Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"ధౌమ్యుడు రుద్ర, యమ సంబంధమయిన మంత్రములు చదువుచు వెళ్లినాడు. రానున్న యుద్ధమందు చావనున్న కౌరవుల పరలోక క్రియలను సూచించుచు, రుద్రా, యమ సంబంధ మంత్రములు చదువుచు సాగినాడు". ధృతరాష్ట్రుడు విదురుని మాటలు విన్నాడు. కలిగిన ఉత్పాతములు తలచున్నాడు. దుఃఖము పొంగివచ్చినది. ఎక్కెక్కి ఏడ్చినాడు. సంజయుడు అది చూచినాడు "మహారాజా! ఎందుకీ ఏడ్పు? పాండవుల రాజ్యము గుంజుకున్నావు. వారిని అడవులకు తోసినావు. నీవు నీ కొడుకు దుర్యోధనుడు ఏపని అయినను చేయగలరు. ఇతరులకు అది సాధ్యపడదు" అన్నాడు.
విదురుడు ధృతరాష్ట్రుని దుఃఖము చూచినాడు. అతని మనసు మారినది అనుకున్నాడు. మంచి మాటలు చెప్పినాడు:-
"ధృతరాష్ట్ర మహారాజా! ఇంత జరిపించి ఏడ్చి ప్రయోజనమేమి? ఇప్పటికిమించి పోయినది లేరు భరత కులమును రక్షించ వచ్చును. పాండవులను పిలిపించుము వారి రాజ్యము వారికి అప్పగించుము. వంచన మంచిదికాదు. వంచన చేసి సంపదలు హరించుటను జనులు సమ్మతింపరు నిందింతురు".
విదురుని మాటలు విన్న గుడ్డిరాజు చెవిటి వానివలె ప్రవర్తించినాడు. తాను ఏమియు విననట్లు లేచి వెళ్లిపోయినాడు.
వెళ్లిపోవుచున్న ధృతరాష్ట్రుని చూచుచు ఉండిపొయినాడు విదురుడు.
ఆలోచనామృతము
1. ఈసారి దుర్యోధనుడు శకునితో మాత్రమే కాక సైంధవునితో మంతనములు సాగించినాడు అతనికి సలహాదారులు ఇద్దరు అయినారు.
పూర్వము తాను చత్తునని తండ్రిని లొంగదీసినాడు దుర్యోధనుడు. ఇప్పుడు పాండవులు తమను చంపుదురని భయపెట్టినాడు. అప్పుడు వారి సంపదను పొగిడి, ఇప్పుడు వారి పరాక్రమమును పొగిడి ధృతరాష్ట్రునకు ఈర్ష్య కలిగించినాడు. పాండవుల వలన ప్రమాదమున్నదని ధృతరాష్ట్రుని మనసునకు ఎక్కించినాడు.
ధృతరాష్ట్రుడు ఈ సారి సులభముగా ఒప్పుకున్నాడు. విదురుని సంప్రదించలేదు. విదురుని దూరము చేసికొన్నాడు.
ఈసారి ద్రౌపది ఊసెత్తలేదు. అవమానింప తలపెట్టలేదు. తాత్కాలికమయిన ఆవేశమును విడిచి శాశ్వతముగా పాండవులను వదిలించుకొను పథకము వేసినారు. ఒకే పందెమున వారిని అడవులకు పంపినారు. పాండవులు అడవుల నుంచి మరలిరారు అనుకున్నారు.
దుర్యోధనునకు రాజ్యము లేదు. రాజకీయ ప్రతిపత్తిలేదు. అతడు ధృతరాష్ట్రుని కొడుకు అంతే. కొడుకుల రాజకీయములు ఈ మధ్యన కూడ కల్లోలములు లేపినవి. లేపుచున్నవి.
కొడుకుల రాజకీయములు ప్రమాదకరములు అని హెచ్చరించుచున్నాడు వ్యాసుడు. అతని మాట వినువారు నాడు లేరు. నేడు లేరు. రేపు ఉందురేమో ఊహింపలేము.
2. పాండవులు రాజ్యము కోల్పోయి మరల పొందినారు. గతపు అనుభవము ధర్మరాజునకు గుణపాఠము కాలేదు.
పాండవులు పడిన బాధలు శ్రీకృష్ణునకు తెలియును. అతడే కదా ద్రౌపదిని రక్షించినది. ఇంత జరిగిన తరువాత శ్రీకృష్ణుడు పాండవుల వద్దకు రాలేదు. ధర్మరాజు శ్రీకృష్ణుని సంప్రదించలేదు. ఇందు ఏదో నిగూఢమయిన రహస్యము ఉండవలెను. వారికి ఏవో అభిప్రాయ భేదములు కలిగినవనియు. అవి రాజసూయ సమయపువి అనియు నాకు తోచుచున్నది.
ధర్మరాజును తీసుకొని వెళ్లుటకు విదురుడు రాలేదు. ప్రాతిగామి వచ్చినాడు. అందువల్ల విదురుడు జూదమునకు విముఖుడని ధర్మరాజు గ్రహించవలసి ఉన్నది. అతడు గ్రహించలేదు.
ఈ తడవ రంగమున దుర్యోధనుడు లేడు. శకుని మాత్రమే జూదమాడినాడు. అది మాయా జూదమని ధర్మరాజు ఎరుగును. శకుని విధించిన షరతులకు సభాసదులు కల్లోలితులు అయినారు. ధర్మరాజు జూదము ఆడినాడు. ఓడినాడు అడవులకు వెళ్లినాడు. ఇది విధి లిఖితమా?
3. రాజ్యము, ప్రజలు వేరువేరు వ్యవస్థలుగా ఉన్నట్లున్నవని ఇదివరకు గుర్తుచేసినాను. పాండవులు అడవులకు వెళ్లుటను గురించి విదురుడు చెప్పిన పద్ధతి దానిని బలపరచినది.
పాండవులకు హాని చేసినది దుర్యోధనాదులు. ప్రజలు కారు. దుర్యోధనాదులకే హాని కలుగవలె ఆ హాని ప్రజలకు కలుగరాదను విషయమున పాండవులు జాగ్రత్తపడినారు.
4. కుంతిని చూచిన కౌసల్య గుర్తుకు వచ్చుచున్నది. ఇద్దరును బాధలు సహించుటకే పుట్టినట్లున్నారు. ఇద్దరికిని భర్తల వలన సుఖము లభించలేదు. సంతానమును గురించిన ఆశలు ఫలించు సమయమున అడవులకు పోయినారు.
కుంతి కన్నీరు చూసిన గుండె కరగక మానదు.
5. నారదుడు రానున్న యుద్దమును గురించి హెచ్చరించుటలో దైవజ్ఞత్వము ఏమియు లేదు. ఇది రానున్న పరిణామములను గురించి మన పాత్రికేయులు వేయు అంచనా వంటిది.
నారదుడు వార్తలు చేరవేయువాడు మాత్రము కాదు. అతడు వ్యాఖ్యాత, కొన్ని పరిణామములకు కారకుడు కూడ.
మన పాత్రికేయులు కూడ ఇట్టివారే.
లక్ష్మణాచార్య బుచ్చమాంబా పౌత్రుండును, వేంకటాచార్య వేంకటాంబా పుత్రుండును ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవీశ్వరులు కృష్ణమాచార్యుల అనుజుండును రణభేరి, రణరంగాద్యనేక గ్రంథ సనకలనకర్తయు అయిన దాశరథి రంగాచార్య విరచితంబయిన శ్రీ మహాభారమున సభాపర్వము సమాప్తము.





