Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    ఆ మాటలు విని చావు నిశ్చయం అనుకున్నాను. కళ్ళలో నీళ్ళు నిలిచాయి. కంపరం పుట్టుకుంది. నరాలు పట్టు తప్పాయి. కాళ్ళు చేతులు డీలా పడిపోయాయి. ఈ స్థితి చూచి కూడా ఆ రాక్షసునికి కనికరం కలగలేదు. గట్టిగా గుండెలో గుద్దాడు. విలవిల్లాడాను. పడిపోయేంత పని అయింది.
    పీర్: దీన్నీ చంపితే ,మరి నా డబ్బో?
    దిలా: ఇస్తాం ఎలాగో.
    పీర్: ఎక్కణ్ణుంచి తెచ్చిస్తావు? నేను వేరే విధంగా అనుకున్నాలే.
    దిలా: ఇంటికి పద. ఎక్కడా దొరక్కుంటే పావురాలు అమ్మేస్తాను.
    పీర్: పావురా లెందుకమ్మాలి? ఒకమాట చెప్పనా?
    దిలా: చెప్పు    
    పీర్: లక్నో కు వెళ్ళి దీన్ని డబ్బు చేసుకుంటే?
    చావు నిశ్చయం అనుకున్న తర్వాత వారి మాటలు సరిగా చెవిని పడటం లేదు. ఎవరో కలలో మాట్లాడినట్లు వినిపిస్తున్నాయి. పీర్ భక్షు మాటలు విని మళ్ళీ ప్రాణం మీద కొంత ఆశ కలిగింది. మనసులో పీర్ బక్ష్ ను దీవించాను. ఆ రాక్షసుడు ఏమంటాడో వినాలని ఊపిరి బిగపట్టి కూర్చున్నాను.
    దిలా : సరి చూద్దాం లే నడువనీ.
    కాస్సేపు అగుదామే? అదిగో ఆ చెట్టు కింద మంట కనిపిస్తుంది. నిప్పు తెస్తాను. హుక్కా నింపుకుందాం.
    పీర్ బక్ష్ నిప్పుతేవడానికి వెళ్ళిపోయాడు. అతడు వచ్చే లోగా చంపెస్తాడేమోనని భయం పట్టుకుంది. ప్రాణ భయం మహా చెడ్డది. గట్టిగా కేకవేశాను. దిలావర్ ఖాన్ చెళ్ళుమని చెంప మీద కొట్టాడు. " హరామ్జీదీ! నోరు మూసుకుని ఉండలేవు? పొడిచేస్తా..... నఖరాలు ...."
    పీర్ ఇంకా అట్టే దూరం వెళ్ళలేదు. "నహీ భాయీ! అలాంటి పని చెయ్యొద్దు. నామీద ఒట్టు. నేను వచ్చేవరకూ అగు" అని అన్నాడు.
    దిలా: సరే, వెళ్లి నిప్పు తీసుకురా.
    పీర్ బక్ష్ నిప్పు తెచ్చాడు. హుక్కా నింపి దిలావర్ ఖాన్ కు ఇచ్చాడు.
    దిలా: (హుక్కా పీల్చి) అయితే ఇది ఎంతకు అమ్ముడు అవుతుందంటావు? ఎవడు అమ్మాలి? పట్టుబడ్తే చిక్కుల్లో పడిపోతాం.
    పీర్: ఆ బాధ్యత నాది. అరేమియా అన్నీ నీ మాటలు! ఎవడూ పట్టుకునేది? లక్నో లో ఇలాంటివి రాత్రిబవళ్ళు జరుగుతూనే ఉంటాయి. మా బావమరిది తెలుసుగా?
    దిలా : కరీమా?
    పీర్ : ఆ అతని బ్రతుకే దాని మీద. ఎందరో అమ్మాయిలను తీసి కెళ్ళాడు. లక్నోలో వెండి బిళ్ళలు చేసుకున్నాడు.
    దిలా: ఎక్కడ ఉంటున్నాడతను?
    పీర్: ఎక్కడేమిటీ? లక్నో లోనే. గోమతి అవలి వైపు అతని అత్తావారిల్లు . అక్కడే ఉండొచ్చు.
    దిలా: అలాగా, అయితే పిల్లలు ఎంతకు అమ్ముడు అవుతారో?
    పీర్: రూపాన్ని బట్టి.
    దిలా: దీనికి ఎంత వస్తుంది?
    పీర్: నూరు, నూట యాభై, నీ అదృష్టాన్ని బట్టి.
    దిలా: ఏం భాయీ! ఈ ముఖానికా? నూరు వస్తే ఎక్కువే?
    పీర్: ఎంతైతే ఏం గాని తీసికెళ్దాం. చంపేస్తే ఏం లాభం?
    తరవాత దిలావర్ ఖాను పీర్ బక్ష్ చెవిలో ఏదో చెప్పాడు. నాకు వినిపించలేదు. "అది నేను ముందే అనుకున్నాను. నువ్వే బేకూప్ వా?" అన్నాడు పీర్ బక్ష్.
    రాత్రంతా బండి నడిచింది. ప్రాణం గుప్పెట్లో ఉంది. కళ్ళముందు మృత్యువు తాండవిస్తుంది. శక్తి జారిపోయింది. వొళ్ళు మొద్దుబారింది. ఉరికంబం మీద కూడా నిద్ర వస్తుందని మీరు వినే ఉంటారు. కొంచెం సేపటికి కన్ను అంటుకుంది. పీర్ బక్ష్ దయ. ఎద్దుల గొంగళి కప్పాడు. రాత్రి ఎన్నోసార్లు ఉలిక్కిపడ్డాను. భయం మెదలకుండా పడుకున్నాను. చివరకు ఒకసారి కంబళి ముఖం మీంచి తొలగించి చూశాను. బండిలో ఒక్కర్తేనే ఉన్నాను. పరదాలోంచి తొంగి చూశాను. కొన్ని మట్టి ఇండ్లు కనిపించాయి ..... ఒక కోమటి చెట్టు. దిలావర్ ఖాను, పీర్ బక్షూ ఏదో కొంటున్నారు. ఎడ్లు ఎదురుగా ఉన్న మర్రి చెట్టు క్రింద తవుడు తింటున్నాయి. ఇంతలో పీర్ బక్ష్ బండి దగ్గరకు వచ్చాడు. కాల్చిన శనగలు పెట్టాడు. రాత్రంతా ఉపవాసం. శనగలు తిన్నాను. చంబుతో నీళ్ళు తెచ్చిచ్చాడు. త్రాగాను. మెదలకుండా పడి ఉన్నాను.
    బండి చాలా సేపు అక్కడ నిలిచింది. పీర్ బక్ష్ బండి కట్టాడు. దిలావర్ ఖాన్ హుక్కా నింపుకొని నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. బండి కదిలింది. ఆరోజు అంతగా దౌర్జన్యం జరుగలేదు. దిలావర్ ఖాన్ కత్తి కనిపించలేదు. గుద్దులు తగల్లేదు. వారిద్దరూ మధ్యమధ్య హుక్కా పిల్చారు. బాతాఖానీ సాగింది. మాటలతో అలసినపుడు పాటలు సాగించారు. ఒకడు పడుతుంటే రెండవవాడు మౌనంగా వింటున్నాడు. వింటున్నాడని కాదు- ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాడు. మళ్ళీ మాటలు ప్రారంభం . మాటలు వాదనలోకి దిగాయి. ఇద్దరూ తిట్టుకున్నారు. చొక్కా చేతులు పైకెత్తారు. నడుములు బిగించారు. ఒకడు బండి నుండి దూకాడు. మరొకడు గొంతు నులమడానికి తయారైనాడు. ఇంతలో ఇద్దరూ డీలా పడిపోయారు. సమాధానం కుదిరింది. మిత్రులైపోయారు. ఎన్నడూ పోట్లాటే ఎరగనట్లు మాటలు సాగించారు.       ఒకడు: మనం ఏ విషయంలో పోట్లాడుకున్నట్లు?
    రెండోవాడు : అవును ఏమిటా విషయం?
    మొదటివాడు : పోనీ ఆ మాటేందుకూ ఇప్పుడు ?
    రెండోవాడు : సరే పోనీ .

                                   2


        బందినైతి, తొలిరేయి, ఓ నిషాద,
        వదులు మొకింత రెక్కలార్చుకొందు!
    పట్టుబడిన తొలిరేయి కధ విన్నారు. నాటి యాతన ఊపిరి ఉన్నంతవరకూ మరవలేను. ఎలా బతికానో , ఎందుకు బతికానో నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎంత గట్టి ప్రాణం! ఎగిరిపోలేదు. ఒరే బానిసా! దిలావర్ ఖాన్! లోకంలో అనుభవించాల్సిన శిక్ష అనుభవించావు. అంతటితో నా ఆత్మ శాంతించిందనుకున్నావా? ఆ రాక్షసుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి కాకులకూ, గద్దలకూ వేసినా బాధపడకపోయేదాన్ని. గోరీలో రేయింబవళ్ళు నరకయాతనలు పడుతూనే ఉంచావు. అంతిమదినం నాడు అల్లా నిన్నూ పెడతాడురా తీరని యాతనలు!
    నా తలిదండ్రుల గతి ఎమై వుండాలి? నా ప్రాణానికి ఎంత పరితపించారో! మిర్జా సాహెబ్! బస్. ఇక చాలు. మిగతాది రేపు చెపుతాను. నా గుండె వ్రక్కలు అవుతుంది. పెద్దగా కేకలు పెట్టి ఏడవాలనిపిస్తుంది.
    నా ఆవారా జీవిత కధ విని ఏం చేస్తారు? విన్నది చాలు, దిలావర్ ఖాన్ నన్ను అప్పుడే చంపేస్తే బాగుండేది. పిడికెడు మట్టిలో నా శీలం దాగేది. తలిదండ్రుల గౌరవానికి కళంకం కలిగేది కాదు. లోకమూ , మతమూ నా ముఖానికి మసి పూసి ఉండేవి కావు.
    తరవాత ఒకసారి చూచాను అమ్మను. చాలా కాలం తరవాత. ఇపుడు బతికే వుందో, చనిపోయిందో అల్లాకే తెలియాలి. తమ్మునికి ఒక కుర్రాడు . దేవుని దయవల్ల పదిహేనేండ్లవాడయ్యాడు . ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళను చూడాలని తపిస్తాను. ఒక్కొక్కసారి. ఏమంత దూరం కూడా కాదు. వెధవ రూపాయి పారేస్తే పైజాబాదు చేరతాను. అయినా వివశను. రైళ్ళు లేనపుడు పైజాబాదు నుంచి లక్నో నాలుగురోజుల బాట. దిలావర్ ఖాను, నాన్న వెంట పడతారనే భయంతో ఏ డొంకతిరుగుడు దారిన వచ్చాడో ఎనిమిది రోజులు పట్టింది. దిలావర్ ఖాను, పీర్ బక్ష్ మాటల్ని బట్టి నన్ను వారు లక్నో తీసికేళ్తున్నారని తెలుసుకున్నాను. అప్పటికే ఆ పేరు విన్నాను. మా తాత అక్కడే ఒక రాజ భవనంలో సిపాయి పని చేశాడు. వారు ఒకసారి ఫైజాబాదు కూడా వచ్చారు. నాకోసం మిఠాయిలు, బొమ్మలూ తెచ్చారు. వారి రూపం ఇప్పటికీ గుర్తుంది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.