Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
8. ఇంద్రా ! నీవు దాతయగు యజమానికి అనేక వందల, అనేక వేల గోవులు ఇచ్చెదవు. మేము పురభేదివగు నిన్ను రక్షణ కోరినాము. వివిధవచములతో స్తుతించినాము. నీవు మా వద్దకు విచ్చేయుము.
9. ఇంద్రా ! నీవు శతక్రతువవు.యుద్ధమందు గర్వివి. నిన్ను స్తుతించువాడు బుద్ధిమంతుడైనను, బుద్ధిహీనుడైనను - నీ కృపవలన - ఆనందించగలడు.
10. ఉగ్రబాహువు, వధించువాడు, పురభేదకుడగు ఇంద్రుడు మా ఆహ్వానమును విన్నచో ధనాభిలాషగల మేము - ధనపతి, బహుకర్మ ఇంద్రుని - స్తుతులు చదివి - పిలుస్తాము.
11. మేము పాపులము - ఇంద్రుని గుర్తించము. మేము ధనశూన్యులము, అగ్ని రహితులము- ఇంద్రుని గుర్తించము. మేము సోమాభిషవమయనంత చేసికొందుము.
(ఇంద్రుని మిత్రుని చేసికున్నందున మేము పాపులము, ధనశూన్యులము, అగ్నిరహితులము కాము అని భావము.)
12. మేము - ఉగ్రుడు, యుద్ధవిజేత - ఇంద్రుని తోటివారమగుదుము. ఇంద్రుని స్తుతించుట రుణమువంటిది - అవశ్యము ఫలమునిచ్చునది. అహింసనీయ, రథపతి ఇంద్రుడు అశ్వములందు వేగవంతమగు అశ్వమును గుర్తించగలడు అతడుదాత. అనేకమంది యజమానులందు మాకు లభించినాడు.
13. మఘవా ! నీవు సమర్ధుడవు. మాకు హింసకుల నుండి భయము కలిగినది. మమ్ము భయ రహితులను చేయుము. మాకు అభయ ప్రదానము చేయుటకుగాను - రక్షకులగు పురుషునితో - శత్రువులను, హింసకులను నష్టపరచుము.
14. ఇంద్రా ! నీవు ధనస్వామివి, సేవకుని గృహము వర్థిల్లచేయువాడవు, మఘవుడవు స్తుతి పాత్రుడవని మేము ఎరుగుదుము. సోమాభిషవము చేసి నిన్ను పిలుచుచున్నాము.
15. ఈ ఇంద్రుడు సర్వము తెలిసినవాడు. వృత్రహంత. పాలకుడు వరణేయుడు. అతడు మా పుత్రుని రక్షించవలెను. కనిష్ఠపుత్రుని రక్షించవలెను. మధ్యమ పుత్రుని రక్షించవలెను. అతడు మమ్ము - వెనుక, ముందు - రెండుదిక్కులందు రక్షించవలెను.
16. ఇంద్రా! నీవు మమ్ము- క్రింద, మీద, ముందు, వెనుక - నాలుగు వైపుల రక్షించుము. మానుంచి దైవ, అసుర, ఆయుధ భయము దూరము చేయుము.
17. ఇంద్రా ! నేడు రేపు, ఎల్లుండి మమ్ము రక్షింపుము మేము నీ స్తోతలము రోజంతయు మమ్ము రక్షింపుము.
18. ధనిక, అధిక ధనిక ఇంద్రుడు పౌరుషమునకు అందరితో కలియును. శతక్రతు ఇంద్రా! అభిలాషప్రదములగు నీ ఉభయ భుజములు వజ్రము ధరించవలెను.
ఏబది ఒకటవ సూక్తము
ఋషి - కాణ్వ ప్రాగధుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు -
పంచపాజ పంక్తి - 7,8,9 బృహతి.
1.ఋత్విక్కులారా ! ఇంద్రుడు భరించువాడు కావున ఇంద్రుని స్తుతించండి. జనులు - సోమప్రియ ఇంద్రుని విశేషమును ఉక్ధమంత్రములతో వర్థిల్లచేయుదురు. "భద్రాఇంద్రస్య రాతయః" ఇంద్రుని దానములు కళ్యాణవహములు.
2. సహాయము అక్కరలేని, అనుపమాన దేవతలలో ముఖ్యుడు ఇంద్రుడు. అతడు అవినాశ్యుడు. పురాతనప్రజను అతిక్రమించిసాగును "భద్రాఇంద్రస్య రాతయః"
3. వెంటనే వరము అచ్చు ఇంద్రుడు - ప్రేరణలేకనే పయనించు - గుఱ్ఱపుస్వారి చేయగోరును. ఇంద్రా ! నీవు సమర్ధుడవగు దాతవు. నీ మహత్యము స్తుతించ దగినది "భద్రాఇంద్రస్య రాతయః"
4. ఇంద్రా! రమ్ము నిన్ను - ఉత్సాహవర్థకము, ఉత్కృష్టమగు స్తుతితోస్తుతింతుము. ఈ స్తుతినివినుము. అన్నమును కోరుస్తోతకు శుభములు కలిగించుము. "భద్రాఇంద్రస్య రాతయః"
5. ఇంద్రా ! నీ మనసు అత్యంతనిర్మలము. యజమానులు కొందరు నీకు సొమము సమర్పింతురు. కొందరు నమస్కరించి పూజింతురు. అట్టివారికి నీవు అపార ఫలములు అందింతువు. "భద్రాఇంద్రస్య రాతయః"
6. ఇంద్రా ! స్తుతులలో పరివేష్టతుడవైన నీవు - మానవుడు కూపము చూచినట్లు - మమ్ము చూచి సంతసించుము. ఇంద్రుడు ప్రసన్నుడై సోమవంతుడగు యజమానికి యోగ్యుడగు బంధువగును "భద్రాఇంద్రస్య రాతయః"
7. ఇంద్రా ! నీ పౌరుషము, ప్రజ్ఞవెంటపడిన దేవగణములు పౌరుషము, ప్రజ్ఞకలవారలగుదురు. అనేకులు స్తుతించు ఇంద్రుడు ప్రసిద్ధములగు గోవులకు స్వామి. "భద్రాఇంద్రస్య రాతయః"
8. ఇంద్రా ! నీ నిరుపమానబలమును యజ్ఞమునందు స్తుతింతును. యజ్ఞపతీ ! నీ బలమున వృత్రుని వధించినావు. "భద్రాఇంద్రస్య రాతయః"
9. ప్రేమగల యువతి రూపాభిలాషి పురుషుని వశపరచు కొనును. అట్లే ఇంద్రుడు మానవులను వశపరచు కొనును. మానవులకు సంవత్సరము మున్నగు కాలపరిమాణమును ఇంద్రుడే తెలియపరచును "భద్రాఇంద్రస్య రాతయః"
10. ఇంద్రా ! యజమానులకు నీవు అనేక పశువులను ఇచ్చినావు. వారు వాటివలన సుఖములు అనుభవించినారు. వారు నీ విశేషబలమును వర్థిల్లచేయుదురు. నిన్ను వర్థిల్లచేయుదురు నీ ప్రజ్ఞను వర్థిల్ల చేయుదురు. "భద్రాఇంద్రస్య రాతయః"
11. ఇంద్రా ! ధనము లభించునంతవరకు మనము కలసి ఉందుము. వృత్రఘ్న, వజ్ర, శూర ఇంద్రా! దాతకాని వాడు సహితము నీ దానమును ప్రశంసించును. "భద్రాఇంద్రస్య రాతయః"
12. మేము నిశ్చయముగా ఇంద్రుని సత్యస్తుతి చేయుదుము. అసత్యస్తుతి చేయము. ఇంద్రుడు పెద్దసంఖ్యలో యజ్ఞవిరోధులను హతమార్చును. అతడు అభిషవించు వారికి మహాజ్యోతిని ప్రసాదించును. "భద్రాఇంద్రస్య రాతయః"
ఏబది రెండవ సూక్తము
ఋషి - కాణ్వ ప్రాగధుడు దేవత - ఇంద్రుడు ఛందస్సు - వివిధము
1. ఇంద్రుడు ముఖ్యుడు అతడు పూజనీయుల కర్మములను వాంఛించును. దేవతల మధ్యమనువు - ఇంద్రుని పొందు మార్గమును - కనుగొన్నాడు.
2. సోమాభిషమున నిమగ్నములైన శిలలు స్వర్గనిర్మాత ఇంద్రుని విడువవు. ఇంద్రునాకు ఉక్థలు, స్తోత్రములు ఉచ్చరించవలెను.
3. విద్వాంసుడగు ఇంద్రుడు అంగిరులకు గోవులను వెలువరించినాడు. ఇంద్రుని ఆ వీరకృత్యమును స్తుతిస్తాను.
4. మునుపటివలె ఇంద్రుడు ఇప్పుడు కూడ కవులను వర్థిల్లచేయును. అతడు హోతకు కార్యనిర్వాహకుడు. మేము పూజినీయమగు సోమమును హవనము చేయుదుము. అప్పుడు ఇంద్రుడు మా రక్షణకు రావలెను.
5. ఇంద్రా ! స్వాహాదేవిపతి అగ్నికొరకు యజ్ఞకర్తలు ఇంద్రుని గుణకీర్తనము చేయుదురు. త్వరగా ధనములభించుటకుగాను స్తోతలు ఇంద్రుని యజింతురు.
6. సకల వీరకృత్యములు, సకల కర్తవ్య కర్మలు ఇంద్రునిలో ఉన్నవి. స్తోతలు ఇంద్రుని అధ్వరుడు - ఆహింసకుడు - అందురు.
7. పంచజనులు ఇంద్రుని స్తుతించినప్పుడు - ఇంద్రుడు తన మహిమతో శత్రువులను వధించును. ఇంద్రుడు స్తోతయొక్క పూజకు నివాసస్థానమగును.
8. ఇంద్రా ! నీవు సకల పౌరుష కార్యములను నిర్వర్తించినావు. అందువలనే నీవు స్తుతించబడుచున్నావు. రథచక్రమార్గమును రక్షింపుము. "పావశ్చక్రస్య వర్తనిమ్"
9. వర్షక ఇంద్రుడు అందించు నానావిధ అన్నములు అందుకున్న జనులు నానావిధ కర్మలు చేయుదురు. పశువులవలె జనులు యదలు కొందురు.
10. మేముస్తోతలము రక్షణాభిలాషులము ఋత్విక్కులారా! మీతో పాటు మేము మరుద్యుక్త ఇంద్రుని వర్థిల్లచేయుటకు అన్నస్వాములము అగుదుము.
11. ఇంద్రా ! నీవు యజ్ఞసమయమున ఆవిర్భవించినావు. నీవు తేజస్వివి. శూర ఇంద్రా! మంత్రములతో నిన్ను నిశ్చయముగ స్తుతింతుము.
12. ఇంద్రుడు భయంకర మేఘమును పట్టువాడు. వర్షము కలిగించువాడు. యుద్ధములకు పిలిచినంత ఆనందించువాడు. వృత్రుని వధించినవాడు, స్తోత్ర, శస్త్రపాఠకుల వద్దకు ఇంద్రుడు వేగముగా వచ్చును. దేవజ్యేష్ఠుడగు ఇంద్రుడు మమ్ము రక్షించవలెను.
ఏబది మూడవ సూక్తము
ఋషి - ప్రాగధుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు -గాయత్రి.
1. ఇంద్రా! స్తుతులు నిన్ను ఉన్నత్తుని చేయవలెను. వజ్రి ఇంద్రా! ధనము ప్రదానము చేయుము. స్తుతి విద్వేషులను నాశనము చేయుము.
2. లోభిని, యజ్ఞశూన్యుని, ధనదానశూన్యుల పాదముల క్రింద నలిపివేయుము. నీవు మహామహుడవు నీకు ఎదురులేదు.
3. నీవు అభిషుత సోమమునకు ఈశ్వరుడవు. అనభిషుత సోమమునకు ఈశ్వరుడవు జనుల రాజువు.
4. ఇంద్రా ! విచ్చేయుము. స్వర్గమునుంచి విచ్చేయుము. మానవుల యజ్ఞగృహమును ధ్వనులతో నింపుచు విచ్చేయుము. నీవు వర్షముతో ద్యావాపృథ్వులను పరిపూర్ణము చేయుదువు.
5. నీవు స్తోతల కొరకుగాను పర్వతములు, వంద విధముల జలముల అపారమేఘములను విజీర్ణము చేసినావు.
6. సోమము అభిషుతమైనంత రాత్రింబవళ్లు నిన్నే ఆహ్వానిస్తాము. "అస్మాకం కామమాపృణ" మా కోరికలు తీర్చుము.
7. ఇంద్రుడు వర్షదాత నిత్యతరుణుడు. విశాలస్కందుడు, ఎంతటివానికిని లొంగని ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడు? అతని స్తుతించగలవాడెవ్వడు?
8. వృష్టికర ఇంద్రుడు ప్రసన్నుడైవచ్చును. ఏ యజమానికి ఇంద్రుని స్తుతించుట తెలియును?
9. వృత్రఘ్న ఇంద్రా ! యజమాని ఇచ్చిన దానము నిన్నుసేవించును. శస్త్ర -మంత్ర ఉచ్చారణ సమయమున సుందరములు, వీర్యవంతములగు స్తుతులు నిన్ను సేవించును. నీవు ఎట్లున్నావు? యుద్ధమున నిన్ను దరిచేరగలవాడేడి?
10. మానవుల మధ్య ఉన్న నేను నీ కోరకు సోమాభిషవము చేయుదును. సోమము వద్దకు రమ్ము. త్వరగారమ్ము. పానము చేయుము.
11. ఇది ప్రియమగు సొమము. ఇదినిన్ను తృణవంత పుష్కర క్షేత్రమునను, 'సుషోమ' 'ఆర్థీ' నదీ తీరములందును మరింత ఉన్మత్తుని చేయును.
12. మాధము, మరియు శత్రునాశ బలముకుగాను నేడునీవు ఆ మనోహర సోమమును సేవింపుము. త్వరగా సోమపాత్రవైపు తరలుము.
ఏబది నాలుగవ సూక్తము
ఋషి - ప్రాగధుడు దేవత - ఇంద్రుడు ఛందస్సు - గాయత్రి
1. ఇంద్రా! జనులు నిన్ను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములనుండి పిలుస్తారు. కావున అశ్వసాయమున త్వరగా విచ్చేయుము.
2. నీవు ద్యులోకమున అమృతస్పందన స్థానమున మత్తుడవగుదువు. భూలోకమున మత్తుడవగుదువు. అన్న అపాదానా అంతరిక్షమున మత్తుడవగుదువు.
3. ఇంద్రా ! నీవు మహా మహుడవు. స్వేచ్చార్తివి. నిన్ను నేను స్తుతులతో పిలుతును. సోమపానమునకును, భోగానుభవముణకును నిన్ను - ఆవువలె - పిలుస్తాను.
4. రథమునకు కట్టిన అశ్వములు నీ తేజస్సును, మహిమను తేవలెను.
5. ఇంద్రా ! నీవు మహా ఉగ్రుడవు ఐశ్వర్యకర్తవు. నీవు వాక్యములు, స్తుతుల ద్వారా స్తుతించ బడుదువు రమ్ము వచ్చి సోమము సేవించుము.
6. మేము అభిషుత సోమవంతులము, అన్నవంతులము అయినాము. మా కుశల మీద ఆసీనుడవగుటకు ఆహ్వానించుచున్నాము.
7. ఇంద్రా ! నీవు అనేకమంది యజమానులకు సాధారణుడవు అందుకే మేము నిన్ను ఆహ్వానించుచున్నాము.
8. అధ్వర్యులు రాళ్లతో సోమమధువును అభిషుతము చేయుచున్నారు. ప్రసన్నుడవై సేవించుము.
9. ఇంద్రా ! నీవు స్వామివి. సకల స్తోత్రలను దాటిరమ్ము. త్వరగారమ్ము. మాకు మహాఅన్నమును ప్రసాదించుము.
10. ఇంద్రుడు హిరణ్య వర్ధ గోవులకు ప్రభువు. అతడు మాకు ప్రభువు. దేవతలారా ! ఇంద్రుని బాధించకండి.
11. వేలగోవుల మీద ఉన్నదియు, విశాలము, విస్తృతము, ఆహ్లాదకరము, నిర్మలమగు హిరణ్యమును స్వీకరింతును.
12. నాకు రక్షణలేకున్నది. దుఃఖమున ఉన్నాను. నా సంబంధులు ఇంద్రుని అనుగ్రహమున అపార ధనవంతులైనారు. దేవతలు ప్రసన్నులైనంత యశము లభించును. "శ్రవోదేవేష్వక్రత"





