Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



                                                                    విదురుని బహిష్కారము

    పాండవులు కామ్యక వనమున ఉన్నారు. అప్పుడు హస్తినలో ధృతరాష్ట్రుడు ఒకనాడు విదురుని పిలిపించినాడు. అతనితో అన్నాడు:-
    "విదురా! నీవు శుక్రుని మించిన మేధావివి. కౌరవ పాండవుల యందు సమబుద్ధి కలిగినవాడవు. పాండవులు నిర్వీర్యులు అయినారని నా అభిప్రాయము. వారు ఇక ఏమియు చేయలేరని నాకు తోచుచున్నది. నీవు ఏమందువు?".
    "మహారాజా!" విదురుడు వాస్తవము చెప్పినాడు. "పాండవులు దైవస్వరూపులు. ధైర్యము వారి ధనము. యోగ్యత వారి సంపద. భీమార్జునులు అసమాన బలపరాక్రమములు కలవారు. వారిని ఎదిరించిన శత్రువు బ్రతికి బయటపడలేడు. నీ కొడుకులు మాయాజూదమున వారిని ఓడించి కయ్యము కొనుక్కున్నారు. ఇది భరత కులమునకు శ్రేయస్కరముకాదు. జూదము అపాయకరము అని అప్పుడు నేను చెప్పినాను. నీవు వినలేదు. ఇప్పుడయినను వారిని పిలిపించుము. వారి రాజ్యము వారికి అప్పగించుము."
    "దుర్యోధనుడు పుట్టినప్పుడే వాడు కుల దూషకుడు అగునని చెప్పినాను. వానిని విడువమన్నాను. వినలేదు. కుల దూషకుని దూషించి కులమును రక్షించుట ధర్మమగును. ద్రౌపది భీములను ప్రార్థించుటకు దుశ్శాసనుని పంపుము. ధర్మరాజు మహా తపస్సంపన్నుడు. నీ కొడుకులు చేసిన దుర్మార్గములను మన్నింపగలడు, కులమును రక్షించగలడు".
    విదురుడు చెప్పిన మాటలు ధృతరాష్ట్రునకు కఠోరములుగా వినిపించినవి. అతనికి కోపము పొంగినది. "విదురా! కొడుకును చంపుకొని తండ్రులుండరు. నీవు నా పుత్రుల అభివృద్ధిని ఎప్పుడును సహించలేదు. నీ సాయము నాకు అక్కరలేదు. నన్ను విడిచి వెళ్ళిపొమ్ము పాండవుల వద్దకుగాని మరొక చోటునకుగాని వెళ్ళుము. పొమ్ము" అని విదురుని వెళ్లగొట్టినాడు.
    విదురుడు ధృతరాష్ట్రుని విడిచినాడు. వేగముగా సాగు రథమును ఎక్కి కామ్యకవనమునకు చేరినాడు. ధర్మరాజు విదురనకు ఎదురేగినాడు. స్వాగతము పలికినాడు. అతని రాకకు గల కారణము అడిగినాడు.
    "ధర్మరాజా! ధృతరాష్ట్రుడు నన్ను సలహా అడిగినాడు. ఉభయులకు హితకరమగు విషయము చెప్పినాను. అందరికి హితవుగా ఉండు ఆహారము రోగపీడితునకు నచ్చదు. వాస్తవము బుద్ధిమంతులకు నచ్చును. అల్పబుద్ధులకు కోపము తెప్పించును. ధృతరాష్ట్రుడు నా మాట విన్నాడు. మండిపడినాడు. వెళ్లగొట్టినాడు.
    "ధర్మరాజా! రూపలావణ్యవతి యగు యౌవనవతి వృద్ధ శ్రోత్రియునకు లభించినను ఉండదు. విడిచి పోవును. రాజ్యలక్ష్మికి ధృతరాష్ట్రుని యందు విరక్తి కలిగి ఉన్నది. దుర్యోధనాది దుర్మార్గులవద్ద రాజ్యలక్ష్మి స్థిరముగా ఉండదు. రాజ్య సంపదలన్నియు తమంతతామే వచ్చి మిమ్ము వరించనున్నవి. నేను చెప్పినట్లు నీవు ప్రవర్తింపుము" అన్నాడు.
    ధర్మరాజు విదురుని మాటలు విన్నాడు. సమ్మతించినాడు. విదురుడు పాండవుల వద్ద సంతోషముగా ఉన్నాడు.
    విదురుడు పాండవుల వద్ద ఉన్న విషయము గ్రహించినాడు ధృతరాష్ట్రుడు. అది అతనికి నచ్చలేదు. సంజయుని పిలిచినాడు. "సంజయా! విదురుడు నాకు తమ్ముడు. నాకు మనసు వంటివాడు. నేత్రముల వంటివాడు. నాకు కార్యాకార్యములు చెప్పుచుండువాడు. అతను లేకున్న నాకు తోచుటలేదు. కాబట్టి నీవు కామ్యక వనమునకు వెళ్లుము. విదురుని వెంట పెట్టుకొని రమ్ము. విదురుడు లేకున్న నేను నిలువజాలను" అని చెప్పి సంజయుని పంపించినాడు.
    సంజయుడు హస్తిన నుండి బయలుదేరినాడు. కామ్యకవనము చేరినాడు. అచట వేలమంది బ్రాహ్మణులున్నారు. భీమార్జున, నకుల, సహదేవులు, ద్రౌపది, ధౌమ్యుడు, విదురుడు ధర్మరాజును సేవించుచున్నారు. రాజ్యము లేకున్నను ధర్మరాజు ముల్లోకములను పాలించుచున్నట్లు ఉన్నాడు. సంజయుడు అది చూచి సంతసించినాడు. ధర్మరాజునకు నమస్కరించినాడు. తాను వచ్చిన పనిని గూర్చి విన్నవించినాడు.
    ధర్మరాజు సంజయుని మాటలు విన్నాడు. విదురునితో "ధృతరాష్ట్రుడు మహారాజు. సర్వజనులు అతని ఆజ్ఞ ప్రకారము ప్రవర్తించుచున్నారు. మనము సహితము అతని మాట పాటించవలసి ఉన్నది. కాబట్టి నీవు హస్తినకు వెళ్లుము" అని విన్నవించినాడు.
    విదురుడు ధర్మరాజు మాట విన్నాడు. సంజయుని వెంట బయలుదేరినాడు. హస్తిన చేరినాడు. ధృతరాష్ట్రుడు విదురుని రాక గ్రహించినాడు. అతి స్నేహముగా అతనిని కౌగిలించుకున్నాడు. శిరసు మూర్కొన్నాడు అన్నాడు:-
    "తమ్ముడూ! నీవు శాంత స్వభావుడవు. బుద్ధిమంతుడవు. నేను బుద్ధిహీనుడను. నిన్ను నిందించినాను. నన్ను మన్నింపుము. క్షమింపుము" అని ప్రార్థించినాడు.
    విదురుడు ఎప్పటివలెనే ధృతరాష్ట్రునకు రాజ్య కార్యములందు సాయపడుచు హస్తినలో ఉన్నాడు.

                                                         ఆలోచనామృతము

    1. ఇచ్చటి విదురుడు రామాయణమునందలి విభీషణుని వలెను, ధృతరాష్ట్రుడు రావణుని వలెను కనిపించుచున్నారు. విభీషణుడు రావణునకు సరిగా ఇటువంటి హితవునే చెప్పినాడు. సీతను శ్రీరామునకు అప్పగించి రాక్షస జాతిని రక్షించమన్నాడు. అప్పుడు రావణునకు కోపము వచ్చినది. విభీషణుని వెళ్లగొట్టినాడు. ఇచట విదురుని విషయమున అట్లే జరిగినది.
    2. మనిషి తనవద్ద ఉన్నంత కాలము అతని విలువ గ్రహించుట కష్టము. తనకు దూరమయినపుడే వాని విలువ తెలియును. విదురుడు ధృతరాష్ట్రుని తమ్ముడు. విద్వాంసుడు. ధర్మజ్ఞుడు. పుత్రేషణతో వాస్తవము గ్రహించలేక వెళ్లగొట్టినాడు.
    విదురుడు వెళ్లిన తరువాత అతని విలువ గ్రహించినాడు. పిలిపించినాడు. అంతేకాదు విదురునకు హస్తిన రహస్యములన్నియు తెలియును. విదురుడు పాండవులవద్ద ఉన్న వారి శక్తి మరింత పెరుగును. అందువలన అతనిని తిరిగి రప్పించుటయే మంచిది.
    అందుకని విదురుని తిరిగి రప్పించినాడు.

                                                      కిమ్మీర వధ

    ధృతరాష్ట్రుడు విదురుని వెళ్లగొట్టినాడు. దుర్యోధనాదులు ఎంతో సంతసించినారు. ధృతరాష్ట్రుడు విదురుని మరల రప్పించినాడు. అందుకు దుర్యోధనుడు దుఃఖించినాడు. విదుర, ధృతరాష్ట్రులు కలిసి పాండవులను తిరిగి రప్పింతురని రాజ్యము అప్పగింతురని భయపడినాడు. శకుని కర్ణులను సంప్రదించినాడు. పాండవులను రప్పించిన అగ్ని విషాదుల చేత పాండవులకు అపాయము కలిగించవలెననుకున్నాడు. ఆవిషయము వారికి చెప్పినాడు. అది విని శకుని అన్నాడు:-
    "దుర్యోధనా! బాల్య చాపల్యమున నీవు అట్లు తలచినావు. ధృతరాష్ట్ర విదురులు రప్పించినను పాండవులు రారు. వారు సత్యవ్రతులు. ఆడిన మాట తప్పరు. అరణ్య, అజ్ఞాత వాసములు ముగించక వారు తిరిగిరారు. నీవు నిశ్చింతగా ఉండుము. కర్ణునకు శకుని మాటలు నచ్చలేదు.
    మహారాజా! నిశ్చింతగా ఉండుట క్షేమముకాదు. మనము సకల సైన్యములతో పాండవుల మీదికి దండెత్తుదము. వారిని వధించి శత్రు శూన్యము చేతము. అప్పుడు నీకు మనశ్శాంతి కలుగును. నీవు నిశ్చింతగా ఉండవచ్చును" అన్నాడు.

    దుర్యోధనునకు కర్ణుని మాటలు నచ్చినవి. అతడు సకల సైన్యములను ఆయత్తము చేసినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.