Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



 
                                ఏబది అయిదవ సూక్తము
                   ఋషి - ప్రాగథపుత్రుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు -.
                                బృహతి, చివరిది అనుష్టుప్


    1. ఋత్విక్కులారా! ఇంద్రుడు వేగవంతములగు అశ్వములమీద ధనదానము చేయుటకు వచ్చును. మీరు బాధావిముక్తులై ఆ ఇంద్రుని సోమగానముతో సేవించండి. జనులు హితముకోరువానిని, కుటుంబ పోషకుని ఆహ్వానిస్తారు. అట్లే అభిషుత సోమముగల యజ్ఞమునకు ఇంద్రుని ఆహ్వానిస్తాను.

    2. దుర్ధర్ష శత్రువులు సహితము సుందరహనువుల ఇంద్రుని బాధింపజాలరు. స్థిరులగు దేవగణములు సహితము ఇంద్రుని నివారించజాలరు. మానవులు సహితము ఇంద్రుని నివారింపజాలరు. ఇంద్రునకు సోమము వలన కలిగిన ఆనందము కావలెను. అందుకు అతడు ప్రశంసకులు, సోమాభిషవకర్తలకు దానములు చేయును.

    3.ఇంద్రుడు పరిచర్యయోగ్యుడు. అశ్వవిద్యాకుశలుడు. అద్భుతడు. హిరణ్మయుడు. ఆశ్చర్యకరుడు. వృత్రఘ్నడు అతడు  గోసమూహములను అడ్డుకున్నవారిని గడగడలాడించును.

    4. ఇంద్రుడు - భూమి మీదియు, సంగృహీత ధనమును యజమానికొరకు - పైకి తెచ్చును. అతడు వజ్రధరుడు ఉత్తమ హనువులు గలవాడు. హరిత వర్ణ అశ్వవంతుడు. ఇంద్రుడు అనుకున్నదానికి కర్మతోసిద్ధి కలిగించును.

    5. వీరపురుష ఇంద్రా ! నిన్ను అనేకులు స్తుతింతురు. నీవు పూర్వము వలెనే స్తోతలనుండి స్తుతులు ఆశించినావు. ఇదిగో అవి నీకు సమర్పించుచున్నాము. అది యజ్ఞమైనను, ఉక్ధయనను, వాక్యమైనను - దానిని నీకు సమర్పించుచున్నాము.

    6. ఇంద్రా ! నీవు  బహుస్తుతుడవు. వజ్రధరుడవు. స్వర్గ సంపన్నడవు. సోమపాయివి. సోమాభిషవము కాగా మదయుక్తుడవగుము. నీదే - సోమాభిషువకర్తకు -  అందరినిమించి ధనము ఇచ్చువాడవు.

    7. మేము నేడు, రేపు ఇంద్రుని సోమమున ప్రసన్నుని చేయుదుము. ఇంద్రుని కొరకే ఈ  యుద్ధమునకు అభిషుత సోమము తేవలెను, స్తోత్రములు విన్నంత ఇంద్రుడు రావలెను.
   
    8. దొంగ అందరిని అడ్డగించువాడు - బాటసారులను నాశనము చేయువాడు కావచ్చును. ఆయనను ఇంద్రుని కార్యమునకు విఘ్నము కలిగించజాలడు. ఇంద్రా! నీవు ప్రసన్నుడవై రమ్ము. విచిత్ర కర్మబలమున. విశేషరూపమున విచ్చేయుము.
   
    9. ఇంద్రుడు చేయని వీరకృత్యమేది? వినబడని ఇంద్రుని పౌరుషమేది? ఇంద్రుడు చేసిన వృత్రవధ అతని చిన్ననాటి నుండియే వినిపించుచున్నది.   
   
    10.  ఇంద్రుని బహుబలమునకు ఎదురు ఏది? ఇంద్రుడు వృత్రఘ్నడని తెలియని దెవ్వనికి? ఇంద్రుడు వధించదలచగా బ్రతికినవాడెవ్వడు? వడ్డీలుగుంజువారిని, పరలోకరహితులను, వర్తకులను ఇంద్రుడు శిక్షంచి అణచి ఉంచును.

    11. ఇంద్రుడు వజ్రధరుడు - వృత్రఘ్నడు. బహుస్తుత్యుడు ఇంద్రుడు ఇచ్చిన భృతికి సమముగా మేము అతనికి అభినవ స్తుతులు సమర్పించుచున్నాము.

    12. బహుకర్మ ఇంద్రా ! నీలోనే అనేక ఆశలు నిహితములు - రక్షణలు నిహితములు. కావున స్తోతలు నిన్ను  ఆహ్వానింతురు. నీవు సకల శత్రు సవనములను దాటి మా సవనమునకు విచ్చేయుము. మహాబలి ఇంద్రా ! మా ఆహ్వానములు వినుము.

    13. ఇంద్రా ! మేము నీవారలము. మేము నీ స్తోతలము. నీవు వినా మరెవ్వడును సుఖప్రదుడు కాలేడు.

    14. ఇంద్రా ! నీవు మమ్ము ఈ దరిద్రము, ఈ ఆకలి, ఈ నిందలనుంచి విముక్తులను చేయుము. రక్షణలు, విచిత్ర కర్మములతో మాకు కోరిన పదార్థములను ప్రసాదించుము.

    15. నీ కొరకే సోమము అభిషుతమైనది. కలిఋషి పుత్రులారా! భయపడకండి. ఈ  రాక్షసాదులు దూరమగు చున్నారు. వారు పారిపోవుచున్నారు.

                                ఏబది ఆరవ సూక్తము
ఋషి - మిత్రావరుణ పుత్రుడు మాన్యుడు లేదా మహా మీనా  పుత్రుడు మత్యుడు

                                            లేదా
    బమూఋషులు. దేవత - ఆదిత్యులు ఛందస్సు - గాయత్రి

    1. అభిమతఫల ప్రాప్తికిగాను - సుఖప్రదాతలు, క్షత్రియులగు ఆదిత్యులను - రక్షణ ప్రసాదించ వలసినదని ప్రార్థించుచున్నాము.

    2. మిత్ర, వరుణ, ఆర్యమ, ఆదిత్యులు దుస్సహ కార్యములను ఎరుగుదురు. వారు మమ్ము పాపములు - రోగములనుండి దాటించ వలెను.

    3. ఆదిత్యుల వద్ద విచిత్రము, స్తుతియోగ్యమగు ధనమున్నది. అది హవ్యదాతలగు యజమానులు కొరకు అగును.

    4. వరుణాది దేవతలారా ! మీరు గొప్పవారు. హవ్యదాతలకు మీరు కల్పించిన రక్షణ గొప్పది. కావున మేము మిమ్ము రక్షణల కొరకు ప్రార్థింతుము.

    5. ఆదిత్యులారా ! మేము ఇంకను జీవించి ఉన్నాము. మా వద్దకు రండు మా ఆహ్వానము వినుడు. మృత్యువు కన్న ముందురండు.

    6. శ్రమించిన అభిషవకర్త యజమాని కొరకు మీ వద్ద వరణీయధనము, గృహము ఉన్నవి. మమ్ము ప్రసన్నులను చేయండి మంచి మాటలు పలకండి.

    7. దేవతలారా ! పాపివద్ద మహాపాపమున్నది. పాపశూన్యులవద్ద శుభములున్నవి. పాపశూన్య ఆదిత్యులారా! మా కోర్కెలు ఫలింప చేయండి.

    8. ఈ ఇంద్రజాలమున  మమ్ము  బంధించరాదు మహాకర్మలకుగాను మమ్ము ఈ జాలమునుండి విడువండి. ఇంద్రుడు విఖ్యాతుడు. అందరిని వశపరచుకొనువాడు.

    9. దేవతలారా ! మమ్ము విడువండి. మమ్ము తప్పించదలచి శత్రువుల వలలో మమ్ము బాధించకండి.

    10. దేవా అదితీ ! నీవు  మహిమాన్వితవు. సుఖదాత్రివి. అఖిలహిత ఫలప్రాప్తి కొరకు నేను నిన్ను స్తుతించుచున్నాను.

    11. అదితీ! నలువైపులనుండి మమ్ము రక్షింపుము. గంభీరము, ఉగ్రపుత్రవంతమగు జలమునందలి హింసకజాలమున మా పుత్రులను పడనీయకుము.

    12. అదితీ! నీ గమనము విశాలము నీవు గంభీరవు. మా పుత్రులు జీవించుటకుగాను పాపరహితులమగు మమ్ము బ్రతికించుము.

    13. ఆదిత్యులు అందరకు శిరోమణులు. మానవులను బాధించని వారు చక్కని కీర్తిశాలురు ద్రోహశూన్యులు. వారు మమ్ము రక్షించువారు.

    14. మీరు   హింసకులనుండి పట్టుకున్న దొంగనువలె - మమ్ము రక్షించండి.

    15. ఆదిత్యులారా ! ఈ జాలము మమ్ము హింసించరాదు. మానుండి జాలము దూరము కావలెను దుర్భుద్ధి దూరము కావలెను.

    16. చక్కని దాతలగు ఆదిత్యులారా ! మీ  రక్షణల క్రింద పూర్వపురీతి ఇప్పుడు సహితము మేము నానా విధ భోగములు అనుభవించవలెను.

    17. విశాల జ్ఞానవంతులగు దేవతలారా ! ఒక పాపియగు శత్రువు మావెంట పడినాడు. మేము జీవించుటకు, వానిని దూరము చేయండి.

    18. ఆదిత్యులారా !ముడివీడిన నాకు బంధవిముక్తుడయినట్లు - మీ అనుగ్రహమున మమ్ము జాలము విడుచును మీ అనుగ్రహము స్తుత్యము - భజనీయము.

    19. ఆదిత్యులారా! మీ వేగమును మేము అందుకొన జాలము. మీ వేగము మమ్ము విముక్తము చేయగలది "యూయమస్మాభ్యమృళయత" మీరు మమ్ము సుఖింప చేయండి.

    20. ఆదిత్యులారా ! యముని ఆయుధమువంటి కృత్రిమ జాలము - జీర్ణవ్యక్తులమైన  మమ్ము బాధించరాదు.

    21. ఆదిత్యులారా ! ద్వేషించువారిని నాశము చేయండి పాపులను నాశము చేయండి. జాలమును నాశము చేయండి. సర్వవ్యాపక పాపమును నాశము చేయండి.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత ఎనిమిదవ మండలము ఆరవ అష్టకామున నాలుగవ అధ్యాయము సమాప్తము.)

      ఓం నతామినన్తిమాయనో నధీరావ్రతా దేవానాం ప్రథమాధ్రవాణి
       నరోదసీ అద్రుహా వేద్యాభిర్నపర్వతాని నమే స్థివాంసః

                 అయిదవ అధ్యాయము    ఏబది ఏడవ సూక్తము
    ఋషి - అంగిరస ప్రియమేధ దేవత - ఇంద్రుడు ఛందస్సు - గాయత్రి 1, 4,7 అనుష్టుప్

        ఓమ్ ఆత్వారథం యధోతమే సువమ్నాయ వర్తయామసి
        తువి కూర్నమృతీషహ మిన్ద్రశనిష్ఠ సత్పతే

    1. అత్యంతబలవంతుడవు, సత్పతివగు ఇంద్రా ! నీవు బహుకర్మవు. హింసకుల పరాభవకారివి మేము రథము వంటివారము. రక్షణ మరియు సుఖముల కొరకు నిన్ను ఆహ్వానించుచున్నాము.

    2. ఇంద్రా ! నీవు విశేష బలశాలివి. అత్యంత ప్రాజ్ఞుడవు బహుకర్మవు. పూజనీయుడవు. నీయొక్క విశ్వ వ్యాపక మహత్వమున జగములను పూరించినావు.

    3. ఇంద్రా ! నీవు మహానుడవు. నీ  మహిమ వలన పృథ్విమీద వ్యాపించిన హిరణ్మయ వజ్రమును రెండు చేతులతో పట్టినావు.
   
    4. ఇంద్రుడు సమస్త శత్రువుల మీదకు ఉరుకువాడు. దుర్దమనీయుడు బలపతి మరుత్తుల సేనలతోను, రథగమనముతోను విచ్చేయమని ఇంద్రుని ఆహ్వానిస్తున్నాను.

    5. నేతలగుజనులు - తమ రక్షణకుగాను - యుద్ధములకు నానా విధములుగా ఇంద్రుని ఆహ్వానింతురు. అట్టి సర్వదా వర్షమానుడగు ఇంద్రుని, సాయమునకు రావలసినదని ఆహ్వానింతును.

    6. ఇంద్రుడు అపారశరీరవంతుడు. స్తుతులకు పరిమితుడు సుందరుడు. ధనసంపన్నుడు. ధనస్వామి. ఉగ్రుడు. నేను అట్టి ఇంద్రుని ఆహ్వానిస్తాను.

    7. ఇంద్రుడు నాయకుడు. యజ్ఞముఖస్థితుడు. క్రమబద్ధుడు. స్తుతిశ్రవణ సమర్థుడు. ఆ ఇంద్రునే - మహాధన ప్రాప్తికిగాను - సోమపానమునకు ఆహ్వానిస్తాను.

    8. బలశాలి ఇంద్రా ! మానవుడు నీ సఖ్యతను వ్యాప్తము చేయజాలడు. నీ బలమును అధిగమించజాలడు.

    9. వజ్రధరా ! మేము నీ రక్షణలు పొందుదుము. జాలమున స్నానము చేతుము. సూర్యుని దర్శింతుము. నీ సాయమున. యుద్ధమున మహాధనము పొందుదుము.

    10. స్తుతులద్వారా అత్యంత ప్రసిద్ధ ఇంద్రా ! నేను నిన్ను ఎంతగానో స్తుతించువాడను. నీవి మమ్ము యుద్ధమందు రక్షించవలెనని యజ్ఞమందు నిన్ను యాచింతుము.

    11. వజ్రధర ఇంద్రా !నీ సాహచర్యము స్వాదిష్టము. నీవు ధనాదులను కల్పించుట సహితము స్వాదిష్టము. నీ యజ్ఞము విస్తార యోగ్యము.

    12. మా పుత్రునకు స్వేచ్ఛగా ధనమునిమ్ము. మా పౌత్రులకు స్వేచ్ఛగా ధనమునిమ్ము. మా నివాసమునకు విశేష ధనమునిమ్ము. మా జీవనమునకుగాను కోరిన పదార్ధములనిమ్ము.

    13. ఇంద్రా ! మేము నిన్ను మానవుల మేలుకొరకు ప్రార్థించుచున్నాము. గోవుల మేలు కొరకు ప్రార్థించుచున్నాము. రథమునకు మంచి మార్గము కొరకు ప్రార్థించుచున్నాము. యజ్ఞమునకు నమస్కరించుచున్నాము.

    14. సోమపానమున కలిగిన హర్షమున చక్కని అనుభవయోగ్య ధనయుక్తులగు నరనాధులు ఆరుగురిలో ఇద్దరిద్దరు మా వద్దకు వచ్చెదరు.

    (ఇద్దరిద్దరు అనగా పితృపుత్రరూపులు. ఆరుగురు నరనాథులు షట్చక్రవర్తులు కావచ్చును)

    15. ఇంద్రోతి నామక రాజపుత్రునినుండి నాకు రెండు సగామి అశ్వములు లభించినవి. ఋక్షపుత్రుని నుండి రెండు హరిత వర్ణ అశ్వములు పొందినాను. అశ్వమేధ పుత్రుడు నాకు రెండు రోహితవర్ణ అశ్వములు ఇచ్చినాడు.

    16. అతిథిగ్వ పుత్రుని నుండి చక్కని రథపు అశ్వములు లభించినవి. ఋక్షపుత్రుని నుండి కళ్లెములుగల అశ్వములను పొందినాను. అశ్వమేధపుత్రుడు నాకు సుందర అశ్వములను ఇచ్చినాడు.

    17. అతిధిగ్వపుత్రుడు - పరిశుద్ధకర్మడు - ఇంద్రోతి నుండి ఆడగుఱ్ఱములను ఋక్షపుత్రుడు, అశ్వమేధపుత్రుడు ఇచ్చిన అశ్వములసహితముగా అందుకున్నాను.

    18. ఈ అశ్వములందు - దీప్తివంతములు, వర్షక అశ్వముల యుక్తముగా - కళ్లెములుగల ఆరు గుఱ్ఱములున్నవి.

    19. అన్నదాతలగు ఆరుగురురాజులారా ! నిందకుడు సహితము మీపై నిందలు ఆరోపింపలేడు.
   
                              ఏబది ఎనిమిదవ సూక్తము
ఋషి - అంగిరస ప్రియమేధ దేవత  - మిత్రావరుణ ఇంద్రులు చంధస్సు - వివిధము

    1. అధ్వర్యులారా ! వీరులకు హర్షము కలిగించు ఇంద్రుని కొరకు త్రిస్తోమ యుక్త అన్నము సమకూర్చుండి. యజ్ఞభోగమునకుగాను ప్రజ్ఞాయుక్త కర్మలతో ఇంద్రుడు మిమ్ము సత్కరించగలడు.

    2. ఉషస్సుల ఉత్ధాదకుడు ధ్వనిజనకుడు, అవధ్యగోవుల పతి ఇంద్రుని ఆహ్వానించండి. యజమాని పాడియావు కలిగిన అన్నమును కోరుచున్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.