Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||
ముప్పది నాలుగవ అధ్యాయము
1. యజ్జాగ్రతో దూరముపైతి దైవం తదుస్తుప్తస్య తథైవేతి|
దూరంగమం జ్యోతిరేకం తన్మేమనః శివ సంకల్పమస్తు||
మనసు దివ్య శక్తియుక్తమైనపుడు జాగృతమానవునికన్న దూరమున వ్యక్తమగుచున్నది. నిద్రలో ఉన్న మానవుని మనసు సహితము అదేవిధముగా దూరమున వ్యక్తమగును.
నామనసు దూరము ప్రయాణము చేయగలది. అది జ్యోతులందు ఒకే జ్యోతి. నామనసు శుభసంకల్పములది అగును గాత.
2. కర్మవంతుడును, విద్వాంసుడును, వీరుడును అగువాడు యజ్ఞములందును అన్యధనలాభ కార్యములందును మనసు చేతనే కర్మ చేయుచున్నాడు. నామనసు జనులందు అపూర్వమును, ప్రకాశమానమగు జ్యోతి యగును.
తన్మేమనః శివసంకల్పమస్తు. అట్టి నామనసు శుభసంకల్పములది అగును గాత.
3. ఏది ప్రజ్ఞానమగునో, ఏది విచిత్రమగునో, ఏది ధృతి యగునో, ఏది జనుల అంతరములందలి ఋతసంజ్ఞక జ్యోతియగునో - ఏది లేకున్న ఎవ్వాడును కర్మచేయజాలడో.
తన్మేమనః శివసంకల్పమస్తు.
4. ఇది మనసు. దీని వలననే భూత, భవిష్యత్, వర్తమానాత్మక సమస్త జగములు ప్రవర్తిల్లుచున్నవి. మనసు వలననే సప్తహోతలు యజ్ఞము విస్తరించుచున్నది.
తన్మేమనః శివసంకల్పమస్తు.
5. రథనాభియందు ఫలకముల వలె మనసునందు ఋగ్యజుస్సామములు ప్రవర్తిల్లు చున్నవి. మనసునందే జనుల మంచి చెడులు ఆంతర బహిరములు ఉన్నవి.
తన్మేమనః శివసంకల్పమస్తు.
6. నిపుణుడగు సారథి తన రథమును గమ్య స్థానమునకు చేర్చును. కళ్లెము పట్టి గుర్రమును అదుపులో ఉంచును. అట్లే జనుల మనసులు అటు నిటు ఉరుకులు పెట్టును. ఈ మనసు హృదయమునందు ప్రతిష్ఠితము. జరారహితము. వేగవంతము.
తన్మేమనః శివసంకల్పమస్తు.
(యదజరం అనుచున్నాడు. వార్థక్యము దేహమునకే కాని మనసునకు కాదనుచున్నాడు.)
7. అన్నము తేజస్సు గలది. బలము గలది. నేను అన్నమును స్తుతించుచున్నాను. అన్న బలముననే ఇంద్రుడు వృత్రుని ముక్కలు ముక్కలుగా నరికినాడు.
8. అనుమతే! నీవు మా మనోరథములను ఆమోదించుము. మాకు శుభములు కూర్చుము. కర్మము, బలము కొరకు నన్ను ప్రోత్సహించుము. ఆయూంషితారిషః - మా ఆయువులను పెంచుము.
9. అనుమతి దేవి నేడు మా యజ్ఞములను ఆమోదించును గాత. అనుమతి హవ్య వాహక అగ్ని హవిర్ధత యజమానికి సుఖప్రదులు అగుదురు గాత.
10. పొడుగు జడలసినీవాలీ! నీవు దేవతల సోదరివి. నిన్ను ఆహ్వానించుచున్నాము. హవిని సేవింపుము. మాకు సంతానము కలిగించుము.
(యా పూర్వ్క మావాస్యా సా సినీవాలి అని ఐతరేయము. అమావాస్యకు పూర్వపుది సినీవాలి. చంద్రకళ కానవచ్చెడి అమావాస్య అని శబ్దరత్నాకరము)
11. అయిదు ఉపనదులు సరస్వతి నదిలో సంగమించును. అయిదు నదులుగా ప్రవహించు సరస్వతి ప్రవాహ ప్రదేశమున ఒకే నది అగుచున్నది.
(ఉపనది నదిలో కలసినపుడు ఉపనది పేరు ఉండదు. నది పేరే మిగిలును. ప్రయాగలో యమునా గంగలో కలియును. అప్పటినుండి అది గంగయే యగును)
12. అగ్నీ! నీవే ప్రథమ అంగిర ఋషివి. ద్యుతిమంతుడవగు నీవు దేవతలకు శుభంకరుడవగుము. మిత్రుడవు అగుము.
క్రాంతద్రష్టలు, విదిత కర్ములు, మెరుపులు బరిశల వారలగు మరుత్తులు నిన్ను సేవింతురు.
13. అగ్నీ! నీవు ద్యుతిమంతుడవు. వందనీయుడవు. మా ధనములను, పుత్రులను రక్షింపుము. నీవు పుత్ర, పౌత్రులను, గోవులను రెప్పవాల్చక రక్షించువాడవు. మేము నీ యజ్ఞమందే ఉన్నాము.
14. అధ్వర్యులారా! మీరు ప్రజ్ఞానులు. పడి ఉన్న కట్టెలో అగ్నిని తెచ్చిపెట్టండి. కోరినంతవే అరణి తక్షణమే అభిషిక్త అగ్నిని పుట్టించినది. అరణిని మధించినంత రక్తజ్వాలావంతుడును, పృథ్విపుత్రుడగు అగ్ని జ్ఞానయుతుడై ఉత్పన్నుడైనాడు. ఇతని కాంతి మెరుపులు మెరయుచున్నది.
15. జాతవేద అగ్నీ! యజన స్థానమును, పృథ్వికి నాభియునగు ఈ వేది యందు హవ్యము వహించుటకు నిన్ను ఏర్పరచినాము.
16. ఇంద్రుడు బలకామి. స్తుతి లభ్యుడు. స్తుత్యుడు. ఋక్కులచే ప్రతిపాదితుడు. నరరూపుడు. లబ్ధ ప్రతిష్ఠుడు. అతని కొరకు - అంగిర సమముగా, బలప్రాపక స్తోమము స్మరించుచున్నాము. మంత్రములు ఉచ్చరించుచున్నాము.
17. ఋత్విజులారా! బలకామియు, మహానుడగు ఇంద్రుని కొరకు మహా సోమాన్నమును, స్తోమ ఉపయోగి సామమును సమకూర్చండి. ఈ సామము వలననే మా పూర్వజులగు అంగిరసులు ఇంద్రుని అర్చించినారు. గోవులను పొందినారు.
18. ఇంద్రా! సోమ సంపాదకులగు స్నేహ యజమానులు నిన్నే అపేక్షింతురు. సోమమును అభిషవింతురు. హవిరన్నమును వేది మీద ఏర్పరతురు. జనుల నిందల భరింతురు. ఏల ఇవన్నియు? ఏలననగా నీ వల్ల వారికి ప్రజ్ఞాన విశేషము లభించుచున్నది.
19. ఇంద్రా! ఎంతటి దవ్వైనను నీకు దూరము కాదు. నీ హర్యశ్వముల మీద యజ్ఞమునకు రమ్ము. స్థిర బలుడగు ఇంద్రుని కొరకే ప్రాతః సవనాదులు చేయబడు చున్నవి. అగ్ని సమిద్ధమైనది. సొమము సిద్ధమైనది.
20. సొమమా! నిన్ను యుద్ధములందు సహించజాలరు. నీవు సర్వత్ర వ్యాప్తుడవు. జల వర్షకుడవు. బలరక్షకుడవు. యుద్ధ విజేతవు. శుభనివాసివి. సుకీర్తిమంతుడవు. జేతవు. నిన్ను ఆనందింప చేయుచున్నాము. "త్వామనుమదేమసోమ"
21. సోమమే నవప్రసూత గోవును ఇచ్చువాడు. వ్యాపన శీల అశ్వదాత. కర్మఠ. పుత్రదాత.
సోమమునకు ఆహుతులు అర్పించువాడు సదనమున సాధువు. యజ్ఞమున సాధువు సభలందు సాధువు, 'పితృ శ్రవణుడు' అగుచున్నాడు.
22. సోమమా! నీవే ఈ జలములను, ఓషధులను, గోవులను సృష్టించినావు. నీవే విశాల అంతరిక్షమును వ్యాపింపచేసినావు. నీవే జ్యోతి వలన అంధకారమును నష్టపరచినావు.
"త్వం జ్యోతిషావి తమో వవర్ధ'
23. సోమమా! నీ దివ్య మనమును ఉదారము చేయుము. నీ ధనమునందలి ఒక చిన్న భాగమును మాకు అందించుము. నిన్ను ఎవరును ఆటంక పరచరాదు. యజ్ఞమందు నీవు మమ్ము ఉభయ లోకములకు యోగ్యులమగునట్లు ఆరోగ్యవంతులను గావించుము.
24. బంగరు కిరణముల సూర్యుడు భూమికీ సంబంధించిన ఎనిమిది దిక్కులను, మూడు లోకములను, యోజనముల కొలది దూరములను, సప్త సముద్రములను ప్రకాశింప చేయుచున్నాడు. హవిర్దాత యజమానికి వరణీయ రత్నాదులు ప్రసాదించుచు ఉదయించుచున్నాడు.
25. హిరణ్యపాణియు, విశిష్ట రూపమున జనులను దర్శించువాడగు సవిత ధ్యావాపృథ్వులందు సంచరించును. ఉదయించిన భానుడు వ్యాధులను బాధించును. సూర్యుడు అస్తమించినంత తన కృష్ణ ప్రకాశమున ద్యులోకమును శూన్యముగా మార్చును.
26. హిరణ్యహస్తుడు, ప్రాణవంతుడు, శుభసంస్తుతుడు, సుఖప్రదాత, తేజోవంతుడగు సూర్యుడు మాకు అభిముఖుడు అగును గాత. ప్రతిరోజు రాత్రి స్తూయమానుడగు సూర్యుడు రాక్షస యాతుధానులను అపసిద్ధము చేయుచు ఊర్ధ్వస్తుడు అగుచున్నాడు.
27. సవితృదేవా! నీ మార్గము ప్రాచీనము. ధూళిరహితము. సాధు సంపాదితము. దానిని విధాత అంతరిక్షమున నిర్మించినాడు. అట్టి సుగమ్య మార్గముననే నేడు నీవు యజ్ఞమునకు విచ్చేయుము. మమ్ము నీ వారిని చేసికొనుము.
28. అశ్వినీ ద్వయమా! రండి. సోమరసమును సేవించండి. మాకు సుఖ శాంతులు ప్రసాదించండి. మీరు మీ అఖండ, రక్షణలచే మమ్ము సురక్షితులను చేయండి.
29. అశ్వినులారా! మాలో కర్మవంతమగు బుద్ధిని నింపండి. మీరు దర్శనీయులు, సేచకులు. మా అభీష్టములను యజ్ఞమయము చేయండి. జూదము ఆడకుండుటకును, రక్షణ కొరకును, అభ్యుదయమునకు గాను మిమ్ము ఆహ్వానించుచున్నాము.
అశ్వినులారా! అన్నప్రాప్తి కలుగు యజ్ఞమున మాకు సాయపడండి.
30. అశ్వినులారా! బాధించనట్టి, సుగమ రక్షణలచే మీరు రాత్రింబవళ్ళు మమ్ము రక్షించండి. మిత్ర, వరుణ, అదితి, సింధు, ద్యులోక భూలోకములు సహితము మాకు అట్టి రక్షణలే ప్రసాదింతురు గాత.
31. సవితది బంగరు రథము. అతడు ఆ రథము మీద సాగినాడు. రాత్రియును నలుపు లోకమునుండి వెడలి, దేవతలను, మానవులను వారి వారి కార్యములందు నియమించును. లోకములన్నింటిని వీక్షించుచు వచ్చుచున్నాడు.
32. రాత్రీ! ఉత్పాదక అంతరిక్షము సహితముగా సంపూర్ణ భూలోకమున నిండినావు. మహతీ! నీవుద్యులోక స్థానములకు సహితము వ్యాపించినావు. చీకట్లు, తమ బలములను కూర్చుకొని, సర్వత్ర నిండిపోయినవి.
33. అన్నదాత్రీ ఉషా! మేము స్వయముగను, మా పుత్ర పౌత్రాదులను జీవింపచేయునట్టి ధనమును మాకు ప్రసాదించుము.
34. ప్రాతరగ్నిం ప్రాతరిన్ద్రం హవామహే ప్రాతర్మిత్రావరుణా ప్రాతరశ్వినా|
ప్రాతర్భగం పూషాణం బ్రాహ్మణస్పతిం ప్రాతః సోమముతరుద్రం హవేమ||
పైన పేర్కొన్న దేవతలందరను ప్రాతః కాలమున ఆహ్వానించుచున్నాము.
35. ప్రాతః కాలమున అదితి పుత్రుడు, విజయుడు, ఉగ్రస్వభావుడు, విశేషరూపము ధరించువాడగు భగుని ఆహ్వానించుచున్నాము. ఆకలిగొన్నవారు ఆదరమున "ఉదయించుము" అనునట్టియు భగుని ఆహ్వానించుచున్నాము.
36. హీనేతా! భగదేవా! నీవు సత్యధనుడవు. ధనాదులు దానము చేయనపుడు మాకు ధనములనిమ్ము. మమ్ము ఉదారులను చేయుము. మమ్ము అశ్వ, గోసహితముగ వర్ధిల్లచేయుము. మేము సేవకాదులు కలవారలము కావలెను.
37. మేము ప్రస్తుతము ధనికులము కావలెను. సాయంకాలమునను, మధ్యాహ్నమందును ధనికులము కావలెను. సూర్యోదయమున కావలెను. మేము సర్వదా దేవతల సుబుద్ధి యందు వర్తిల్లుదుము గాత. "వయం దేవానాం సుమతౌస్యామ"
38. దేవతలారా! భగుడే ధనవంతు దేవత అగును గాత. మేము అతని వలెనే ధనవంతులము అగుదుము గాత. భగుదేవునే సర్వజగత్తులు అధికముగా ఆహ్వానించును.
భగదేవా! నీవు మాకు పురోగామివి అగుము. "నో భగ పుర ఏతా భవేహ"
(యః భగః విధర్తా విధారయితా సర్వస్య జగతః | సర్వ జగత్తులను ధరించువాడును, ధరింపచేయువాడును అని ఉవటుడు
భగమాదిత్యం అని మహీధరుడు
భగః యజ్ఞోభాగః అని శతపథము
భగస్యవా ఏతన్నక్షత్రం యదుత్తరే ఫల్గునీ అని తైత్తరీయము
"భగ ఏవ భగవాఁఅస్తు" అని ఈ మంత్రము. భగవాన్ అనిన ధనవంతుడు)
39. అశ్వసమ యజ్ఞము కొరకును, పవిత్ర పదము కొరకును ఉషస్సులు వికసించుచున్నవి. ఉషస్సులు ధనదాతయగు భగుని మాకు ప్రత్యక్షము చేయవలెను. అశ్వము రథమును తెచ్చినట్లు భగదేవత మాకొరకు ధనము తేవలెను.
40. అశ్వములు, గోవులు, పుత్రులను ప్రదానము చేయునట్టి ఉషస్సులు మాకు విదితములు అగును గాత. తుహిన బిందువులను తుడుచుచు నిత్య ప్రవర్ధమానలగు ఉషస్సులు "పాతస్వస్తిభిః సదానః"
41. పూషా! మేము నీ యజనమందున్న వారలము. "రిష్యేమకదాచన" మేము ఎన్నటికి నష్టపడకుందుము గాత. యజ్ఞమునందు నిన్ను స్తుతించు వారలమగుదుము గాత.
42. పూష వాక్కు మరియు క్రియ వలన అభిముఖుడు అయినాడు. అతడు పథముల రేడగు సూర్యుని అందుకొనును. ఆనందమూలము, శోకనాశకుడగు పూష మాకు ధనాదులు ఇచ్చును గాత. అతడు మా యజ్ఞములకు సిద్ధి కలిగించును గాత.
43. జగద్రక్షకుడు, అదమనీయుడగు విష్ణువు మూడు పాదములు ఉంచినాడు. కావుననే అతడు ధర్మములను దాల్చినాడు. "అతో ధర్మాణి ధారయన్"
44. విష్ణోర్యత్పరమం పదమును నిష్కాములు. అప్రమత్తులగు విద్వాంసులు ఎరుంగుదురు.
45. పృథివి జలవతి. సర్వలోక ఆశ్రయణీయ. ద్యావాపృథ్వులు విస్తృతలు, జలదాయనులు. శుభరూపలు. జరారహితలు. ప్రభూతరేతస్కలు. అవి వరుణధర్మమున దృఢీకృతలైనవి.
46. మా శత్రువులు అధోగాములు అగుదురు గాత. వారిని మేను ఇంద్రాగ్నులచే దూరమునకు తోలింతుము. వసు, రుద్ర, ఆదిత్య గణములు నన్ను అందరిపైన నిలుపుదురు గాత. ఎంతోబలము కలిగింతురు గాత. అధిజ్ఞుని, అధిపతిని చేయుదురు గాత.
47. నాసత్య అశ్వినులారా! ముప్పది ముగ్గులు దేవతలు సహితులై మీరు సోమపానమునకు గాను యజ్ఞమునకు విచ్చేయండి. మా ఆయువును పెంచండి. పాపములను కడిగివేయండి. ద్వేషించుశత్రువులను కట్టివేయండి. మాకు శుభములు కలిగించుటకు మా వెన్నంటి ఉండండి.
48. మరుత్తులారా! ఇది మీ స్తోమము. ఇయ్యది మీస్తుతి ఈయజమాని స్వార్థము లేనివాడు. మాననీయుడు. ఇతనికి వర్షము కలిగించుటకు మేము మిమ్ము ఆహ్వానించుచున్నాము. బాల్య, యవ్వన, వృద్ధావస్థలందు మాదేహములను పటిష్ఠము చేయుటకు మిమ్ము ఆహ్వానించుచున్నాము.
49. స్తోమ, ఛంద, కర్మ ప్రమాణ సహితులైన దివ్యసప్తర్షులు సృష్టి యజ్ఞమును సాధించినారు. పూర్వకల్పపు దివ్య ఋషుల మార్గమును అనుసరించి ఈ ఋషుల ధీమంతులై సృష్టికార్యమును సారథి గుర్రముల కళ్లెమును అందుకున్నట్లు - ప్రారంభించినారు.
50. ఆయుష్యము, బ్రహ్మవర్చస్సు, ధనసమృద్ధి, శత్రుభేదనము, వెండిబంగారములు, తేజస్సు ఇవన్నియు జయము కలిగించుటకు గాను నాలోన కూడును గాత.
51. ఇది దేవతలందు తొలుత పుట్టిన తేజము. దీనిని రాక్షస పిశాచాదులు సహించజాలవు. దాక్షాయణ హిరణ్యమును ధరించిన మానవుడు దేవతలందును, మానవులందును ఆయుష్మంతుడగుచున్నాడు.
(దాక్షాయణ మిత్యలంకార విశేషః ఇతిఉవటః)
52. ప్రసన్న మనస్కులగు దక్షుని సంతానము శతానీకునకు స్వర్ణాభరణములు కట్టినారు. అదేవిధముగా నేను శతశరదాయుష్యము కొరకు స్వర్ణాభరణములు ధరించుచున్నాను. అందువలన నేను ఆయుష్మంతుడను, బుద్ధిమంతుడను అగుదును గాత.
53. ఆహిర్భుథ్న్య, అజ ఏకపాత్, పృథ్వి, సాగరము, విశ్వే దేవరలు మా ఆహ్వానములు ఆలకింతురు గాత. యజ్ఞవర్ధక, ఆహూయమాన, మంత్రసంస్తుత, ఋషి ప్రశంసిత దేవతలు మమ్ము రక్షింతురుగాత.
54. చిరకాల శోభాయమాన ఆదిత్యులకొరకు నేతులు కారు స్తుతివచనములను జుహువుచే హోమము చేయుచున్నాము. మాయొక్క ఆ వచనములను మిత్ర, ఆర్యమ, భగ, వరుణ, దక్ష, అంశములు ఆలకించవలెను.
55. సప్త ఋషులు - త్వక్, చక్షు, శ్రవణ, రసన, ఘ్రాణ, మనోబుద్ధులుగా ఈ దేహమున నిలిచిఉన్నారు. వారు అప్రమాడ భావమున ఈ దేహమును రక్షించు చున్నారు. వారు నిద్రించినంత ఆత్మయందు లీనము అగుదురు. అప్పుడు ఎన్నటికి నిద్రించని జీవనదాతలగు ప్రాణాపానములు జాగృతములై ఉండును.
56. దేవతలను అపేక్షించు మేము మిమ్ము యాచించు చున్నాము. ఉత్తిష్ఠ బ్రాహ్మణస్పతే. సుదాతలగు మరుత్తులారా! దగ్గరికి రండి. ఇంద్రా! నీవు సహితము త్వరగా యజ్ఞమునందు చేరుము.
57. మంత్రాధిపతి బ్రహ్మణస్పతి ఉక్థార్హ మంత్రములు చదువుచున్నారు. వానియందు ఇంద్ర,
వరుణ, మిత్ర, ఆర్యమదేవతలు తమ తమ ఇండ్లు కట్టుకొనుచున్నారు.
58. బ్రాహ్మణస్పతే! త్వమస్యయన్తా - నీవు దీని నియంతవు. నీవు మా సూక్తమును తెలియుము. మా పుత్రులను సంప్రీతులను చేయుము. దేవతలచే రక్షించబడిన లోకము లన్నియు కళ్యాణమయములై ఉన్నవి.
ఎవడు ఈ విశ్వమునకు విశ్వకర్మ యగునో, ఎవడు నాకు తండ్రియగునో, ఎవడు అన్నపతి యగునో అతడు నాకు అన్నము ప్రసాదించును గాత.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
బ్రహ్మయజ్ఞార్థకమను ముప్పది నాలుగవ అధ్యాయము సమాప్తము.
మే మనః శివ సంకల్పమస్తు





