Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
నేను : అమీరన్
ఖానమ్ : ఈ పేరు నాకు నచ్చలేదు. నేను ఉమ్రావ్ అని పిలుస్తాను.
హుసేనీ : విన్నావా అమ్మాయీ! ఉమ్రావ్ అని పిలిస్తే పలకాలి. అమ్మగారు "ఉమ్రావ్ " అన్నప్పుడు "జీ" అనాలి.
ఆరోజు నుంచీ "ఉమ్రావ్" అయిపోయాను. కొంతకాలం తరవాత వేశ్యల లెక్కలోకి వచ్చినప్పుడు "ఉమ్రావ్ జాన్" ని అయిపోయాను.
ఖానమ్ గారు చచ్చేవరకు ఉమ్రావ్ అని పిలిచారు. బువాహుసేనీ ఉమ్రావ్ సాహెబా (గారు) అనేది. ఇదంతా అయిం తర్వాత బువాహుసేనీ నన్ను తన ఇంటికి తీసికెళ్ళింది. మంచి మంచి పదార్ధాలు తినిపించింది. మిఠాయి లిచ్చింది. ముఖం కడిగించింది. తన దగ్గర పడుకోబెట్టుకుంది.
ఆ రాత్రి అమ్మా నాన్నా కలలో కనిపించారు. నాన్నా కొలువు నుంచి వచ్చారు. తమ్ముడు ఆడుతున్నాడు. వాడికి మిఠాయిలు ఇస్తున్నారు. నేను వేరే గదిలో ఉన్నట్లు నాన్న నన్ను గురించి అడుగుతున్నారు అమ్మ వంటింట్లో ఉన్నది. ఇంతలో నాన్నను చూశాను. పరుగెత్తుకొని వెళ్లి చుట్టివేశాను. ఏడుస్తూ నా కధంతా చెపుతున్నాను.
కలలో ఏడ్చీ ఏడ్చీ ఎక్కిళ్ళు వచ్చాయి. బువాహుసేనీ ఓదార్చింది. కాళ్ళు తెరచి చూస్తె ఆ ఇల్లూ కాదు వాకిలీ కాదు. అమ్మా లేదు. నాన్నా లేడు. బువాహుసేనీ ఒళ్ళో పడి ఏడుస్తున్నాను. బువాహుసేనీ కన్నీరు తుడుస్తుంది. దీపం వెలుగుతుంది. బువాహుసేనీ ని చూశాను. కన్నీటి కాలువ కనిపించింది.
బువాహుసేనీ చాలా మంచిది. నా విషయంలో ఎంతో వాత్సల్యం కనబరిచింది. కొద్ది రోజుల్లో అమ్మనూ, నాన్నానూ మరిచిపోయాను. మరిచిపోక చేసేది మాత్రం ఏముంది? అందుకు కారణం ఒకటి గత్యంతరం లేకపోవడం. రెండవది కొత్త పద్దతులు, కొత్త జీవితం. తినడానికి రుచికరమైన పదార్ధాలు, కలలో సహితం ఎరగని మంచి మంచి బట్టలు లభించాయి. ఆడుకోవడానికి ఖుర్షీద్ జాన్, బిస్మిల్లాఖాన్, అమీర్ జాన్ , రాత్రింబవళ్ళు నృత్యగానాలు- సంతలు, వన విహారాలు - అందని ఆనందం అంటూ లేందే!
మిర్జాగారూ! ఆటపాటల్లో పడి అంత త్వరగా తల్లిదండ్రులను మరిచిపోయానంతే మీరు నన్ను కఠినురాలు కృతఘ్నురాలు అనుకోవచ్చు. నా వయస్సు అప్పటికి చాలా తక్కువ. కొత్త కోడలు అత్తవారింటికి వెళ్తుంది. ఒకటి రెండు రోజులు కాక బ్రతికి ఉన్నానాళ్ళు అక్కడే ఉండిపోవాలని తెలుసుకుంటుంది. అలాగే నేకూ తెలిసిపోయింది. ఖానమ్ ఇంట్లో జీవితాంతం గడపాలని అర్ధం అయింది. తోవలో దొంగవేధవలు ఎన్నో బాధలు పెట్టారు. ఖానమ్ ఇల్లు స్వర్గంలా కనిపించింది. తలిదండ్రులను చూడడం అసంభవం అని అర్ధం చేసుకున్నాను. అసంభవం అని తెలిసిన తరువాత ఆశ నశిస్తుంది. ఫైజాబాదు లక్నో నుంచి 40 కోసులు దూరం మాత్రమే అయినా నాకేదో అనంతమైన దూరంలా కనిపించేది.
చిన్ననాటి జ్ఞాపకాలకు, ఈనాటి ఆలోచనలకూ ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది.
మారుట నైజం మనిషి ప్రవృత్తి!
మంచికే మారెనులే నా ప్రవృత్తి!
రుస్వాగారూ! ఖానమ్ ఇల్లు జ్ఞాపకం ఉందనుకుంటా , ఎంత విశాలమైంది! ఎన్ని గదులు! అన్ని గడుల్లోనూ సానులే. ఆమె కూతుళ్ళు బిస్మిల్లా, ఖుర్షిద్ లు నా వయసు వాళ్ళు. వీరు కాక పది పదకొండు మంది సానులుండేవారు. వారి గదులు వేరు. బృందాలు వేరు. దర్బారులు వేరు. అందంలో ఒకరిని తలదన్నినవారొకరు. ఎప్పుడూ నగలూ, నాణాలూ శృంగారించుకొని ఉండేవాళ్ళు . వారి బట్టలు మా బట్టలలాంటివి కావు. ఖరీదైనవి. ఇతర సానులకు ఈద్ , బఖ్రీదుల్లో కూడా లభించనివి. ఖానమ్ ఇల్లు స్వర్గంలా ఉండేది ఏ గదిలో ప్రవేశించినా హాస్యం , నవ్వులు , ఆటలు పాటలే . స్త్రీ జాతి తెలివి గలది. తనకు అవసరం అయిందాన్ని ఇట్టే అర్ధం చేసుకుంటుంది. నా వయసు చిన్నది. అయినా బిస్మిల్లా ఖుర్షిద్ లు పాడుతూ నాట్యం చేస్తూ కనిపిస్తే నాకూ అలా చేయాలనిపించింది. కూనిరాగాలు తీస్తూ గంతులేస్తూ ఉండేదాన్ని. ఈలోగా నాకు గూడ చదువు ప్రారంభం అయింది. నా స్వభావం సంగీత కళకు , గొంతు పాటకు అనుకూలం అయినందున సరిగమలు పూర్తి కాగానే అధ్యాపకుడు పాఠాలు ప్రారంభించాడు. వారు పట్టుదల గలవారు. రాగాలన్నీ స్వరయుక్తంగా నోటికి రావాలనేవారు. అదే స్వరంతో పాడించేవారు. వారంటే అడలు పుట్టేది. స్వరం మారడానికి వీల్లేదు. కోమలం అతికోమలం కావడానిగ్గాని , శుద్ధం విశుద్ధం కావడానిగ్గాని తీవ్రం తీవ్రతరం కావడానికి గ్గాని వీల్లేదు. నాకు కాస్త మంకుతనం అలవాటు. వారు దాన్ని అట్టే పట్టించుకునేవారు కాదు.
ఒకనాడు ఖానమ్ ముందు రామ్ కలీ పాడుతున్నాను. ద్యుతశుద్ధికి వచ్చేశాను. గురువుగారు ఆపలేదు. ఖాన్మ్ మళ్ళీ పాడించారు. అలాగే పాడాను. గురువుగారు మళ్ళీ పాడించారు. అలాగే పాడాను. గురువుగారు మళ్ళీ మాట్లాడలేదు. ఖానమ్ గుడ్లురిమి చూచారు. నేను గురువు ముఖం చూశాను. వారు తల వంచుకున్నారు. ఖనమ్ కు కోపం వచ్చింది.
ఖానమ్ : ఉస్తాద్ జీ! ఏమది ? రామ్ కలీ లో ఉచ్చారణ ద్యుతం. ఆ స్వరమే సరియైనది. దుత్యం కొమలమా శుద్దమా?
గురువు : కోమలం.
ఖానమ్ : అమ్మాయి ఏ స్వరంలో ఆలపించింది.
గురువు : శుద్ధం.
ఖానమ్ : ఎందుకు ఆపలేదు ?
గురువు : ధ్యాస లేదు.
ఖానమ్ : ధ్యాస లేదు. అందుకే రెండోసారి అనిపించాను. అప్పటికీ మాట్లాడలేదు. ఇదేనా మీరు చెప్పే చదువు ? తెలిసినవారి ముందు ఇలాగే పాడితే నా నోట్లో ఊయరూ?
గురువుగారు తలవంచారు. మాట్లాడలేదు. మనసులో ఉంచుకున్నారు. ఉస్తాద్ జీ తమను "నానక్" గా భావించారు. వాస్తవంగా వారి ప్రతిభ అలాంటిది . ఖానమ్ గద్దింపు సహించలేక పోయారు.
ఒకనాటి వృత్తాంతం "మహా" పాడుతున్నాను. ఖానమ్ కూడా ఉన్నారు. నేను ఉస్తాద్ జీ ని అడిగాను "గాంధారం కొమలమా? అతి కొమలమా?" అని.
గురువు : అతి కోమలం.
ఖానమ్ : ఖా సాహబ్ ! మాషా అల్లా! (అయ్యో) నా ముందే?
గురువు : ఏం ?
ఖానమ్ : నన్నే అడుగుతున్నారూ? "సోహా" లో గాంధారం అతి కొమలమా? చెప్పండి మీరే.
గురువు : గాంధారం కోమలం కావాలి.
ఖానమ్ : ఒప్పుకున్నారా? అతి కోమలం అనేగా అమ్మాయికి తప్పు చెపుతున్నారు ? ఖా సాహెబ్! గొంతు తప్పు చేస్తే చెవులు పట్టేస్తాయి. నేను మాములు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాననుకుంటున్నారేమో! మియా గులామ్ రసూల్ ఖా పేరు వినే ఉంటారు. ఇవన్నీ మీకు చెప్పి ఏం ప్రయోజనం? చెప్పాలనుకుంటే మనసుంచి చెప్పండి. లేదా క్షమించండి. వేరే ఏర్పాటు చేసుకుంటాను. అమ్మాయిలను మాత్రం నాశనం చేయకండి.
గురువుగారూ "మంచిది" అని లేచి వెళ్ళిపోయారు. చాలారోజుల వరకు తిరిగి రాలేదు. ఖానమ్ స్వయంగా చదువు చెప్పారు. ఖలీ ఫాజీ మధ్యవర్తిత్వంతో తగాదా పరిష్కరించబడింది. గురువుగారు సరిగా చెప్పసాగారు. చెప్పక ఏం చేస్తారు. గురువుగారు , ఖానమ్ - ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ విద్యావంతులో ఇప్పటికీ అర్ధం కాలేదు. ఖానమ్ కొన్ని విషయాలు చెప్పేది. గురువుగారిని అడిగితే చెప్పలేకపోయేవారు. వారికి తెలియదా? తెలిసి చెప్పరా? లక్షసతమతం అయినా గుట్టు బయట పెట్టేవారు కారు. సంగీతం విషయంలో నాకు శ్రద్ధ ఎక్కువైంది. ఏమాత్రం సంశయం వచ్చినా అడిగేదాన్ని. ఉస్తాద్ జీ దొర్లించేసేవారు. వారు లేనప్పుడు ఖానమ్ ను అడిగేదాన్ని. నా శ్రద్దను చూచి చాలా సంతోషించేది. బిస్మిల్లాను తిట్టిపోసేది. బిస్మిల్లా విషయంలో చాలా కృషి చేసింది కాని టప్పా, టుమ్రీ తప్ప ఏమీ రాలేదు. ఖుర్షీద్ గొంతు మంచిది కాదు. రూపంలో అప్సరస , గొంతు పగిలిన వెదురు బొంగు. నాట్యం బాగా చేసేది. నేర్పింది కూడాను అదే. ఆమె కచ్చేరీ అంతా నాట్యమే. ఒకటి రెండు పాటలు పాడేది పేరుకు.
ఖానమ్ వేశ్యల్లో బేగాజాన్ ది సంగీతంలో అందెవేసిన చేయి. కాని ముఖం? రాత్రికి చూస్తె దడుచుకోవాల్సిందే. రొట్టెల పెంకు, మశూచి మచ్చలు, ఎరుపు కళ్ళు, చట్టి ముక్కు, లావు పెదాలు, పెద్దపెద్ద కళ్ళు , పైగా పొట్టి, కాని గొంతు? పాట పాడ్తే అమృతం కురిసేది. "మూర్చన"ఆమె పాడగానే వినాలి. నేను ఆవిడ గదిలో ప్రవేశిస్తే ప్రాణం తీసేదాన్ని అది చెప్పమనీ, ఇదీ చెప్పమనీ.





