Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    లక్నో లో గోమతి అద్దరిన ఉన్న కరీమ్ అత్తవారింటికి తీసికెళ్ళి నన్ను దింపారు. ఇల్లు చిన్నది. కరీమ్ అత్త రాక్షసి. చండిక. నన్ను ఇంట్లోకి తీసికెళ్ళింది. కొట్లో బంధించింది. ఉదయం లక్నో చేరిందాన్నల్లా మధ్యాహ్నం వరకూ గదిలోనే పడి వున్నాను . అప్పుడు తలుపు తెరచుకుంది. ఒక యువతి - కరీం భార్య - మూడు చపాతీలు, ఒక మట్టి కప్పులో చిన్న గరిటెడు మినపపప్పూ , ముంతలో నీళ్ళు తెచ్చి పెట్టి వెళ్ళిపోయింది. అప్పటికి అదే పంచ భక్ష్యపరమాన్నం అయింది. ఎనిమిది రోజుల్నించీ ఇంటి వంటే తినలేదు . శనగలూ,గుగ్గిళ్ళతో సరిపుచ్చుకున్నాను. సగం ముంతెడు నీళ్ళు త్రాగి పడుకున్నాను. ఎంతసేపు నిద్రపోయానో! కొట్లో చీకటీ. రాత్రీ పగలూ తెలియడం లేదు. ఈలోగా అనేకసార్లు కళ్ళు తెరిచాను. చీకటి నలువైపులా అంధకారం. ఒంటరిదాన్ని, దగ్గర ఎవ్వరూ లేరు. మళ్ళీ దుప్పటి కప్పుకొని పడుకున్నాను. మళ్ళీ నిద్ర. మూడవసారో, నాల్గవసారో మెలకువ వచ్చినపుడు మళ్ళీ నిద్ర రాలేదు. ఈలోగా కరీం అత్త - రాక్షసి -అరుస్తూ కేకలు వేస్తూ లోనికి వచ్చింది. "ముండా! ఎంత నిద్రే! రాత్రంతా అరిచీ అరిచీ గొంతు పగిలిపోయింది. కదిపి లేపితే శ్వాస కూడా లేదు. ఊపిరి ఉన్నట్లు కనిపించలేదు. పురుగు ముట్టిందేమో అనుకున్నా!"
    లేచి కూర్చున్నాను. మౌనంగా విన్నాను. అరవాల్సినంత అరిచి అడిగింది "కప్పు ఏదీ?" అని. చేతికి అందించాను. తీసుకొని వెళ్ళిపోయింది. తలుపు మూసేసింది. కాస్సేపటికి కరీమ్ భార్య వచ్చింది. గదికి ఒక దిడ్డి ఉంది. అది తెరచింది. నన్ను బయటికి తెచ్చింది. పాడుపడిన గోడలు కనిపించాయి. ఇక్కడ ఆకసాన్ని అవలోకించే అదృష్టం లభించింది. మళ్ళీ ఆ కాలకూటంలో పడ్డాను. ఈరోజు జొన్నన్నమూ , కందిపప్పూ లభించాయి.
    అలా రెండు రోజులు గడిచిపోయాయి. మూడో రోజు మరొక అమ్మాయి వచ్చింది. వయసు లో నాకంటే మూడేళ్ళు పెద్దది. కరీమ్ మోసగించి తెచ్చాడో, బుజ్జగించి తెచ్చాడో గాని ఆ అమ్మాయి వెక్కి వెక్కి ఏడిచింది. ఆవిడ రావడం నాకు కాస్త నయం అయింది. ఏడుపూ అరుపూ అయిపోయిం తరవాత మెల్లగా మాటలు సాగాయి.
    కోమట్ల పిల్ల పేరు రామ్ దేవి. సీతాపూర్ దగ్గర ఏదో ఊరు వాళ్ళది. చీకట్లో ముఖం కనిపించలేదు. తెల్లవారి దిడ్డి తెరిచినప్పుడు చూచాను. ఎరుపు రంగు, ముక్కూ ముఖం తీర్చిదిద్దినట్లున్నాయి. అందమైంది.
    నాలుగవరోజు ఆ అమ్మాయికి కాలకూటం నుంచి విముక్తి లభించింది. నేను అక్కడే ఉండిపోయాను. మళ్ళీ వంటరితనం. మూడవరోజు రాత్రి దిలావర్ ఖాన్, పీర్ బక్ష్ వచ్చి నన్ను బయటకు తీశారు. వెంట తీసికెళ్ళారు. వెన్నెలరాత్రి . ముందు ఒక మైదానం. తర్వాత ఒక బజారు నుంచి వెళ్ళాం. వంతెన మీదికి వచ్చాం. నదిలో తరంగాలు ఊగుతున్నాయి. చలిగాలి వీస్తుంది. వణికిపోతున్నాను. వంతెన దాటి ఇరుకు గొందిలో చాలా దూరం నడిచాం. కాళ్ళు అలాసిపోయాయి . అక్కడ్నుంచి మరొక వీధిలో ప్రవేశించాం. జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. దారి దొరకడమే కష్టంగా ఉంది.
    మిర్జారుస్వాగారూ ! అది ఏ బజారో గుర్తించారా? నా మానమర్యాదలు అమ్ముకున్న దుకాణం అక్కడే ఉంది. అది చౌకు. అగౌరవం, గౌరవం అపక్యాతి, ఖ్యాతి లభించిన ఇల్లే ఆ ఇల్లు. ఖానమ్ జాన్ ఇంటి తాలుపు తెరిచి ఉంది. కొద్ది దూరంలో మెట్లున్నాయి  పైకి వెళ్ళాను. అంగణం లో ప్రవేశించాను. పెద్ద వసారాకు కుడివేపు పెద్ద గదిలో ఉన్న ఖానమ్ జాన్ దగ్గరికి వెళ్ళాను.
    మీరు ఖానమ్ గారిని చూచే ఉంటారు. అప్పటికి ఆవిడ వయసు సుమారు 50 సంవత్సరాలు. భారీ శరీరం, చామన చాయ అలాంటి స్త్రీ ని మళ్ళీ చూడలేదు. ముఖం మీద పడిన తెల్లటి ముంగురులు ముఖానికి ఎంతో అందాన్ని ఇచ్చేవి. సన్నని తెల్ల మల్మల్ ముసుగు , నీలి రంగు పట్టు పైజమా , చేతులకు బంగారు మురుగులు, విలువైన దిద్దులు - ఆనాటి ఖానమ్ రూపం ఈనాటికీ నా కళ్ళలో అడుతూంది. మంచానికి అనుకోని రత్నకంబళి మీద కూర్చుని ఉంది.
    పద్మాకారమైన దీపం వేలుగుతూంది. చెక్కడపు పనిగల పెద్ద తాంబూల పేటిక తెరిచి ముందు పడి ఉంది. పొడవైన గొట్టంతో హుక్కా పీలుస్తుంది. ఒక చామనచాయ పిల్ల -- బిస్మిల్లా- నృత్యం చేస్తుంది. మేము వెళ్ళగానే నాట్యం ఆగిపోయింది. మిగతావాళ్ళు గది నుంచి వెళ్ళిపోయారు. అంతా మొదలే నిర్ణయం అయిపొయింది.
    ఖానమ్ జాన్: ఈ పిల్లేనా?
    దిలావర్ ఖాన్ : జీ హా అవును.
    నన్ను దగ్గరకు పిలిచింది. కూర్చో బెట్టింది. ముఖం ఎత్తి చూచింది.
    ఖాన,మ్ జాన్ : అచ్చా! అన్నది ఖాయం. రెండో అమ్మాయి ఏది?
    పీర్ బక్ష్ : ఆ వ్యవహారం ముగిసింది.
    ఖానమ్ : ఎంతకు ?
    పీర్ : రెండు వందలకు .
    ఖానమ్ : అచ్చా ఎక్కడ?
    పీర్ : ఒక బేగం కొడుకు కోసం ఖరీదు చేసింది.
    ఖానమ్ : ముక్కూ, మొఖం బాగుంది . అంత నేనూ ఇచ్చేదాన్నే. తొందరపడ్డారు.
    పీర్ : నేనేం చేయను? ఎంతో చెప్పాను కరీం వినలేదు.
    దిలా: దీని ముక్కూ ముఖమూ బాగానే ఉన్నాయి. మీకు నచ్చాలి.
    ఖానమ్: సరే కుక్క పిల్లెం కాదుగా! మనిషి పిల్ల.
    దిలా: ఉన్నదేదో మీముందుంది.
    ఖానమ్: మంచిది. మీమాటే నేగ్గనీ, అని హుసేసీని కేకవేసింది.
    బొద్దుగా ఉన్న చామనచాయ నడివయసు స్త్రీ వచ్చి ముందు నుంచుంది.
    ఖానమ్: హుసేనీ!
    హుసేనీ : ఖనమ్ సాహెబ్!
    ఖానమ్: పెట్టె తీసుకురా.
`    హుసేనీ వెళ్లి పెట్టె తెచ్చింది. ఖానమ్ పెట్టె తెరిచి చాల రూపాయలు దిలావర్ ఖాను ముందు పోసింది. తరవాత తెలిసింది నూట పాతికని. వాటిలో కొన్ని రూపాయలు లెక్కించి పీర్ బక్ష్ కొంగున కట్టుకున్నాడు. యాభై అని విన్నాను. మిగతావి దిలావర్ ఖాను సైతాను తీసుకున్నాడు. ఇద్దరూ సలామ్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు గదిలో నేను, ఖానమ్ , బువాహుసేనీ ముగ్గురం మాత్రమే మిగిలాం.
    ఖానమ్ : ఖరీదు ఎక్కువ ఏమీ కాదనుకుంటా.
    హుసేనీ" ఎక్కువా? చాల చవక అంటాను.
    ఖానమ్ : చవక కూడా కాదు. సరే అయిందేదో అయింది. అమయకురాలుగా కనిపిస్తుంది. ఎవరి అమ్మాయో అల్లాకే తెలియాలి. పాపం, తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లుతున్నారో, ఈ రాక్షసులు ఎక్కడ్నుంచి తెస్తారో , ఏమాత్రం భగవంతుని భయం లేదు కదా!
    హుసేనీ: మనం ఏ పాపమూ ఎరగం. పాపం అంతా వాళ్ళకే చుట్టుకుంటుంది.
    మనకేం మనం కొనకుంటే వేరేవాళ్ళు కొనేదేగా. ఖానమ్ సాహిబ్ , వీళ్ళు ఇక్కడే సుఖంగా ఉంటారు. భార్యల మధ్య పనికత్తెల గతులు మీకు తెలియనివా?
    ఖానమ్: తెలియకేం? ఇవాళ్టి విషయం. సుల్తాన్ జహ్ర బేగం , తన భర్తతో పనికత్తె మాట్లాడుతూ ఉండటం చూసిందట. ఇంకేముంది ! ఇనుప సీకులతో కాల్చి చంపేసిందట!
    హుసేనీ: ఇహంలో వారి ఇష్టం వచ్చినట్లు చేస్తారు. అంతిమ దినం నాడు ఈ భార్యల ముఖాలు మాడ్తాయి.
    ఖానమ్ " ముఖాలు మాడడం కాదు. భగవంతుని కొరడాలు తగులుతాయి.
    హుసేనీ : అంతే కావాలి. చచ్చినోళ్ళు . వాళ్ళకు అదే శిక్ష.
    తరువాత మిక్కిలి వినయంగా విన్నవించుకుంది. "ఈ పిల్లను నాకు ఇచ్చేయండి. సాకుతాను. సరుకు మీది, తమకే సమర్పించుకుంటాను."
    ఖానమ్: మంచిది నీవే సాకు.
    అంతసేపూ నుంచుని ఉన్న బువాహుసేనీ వచ్చి నా పక్కన కూర్చుంది.
    హుసేనీ : అమ్మాయీ! ఎక్కడ్నించి వచ్చావు?
    నేను : (ఏడ్చి) బంగాళా నుంచి.
    హుసేనీ : బంగాళా ఎక్కడ? ఖానమ్ ను అడిగింది.
    ఖానమ్: ఓహో ..... పసిపాపవే, ఫైజాబాదును బంగళా అని కూడా అంటారు.
    హుసేనీ : మీ నాన్నాపేరు ?" నన్నడిగింది.
    నేను : జమేదారు.
    ఖానమ్ : నువ్వొక పిచ్చిదానివి. పసిపిల్ల దానికేం తెలుస్తుంది ?
    హుసేనీ : నీ పేరు ? 




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.