Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    7. నేను అగ్నిని. పరబ్రహ్మమును. పుట్టుకతోనే జాతవేదిని. పరతత్వ స్వరూపుడను. ఘృతము ప్రకాశము నా నేత్రము అగును. నా ముఖమున అమృతము ఉన్నది. నావి వాయు, సూర్య, దీప్తములను త్రివిధ ప్రాణములు. నేను అంతరిక్షము కొలతవేయువాడను. నేను అక్షయ ఉత్తాపుడను. నేను హవ్యరూపుడను.

    8. అగ్ని అంతఃకరణము ద్వారా మనోహర జ్యోతిని చక్కగా గ్రహించినాడు. అతడు అగ్ని - వాయు - సూర్య రూపములను ధరించినాడు. అగ్ని పూజనీయ జ్ఞానమును పరిశుద్ధము చేసినాడు. అగ్ని తన రూపముననే తనను అత్యంత రమణీయుని చేసికొన్నాడు. మరుక్షణముననే అగ్ని ద్యావాపృథ్వులను పరికించినాడు.

    9. శతధార స్రోతస్సువలె అవిచ్చిన్న ప్రవాహవంతుడు, విద్వత్ పాలకుడు, వాక్యముల సంధానకర్త తలిదండ్రుల ఒడిలో ప్రసన్నుడు విశ్వామిత్రుని ఉపాధ్యాయుని ద్యావాపృథ్వులారా ! మీరు పరిపూర్ణుని చేయండి.

    ఆలోచనామృతము

    1. ఆలోచనము అనంతము. అంతము లేనిది. అయినను సదాలోచనమునకు పరిధులు ఉన్నవి. సదాలోచనము ఇతరులకు నష్టము కలిగించరాదు. ప్రయోజనము కలిగించవలెను. దురాలోచనమునకు హద్దులు లేవు. అవి అందరిని దురాలోచనపరుని సహితముగా నష్టపరచును. అందుకే వీరి నుండి రక్షించమని వేదమున అనేక స్తుతులు ఉన్నవి.

    పరిశీలనము సమీక్ష విమర్శ ఇవి విలక్షణ ఆలోచనములు. సాహిత్యము కళలు వీటిని గురించి ఆలోచించుటయే పరిశీలనము.

    పరిశీలనమునకు పరిధులు ఉన్నవి. నియమములు ఉన్నవి. నిబంధనలు ఉన్నవి. పరిశీలకుడు తాను పరిశీలించు పదార్థము కాలమునకు పరకాయ ప్రవేశము చేయవలసి ఉండును. రాగద్వేషములకు అతీతముగా ఆ పదార్థ తత్వమును గ్రహించవలెను.

    పరిశీలకుడు పదార్థ భావమును వివరించవలెను. తన భావములు పదార్థమున చేర్చరాదు. పదార్థమును పరిశీలించుటేకాని వికృతము చేయు అధికారము అతనికి లేదు.

    2. 214లో "అగ్నే మేదసో ఘృతస్య" అని చెప్పబడినది. "మేదసః" అనునది కొత్తగా వచ్చినది. "మేదోరూపస్య హవిషః" అన్నాడు శాయణుడు. అదొక రూపమగు హవిస్సు అన్నాడు. "స్నిగ్ధస్య-స్నిగ్ధాః" అన్నాడు దయానందుడు. 

    ఇది మాంసము అనిగాని కాదనిగాని చెప్పలేదు. ఏలననగా వాఖ్యానించిన కాలమునకు మాంసభక్షణము నీచముగా చూడబడినది. కాని వేదకాలమున మాంసము నిషేధముకాదు.

    మాంసము తినుట తినకుండుట ఆచారము, అలవాటు మీద ఆధారపడి ఉన్నది. ఆహారపు అలవాటును వర్ణములను, భాషాదులను బట్టి ఒక సమాజపు ఉచ్ఛ నీచములను నిర్ణయించజాలము.

    ఈ కాలమున మాంస భక్షక జాతులే ఆధిపత్యము కలిగి ఉన్నవి.

    మానవ ప్రగతిలో ఆహారపు అలవాట్లు ప్రధాన భూమిక నిర్వహించును. మాంసాహారము. పాశవికము. శాకాహారము సాత్వికము. మానవీయము అని మన శాస్త్రములు నిశ్చయించినవి. గుణములను బట్టి ఆహారమును గీతలో ప్రతిపాదించినాడు.

    అయినను మాంస భక్షణము ఒకనాటి ఆచారము. దానిని కాదనలేము. రాముడు మాంసమును ఆరగించినాడు. అది నాటి ఆచారము. అంతమాత్రమున రాముని అవతార పురుషుడు కాదనలేము.

    "మేదా" అనిన పారసీకములో ఉదరము. ఇరానువారు ఆర్యులు, ఆ దేశపు అసలు పేరు "ఆర్యాన్" పారసీకము సంస్కృత సంబంధ భాష.

    వేదము మరుసటి మంత్రముననే వివరించినది. "మధ్యతోమేద ఉధృతం పశోర్మధ్యభాగాత్ ఉధృతం" అని శాయణుడు. పశువు మధ్యభాగము నుండి తీసినది అని అర్ధము.

    2. 26.7ను ఒకసారి పరిశీలించిన ఒక కొత్త భావము గోచరము అగును.

    ఇంతవరకు ప్రకృతి శక్తులను మానవులు స్తుతించుట కీర్తించుట అర్థించుట జరిగినది. ఇచట అగ్ని స్వయముగా తనను గురించి చెప్పుకున్నాడు.

    "అగ్ని రస్మి జన్మనా జాతవేదా ఘృతం మేచక్షురమృత ఆసన్
    అర్కస్త్రిదా తూరజసో విమానో జస్రోధర్మోజ మిరస్మినామ్"

    భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు వక్కాణించినాడు.

    "పితాహమస్య జగతో మాతాధాతా పితామహః
    వేదం పవిత్రమోంకార ఋక్సామయజురేవచ"

    ఒక నూతన విధానము కొత్త పద్ధతి నవీన సిద్ధాంతము ఆవిష్కరించబడుచున్నది. ఇది గమనించవలెను.

                              ఇరువది ఏడవ సూక్తము

 ఋషి - విశ్వామిత్రుడు, దేవత -1 ఋతుదేవత, మిగిలినవి అగ్ని, ఛందస్సు - గాయత్రి.

    1. ఋతువులారా ! స్రుక్కు, హవివంతదేవతలు, మాసములు, అర్ధమాసములు మా యజమాని సుఖమును కోరుచున్నవి. యజమానికి దేవతా ప్రాప్తి కలుగును.

    2. మేధావి, యజ్ఞ నిర్వాహకుడు, వేగవంతుడు, ధనవంతుడు అగు అగ్నిని స్తుతివచనములతో పూజింతును.

    3. దీప్తిమంతుడవగు అగ్నీ ! నీ కొఱకు హవ్యము సిద్ధముచేసి ఇక్కడనే ఉంచెదము. మేము పాప విముక్తులము అగుదుము.

    4. అగ్ని ప్రజ్వలితుడు. జ్వాలాకేశి. పావకుడు. పూజనీయుడు. కోరిన ఫలము ప్రసాదించుమని అగ్నిని అర్థించుచున్నాము.    

    5. ప్రభూత తేజోవంతుడు, మృత్యురహితుడు, ఘృతశోధన కర్త, సమ్యక్ పూజనేయుడగు అగ్ని హవ్యములు గ్రహించవలెను.

    6. యజ్ఞ విఘ్ననాశకులు, హవ్యయుక్తులగు ఋత్విక్కులు ఆశ్రయ ప్రాప్తికిగాను స్రుక్కు సహితులయి స్తుతులద్వారా అగ్నిని అభిముఖుని చేసికొనుచున్నారు.

    7. అగ్ని హోమ నిష్పాదకుడు. అమరుడు. ద్యుతిమంతుడు. అతడు జనులను యజ్ఞకార్యములకు ప్రేరేపించును. యజ్ఞకార్య అభిజ్ఞాత సహకారమున అగ్ని అగ్రగామి అగును.

    8. అగ్ని మేధావి. యజ్ఞ సంపాదకుడు. బలవంతుడు. యుద్ధములందు అగ్నిని అగ్రమున స్థాపించెదరు. యజ్ఞమున అగ్ని యథాస్థానమున స్థాపితుడు అగును.

    9. కర్మద్వారా వరణీయుడు, భూతముల గర్భములందు ఉన్నవాడు పితృ స్వరూపుడగు అగ్ని దక్షపుత్రిని ధరించును.

    బలములు సంపాదించు అగ్నీ ! నీవు ఉత్కృష్ట దీప్తియుక్తుడవు. హవ్యాభిలాషివి. వరణీయుడవు. నిన్ను దక్షతనయ ఇళ వరించినది.

    దక్షతనయ "వేదరూపా భూమిః" అన్నాడు శాయణుడు.

    11. మేధావులగు భక్తజనులు - లోకనియామకుడు, జలప్రేరకుడగు అగ్నిని యజ్ఞ సంపాదకమునకుగాను అన్నము ద్వారా ఉద్దీప్తుని చేయుదురు.

    12. అన్నపౌత్రుడు అంతరిక్షమున దీప్తిమంతుడు. సర్వజ్ఞుడగు అగ్నిని యజ్ఞమున స్తుతింతుము.

    13. పూజనీయుడు. నమస్కారయోగ్యుడు. దర్శనీయుడు. అభీష్టవర్షి అగ్ని అంధకారములను దూరము చేయును. ప్రజ్వలితుడు అగును.

    14. అభీష్టవర్షియు అశ్వమువలె దేవతలకు హవ్యము వహించువాడగు అగ్ని ప్రజ్వలితుడు అగును. హవిష్మంతుడగు అగ్నిని నేను పూజింతును.

    15. అభీష్టవర్షి అగ్నీ ! నిన్ను మేము ఘృతసేచనము చేసెదము. నీవు జలసేచనములు చేసెదవు. మేము నిన్ను దీప్తుని చేసెదము. నీవు దీప్తిమంతుడవు అగుదువు. బృహంతుడవగుదువు.

                          ఇరువది ఎనిమిదవ సూక్తము

    ఋషి-విశ్వామిత్రుడు, దేవత - అగ్ని ఛందస్సు 1,2,6 గాయత్రి, 3 ఉష్ణిక్, 4 త్రిష్టుప్ 5 జగతి.

    1. జాతవేదా ! అగ్నీ ! నీ స్తుతియే ధనదాయకము. ప్రాతస్సవనమున నీవు మా పురోడాశమును, హవ్యమును సేవింపుము.

    2. యువతముడవగు అగ్నీ ! నీ కొఱకు పురోడాశము వచనము చేయబడినది. దానిని సంస్కరించినాము. నీవు దానిని సేవించుము.

    3. అగ్నీ ! దినాంతమున సమ్యక్ ప్రదత్తమగు పురోడాశమును భక్షింపుము. నీవు బలపుత్రుడవు. యజ్ఞమున నిక్షిప్తుడవు.

    4. జాతవేదా ! మేధావి అగ్నీ ! మధ్యాహ్న సవనమున పురోడాశమును సేవింపుము. ధీర అధ్వర్యులు యజ్ఞమున నీ భాగమును నష్టపరచరు. నీవు మహామహుడవు.

    5. బలపుత్రా ! అగ్నీ ! తృతీయ సవనమున సమర్పించిన పురోడాశమును అభిలషించుము. తదనంతరము అవినాశ్యము, రతన్వంతము, జాగరణకారకమగు సోమమును స్తుతియుక్తముగా దేవతలవద్ద స్థాపించుము.

    6. జాతవేదాగ్నీ ! దినాంతమున పురోడాశరూప ఆహుతిని సేవించుము.

                             ఇరవది తొమ్మిదవ సూక్తము

 ఋషి-విశ్వామిత్రుడు, దేవత - 5 అగ్ని, ఋత్విజుడు, మిగిలినవి అగ్ని; ఛందస్సు -
 1,4,10,12 అనుష్టుప్, 2-3,5,7,9,13,16 త్రిష్టుప్, 6,11,14-15 జగతి.

    1. ఇది అగ్నిమంథనము ఉత్పత్తి. స్థానము. లోక రక్షమగు అరణిని తెమ్ము. పూర్వమువలెనే అగ్ని మంథనము చేతుము.

    2. గర్భిణి గర్భమునందువలె జాతవేదాగ్ని అరణి ద్వయమున నిహితుడు తన కర్మమున అప్రమత్తుడు, హవియుక్తుడగు అగ్ని మానవులకు సత్యపూజనీయుడు.

    3. జ్ఞానవంతుడవగు అధ్వర్యూ ! ఊర్ధ్వముఖ అరణిమీద అధోముఖ అరణిని ఉంచుము. సద్యోగర్భయుక్త అరణి అభీష్టవర్షి అగు అగ్నిని ఆవిర్భవింప చేసినది. అందు అగ్ని దాహకత్వము ఉన్నది. ఉజ్వల తేజోయుక్తుడగు ఇళాపుత్రుడు అగ్ని అరణిలో ఆవిర్భవించినాడు.

    4. జాతవేదాగ్నీ ! హవ్యము వహించుటకుగాను నిన్ను మేము భూమిమీద ఉత్తరవేదిన ప్రతిష్ఠింతుము.

    5. అగ్ని విద్వాంసుడు. ద్వైధశూన్యుడు. ప్రకృష్టజ్ఞానవంతుడు. అమరుడు. స్ఫురద్రూపి. నేతా అధ్వర్యులారా ! మంథనముచేసి అగ్నిని ఉత్పన్నము చేయుడు. యజ్ఞసూచకుడు, ప్రప్రథముడు, సుఖప్రదాత అగు అగ్నిని కర్మ ప్రారంభమున ఉత్పన్నము చేయుడు.

    6. చేతులతో మంథనము చేసినపుడు అగ్ని అశ్వమువలె సుశోభితుడు అగును. తదుపరి శీఘ్రగమనముగల అశ్వద్వయపు విచిత్ర రథమువలె వేగవంతుడయి ప్రకాశించును. ఎంతటివాడయినను అగ్నిమార్గమును నిరోధించలేడు. అగ్ని గడ్డిని పిడకలను భస్మము చేసినాడు. ఆ స్థలము వీడినాడు. 

    7. ఉత్పన్న అగ్ని సహితము సర్వజ్ఞుడు. అప్రతిహతగమనుడు, కర్మకుశలుడు అగును. అందువలన మేధావులు అతనిని పూజింతురు. వారు కర్మఫల ప్రాప్తులయి శోభిల్లుదురు. దేవతలు సర్వజ్ఞుడు, పూజనీయుడు అగు అగ్నిని హవ్యవాహనుని చేసినారు.

    8. అగ్నీ ! నీవు హోమ నిష్పాదకుడువు. నీ స్థానమును అలంకరించుము. నీవు సర్వజ్ఞుడవు. యజమానిని పుణ్యలోకమున స్థాపించుము. నీవు దేవతల రక్షకుడవు. హవ్యములద్వారా దేవతలను పూజింపుము. నేను యజ్ఞము చేయుదును. నాకు వలసినంత అన్నము ప్రసాదించుము.

    9. అధ్వర్యులారా ! మీరు అభీష్టవర్షి ధూమాగ్నిని ఉత్పన్నము చేయుడు. అప్పుడు మీరు బలవంతులయి యుద్ధమునకు సాగుడు. అగ్ని వీర్యప్రధానుడు. సేనా విజేత, అగ్ని సాయముననే దేవతలు అసురులను పరాజితులను చేసినారు.

    10. అగ్నీ ! నీవు ఋతుకాష్ఠవంతుడవు. ఈ అరణి నీ జన్మస్థానము. ఇందు జన్మించి నీవు శోభిల్లుము. అది తెలిసి ఆసీనుడవగుము. ప్రవేశించుము. మా స్తుతులను వర్థిల్ల చేయుము.

    11. గర్భస్థ అగ్నికి తనూనపాతుడని పేరు. ప్రత్యక్షమయిన అగ్నికి అసుర నరాశంసుడని పేరు. అంతరిక్షమున తేజము ప్రసరించినపుడు "మాతరిశ్వ' అగును. అగ్ని ప్రభవించిన అనంతరము వాయువు పుట్టినది.

    12. అగ్నీ ! నీవు మేధావివి. మంథనమున ఆవిర్భవించినావు. నిన్ను అత్యుత్తమ స్థానమున ప్రతిష్ఠించినాము. ఈ యజ్ఞమును నిర్విఘ్నము చేయుము. దేవాభిలషుల కొఱకు దేవతలను పూజింపుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.