Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


   
    సూర్యనామములను వర్ణోచ్చారణ విధియుక్తముగా ధర్మరాజునకు ఉపదేశించినాడు ధౌమ్యుడు. "ధర్మరాజా! ఈ సూర్య జపమును ఇంద్రుని నుంచి నారదుడు పొందినాడు. నారదుని వలన వసురాజు గ్రహించినాడు. వసురాజు వలన నేను పొందినాను. ఈ అనుష్ఠానము చేత సూర్యుని ఆరాధింపుము" అని చెప్పినాడు.
    ధర్మరాజు ధౌమ్యుని ఉపదేశము పొందినాడు. పుష్పములచేత సూర్య భగవానుని పూజించినాడు. ఇంద్రియములను నిగ్రహించినాడు. గంగా జలమందుండి సూర్యుని ఉపాసించినాడు. జలము మాత్రము ఆహారముగా స్వీకరించినాడు. తదుపరి ప్రాణాయామము చేసినాడు. వాయువు మాత్రము ఆహారముగా ఉపాసించినాడు.
    సూర్యదేవుడు ధర్మరాజు దీక్షకు మెచ్చినాడు. ప్రత్యక్షము అయినాడు. "ధర్మజా! నీ తపస్సునకు సంతోషించినాను. నీవు కోరినది నీకు లభించును. పన్నెండు సంవత్సరములు నీకు కావలసినంత ఆహారము ప్రసాదించగలను. ఇదిగో ఈ తామ్రపాత్ర తీసుకొనుము. ఈ పాత్రవలన నీ వంటింట భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములు అక్షయములుగా ఉండగలవు. ద్రౌపది వడ్డించుచున్నంత వరకు అవి లభించుచుండును. ఆమె వడ్డించుకొని భోజనము చేసిన ఆ పదార్థములు ఆనాటికి నిలిచిపోవును. "ఇతశ్చతుర్దాశే వర్షే భూయో రాజ్యమవాప్స్యసి" ఇప్పటి నుండి పదునాలుగవ సంవత్సరమున నీకు మరల రాజ్యము లభించనున్నది" అని ధర్మరాజునకు తామ్ర పాత్రను ఇచ్చి భాస్కరుడు అంతర్ధానుడు అయినాడు.
    సూర్యదేవుడు ఇచ్చిన అక్షయపాత్ర వలన ద్రౌపది వేలకొలది బ్రాహ్మణులకు రుచికరములయిన పదార్థములు వడ్డించినది. వారందరు సంతృప్తులయి సంతుష్టులు అయినారు. ఆవిధముగా పాండవులు కొంత కాలము "ప్రమాణము" అను మఱ్ఱిచెట్టు క్రింద నివసించినారు. తరువాత పాండవులు "ప్రమాణము"ను విడిచినారు. కామ్యకవనమును చేరినారు.
    
                                                         ఆలోచనామృతము

    1. పాండవులు జూదమున ఓడినారు. అడవులకు వెడలినారు. అప్పుడు హస్తినలోని ప్రజలందరు వారి వెంట వచ్చుటకు సిద్ధమై బయలుదేరినారు.
    రామాయణమున కూడ ఇట్లే జరిగినది. సీతారామలక్ష్మణులు అడవులకు బయలుదేరినారు. అయోధ్య సాంతము వారి వెంట తరలినది. తమసా నది వద్ద పురజనులందరు నిదురలో ఉండగా రాముడు వెళ్లిపోయినాడు.
    ఇక్కడ ధర్మరాజు పురజనులకు నచ్చచెప్పి పంపినాడు.
    రాజులు దుష్టులు అయినపుడు ప్రజలు వారిని విడిచిపోవుట ఆచారముగా ఉన్నట్లు కనిపించుచున్నది.
    2. ధర్మరాజు ప్రజలను వారించి పంపినాడు. బ్రాహ్మణులు వేల సంఖ్యలో అతని దగ్గరికి వచ్చినారు. వారిని సహితము వారించినాడు. వారు వినలేదు. వారు తమతో ఉండిపోవుటకు సమ్మతించినాడు.
    సామాన్యులను పంపించినాడు. బ్రాహ్మణులను ఉంచుకున్నాడు. ఇందులకు గల కారణమేమి?
    ఏ రాజ్యమునాను సామాన్యుల జీవనమునకు అంతరాయము కలుగదు. దుష్ట ప్రభుత్వములు మేధావులను పట్టి పీడించును. మేధావులు ఆలోచింతురు. దుష్ట ప్రభుత్వములు ఆలోచనను సహించవు. వారిని పట్టి పీడింతురు. కాబట్టి మేధావులు వలస పోవుచుందురు. ఇందుకు ఉదాహరణలు చాలా ఉన్నవి.
    జర్మనీలో హిట్లరు అధికారములోనికి వచ్చినాడు. 1933వ సంవత్సరమున మహామేధావి అయిన ఐన్ స్టీన్ జర్మనీ వదలి వెళ్లినాడు.
    బంగ్లాదేశ్ లో తిరుగుబాటు వచ్చినపుడు విశ్వవిద్యాలయ మందలి మేధావులను కాల్చిచంపినారు.
    మన దేశమున అత్యయిక పరిస్థితిలో బాధలకు గురి అయినవారు మేధావులే. మేధావులకు రక్షణ కల్పించుట మంచి ప్రభువు లక్షణము. అందుకే ధర్మరాజు మేధావులకు ఆశ్రయము ఇచ్చినాడు.
    3. సూర్యుని గురించి ధౌమ్యుడు చెప్పినది మూఢనమ్మకము కాదు. అత్యంత శాస్త్రీయముగా ఉన్నది. సూర్యుని వలననే రాత్రింబవళ్ళు కలుగుచున్నవి. వానలు వచ్చుచున్నవి. పంటలు పండుచున్నవి. మానవజీవనమునకు ఆధారము ఆహారము. ఆహారము భానుమయము. కాబట్టి ఆహారమునకుగాను సూర్యుని ఉపాసించమని చెప్పినాడు.
    సౌరశక్తిని గురించి పరిశోధనలు జరిపిన ప్రాజ్ఞుడు ధౌమ్యుడు అని నా అభిప్రాయము. వర్ష కాలమున పండిన పంటను నిలువ చేసుకొను వీలు అడవులలో లేదు. అందువలన సౌరశక్తిని స్వాధీన పరుచుకొని అన్నివేళలందు ఫలమూలాదులు ఉండు ఏర్పాటు చేసినాడు.
    సూర్యదేవుడు ధర్మరాజునకు ఇచ్చినాడని చెప్పిన తామ్రపాత్ర విషయమున సందేహములున్నవి. అదికొన్ని ప్రతులందున్నది కొన్నిట లేదు. సూర్యుడు ఇచ్చినాడనుకున్నను తప్పుకాదు. కాల్పనిక సాహిత్యమున అట్టివి ఈనాడును ఉన్నవి.
    తామ్రపాత్ర సంకేతము మాత్రమే. భూమియే అక్షయపాత్ర. భూదేవి మనకు ప్రసాదించు దానికి క్షయము లేదు. గత శతాబ్దాదిగా పాశ్చాత్యులు కనిపెట్టిన ఇంధనములు అన్నియు క్షయమగుచున్నవి.
    ఇప్పుడు వారు అక్షయమయిన సౌరశక్తిని గురించి పరిశోధనలు సాగించుచున్నారు. సూర్యుడు జీవన ప్రదాత అని భారతీయ శాస్త్రజ్ఞులు వేల సంవత్సరముల క్రిందట నిరూపించినారనిన పాశ్చాత్య ప్రభావ పీడితులు నమ్మలేకున్నారు. అది పాశ్చాత్యులు పరచిన అంధకారము. ఆవల వెలుగున్నదని నమ్మకుండ చేసినారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.