Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
2. అగ్నీ ! నేను హవ్యయుక్తము, తేజస్వి, హవ్యదాత, ఘృత సమన్విత 'జుహువు'ను నీముందు అర్పించుచున్నాను. దేవతలకు బహుమాన కర్తయగు అగ్ని మాకు ఇవ్వదలచిన ధన సమన్వితుడయి ప్రదక్షిణచేసి యజ్ఞమున చేరవలెను.
3. అగ్నీ ! నీవు రక్షించువాడు అత్యంత తేజస్వి అగుచున్నాడు. అతనికి అపత్యవంతమగు ధనమును ప్రసాదించుము. అగ్నీ ! నీవు ఫలప్రదాతవు. మహా అన్నదాతవు. మేము నీ మహిమల వలన రక్షింప బడుదుము. నిన్ను స్తుతించుచు ధనాధిపతులమగుదుము.
4. అగ్నీ ! నీవు ద్యుతిమంతుడవు. యజ్ఞ, కర్తలు నీకు ప్రభూత దీప్తిని సమర్పించినారు. నీవు యజ్ఞమందు స్వర్గతేజమును పూజింతువు. కావున దేవతలను ఆహ్వానించుము.
5. అగ్నీ ! యజ్ఞమున ఆసీనులయిన దీప్తిశాలురగు ఋత్విక్కులు నిన్ను హోతగా భావించి సిక్తము చేసినారు. కావున మమ్ము రక్షించుటకు జాగృతుడవు అగుము. మా పుత్రులకు మరింత అన్నము ప్రసాదించుము.
ఇరువదవ సూక్తము
ఋషి-గాధి, దేవత-అగ్ని, ఛందస్సు-త్రిష్టుప్.
1. హవ్యవాహక ఉషయొక్క అధికారమును దూరము చేయునపుడు అగ్ని, ఉష, అశ్వినులు దధిక్రుడను దేవతలను ఋక్కులద్వారా ఆహ్వానించును, సుందరులు, ద్యుతిమంతులు, పరస్పరము కలిసి ఉన్న దేవతలు యజ్ఞాభిలాషులయి ఆ ఋక్కులను వినవలెను.
2. అగ్నీ ! నీ అన్నము మూడు రకములది. నీ స్థానము మూడు రకములది. యజ్ఞసంపాదక అగ్నీ ! దేవతల కడుపునింపు నీకు మూడు నాలుకలు ఉన్నవి. నీ మూడు రకముల శరీరములను దేవతలు అభిలషింతురు, నీ మూడు శరీరములతో అప్రమత్తుడవయి మా స్తుతిని రక్షింపుము.
(1. ఆజ్యము-ఇధ్మము-సోమము మూడు అన్నములు. 2. ఏకాహ - ఆహీన-సత్ర లేక ప్రాతః- మధ్యాహ్న - తృతీయ సవనములు మూడు స్థానములు. 3. గార్హపత్య ఆహవనీయ - దక్షిణ మూడు నాలుకలు. 4. పావక-పవమాన - శుచి అను మూడు శరీరములు.)
3. అగ్నీ ! నీవు ద్యుతిమంతుడవు. జాతవేదివి. మరణరహితుడవు. అన్నవంతుడవు. లోకముల తృప్తికర్తవు. ప్రార్థితుడవు. ఫలదాతవు. దేవతలు నీకు అనేక ప్రకారముల తేజస్సును ప్రసాదించినారు. మాయవుల మాయలను ప్రసాదించినారు. అవన్నియు నీలో ఉన్నవి.
4. అగ్ని సూర్యునివలె ఋతుకర్త. అగ్ని మానవుల నియంత, సత్యవంతుడు, వృత్రహంత, సనాతనుడు, సర్వజ్ఞుడు. ద్యుతిమంతుడు. అతడు స్తోతలను పాపములు దాటించి దరికి చేర్చవలెను.
5. నేను యజ్ఞమునకు దధిక్రుని, అగ్నిని, ఉషను, ద్యుతిమంత సవితను, అశ్వినులను, భగుని, వసువులను, రుద్రుని, ఆదిత్యులను ఆహ్వానించుచున్నాను.
ఇరువది ఒకటవ సూక్తము
ఋషి - గాధి, దేవత - అగ్ని, ఛందస్సు-1 త్రిష్టుప్, 2-3 అనుష్టుప్, 4 విరాడ్రూప 5 పతో బృహతి.
1. జాతవేద అగ్నీ ! మా యీ యజ్ఞమును దేవతలకు అర్పింపుము. మా హవ్యమును సేవింపుము. ఆసీనుడవయి అందరికన్నముందు మేదను, ఘృతమును బిందువుగా ఆరగింపుము.
(మేద-క్రొవ్వు లేక జిగట పదార్థము)
2. పావకా ! ఈ సాఙ్గ యజ్ఞమున రెండు నేతిబొట్లు నీ కొఱకును, దేవతల కొఱకును రాలుచున్నవి. కావున మాకు శ్రేష్ఠము, వరణీయ ధనమును ప్రసాదించుము.
3. అగ్నీ ! నీవు కీర్తనీయుడవు. మేధావివి. ఋషివి. శ్రేష్ఠుడవు. నీ కొరకే మేదోరూప హవ్యపు సకల బిందువులు స్రవించుచున్నవి. కవులు నిన్ను స్తుతించుచున్నారు. మహా తేజమున విచ్చేయుము. మా హవ్యమును సేవింపుము.
(ఋషిః అతీంద్రియార్థదశ్రీ అని శాయణుడు)
4. అగ్నీ ! నీవు నిరంతర గమనశాలివి. శక్తిమంతుడవు. నీ కొరకే మేదోరూప హవ్యపు సకల బిందువులు స్రవించుచున్నవి. కవులు నిన్ను స్తుతించుచున్నారు. మహా తేజమున విచ్చేయుము. మా హవ్యమును సేవింపుము.
5. అగ్నీ ! పశువు మధ్య భాగము నుండి తీసిన అత్యంతసార యుక్తము అగు మేదను నీకు అర్పింతుము. నివాస ప్రదుడవగు అగ్నీ ! చర్మము మీద నీ కొఱకు పాడుచున్న బిందువులను, దేవతలకు వేరువేరుగా విభజించి అందించుము.
సారయుక్తమేదః వపాఖ్యం హవి. వప పేరుగల హవిస్సు)
ఇరువది రెండవ సూక్తము
ఋషి - గాధి, దేవత - అగ్ని, చందస్సు - 4వది అనుష్టుప్, మిగిలినవి త్రిష్టుప్.
1. సోమాభిలాషి ఇంద్రుడు అగ్నిలోని అభిహుత సోమమును తన ఉదరమున దాల్చినాడు. ఇతడు ఆ అగ్నియే. సర్వజ్ఞ అగ్నీ ! ఈ హవ్యము నానా రూపములు గలది. అశ్వమువలె వేగవంతమయినది. దానిని నీవు సేవింపుము. లోకములు నిన్ను నుతించును.
2. పూజనీయా ! అగ్నీ ! నీ తేజము ద్యులోకము, పృథివి, ఓషధులు జలములందు ఉన్నది. ఆ తేజమున నీవు అంతరిక్షమున వ్యాపించినావు. ఆ తేజము ఉజ్జ్వలము, సముద్రవలె విశాలము, మానవులకు దర్శనీయమయినది.
3. అగ్నీ ! నీవు ద్యులోకమునందలి జలముల వద్దకు వెళ్లుచున్నావు. ప్రాణాత్ములయిన దేవతలను ఏకము చేయుచున్నావు. సూర్యునిపైన రోచనామక లోకమునను, సూర్యుని దిగువ ఉన్న జలములకును నీవే ప్రేరకుడవు.
(రోచనే నామయలోకః అని శాయణుడు)
4. సికత సమ్మిశ్రిత అగ్నీ ! త్రవ్వుకోల సహితుడవయి యీ యజ్ఞమును సేవింపుము. ద్రోహరహితము, రోగ శూన్యము అగు అన్నమును మాకు దానము ఇమ్ము.
(సికత సమ్మిశ్రిత ఇసుకతో కలిసినది అని శాయణుడు. పశుభ్యోహితః పశువులకు హితకరమయినది అని యాస్కుడు.)
5. అగ్నీ ! స్తోతలకు కర్మభూమి, ధేనుప్రదాత్రి భూమిని సర్వదా ప్రదానము చేయుము. మాకు వంశవర్ధనుడు సంతతి జనయిత అగు ఒక పుత్రుడు కలుగవలెను. నీవు మమ్ము అనుగ్రహింపుము.
ఇరువది మూడవ సూక్తము
ఋషి-దేవాశ్రవ, దేవవాతులు, దేవత-అగ్ని ఛందస్సు 3బృహతి, మిగిలినవి త్రిష్టుప్.
1. అగ్ని మంథనమున ఉత్పన్నుడు. యజమాని గృహమున స్థాపితుడు. యువకుడు. సర్వజ్ఞుడు. యజ్ఞప్రేరకుడు. జాతవేది. మహారణ్యములను దహించియు అజరుడు. అట్టి అగ్ని ఈ యజ్ఞమున అమృతమును ధరించును.
2. భారత పుత్రులు దేవశ్రవుడు, దేవవాతుడు, సుధక్షుడు, ధనవంతుడగు అగ్నిని మంథనమున ఉత్పత్తి చేసినారు. అగ్నీ! నీవు మరింత ధనముతో మావైపు చూడుము. మా కొఱకు నిత్యము అన్నము తీసికొని రమ్ము.
3. పురాతనము, కమనీయమగు అగ్నిని చేతివ్రేళ్లు పది పుట్టించినవి. దేవవాతుడు అరణిరూపమాతల మధ్యన సుజాతుడు, సుప్రియుడు అగు అగ్నిని ఆవిర్భవింప చేసినాడు. దేవశ్రవా ! అట్టి అగ్నిని స్తుతింపుము. ఆ అగ్నియే జనులకు వశవర్తి అగును. "జనానామసద్వసే"
(అరణుల వలన కలిగిన అగ్నిమాత్రమే మానవుని వశమున ఉండును అనుచున్నాడు)
4. ప్రధాన దేవాపూజా దినప్రాప్తికొఱకు అగ్నీ ! నిన్ను గోరూప పృథ్వియొక్క ఉత్కృష్ట స్థానమున స్థాపించినాము. అగ్నీ ! నీవు ద్రుషద్వతి, ఆపయ, సరస్వతీ నదుల తీరములందు ఉన్నవారి గృహములందు ధనయుక్తుడవుయి దీపించుము.
(దృషద్వతి రాజస్థానమున, ఆపయ, సరస్వతులు కురుక్షేత్రమున పూర్వము ప్రవహించి ఇప్పుడు అదృశ్యములయిన నదులు.)
5. అగ్నీ ! నీవు స్తోతలకు కర్మభూమియు ధేనుప్రధాత్రియునగు భూమిని సర్వదా ప్రదానము చేయుము. మాకు వంశవర్ధనుడు సంతతి జనయిత అగు ఒక పుత్రుడు కలుగవలెను. నీవు మమ్ము అనుగ్రహింపుము.
ఇరువది నాలుగవ సూక్తము
ఋషి - విశ్వామిత్రుడు, దేవత - అగ్ని, ఛందస్సు -1 అనుష్టుప్, మిగిలినవి గాయత్రి.
1. అగ్నీ ! నీవు శత్రు సేనలను ఓడించుము. విఘ్నకర్తలను దూరము చేయుము. నీవు అజేయుడవు. శత్రువులను గెలుపుము. యజమానికి అన్నము ప్రసాదించుము.
2. అగ్నీ ! నీవు యజ్ఞప్రియుడవు. అమరుడవు. నీవు ఉత్తరవేదిమీద ప్రజ్వలితము చేయబడుదువు. నీవు మా యజ్ఞమును చక్కగా సేవింపుము.
3. అగ్నీ ! నీవు బల పుత్రుడవు. నీవు త్వత్తేజమున సర్వదా అప్రమత్తుడవు అగుము. నేను నిన్ను ఆహ్వానించుచున్నాను. విచ్చేయుము. కుశలమీద ఆసీనుడవు అగుము.
4. అగ్నీ ! నిన్ను పూజించువారి యజ్ఞమునకు తేజోవంతులయిన సమస్త అగ్నుల సహితుడవయి విచ్చేయుము. అక్కడి స్తుతి గౌరవమును రక్షింపుము.
5. అగ్నీ ! హవ్యదాతకు వీర్యయుక్తము. ప్రభూత ధనమును ప్రసాదించుము. మేము పుత్ర పౌత్రవంతులము. మాకు తీక్ష్ణత ప్రసాదించుము.
ఇరువది అయిదవ సూక్తము
ఋషి - విశ్వామిత్రుడు, దేవత - ఇంద్రాగ్నులు, ఛందస్సు - విరాట్.
1. అగ్నీ ! నీవు సర్వజ్ఞుడవు. చిత్రవంతుడవు. ద్యుపుత్రుడవు. పృథ్వీ తనయుడవు. చైతన్యవంతుడవు. ఇది దేవతల యజ్ఞము. ఇందు నీవు వేరు వేరు యజ్ఞములు చేయుము.
2. విద్వాంసుడగు అగ్ని సామర్థ్యము ప్రసాదించును. అగ్ని తనను విభూషితుని చేసికొనును. దేవతలకు అన్నప్రదానము చేయును. బహువిధ అన్నవంతుడవగు అగ్నీ ! మా కొఱకు దేవతలను ఈ యజ్ఞమునకు తోడ్కొని రమ్ము.
3. సర్వజ్ఞుడు, దీప్తిమంతుడు, జగస్పతి, బలము, అన్నములుగల అగ్ని, లోకమాత, ద్యుతిమతి, మరణరహిత ద్యావాపృథ్వులను ప్రకాశింప చేయును.
4. ఇంద్రాగ్నులారా ! మీరు యజ్ఞమును హింసించరాదు. అభిషవ ప్రదాత గృహమునకు సోమ పానమునకు విచ్చేయుడు.
(అనాగమనేన యజ్ఞహింస అన్నాడు శాయణుడు. యజ్ఞమునకు ఇంద్రాగ్నులు రాకుండుటే యజ్ఞహింస అన్నాడు)
5. బలపుత్రుడు, నిత్యుడు, సర్వజ్ఞుడు అగ్ని ఆశ్రయ దానమున జీవలోకులను అలంకృతులను చేసి జలస్థానమగు అంతరిక్షమున విరాజిల్లును.
ఇరువది ఆరవ సూక్తము
ఋషి1-6, 8-9 విశ్వామిత్రుడు, 7 బ్రహ్మ, దేవత-1-3 వైశ్వానరాగ్ని,4-6 మారుతో
అగ్ని, 7,8 బ్రహ్మ, 9విశ్వామిత్ర ఉపాధ్యాయుడు, ఛందస్సు - 1-6 జగతి, 7-9 త్రిష్టుప్.
1. మేము కుశికు గోత్రజన్ములము. ధనమును అభిలషించి హవ్యసేకరణ చేయుచు, లోలోన వైశ్వానరాగ్నిని తెలిసికొన్నాము. స్తుతుల ద్వారా అతనిని ఆహ్వానించుచున్నాము. అతడు సత్యానుగతుడు. స్వర్గజ్ఞాత. యజ్ఞఫల ప్రదాత. రథి. అతడు యజ్ఞమునకు విచ్చేయును.
2. ఆశ్రయ ప్రాప్తికొఱకును యజమాని యజ్ఞము కొఱకును పరిశుభ్రుడు, వైశ్వానరుడు, మాతరిశ్వ, రుచాయోగ్యుడు, యజ్ఞపతి, మేధావి, శ్రోత, అతిథి, శీఘగ్రామి అగ్నిని ఆహ్వానించుచున్నాము.
3. సకిలించు గుఱ్ఱపు పిల్ల తల్లివల్ల వర్థిల్లును. అట్లే వైశ్వానరాగ్ని ప్రతిదినము కుశికులవలన వర్థిల్లును. దేవతలలో జాగరూకుడగు అగ్ని మాకు ఉత్తమ అశ్వములు, ఉత్తమ వీర్యము, ఉత్తమ ధనము ప్రసాదించవలెను.
4. అగ్నిరూప అశ్వగణము కదలవలెను. బలవంతులగు మరుత్తులతో కూడి పృషతి, వాహనములను సంయుక్తము చేయవలెను. సర్వజ్ఞులు, అహింసనీయులగు మరుత్తులు అధిక జలశాలి, పర్వత సదృశ మేఘమును కంపింప చేయవలెను.
5. మరుద్గణములు అగ్నికి ఆశ్రితములు. లోక ఆకర్షకములు. ఆ మరుత్తుల దీప్తిమంతము, ఉగ్రమగు ఆశ్రయము కొకరు మేము యాచించుచున్నాము. వర్షరూపధారులు, సకిలింపు శబ్దము చేయువారు, సింహ గర్జనవలె ఉరుమువారాగు మరుద్గణము విశేషరూప జలమును ప్రసాదింతురు.
6. దళములు దళములుగను, గుంపులు గుంపులుగను స్తోత్రమంత్రములతో అగ్ని తేజమును, మరుత్తుల బలమును యాచింతుము. మచ్చల గుఱ్ఱములు, పృషతులు కలవారు, అక్షయ ధనవంతులు, ధీరులును అగు మరుద్గణములు హవ్యముల కొఱకు యజ్ఞములకు విచ్చేయుదురు.





