Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    11. మరుద్గణముల సాయమున ఇంద్రుడు వృత్రుని వధించినాడు. అతడే పూజనీయుడు. హోమ యోగ్యుడు. యజ్ఞము కొఱకు మరుత్తుల సహితుడయి గోవులను దానము చేసినాడు. గోవు ఘృతయుక్త హవ్యధారణి, ప్రభూత హవ్యదాత్రి. గోవు వీరి కొఱకు స్వాదుతరమగు క్షీరాదులను ప్రసాదించినది.

    12. అంగిరులు - పాలకుడగు ఇంద్రుని కొఱకు దీప్తిమంతమగు స్థానమును సంస్కరించినారు. సుకర్మశాలురగు అంగిరులు ఇంద్రునకు ఆస్థానము విశేషరూపమున చూపినారు. వారు యజ్ఞమున ఆసీనులయి జనయిత్రి ద్యావాపృథ్వులను అంతరిక్ష స్తంభమున నిలిపినారు. వేగవంతుడగు ఇంద్రుని ద్యులోకమున స్థాపించినారు.

    13. ద్యావాపృథ్వులు పరస్పర విశ్లిష్టములు అయినపుడు మహాస్తుతి ఇంద్రునకు తక్షణము వృద్ధిప్రాప్తిని, ధారణ శక్తిని కలిగించును. అప్పుడు ఈ స్తుతి దోషరహితమయి ఇంద్రుని చేరును. పర్యవసానముగా ఇంద్రుని సర్వబలములు స్వభావసిద్ధములు అగును.

    14. ఇంద్రా ! నేను నీ గొప్ప స్నేహము కొఱకు ప్రార్థించుచున్నాను. నీవు వృత్రహంతవు. అశ్వవంతుడవు. విద్వాంసుడవు. మేము నీకు మా మంచి స్నేహమును, స్తోత్రమును, హవ్యమును సమర్పింతుము. ఇంద్రా ! నీవే మా రక్షకుడవని గ్రహింపుము.

    15. ఇంద్రుడు చక్కగా గ్రహించి మిత్రజనులకు మహాక్షేత్రములు, వలసినంత సువర్ణము దానము చేసినాడు. తరువాత వారికి గోవులు మున్నగు వానిని కూడ దానము చేసినాడు. దీప్తిమంతుడగు ఇంద్రుడు మరుద్గణములతో కలిసి సూర్యుడు, ఉష, పృథివి, అగ్నిని సృష్టించినారు.

    16. శాంత మనస్కుడగు ఇంద్రుడు పరస్పరము కలిసి నవియు, లోకములకు ఆనంద దాయకములును అగు జలములను సృష్టించినాడు. మాధుర్యయుక్తమగు సోమసమూహములను అగ్ని, సూర్య, వాయువులతో పవిత్రముగ శోధించినాడు. సకల జగములకు ఆనందము కలిగించినాడు. రాత్రింబవళ్ళు జగములను హమ వ్యాపారములకు ప్రేరేపించినాడు.

    17. సూర్యుని మహిమ వలన సకల పదార్థములను ధరించునవియు, యజ్ఞార్హములయినవియునగు రాత్రింబవళ్ళు క్రమము తప్పక తిరుగుచున్నవి. ఋజుగతులు, మిత్రభూతులగు మరుద్గణములు శత్రువులను పరాజితులను చేయుటకు ఇంద్రుని శక్తిమంతుని చేయుదురు.

    18. ఇంద్రా ! నీవు వృత్రహంతవు. అవినాశ్యుడవు. అభీష్టవర్షివి. అన్న దాతవు. మా ప్రియతమ స్తుతులకు స్వామివి. మహామహుడవు. యజ్ఞగమనాభిలాషివి. మహా ఆశ్రయమవు. శుభప్రద స్నేహమునకు మావద్దకు విచ్చేయుము.

    19. ఇంద్రా ! నీవు సనాతనుడవు. అంగిరులవలె నేను నిన్ను పూజింతును. నిన్ను స్తుతించుటలో నవీనత తెచ్చెదను. నీవు దేవరహిత ద్రోహులను వధించుము. మాకు అనుభవ యోగ్య ధనమును ప్రసాదించుము.

    20. ఇంద్రా ! పవిత్రజలము నలువైపుల వ్యాపించి ఉన్నది. మా కొఱకుగాను జలసమూహ తీరములను జలపూర్ణము చేయుము. నీవు రథవంతుడవు. మమ్ము శత్రువుల నుండి రక్షింపుము. మమ్ము త్వరగా గోవుల విజేతలను చేయుము.

    21. శత్రుహంతవు, గోవులకు స్వామివి అయిన ఇంద్రా ! నీవు మాకు గోవులను దానము చేయుము. యజ్ఞ విఘాతక అసురులను దీప్తియుక్త తేజమున నష్టపరచుము. నీవు సత్యవచనులగు అంగిరులకు గోవులను దానము చేసినావు. అసురుల అన్ని మార్గములను బంధించినావు.

    22. ఇంద్రా ! నీవు అన్నలాభకర్తవు. యుద్ధమందు ఉత్సాహము ద్వారా పెంచుకున్న ధనవంతుడవు. ఐశ్వర్య వంతుడవు. నేతృ శ్రేష్ఠుడవు. శ్రుతి శ్రవణ కర్తవు. ఉగ్రుడవు. సంగ్రామమున శత్రు వినాశకారివి. ధనవిజేతవు. ఇంద్రా ! ఆశ్రయప్రాప్తి కొఱకు నిన్ను ఆహ్వానించుచున్నాను.

    ఆలోచనామృతము

    1. దుహిత అనగా దూరమున ఉండి హితము కోరునది "దూరేహితా" పాలు ఇచ్చునది "దోగ్ధవతి"

    మొదటి మంత్రమున పుత్రులు లేక పుత్రిక ఉన్న తండ్రిని గురించి చెప్పినాడు. అటువంటి తండ్రి శాస్త్ర ప్రకారముగా కూతురు కొడుకును తన కొడుకును చేసి కొనవచ్చును. అటువంటి మనుమనికి కొడుకునకు ఉన్న హక్కు భుక్తములన్నియు సంక్రమించును. ఇది దౌహిత్రము. నాటిది నేటికిని అమలులో ఉన్నది.

    రెండవ మంత్రమున సోదరుని బాధ్యత తెలియపరచినాడు. తండ్రిలేని కూతురునకు సోదరుని ఆస్తి సంక్రమించదు. కాని సోదరికి వివాహము చేయవలసిన బాధ్యత సోదరునిపై ఉండును.

    పుత్రుడు పుత్రికల అధికారములను నిర్ణయించినాడు. దుహిత దూరముగ ఉన్నందున పుత్రుడు, తండ్రికి వారసుడు అగును. పుత్రిక సమ్మాన యోగ్యురాలగును. "వస్త్రాలంకారాదినా రుధ్యమాన ఏవభవతి" శాయణుని వ్యాఖ్య.

    ఆధునిక కాలమున ఆస్తివిషయమున పుత్రికకు పుత్రునితో సమాన హక్కు లభించినది. కాని పిండ ప్రదానాది కర్మలు మాత్రము పుత్రుడు మాత్రమే చేయవలసి ఉన్నది.

    2. 6వ మంత్రమున 'సరమ'ను పేర్కొనుట జరిగినది. సరమను దేవశ్వానము అన్నారు. కుక్క శబ్దమును బట్టి జాడ తీయునది. ఈ విధానము నేటికిని నేరములను శోధించుటకు ఉపయోగపడుచున్నది.

    కుక్కకు భారతమున మంచి స్థానము లభించినది. కుక్క విశ్వాసపాత్రమైన జంతువు.

                              ముప్పది రెండవ సూక్తము

        ఋషి - విశ్వామిత్రుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. సోమపతి ఇంద్రా ! నీవు ఈ మధ్యాహ్న సవనమునకు విచ్చేయుము. సోమపానము చేయుము. సోమము నీకు ప్రియమయినది. ధనవంతుడవు, సోమయుక్తుడవగు ఇంద్రా ! నీ రథపు రెండు గుఱ్ఱములను విప్పుము. వాటి నోటిని గడ్డితో నింపుము. ఈ యజ్ఞమున వానిని సంతోష పెట్టుము.

    2. ఇంద్రా ! గవ్య సంయుక్తము, మంథన సంపన్నమగు నూతన సోమమును పాపము చేయుము. నీ ఆనందమునకుగాను మేము నీకు సోమము సమర్పింతుము. స్తోతలు మరుత్తులు రుద్రుల సహితులయి తృప్తిచెందు వరకు నీవు సోమపానము చేయుము.

    3. ఇంద్రా ! మరుద్గణములు నీ శత్రుశోషక శక్తిని పెంపొందింతురు. వారు నీ బలమును వృద్ధిచెందింతురు. వారు స్తుతులద్వారా నీ యుద్ధశక్తిని వర్ధిల్ల చేతురు. వజ్రహస్తా ! శోభన శిరస్త్రాణ యుక్తా ! ఇంద్రా ! రుద్రుల సహితుడవయి మధ్యాహ్న సవనమునకు విచ్చేయుము. సోమపానము చేయుము.

    4. మరుద్గణములు ఇంద్రునకు సహాయకులు అయినారు. వృత్రుడు తన రహస్యములు తెలిసిన వారు లేరనుకున్నాడు. కాని మరుత్తుల ద్వారా ఇంద్రుడు వృత్రుని రహస్యములు తెలిసికొన్నాడు. ఈ మరుద్గణములే ఇంద్రుని కొఱకు మధురములు, ఉత్సాహ కారకమగు మాటలు పలికినారు.

    5. ఇంద్రా ! మనువు యజ్ఞమునకువలె మా ఈ యజ్ఞమునకు విచ్చేయుము. శాశ్వత బలమునకుగాను సోమపానము చేయుము. హర్యశ్వములు, యజ్ఞయోగ్య మరుత్తుల సహితుడవయి విచ్చేయుము. గమనశీల మరుత్తుల కూడి అంతరిక్షమునందలి జలమును ప్రేరేపింపుము.

    6. ఇంద్రా ! నీవు దీప్తిమంతమగు జలముల అవతరణ కర్తవు. దీప్తిశూన్యుడు, శయనించువాడగు వృత్రుని యుద్ధమున హతమార్చినావు. అందువలన యుద్ధమున అశ్వమువలె జలములను విడిచినావు.

    7. అందువలన మేము హవ్యము ద్వారా ప్రవృద్దుడు, మహా పరిణామ శూన్యమగు ద్యావాపృథ్వులు యజ్ఞార్హుడగు ఇంద్రుని మహిమను పరిమిత పరచలేవు.

    8. సమస్త దేవతలు ఇంద్రుని కర్మలను - సుకృతులు, యజ్ఞాదికములను నష్టపరచజాలరు. ఇంద్రుడు భూలోక, ద్యులోక, అంతరిక్షములను ధరించినాడు. ఇంద్రుని కార్యములు రమణీయములు. ఇంద్రుడు ఉషను, సూర్యుని సృష్టించినాడు.

    9. ఇంద్రా ! నీవు దురాత్మ రహితుడవు. నీ మహిమయే వాస్తవ మహిమ. నీవు జన్మించి సోమపానము చేసినావు. నీవు బలవంతుడవు. స్వర్గాదిలోకములు నీ మహిమను నివారించలేవు. దినములు, మాసములు, సంవత్సరములు సహితము నివారించలేవు.

    10. ఇంద్రా ! నీవు పుట్టగానే సర్వోచ్చ స్వర్గ ప్రదేశమున నిలిచి వెంటనే ఆనంద ప్రాప్తికి సోమపానము చేసినావు. నీవు ద్యావాపృథ్వులందు ప్రవేశించగనే సనాతనుడవు, సృష్టికి విధాతవు అయినావు.

    11. ఇంద్రా ! నీ నుండి అనేకములు ఉత్పన్నములు అయినవి. 'అహి' తనను బలవంతుడు అనుకున్నాడు. జలములను పరివేష్టించినాడు. నీవు వర్థిల్ల ఆ ఆహిని నష్టపరచినావు. కాని నీవు భూమిని ఒక కంటిలో దాచి నిలిచినపుడు స్వర్గము సహితము నీ మహిమకు సమము కాజాలదు.

    12. ఇంద్రా ! మా యజ్ఞము నిన్ను వృద్ధి చెందించును. ఈ యజ్ఞమున నీకు ప్రియమయిన సోమము అభిషవింపబడును. యజ్ఞయోగ్యా ! ఇంద్రా ! యజ్ఞము కొఱకు యజమానిని రక్షింపుము. అహిని వినాశము చేయుటకుగాను ఈ యజ్ఞము నీ వజ్రమును గట్టి పరచును.

    13. పురాతనులు, మధ్యతనులు, అధునాతనులు ఇంద్రుని స్తుతుల ద్వారా వర్థిల్ల చేసినారు. యజమాని అట్టి ఇంద్రుని రక్షక యజ్ఞమునకు తీసికొని వచ్చును. నవధనము కొఱకు ఇంద్రుని ఆహ్వానించును.

    14. నేను మనమున ఇంద్రుని స్తుతించ కోరినపుడు అతనిని స్తుతింతును. దూరవర్తి అయిన అశుభ దినమున కన్న ముందే ఇంద్రుని స్తుతింతును. ఇంద్రుడు మమ్ము దుఃఖములనుండి దాటించవలెను. నదికి రెండు దరులందు ఉన్నవారు పడవవారిని పిలచెదరు. అట్లే మాతృ-పితృ కులములవారు ఇంద్రుని ఆహ్వానింతురు.

    15. ఇంద్రుని కలశము నిండినది. "స్వాహా" శబ్ద ఉచ్ఛారణ జరిగినది. జలసేక్త జలపాత్రను జలసేకము చేసినట్లు నేను సోమ సేచనము చేసెదను. స్వాదు సోమము ప్రదక్షిణ చేయుచు ఇంద్రుని ప్రసన్నత కొఱకు అతనిముందు చేరును.

    16. ఇంద్రా ! బంధుజనులు నీకొఱకు ప్రార్థించినారు. అందువలన నీవు ప్రబలుడవు అయినావు. బడబానలమును, వృత్రుని నివారించినావు. కావున అనేక ఆహ్వానములుగల ఇంద్రా ! గంభీర సాగరములు నిన్ను నివారింపలేవు. సాగరముల చుట్టుగల ఉపసాగరములు నిన్ను నివారించజాలవు.

    17. ఇంద్రా ! నీవు అన్న సంపాదకుడవు. యుద్ధమున ఉత్సాహమున ప్రవృద్ధుడవు. ప్రభూత ఐశ్వర్యవంతుడవు. నేతృ శ్రేష్ఠుడవు. స్తుతిశ్రవణ కర్తవు. ఉగ్రుడవు. సంగ్రామమున శత్రునాశకుడవు. ధన విజేతవు. ఆశ్రయ ప్రాప్తికొఱకు మేము నిన్ను ఆహ్వానించుచున్నాము.

                                ముప్పది మూడవ సూక్తము

                     ఋషి విశ్వామిత్రుడు, వద్య ఋషులు, దేవత - ఇంద్రుడు,
                            ఛందస్సు 1-12 త్రిష్టుప్. 13 అనుష్టుప్.

    1. జల ప్రవాహములగు విపాశ, శుతుద్రీ నదులు కొండ చరియలనుండి బయలుదేరినవి. అవి అశ్వశాలనుంచి విడిచిన అశ్వములవలె రెండు ఆవులు దూడల కోసమువలె సాగరసంగమాభిలాషులయి సముద్రమువైపు పరువులు పెట్టును.

    (విపాశ వ్యాసనది శుతుద్రీ సట్లేజ్ నది. ఇవి పంజాబులో ఉన్నవి.)

    2. నదీద్వయమా ! మిమ్ము ఇంద్రుడు ప్రేరేపించినాడు. మీరు ఇంద్రుని ప్రార్థన మన్నింతురు. రెండు రథములవలె సాగరమువైపు సాగుదురు. మీరు ఒకేసారి ప్రవర్థితులు అగుదురు. తరంగముల ఊయలలు ఊగుదురు. ప్రక్క ప్రక్కనే ఉల్లాసముగా సాగిపోవుదురు.

    3. మాతృతుల్యమగు సింధునది వద్ద నిలిచినాను. పరమ సౌభాగ్యవతి విపాశవద్ద నిలిచినాను. ఈ ఉభయనదులు దూడను నాకగోరు గోవులవలె ఒకేచోటునకు సాగును.

    4. మేము ఉభయ నదులము. ఈ జలమున పరిశుద్ధులమై దేవకృత ప్రదేశమునకు సాగుదుము. మా నడక నిరంతరము. అది నిలుచునది కాదు. ఏమి కోరి ఆవిప్రుడు మమ్ము పిలుచుచున్నాడు? "కింయర్విప్రో నద్యోజుహోతి"

    5. జలవతులగు నదులారా ! నేను విశ్వామిత్రుడను. సోమ సంపాదకుడను. నామాట వినుటకు క్షణము నిలువండి. నేను కుశిక పుత్రుడను. నేను మిమ్ము సంతోషపెట్ట దలచినాను. నా ఉద్దేశ సిద్ధికిగాను స్తుతుల ద్వారా ఆహ్వానించుచున్నాను.

    6. వృత్రుడు నదులను పరివేష్టించినాడు. వజ్రబాహువగు ఇంద్రుడు వృత్రుని పరిమార్చినాడు. ఇంద్రుడు మా ఉభయ నదులను వెలికి తీసినాడు. జగత్ప్రేరకుడు, సుహస్తుడు, ద్యుతిమంతుడు ఇంద్రుడు మమ్ము ప్రేరేపించినాడు. ఇంద్రుని ఆజ్ఞచొప్పున మేము ప్రభవించినాము. సాగుచున్నాము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.