Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
12. అప్పుడు బృహస్పతి 'సూర్యస్య త్వా చక్షుషా ప్రతిపశ్యామి - సూర్యుని కంటితో నిన్ను చూచుచున్నాను - అను మంత్రమును ఆవిష్కరించినాడు. సూర్యుని కన్ను ఏదానిని హింసించదు కదా అనుకున్నాడు.
13. దేవతలనుండి ప్రాశిత్రమును స్వీకరించుచు బృహస్పతి భయపడినాడు. 'ప్రాశిత్రమా! నిన్ను సవితా దేవత అనుమతి వలనను, అశ్వినుల బాహువులతోను, పూష హస్తములతోను అందుకొనుచున్నాను' అన్నాడు.
సవితా దేవత అనుమతి వలన మంత్రపూర్వకముగ, దేవతలు అందించగా ప్రాశిత్రమును బృహస్పతి స్వీకరించినాడు.
14. బృహస్పతి ప్రాశిత్రము భక్షించు తనను బాధించునని భయపడినాడు. 'ప్రాశిత్రమా! నిన్ను అగ్ని ముఖముతో తినుచున్నాను. అగ్నిముఖము ఏదానిని హింసించదు కదా!' అన్నాడు.
ప్రాశిత్రము భక్షించు తనను అది బాధించునని బృహస్పతి భయపడినాడు. ప్రాశిత్రమా! నిన్ను బ్రాహ్మణుని ఉదరమున ఉంచుచున్నాను. బ్రాహ్మణుని ఉదరము ఏదానిని హింసించదు కదా!' అన్నాడు.
బృహస్పతి వేదవిదుడు కదా!
15. ప్రాశిత్రము తిన్న వాని నుండి ప్రాణములు తొలగిపోవును. కావున శిరసు మొదలుకొని సర్వాంగములను నీటితో మార్జనము చేసికొనవలెను. ప్రాణాది స్థానములను తాకవలెను.
ప్రాణములు అమృతములు. ఉదకములు అమృతములు. కావున అవి యథాస్థానమున నిలిచి ఉండును. వదిలిపోవు.
తొమ్మిదవ అనువాకము
1. అగ్నీధ్రుడు అగ్నీధ్రము నందు సమిధను వేయవలెను. అందువలన అతడు ఋతువులను సంతోషపెట్టిన వాడగును.
2. తదుపరి అనుయాజాహుతులను ప్రతిష్ఠించవలెను. అందుకు అగ్నీధ్రుడు సమిధను అగ్ని యందు వేయవలెను. అది సమిధాగ్ని యందు హోమము చెసినట్లగును.
3. అగ్నీధ్రుడు పరిధులను శుభ్రముగా తుడువవలెను. అందువలన పరిధులను పునీతము చేసినట్లగును.
4. ఒక్కొక్క పరిధిని తుడవవలెను. అట్లయినచో యజ్ఞము పరాగ్భూతము వంటిది అగును కదా!
5. మూడు పరిధులను తుడిచి అగ్నిని కూడ తుడువవలెను. అప్పుడు సమ్మార్గములు నాలుగు అగును. పశువులు నాలుగు కాళ్లవి కదా! అందువలన యజమానికి పశువులు కలుగును.
6. బ్రహ్మన్ర్పస్థాస్యామః - బ్రహ్మా! బయలు దేరుచున్నాము అని మంత్రము చెప్పినది.
బ్రహ్మ నిలిచిన చోటినే యజ్ఞము ఆశ్రయించి ఉన్నది. యజ్ఞము ఆశ్రయించిన చోటునుండియే అనుయాజ యాగమును ఆరంభించవలెను.
7. అధ్వర్యుడు అనూయాజమునకు బ్రహ్మ అనుమతి కోరును. అప్పుడు బ్రహ్మనోటి మాటతో అనుమతినిచ్చిన అతనికి కంపనరోగము కలుగును. తలపంకించి అనుమతించిన శిరో రోగము కలుగును. మాట్లాడకున్న యజ్ఞము జరిగినట్లు కాదు. 'ప్రతిష్ఠేత్యేవ బ్రూయాత్' 'ప్రతిష్ఠా' అనియే అనుమతించవలెను. యజ్ఞము మంత్రమును ఆశ్రయించి ఉండును. అందువలన 'బ్రహ్మ' మంత్ర వాక్కుచేతనే యజ్ఞమునకు అనుమతించినట్లగును.
8. "బ్రహ్మన్ర్పత్యాస్యామః" అని అధ్వర్యుడు బ్రహ్మను అనుమతి అడుగును. అప్పుడు బ్రహ్మ 'సవితృదేవా! ఇతడు అనుమతి కోరినాడు' అని చెప్పవలెను. అట్లని మంత్రము చెప్పినది.
బృహస్పతి బ్రహ్మస్వరూపుడు. అతడు మంత్రవేత్తలందు శ్రేష్ఠుడు.
బృహస్పతీ! నీవు అటువంటి వాడవు. నీవు యజ్ఞమును రక్షింపుము. యజ్ఞపతిని రక్షింపుము. అని మంత్రము యజ్ఞము కొరకును, యజమాని కొరకును కోరినది.
అట్లనుట వలన బ్రహ్మ తనకొరకును, యజమాని కొరకును బాధలు కలుగనట్టి ఆశీస్సులు కోరినవాడు అగుచున్నాడు.
9. 'దేవతల కొరకు యాగము చేయుము' అని అందరు వినునట్లు చెప్పవలెను.
10. దేవతలు యాగము చేయుటకు సిద్ధపడినారు. 'అనుయాజ యాగమునకు దేవత ఎవరు?' అని బ్రహ్మవాదులు అడిగినారు.
గాయత్రి, త్రిష్టుప్, జగతీ ఛందస్సులని సమాధానము.
కావున ఛందోదేవతలను గూర్చి అధ్వర్యుడు యాగము చేయవలెనని చెప్పవలెను.
బ్రాహ్మణములే ఛందస్సులని చెప్పబడినవి. కావున బ్రాహ్మణముల నుద్దేశించియే యాగము చేయవలెను.
11. దేవతలు అగ్ని, ప్రజాపతి మొదలగు దేవతలను గూర్చి యాగములు చేసినారు. అంతట అగ్ని ప్రజ్వలించలేదు. అప్పుడు వారు అనుయాజన ఆహుతులందు అగ్నిని దర్శించినారు. కావున అనుయాజలను అనుష్ఠించవలెను. అది అగ్నిని చక్కగా ప్రజ్వలింప చేసినట్లగును.
12. ఏతదుడు అను అసురుడు ఉండెను. అతడు యజ్ఞపు సూక్త వాకమునందలి 'ఆయురాశాస్తే సుప్రజాస్త్వ మాశాస్తే' అను ఆశీస్సును తన పరము చేసికొన్నాడు.
'ఏతదు ద్యావాపృథివీ భద్రమాభూత్' అను మంత్రమును ఆ విధముగా ఉచ్చరించినచో అధ్వర్యుడు యజ్ఞసంబంధ ఆశీస్సులను రాక్షసపరము చేసిన వాడగును.
కావున అధ్వర్యుడు 'ఇదం ద్యావాపృథివీ భద్రమభూత్' అనునది చదువవలెను. అందువలన యజ్ఞ సంబంధ ఆశీస్సు యజమానికి చెందును.
('ఏతద్' 'ఇదం' రెండింటి మధ్య భేదము గమనించవలెను.)
13. 'ఇదం ద్యావాపృథివీ' యందు 'ఆర్ద్మసూక్తవాక' మును 'ఉతనమోవాకమ్' అను వాక్య ద్వయము నిక్షిప్తము. సమృద్ధి పొందితిని అని ఈ మంత్రము చెప్పుచున్నది.
('అయం యజమానః శ్రద్దాలుః' వంటివి సూక్తవాకము. 'నమో దేవేభ్యః' అనునవి నమోవాకములు.)
14. 'ఉపశ్రితః ద్యావాపృథివీ' అను సూక్తవాకము నందు భూమి మీద అగ్నియు, ద్యులోకమున గలము ఉన్నవని చెప్పబడినది.
15. యజమానీ! నీవు చేయు ఈ యజ్ఞమునందు ద్యావా పృథ్వులకు రక్షణ కలుగును గాత అను దానిని ఆశీస్సుగనే కోరుచున్నాడు.
16. 'సూపచరణా'కు మారుగా 'సూపావసానా' అనియు 'స్వధిచరణా' కు బదులు 'స్వధ్యవసానా' అనియు పలుకరాదు. అట్లు పలికిన యజమానికి మరణము కలుగును. అప్పుడు అతడు భూమికి చెందినవాడు అగును.
కావున స్వధిచరణా - భూమి ఎంతో ఆశ్రయించ తగినది అనియు సూపచరణా - ద్యులోకము ఎంతో సేవించదగిన దనియు వచించవలెను. అందువలన అధ్వర్యుడు యజమానికి గోప్రచార భూమిని కోరిన వాడు అగును. యజమానికి మరణము కలుగదు.
17. ఇంతకు ముందు 'ద్యావాపృథ్వుల అనుమతి వలన అగ్ని హవిస్సును సేవించినది' అని చెప్పబడినది.
ఏ దేవతలను గురించి ఈ యాగము చేసినామో వారికి సమృద్ధి కలిగించినాము, అని ఇప్పుడు చెప్పబడుచున్నది.
18. ఆశీస్సులు కోరునపుడు యజమాని పేరు నిర్దిష్టముగ చెప్పకున్న ఆ ఆశీస్సులు ఇతరులకు చెందును.
ఈ యజమాని అని అతని పేరు చెప్పుట వలన అది ఆ యజమానికే చెందును. అతనికి స్వర్గ ప్రాప్తి కలుగును.
19. ఈ యజమానికి ఆయుష్యము కోరుచున్నాను. ఈ యజమానికి సంతానము కోరుచున్నాను అనుట వలన అది యజమాని కోరినట్లే అగును.
20. ప్రాణములు జీవాత్మకు సజాతీయములు. కావున "సజాతవవస్యామాశస్తే" అనుట వలన ప్రాణములకు అంతరాయము కలుగదు.
21. అగ్నిదేవుడు దేవతలనుండి తెచ్చి యాజమానిని ఫలవంతుని చేయుచున్నాడు. హోత్రాదులమగు మేము అగ్ని అనుగ్రహమున మానవులకు ఫలము అందించుచున్నాము అనునది మంత్రార్థము. కావున అగ్ని దేవతల కొరకు యాచించుచున్నాడు. హోతలమగు మేము మనుష్యుల కొరకు యాచించుచున్నాము అన్నట్లయినది.
22. ఇహగతిర్వామస్యేదంచ నమో దేవేభ్యః ఇత్యాహ యాశ్పైవ దేవతా యజతి యాశ్చన తాభ్య ఏ వోభయీభ్యో నమస్కరోత్యాత్మనోనార్త్యై.
ఈ యజ్ఞకర్మయందు ధనమునకును, హవిస్సులు అందుకొను దేవతలకు నమస్కారము అని మంత్రము. అందువలన యాగమునందు ఉద్దిష్టులైన దేవతలకును ఉద్దిష్టులు కానివారికిని - బాధలు కలుగకుండుటకు - నమస్కరించుచున్నాను అన్నట్లు అయినది.
పదవ అనువాకము
1. దేవతలు యజ్ఞము యొక్క హవిస్సును తమకు సొంతము చేయువానిని కానరైరి. వారు బృహస్పతి కుమారుడగు శంయుని - యజ్ఞమునందలి తమ హవిర్భాగములను "స్వగాకురు" మాకు స్వంతము చేయుము అని కోరినారు. శంయు అందుకు ప్రతిఫలము కోరినాడు: -
బ్రాహ్మణనియుక్తుడు కానివాడును, శ్రద్ధలేనివాడును చేయు యాగఫలము తనకు చెందవలెను అను వరము కోరినాడు. దేవతలు అతనికి ఆ వరము ఇచ్చినారు. కావున బ్రాహ్మణనియుక్తుడు కాని వాడును, శ్రద్ధలేని వాడును చేయు యాగ ఫలము శంయునకు చెందుచున్నది.
తదుపరి తన కుమారునకు ఏమి వరము ఇత్తురని దేవతలను అడిగినాడు. పాపము చేసిన వానిని దండించు అధికారమును శంయుని పుత్రునకు ఇచ్చినారు.
బ్రాహ్మణుని కొట్టుటకు నియుక్తుడగు వానికి శతనిష్క దండమగును. బ్రాహ్మణుని కొట్టిన వానికి సహస్ర నిష్క దండమగును. బ్రాహ్మణుని రక్తము వచ్చునట్లుగా కొట్టువాడు భూమి యందుగల పరమాణువులన్ని సంవత్సరములు భూమినంటియే ఉండును. పితృలోకమునకు చేరడు.
కావున బ్రాహ్మణుని అధిక్షేపించరాదు. కొట్టరాదు. రక్తము కారునట్లు చేయరాదు. మ్డువలన అతడు పాపము చేసినవాడు అగును.
2. యజ్ఞము యొక్క ప్రశస్త ఫలమును శంయుని నుండి కోరుచున్నాము అని తచ్చంయోరావృణీమహే అను మంత్రము చెప్పుచున్నది. అందువలన అధ్వర్యుడు యజ్ఞ ఫలమును దేవతలకు 'ప్వగాకరోతి' స్వంతము చేయుచున్నాడు.
3. 'తచ్ఛంయో' మంత్రమున అధ్వర్యుడు బృహస్పతి కుమారుడగు శంయుని సమృద్దుని చేయును.
4. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే ఇత్యాహ - యజ్ఞగమనమునకును యజ్ఞపతి గమనమునకు అని మంత్రము చెప్పినది.
ఇది ఆశీర్వచనము అగును.
5. 1. సోమదేవతాక హోమము చేయవలెను. అందువలన సోముడు రేతోరూపము ధరించును. 2. త్వష్ట దేవత హోమము చేయవలెను. అందువలన అతడు రేతస్సును వివిధ రూపములు ధరించునట్లు చేయును. 3. దేవపత్నుల హోమము చేయవలెను. అందువలన మిథునత్వ లాభము కలుగును. 4. గృహపతియగు అగ్ని హోమము చేయవలెను. అందువలన ప్రతిష్ఠ కలుగును.
(ఇది పత్నీ సంయాజ విధాయక మంత్రము.)
6. ప్రయాజలు ఆజ్యముతోనే, పత్నీ సంయాజలు ఆజ్యముతోనే యజించబడును. అందువలన ఆలస్యము జరిగినట్లగును. ఆలస్య దోష నివారణార్థమును, మిథునత్వ సిద్ధి కొరకును ఋక్కును ఉచ్చరించి, ఋక్కుతో హోమము చేయవలెను.
7. దర్శపూర్ణయాగము పంచ సంఖ్యాత్మకము. ఆద్యంతము లందు పంచసంఖ్య కలది అగుచున్నది. ముందు అయిదు ప్రయాజ హోమములు చేయబడును. చివరన నాలుగు పత్నీసంయాజలు, అయిదవదగు సమిష్టి యజువు యజించబడుచున్నవి. కావున పంచ సంఖ్యతో మొదలై పంచ సంఖ్యతో సమాప్తము అగుచున్నది.
పదకొండవ అనువాకము
1. అగ్నీ! ఇది ప్రసిద్ధకర్మ. అశ్వస్వామి అశ్వములను సమకూర్చును కదా! అట్లే నీవు ఈ యజ్ఞమునకు ఆహ్వానించ దగిన దేవతలను చేర్చుము. నీవు ప్రాచీన హోతవుగా ఈ యజ్ఞప్రదేశమున ఆసీనుడవు అగుము.





