Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    13. మర్త్యులగు ఋత్విక్కులు అమరుడు, అక్షయుడు దృఢంతుడు, పాపనాశకుడగు అగ్నిని పుట్టించినారు. పుత్ర సంతానము వంటి ఉత్పన్న అగ్నిని గూర్చి భగినీ స్వరూపులగు పది అంగుళులు - చేతివ్రేళ్లు పరస్పరము కలిసి ఆనంద సూచక ధ్వని చేయును.

    (చావు ఉన్నవాడు, చావు లేనివాడిని పుట్టించగలిగినాడని ఆనందము !)

    14. అగ్ని సనాతనుడు, ఏడుగురు హోతలు హవనము చేసినపుడు అగ్ని ప్రకాశవంతుడు అగును. తల్లి స్తనములమీద తల్లివడిలో ఉన్నప్పుడు అగ్ని ముద్దుగా ఉండును. అగ్ని అసుర జఠర సంజాతుడు. అందువలన నిత్య అప్రమత్తుడు అగును.

    15. మరుత్తులతో సమానులయి శత్రువులతో యుద్ధము చేయు సమర్థులు. బ్రహ్మకన్న మున్ను జన్మించిన కుశిక గోత్రోత్పన్న ఋషులు తథ్యముగా సకల జగములను ఎరుంగుదురు. గోత్రోత్పన్న ఋషులు తథ్యముగా సకల జగములను ఎరుంగుదురు. వారు అగ్ని లక్ష్యముగా హవ్యయుక్త స్తోత్రములు ఉచ్ఛరింతురు. వారు తమతమ గృహములందు అగ్నిని దీపింప చేతురు.

    16. హోమ నిష్పాదకుడవు. విద్వాంసుడవు. సర్వజ్ఞుడవగు అగ్నీ ! ప్రవర్తమానమగుచున్న ఈ యజ్ఞమున నిన్ను వరించుచున్నాము. కావున ఈ యజ్ఞమున దేవతలకు హవ్య ప్రదానము చేయుము. నిత్యము స్తుతించుము. సోమము మాటవిని సోమము వద్దకు విచ్చేయుము.

    (శ్రీమదాంధ్ర వచన మూడవ అష్టకమున మూడవ మండలమున మొదటి అధ్యాయము -
                             రెండవ అనువాకము సమాప్తము)

                               రెండవ అధ్యాయము

    మూడవ అనువాకము             ముప్పదవ సూక్తము

        ఋషి - విశ్వామిత్రుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రా ! సోమార్హులగు ఋత్విక్కులు నిన్ను స్తుతించ కోరుచున్నారు. వారి మిత్రులు నీ కొఱకు సోమము అభిషవించుచున్నారు. కొందరు హవ్యము సిద్ధము చేయుచున్నారు. శత్రువుల హింస సహించుచున్నారు. లోకమున నిన్ను మించిన ప్రసిద్ధుడు ఎవడు ఉన్నాడు?

    2. ఇంద్రా ! నీవు అశ్వవంతుడవు. దూరప్రదేశము సహితము నీకు దూరముకాదు. హరివర్ణ అశ్వయక్తుడవయి త్వరగా విచ్చేయుము. నీవు దృడచిత్తుడవు. అభీష్టవర్షివి. ఈ సవనమంతయు నీ కొరకే చేయబడుచున్నది. అగ్నీ సమిధయుక్తుడు అయినాడు. సోమాభిషవమునకు ప్రస్తర ఖండము ప్రయుక్తము అయినది.

    3. ఇంద్రా ! నీవు అభీష్ట వర్షివి. ఐశ్వర్యవంతుడవు. నీ శిరస్త్రాణము సుందరము. నీవు ధనవంతుడవు. విజేతవు. మహా మరుద్గణవంతుడవు. యుద్ధమున నానావిధకర్మలు చేయువాడవు. శత్రుహింసకుడవు. భయంకరుడవు. యుద్ధమున బాధలుపడి మానవులకొఱకుగాను నీవు ప్రదర్శించిన వీర కృత్యములు ఎక్కడ ఉన్నవి?

    4. ఇంద్రా ! నీవు ఒంటరిగా దృఢమూలముగల రాక్షసులను వారి తావుల నుండి పడగొట్టినావు. వృత్రాదులను వధించినావు. నీ ఆజ్ఞమేరకు ద్యావాపృథ్వులు, పర్వతము నిశ్చలముగా ఉన్నవి.

    5. ఇంద్రా ! నీవు మహావీరుడవు. నిన్ను అనేకులు ఆహ్వానింతురు. నీవు ఒంటరిగా వృత్రుని వధించినావు. దేవతలకు అభయ ప్రదానము చేసినావు. అది చెప్పుకొన తగినది. నీవు అపార ద్యావాపృథ్వులను సంయోజింప చేతువు. ఈ నీ మహిమ ప్రఖ్యాతము.

    6. ఇంద్రా ! అశ్వయుక్తమగు నీ రథము నిన్ను మార్గమున శీఘ్రముగా రావలెను. శత్రువులను వధించుటకు నీ వజ్రము రావలెను. నీ ఎదుటకు వచ్చిన శత్రువును నాశము చేయుము. పారిపోవు వారిని వధించుము. జగములను యజ్ఞయుక్తము చేయుము. నీలో అంతటి సామర్థ్యము ఉన్నది.

    7. ఇంద్రా ! నీవు నిరంతరము ఐశ్వర్యములు ధరించుము. నీవు దానము అందించిన మానవుడు గృహము, పశువులు సువర్ణయుక్త ధనవంతుడు అగును. అతనిని అనేకులు ఆహ్వానింతురు. హవ్యాది యుక్తమగు నీ అనుగ్రహము శుభంకరమగును. ధనప్రదానము చేయు నీ శక్తి అపారమయినది.

    8. ఇంద్రా ! నీవు అనేకుల ఆహూతుడవు. దానవీరుడవు. బాధకుడు, గర్జన శీలుడయిన వృత్రుని హస్తహీనుని చేసి చూర్ణచూర్ణము చేసినావు. వర్ధమానుడు, హింసకుడు, వృత్రుని పాదహీనుని చేసినావు. అతని బలమును నష్టపరచినావు.

    9. ఇంద్రా ! నీవు మహంతము, అనంతము, చలనశీలమగు భూమిని సమభావమున దానిస్థానమున నిలిపినావు. అభీష్టవరదుడగు ఇంద్రుడు ద్యులోకము, అంతరిక్షమును పదకుండునట్లు నిలిపినాడు. ఇంద్రా ! నీ ప్రేరణ వలన జలము భూమికి చేరవలెను.

    10. ఇంద్రా ! అత్యంత హింసకమగు 'గోవజ్ర' నామక మేఘము నీవు వజ్రము ఎత్తకముందే గడగడలాడి ముక్కలు ముక్కలయినది. గోరూపములగు జలములు బయల్వెడలుటకు మార్గము సుగమము చేసినావు. రమణీయ శబ్దవంతమగు జలము అనేక లోకములనుండి ఇంద్రుని సమ్ముఖమునకు వచ్చినది.

    11. ఇంద్రుడు ఒంటరిగనే ద్యులోక, భూలోకములను పరస్పర సంగతము చేసినాడు. ధనయుక్తము చేసినాడు. పరిపూర్ణము చేసినాడు. ఇంద్రా ! నీవు శూరుడవు. రథశాలివి. మా వద్ద ఉండవలెను అనుకొనుము. అశ్వములను పూన్చుము. అంతరిక్షము నుండి మా దగ్గరికి వచ్చుటకు నడుపుము.

    12. సూర్యుడు ఇంద్ర ప్రేరితుడు. అతడు తన గమనమునకుగాను ప్రకాశవంతములగు దిశలను ప్రతిదినము అనుసరించును. సూర్యుడు అశ్వములపై తన మార్గము పూర్తి చేసినపుడు మనలను వదిలివేయును. అది సహితము ఇంద్రుని మహిమయే అగును.

    13. రాత్రి గమనశీలము. అది గడచిపోవును. ఉష అవతరించును. అప్పుడు సకల జనులు సూర్యుని మహంతమగు విచిత్ర తేజమును దర్శించ అభిలషింతురు. ఉషఃకాలము గతించినంతనే జనులు అగ్నిహోత్రాది కర్మలకు పూనుకొందురు. ఇంద్రుని సత్కార్యములు ఎన్నో ఉన్నవి. "ఇంద్రస్య కర్మ సుకృతా పురాణి."

    14. ఇంద్రుడు నదులలో మహా తేజోవంతములగు జలములను చేర్చినాడు. ఇంద్రుడు రుచికరములగు పెరుగు, పాలు నేయి మున్నగు వానిని గోవు యందు ఉంచినాడు. కొత్తగా పుట్టిన ఆవు పాలను ధరించి చరించును. 

    15. ఇంద్రా ! నీవు బలమును కూర్చుకొనుము. శత్రువులు మార్గము బంధించినారు. యజ్ఞము, స్తుతులు, చేయువారి కోరికలు తీర్చుము. శత్రువులను వధించుటే ఉచితము. వారు క్రమముగా ఆయుధములు పారవేతురు. వారు ఆయుధ, తూణీరవంతులు.

    16. ఇంద్రా ! దగ్గరనున్న శత్రువు విడిచిన వజ్రనాదమును మేము వినుచున్నాము. ఎంతో సంతాపకరమగు ఆ అశనులను శత్రువు ముందుంచి ధ్వంసము చేయుము. సమూలముగ నాశము చేయుము. ఎన్నో బాధలు కలిగించుము. రాక్షసులను వధించుము. అప్పుడు యజ్ఞమును పూర్తి చేయుము.

    17. ఇంద్రా ! రాక్షస జాతిని సమూలముగ ఉన్మీలించుము. వారి మధ్య భాగమును నరుకుము. అగ్రభాగమును నష్టపరచుము. గమనశీలురాయిన రాక్షసులను దూరము చేయుము. బ్రహ్మద్వేషులమీద సంతాపప్రద అస్త్రమును విసరుము. "బ్రహ్మద్విషేతపుషిం హేతిమస్య"

    (బహ్మద్వేషే బ్రాహ్మణద్వేషకారిణే తస్మైరక్షసే) అని శాయణుడు. బ్రాహ్మణ ద్వేషులగు రాక్షసులని అర్థము.

    "యా బ్రహ్మ పరమాత్మానం వేదం వాద్వేష్టి తస్మై" దయానందుడు. వేదమును ద్వేషించువారు అని అర్థము.

    మంత్రమున "బ్రహ్మద్విషే" అని ఉన్నది. బ్రహ్మ పరాత్పరుడగును. బ్రహ్మపదార్థము అందనిది. అర్థము కానిది.

    18. లోక నిర్వాహకుడవగు ఇంద్రా ! మమ్ము అశ్వయుక్తులను చేయుము. మమ్ము అవినాశ్యులను చేయుము. నీవు మా వద్ద ఉన్నపుడు మేము మహాధనమును, అన్నమును అనుభవించగలము. అభివృద్ధి చెందగలము. మాకు పుత్ర, పౌత్రాదులతో కూడిన ధనము లభించవలెను.

    19. ఇంద్రా ! మా కొఱకు దీప్తయుక్తమగు ధనమును తెమ్ము నీవు దానశీలుడవు. మేము దానపాత్రులము. మా కోరికలు బడబానలమువలె పెరుగుచున్నవి. ధనపతీ ! మా కోరికలు తీర్చుము.

    ("ఉర్వ ఇవ" బడబానలమువలె, కోరికలు బడబానలమువంటివట ! కనిపించవు !! కాల్చును !!!)

    20. మా కోరికలను గోవులు, అశ్వములు, దీప్తివంతమగు ధనము ఇచ్చి పూర్తి చేయుము. దానివలన మమ్ము విఖ్యాతులను చేయుము.

    ఇంద్రా ! స్వర్గాది సుఖాభిలాషులు, కర్మకుశలులు, కుశికనందనులు మంత్రముల ద్వారా నిన్ను స్తుతించినారు.

    21. స్వర్గాధిపతీ ! ఇంద్రా ! మేఘములను కదిలించుము. మాకు జలమును ప్రసాదించుము. అనుభవించదగు అన్నము మా ముందునకు రావలెను. అభీష్ట వర్షకా ! నీవు ద్యులోకమున వ్యాపించి ఉన్నావు. నిలిచి ఉన్నావు. సత్యబలమఘవా ! మాకు గోవులను ప్రసాదించుము.

    22. ఇంద్రా ! నీవు అన్నమును ఆర్జించుము. నీవు యుద్ధమున ఉత్సాహ ప్రవృద్దుడవు. ధనవంతుడవు, ఐశ్వర్యవంతుడవు, నేతృ శ్రేష్ఠుడవు, స్తుతిశ్రవణకర్తవు, ఉగ్రుడవు, యుద్ధమున శత్రువినాశకుడవు, ధనవిజేతవు, ఆశ్రయ ప్రాప్తికిగాను మేము నిన్ను ఆహ్వానించుచున్నాము.

                             ముప్పది ఒకటవ సూక్తము

  ఋషి-సుశిక విశ్వామిత్రుడు లేక ఏషీరథికుశిక విశ్వామిత్రుడు, దేవత -ఇంద్రుడు,
                               ఛందస్సు - త్రిష్టుప్.

    1. పుత్రహీనుడగు పితరుడు జామాతను సమ్మానించి శాస్త్రముల అణుశాసనమును అనుసరించి పుత్రికకు కలిగిన పౌత్రుని దౌహిత్రుని వద్దకు వెళ్లినాడు. అపుత్రుడగు పిత పుత్రిక గర్భమున ఉండును. అట్లని విశ్వసించి శరీరము ధరించును.

    2. ఔరస పుత్రుడు పుత్రికకు ధనమును ఇవ్వడు. అతడు పుత్రికను ఆమె భర్త రేతస్సేచనమునకు ఆధారము చేయును. తలిదండ్రులు కొడుకు, కూతురు ఇద్దరి జన్మకారకులు అగుదురు. వారిలో ఒకరు పుత్రుడు, ఉత్కృష్టక్రియ కర్మకు అధికారి అగుచున్నాడు. మరొకరు పుత్రిక సమ్మానయోగ్య అగుచున్నది.

    3. ఇంద్రా ! నీవు దీప్తియుక్తుడవు. నీ యజ్ఞము కొఱకు జ్వాలారూపమున కంపించు అగ్ని యథేచ్చగా పుత్ర రూపములగు కిరణములను ఉత్పన్నము చేసినాడు. ఈ కిరణముల జలరూప గర్భము మహత్తరము. ఓషధిరూప జన్మము మహత్తమము. హర్యశ్వా ! సోమాహుతుల ద్వారా ప్రయుక్తమైన కిరణముల ప్రవృత్తి మహత్తమము.

    4. విజేతలగు మరుద్గణములు వృత్రునితో యుద్ధమున ఇంద్రునివెంట ఉన్నారు. సూర్యసంజ్ఞక మహాతేజము తమోరూప వృత్రుని వలన నిర్గతమగునని మరుత్తులు కనిపెట్టినారు. ఉషస్సులు ఇంద్రుని సూర్యునిగా భావించి అతనిముందు నిలిచినవి. ఒకే ఇంద్రుడు సమస్త రశ్ములకు పతి అయినాడు.

    5. ధీమంతులు, మేధావులు ఏడుగురు అంగిరులు సుదృఢ పర్వతమున నిలిపి ఉంచిన గోవులను వెతికినారు. వెలికితీసినారు. పర్వతమున గోవులు ఉన్నవి అని నిశ్చయించిన అంగిరులు ఏ మార్గమున వెళ్లినారో ఆ మార్గముననే తిరిగి వచ్చినారు. వారు యజ్ఞమార్గమున సమస్త గోవులను సాధించినారు. ఇంద్రుడు ఈ విషయములను తెలిసికున్నాడు. అంగిరులను సన్మానించుటకు పర్వతముపైకి వెళ్లినాడు.

    6. 'సరమ' పర్వతపు విరిగిన ద్వారము వద్దకు చేరినది. అప్పుడు ఇంద్రుడు అన్నట్లుగనే వలసినంత అన్నము, ఇతర పదార్థములు దానికి ఇచ్చినాడు. సరమ చక్కని పాదములు గలది. శబ్దమును గ్రహించినది. ముందు వెళ్లుచున్న అక్షయ గోవుల వద్దకు చేరినది.

    (సరమానామ దేవశునీ, అని శాయణుడు సరమ పేరుగల దేవతల కుక్క)

    7. ఇంద్రుడు అత్యంత మేధావి. అతడు అంగిరులతో స్నేహము చేయదలచినాడు. ఆ మహాయోద్ధ ముందు పర్వతము తన గర్భస్థ గోధనమును వెలువరించినది. శత్రుహంత ఇంద్రుడు యువ మరుత్తులతో కలిసి గోవులను సాధించినాడు. అంగిరులు వెంటనే ఇంద్రుని పూజించినారు.

    8. ఇంద్రుడు ఉత్తమ పదార్ధ ప్రతినిథి. సమర భూమియందు అగ్రగ్రామి. సకల ఉత్పన్న పదార్థజ్ఞాత. శిష్ణు హంత. దూరదర్శి. గోధనాభిలాషి. అట్టి ఇంద్రుడు ద్యులోకమునుండి విచ్చేయవలెను. మమ్ము పాపములనుండి రక్షించవలెను.

    9. లోలోన గోధన ప్రాప్తిని కోరినారు. స్తోత్రముల ద్వారా అమరత్వము సాధించదలచి యజ్ఞము తలపెట్టినారు. ఈ యజ్ఞమున అందరకు ఉపవేశము కలదు. అంగిరుల సత్యభూతమగు యజ్ఞము ద్వారా మాసములను వేరుచేయ తలపెట్టినారు.

    10. అంగిరులు గోధనము లక్ష్యముగా తొలుత కలిగిన పుత్రుని రక్షించుటకుగాను పాలు పితికి హర్షులు అయినారు. వారి హర్షధ్వానము ద్యావాపృథ్వులందు నిండినది. మొదటివలెనే వారు లోకమున నిలిచినారు. గోవులను రక్షించుటకు వీరపురుషుని నియమించినారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.