Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ఓం
శ్రీమహాభారతము
అరణ్యపర్వము
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
అక్షయపాత్ర
పాండవులు నారచీరలు ధరించినారు. ఆయుధములు తీసుకున్నారు. ద్రౌపది సహితులయి పురద్వారము దాటినారు. అది తెలిసి ఇంద్రసేనాది పాండవ భృత్యులు రథములపై వారివెంట వెళ్లినారు. హస్తినాపురపు ప్రజలకు పాండవులు అడవులకు వెళ్లుచున్నారని తెలిసినది. అందుకు వారు దుఃఖించినారు. ఇండ్లు, వాకిళ్లు వదిలినారు. పాండవుల వెంట అడవులకు వెళ్లుటకు సిద్ధము అయినారు. హస్తిన సాంతము కదలినది. జనసందోహము పాండవుల వెనుక ఉరికినది. సముద్ర ఘోష వంటి జనఘోష విని పాండవులు వెనుదిరిగి చూచినారు. జనులు ఉరికి వచ్చినారు. వారిని చుట్టివేసినారు. మొరపెట్టుకున్నారు:-
"ధర్మరాజాది పాండవులారా! మీరు మమ్ము విడిచి వెళ్లరాదు. మాకు మరొక దిక్కులేదు. ధృతరాష్ట్ర దుర్యోధనాదులు పాపాత్ములు. పాపములు చేయకున్నను పాపాత్ముల సహవాసము వలన పుణ్యహీనులము అగుదుము. కావున దుర్యోధనుని రాజ్యమున మేము ఉండజాలము.
"పూవులతో కూడుట వలన నువ్వులకు, నీళ్లకు, వస్త్రములకు పూవులా సువాసన కలుగును. అట్లే సత్పురుషుల సహవాసమున సద్గుణములు కలుగును. మీరు సత్పురుషులు కాబట్టి మేము మీ వెంట అడవులకు వత్తుము. అందుకు మీరు సమ్మతింపవలెను".
"పిరజనులారా!" ధర్మరాజు వారిని వారించి అన్నాడు. "మా యందు మీకు అనురాగమున్నది. అందువలన మేము సత్పురుషుల వలె కనిపించుచున్నాము. మీరు మావెంట వచ్చుట మా అదృష్టముగా భావింతుము. కాని మిమ్ము బాధలకు గురిచేయుట మాకు సమ్మతము కాదు. మీరు వనవాస దుఃఖములను సహింపజాలరు. కాబట్టి మీరు హస్తినకు వెళ్లుడు".
ధర్మరాజు మాటలు విన్నారు జనులు. వెనుక ముందాడినారు. తుదకు తిరిగి పోవుటకు నిశ్చయించినారు. తిరిగి పోయినారు.
పాండవులు ఉత్తర దిక్కునకు సాగినారు. గంగాతీరమునకు చేరినారు. "ప్రమాణము" అను మఱ్ఱిచెట్టు క్రింద విడిసినారు. గంగా స్నానము చేసినారు. ఆ పగలు రాత్రి ఆచటనే ఉన్నారు. మరునాటి ఉదయమున బ్రాహ్మణులు వేదఘోష చేయుచు వేలమంది అక్కడికి వచ్చినారు. వారిని చూచిన ధర్మరాజు. "మేము అడవులకు వెళ్లుచున్నాము. మా వలె మీరు దుఃఖములు అనుభవించరాదు. దయచేసి మీరు హస్తినకు తిరిగి వెళ్లి సుఖముగా ఉండుడు" అని వినమ్రముగా విన్నవించినాడు.
"ధర్మరాజా!" విప్రులు వేడుకొన్నారు. "దుర్యోధనుడు దుర్మార్గుడు. అతని పాలనలో మేము ఉండలేము. మేము మీకు కష్టము కలిగించము. కాయగసరులు తిని కాలము గడుపుదుము. అధర్మయుక్తమయిన పాయసముకన్న, ధర్మయుక్తమయిన కాయగసరు మిన్న. కావున మేము వెంట వచ్చుటకు మీరు సమ్మతించవలెను".
ధర్మరాజు విప్రులను తిప్పిపంపించలేక పోయినాడు. వారు వెంట వచ్చుటకు సమ్మతింపక తప్పలేదు. వారందరు పాండవుల వెంట ఉండిపోయినారు.
ధర్మరాజు బ్రాహ్మణులను ఉండమని అన్నాడు. కాని అతనికి మనోవేదన పట్టుకున్నది. అతడు ధౌమ్యునకు నమస్కరించి పూజించి "మహాత్మా! వలదన్నను వినక బ్రాహ్మణులు నా వెంట ఉన్నారు. వీరి కొఱకు ఆహారము ఎట్లు సంపాదింతునో అర్థము కాకున్నది. వీరిని విడుచుటకు మనసొప్పకున్నది. ఉంచుకొనుట సాధ్యముకాకున్నది. ఇందుకుగాను ఒక ఉపాయము చూపించి నన్ను కాపాడవలెను" అని ప్రార్థించినాడు.
ధౌమ్యుడు ధర్మరాజు మాటలు విన్నాడు. ఆలోచించినాడు. ఆలోచించినా. తుదకు ఒక మార్గము కనుగొన్నాడు. ధర్మరాజునకు చెప్పినాడు.
"సృష్టి ఆదిన సకల భూతములు పుట్టినవి. వానికి పుట్టుకతోనే ఆకలు పుట్టినది. అవి ఆకటికి అలమటించినవి. అది చూచినాడు సూర్య భగవానుడు. అతనికి కరుణ కలిగినది. ఆకలికి అన్నము కల్పించదలచినాడు. ఉత్తరాయణమున భూమి యందలి జలమును పీల్చినాడు. దక్షిణాయనమున పర్జన్య రూపము దాల్చినాడు. వర్షము కురిపించినాడు. రాత్రులందు చంద్ర కిరణములకు అమృతము ప్రసాదించినాడు. ఆ విధముగా ఓషధులను సృష్టించినాడు. వాటిని వృద్ధిపొందించినాడు. సకల భూతములకు అన్నము ప్రసాదించినాడు.
ఏవం భానుమయం హ్యన్నం భూతానాం ప్రాణధారణం
పితైష సర్వభూతానాం తస్మాత్ తం శరణం వ్రజ
ఆ విధముగా అన్నము సూర్యమయమయినది. సూర్యుడే సకల భూతములకు ప్రాణాధారము. అతడు సకల భూతములకు తండ్రి వంటివాడు. కావున సూర్యుని శరణు వేడుము.
పూర్వము భీమ, వైన్య, కార్తవీర్య నహుషాది రాజన్యులు సూర్యుని ప్రార్థించి అన్నమును పొంది ఆపదలందు ప్రజలను ఉద్ధరించినారు. నీవును వారి మార్గమును అనుసరింపుము. బ్రహ్మ విష్ణు శివాత్మకుడయిన సూర్యుని స్తుతించుము. ఉపాసించుము. సూర్యునకు గల 108 నామములను నీకు ఉపదేశింతును" అని ఉపదేశించినాడు:-
సూర్యోర్యమా భగస్త్వష్టా పూషార్క స్సవితారవిః
గభస్తిమానజః కాలో మృత్యుర్ధాతా ప్రభాకరః
పృథివ్యాపశ్చ తేజశ్చ ఖంవాయశ్చ పరాయణం
సోమో బృహస్పతి శ్శుక్రో బుధోంగారక ఏవచ
ఇంద్రో వివస్వాన్ దీప్తాంశు శ్శుచి శ్శౌరి శ్శనైశ్చరః
బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వైవారుణో యమః
వైద్యుతో జాఠరశ్చాగ్నిరైంధవ స్తేజసాంపతిః
ధర్మధ్వజో వేదకర్తా వేదాంగో వేదవాహనః
కృతంత్రేతా ద్వాపరంచ కలిస్సర్వమలాశ్రయః
కాళా కాష్ఠా ముహుర్తాశ్చ క్షపాయా మస్తధాక్షణః
సంవత్సకరోశ్వత్ధః కాలచక్రో విభావసుః
పురుషశ్శాశ్వతో యోగీ వ్యక్తావ్యక్తస్సనాతనః
కారాధ్యక్షః ప్రజాధ్యక్షో విశ్వకర్మా తమోదమః
వరుణస్సాగరాంశశ్చ జీమూతో జీవనోరిహ
భూతాశ్రయో భూపతి స్సర్వలోక నమస్కృతః
స్రష్టా సంవర్తకో వహ్ని సర్వస్యాది రలోలుపః
అనంతః కపిలో భానుః కామదః సర్వతోముఖః
జయో విశాలో వరద స్సర్వధాతు నిషేచితా
మన స్సుపర్ణో భూతాది శ్శీఘ్రగః ప్రాణధారణః
ధన్వంతరి ర్ధూమకేతు రాదిదేవో దితేస్సుతః
ద్వాదశాత్మా రవిందాక్షః పితా మాతా పితామహః
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపం
దేహ కర్తా ప్రశాంతాత్మా విశ్వాత్మా విశ్వతోముఖః
చరాచరాత్మా సూక్ష్మాత్మా మైత్రేయః కరుణాన్వితః





