ! నీవు మాకు కంటకరహితవు. శుభ ప్రదవు అగుము. మాకు ఎన్నో సుఖములను కలిగించుము. ఈ జలము మా పాపములను కడిగి మమ్ము పరిశుద్ధులను చేయునుగావుత.

    22. అస్మాత్త్వమధి జాత్కోసి త్వదయం జాయతాం పునః |
    అసౌ స్వర్గాయ లోకాయ స్వాహా.

    అగ్నీ నీవు ఇతని నిమిత్తము ఆవిర్భవించినావు. ఇతడు మరల నీలో జన్మించును గాత. ఇతనికి స్వర్గము కలుగునట్లు స్వాహా.


                               దాశరథి రంగాచార్య విరచిత
                  శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహిత యందలి
               పితృమేధమను ముప్పది అయిదవ అధ్యయము సమాప్తము.
                            "యచ్ఛానః శర్మం స ప్రాథాః"




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.