Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
వరుణ్ణి చూశాను. అతనితో ఆడుకున్నాను కూడా. నాన్న పెండ్లికి ఏర్పాటు చేశారు. డబ్బు తక్కువ పడింది. రజ్జబ్ నెలలో ముహూర్తం.
రాత్రి పూట అమ్మా నన్నా పెళ్ళిని గురించి మాట్లాడుకుంటుంటే చాటుగా వినేదాన్ని. లోపల్లోపలే సంబరు పడేదాన్ని. "కరీమన్" నా స్నేహితురాలు . దానికి కాబోయే మొగుడి కంటే నా వరుడే బాగున్నాడు. అతను నలుపు, ఇతడు ఎరుపు. అతనిది పెద్ద గడ్డం, ఇతనికీంకా నునుగూ మీసాలే. అతడు మురికి దోవతి కట్టుకొని మట్టి రంగు చొక్కా వేసేవాడు. ఇక నా బావ ఎంత ఠీవిగా ఈద్ నాడు వచ్చాడు! పచ్చని నీటి బట్ట పైజమా, చక్కని టోపీ , మఖ్మల్ బూట్లు ! కరీమన్ వరుడు తలకొక చిరిగిన గుడ్డ చుట్టుకొని చెప్పుల్లేని కాళ్ళతో తిరుగుతాడు. నా పరిస్థితికి పొంగిపోయాను. పొంగకేం? అంతకంటే మంచి దశను గురించి నేను ఉహించనూ లేదు. నా ఆశలు, ఆశయాలన్నీ త్వరలోనే సిద్దిస్తాయనిపించింది.
పుట్టింట్లో ఎలాంటి కష్టాలు పడ్డట్లు గుర్తు లేదు. ఒకసారి దాగుడు మూత లాడుతున్నాం. వెండి ఉంగరం జారిపోయింది. ఖరీదు అణాకు మించి ఉండదు. ఇప్పుడా మాట చెబుతున్నా కాని అప్పుడు నాకింత జ్ఞానం ఎక్కడిది? ఏ వస్తువు ఖరీదు మాత్రం నాకేం తెలుసు? ఉంగరం కోసం ఎంత ఏడ్చానో ఏడ్చాను. కళ్ళుబ్బిపోయాయి. పగలంతా అమ్మకు తెలియనీయలేదు. రాత్రి అయింది. వేలుకు ఉంగరం కనిపించలేదు. అమ్మ అడిగింది. చెప్పక తప్పలేదు. అమ్మ పొంగేటట్లు కొట్టింది. పెద్దగా ఏడ్చాను. ఎక్కిళ్ళు వచ్చాయనుకోండి. ఇంతలో నాన్న వచ్చేశారు. నన్ను గద్దించారు. అమ్మను కోపగించారు. అప్పుడు నాకు ఊరట కలిగింది.
అమ్మకంటె నేనేంటే ఎక్కువ ఇష్టం నాన్నకు. నాన్న ఎప్పుడూ నామీద చేయి చేసుకోలేదు. అమ్మ మాటిమాటికీ కొట్టేది. అమ్మకు తమ్ముడంటే ఎంతో ఇష్టం. తమ్ముని కోసం ఎన్నోసార్లు తన్నులు తిన్నాను. అయినా వాడంటే నాకు ఎంతో ఇష్టం. అమ్మ మీద పంతంతో ఒక్కోసారి పగలంతా వాణ్ని ఎత్తుకునేదాన్ని కాదు . అయినా అమ్మ కనుమరుగయితే చాలు అమాంతం గా ఎత్తుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ముద్దు పెట్టుకునే దాన్ని. అమ్మ అలికిడి వినిపించిందా వెంటనే దించేసేదాన్ని. వాడు ఏడ్చేవాడు. నేనే ఎడ్పించాననుకొనేది. దెబ్బలు తగిలేవి నాకు.
ఐనా కాస్త నే వేలు నోచ్చిందా అమ్మ ప్రాణాల్లో ప్రానాలుండేవి కావు. తిండీ నిద్రా ఉండేది కాదు. కనిపించిన వాణ్ణల్లా మందడిగేది. తాయెత్తులు తెచ్చేది.
నా పెళ్లి కోసం మెళ్ళో గొలుసు తీసి నాన్నకు ఇచ్చేసింది. దీన్లో వెండి కలిపి మళ్ళీ చేయించమని, కొత్తవాటికి మెరుగు పెట్టించమన్నది. ఇంట్లో ఉన్న పాత్రలన్నింటిలో మూడు నాలుగు అట్టే పెట్టి మిగతావన్నీ తీసింది. వాటన్నింటికి కళాయి పూయించమన్నది. "రేపనేది ఉందా లేదా?" అడిగాడు నాన్న. అమ్మ వింటేనా?" మీతోబుట్టువు జమీందారు భార్య ఆవిడకు తెలియాలిగా తోబుట్టువు తన కూతురుకు ఇన్ని ఇచ్చాడని. మీకు తోబుట్టువు అయితే మాత్రం అత్తారిల్లు అత్తరిల్లె. నా కూతురు వట్టి చేతుల్తో వెళ్తే జనమంతా సూటి పోటిమాటలనరూ?' అంది.
1
మిర్జా రుస్వాగారూ! నా పుట్టింటి విషయమూ, బాల్యం విషయమూ వివరించాను. ఆ పరిస్థితుల్లో సుఖంగా ఉండేదాన్నో ఈ పరిస్థితుల్లో సుఖంగా ఉంటున్నానో మీరే అర్ధం చేసుకోవాలి. నాకు మాత్రం ఆనాటి బ్రతుకే హాయిగా ఉంది.
దేశదిమ్మరి నైతినపుడు,
బెదురుపోతు నైతినిపుడు!
కారణ మెనేరుగుదు - కాని,
నోరు విప్పజాల పెద్ద లేదుట!
సానికులం సంగతి చెప్పనే అవసరం లేదు. వాళ్ళు పుట్టింది అలాంటి ఇండ్లలో , వాతావరణం అలాంటిది. పోషణ అలాంటిది. చెడు తప్ప మరో విషయానికి అక్కడ ఆస్కారం లేదు. కాని తల్లిదండ్రులు కన్నబిడ్డలో! లేచిపోయి చెడిపోతారు! వాళ్ళను ఏం చేసినా పాపం లేదు.
నా కధ ఇంతవరకు చెప్పి, అ తరువాత నేను ద్రిమ్మరినైనాను అని చెప్పేశా ననుకోండి లోకం ఏమనుకుంటుంది? "ఎంత రాక్షసి! పెళ్లి కావడం ఆలస్యం అయిందని ఏవడినో లేవదీసుకుపోయింది అతడూ వదిలేశాడు. ఇంకెవడినో ఉంచుకుంది. వాడితోనూ పడలేదు. క్రమక్రమంగా వృత్తిలోకి దిగింది" అని, ఎందు కనుకోరు? వాస్తవంగా జరిగేది అలాగే. అనేకమంది ఆడపిల్లలు చెడిపోవటం కళ్ళారా చూశాను. విన్నాను. అందుకు కారణాలు అనేకం ఒకటీ: వయసు వస్తుంది తల్లిదండ్రులు పెళ్ళి చేయరు . రెండు: నచ్చిన వరునితో పెండ్లి కాదు, ఎవడికో ముడెట్టేస్తారు. ఈడు జోడు చూడరు. అందచందం చూడరు. మనసుకూ, మనిషినీ గమనించరు.మొగుడితో పడదు. ఇల్లు విడిచి లేచిపోతారు. మూడు: యవ్వనంలో మిన్నుమిరిగి నెత్తిన పడుతుంది.బోగం ముండలైపోతారు. సహనం చచ్చిపోతుంది. ఎవనితోనో స్నేహం అయిపోతుంది. కాని నా విషయం అల్లాంటిది కాదు. నా దౌర్భాగ్యం నన్నిలా చేసింది. కాలం నన్ను కారడవిలో విడిచింది. దారి తప్పాను. తెగిన గాలి పటంలా తిరగడం తప్ప గత్యంతరం లేకపోయింది.
దిలావర్ ఖాన్ ఇల్లు మా ఇంటికి కొద్ది దూరంలో ఉంది. అతడు చాలా సంవత్సరాలు లక్నో జైల్లో ఉన్నాడు. ఎవరి సిఫార్సువల్లనో విడుదలై వచ్చాడు. అతడికి మా నాన్నంటే తీరని పగ. ఏమంటే అతడు ఫైజాబాద్ లో అరెస్టయినాడు. అతని ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పడానికి మా వీధి నుంచి మనుషులను పిలిపించారు. నాన్న కూడా వెళ్ళారు. మా నాన్న కల్లాకపటం లేని మనిషి, సత్యవాది. పైగా ఖురాన్ చేతికిచ్చి "జమేదార్! ఉన్నదున్నట్లు చెప్పు, ఈ మనిషి ఎలాంటివాడు?" అని అడిగితే ఉన్నదున్నట్లు చెప్పారు. అదీ అతని ద్వేషానికి కారణం. అదే అతని గుండెలో ముల్లులా బాదిస్తుంది. విడుదలై వచ్చాడు. పట్టుదలకు పావురాళ్ళను సాకాడు. ఒకరోజు మా పావురాన్ని పట్టేశాడు. నాన్న పావురాన్ని అడగడానికి వెళ్ళాడు. పావలా ఇస్తానన్నారు. అర్ధరూపాయి కావాలన్నాడు. నాన్న ఉద్యోగానికి వెళ్ళిపోయారు. కాలమే అలా చేసిందో, సర్వేశ్వరుని ఇచ్చ అలా ఉందో నేను ఇంటి నుంచి బయటికి వచ్చాను. చింతచెట్టు క్రింద కనిపించాడు దిలాపర్ ఖాన్. "బిడ్డా! పద, మీ నాన్న డబ్బిచ్చేశాడు , పావురం తీసికెళ్ళు" అన్నాడు వలలో చిక్కాను. వెళ్లాను . ఇంట్లో ప్రవేశించాను. పిట్ట పీచుమనడం లేదు. ఇల్లు పాడుపడినట్లుంది. ఇటు నేను ప్రవేశించగానే అటు తలుపు వేసి గొళ్ళెం బంధించాడు. అరుద్దామనుకుంటుండగానే నోట్లో గుడ్డలు కూరాడు. రెండు చేతులూ కండువాతో కట్టేశాడు. నన్ను అక్కడే కూర్చోబెట్టి దొడ్డి గుమ్మం నుంచి బయటికి వెళ్ళి ఫీర్ బక్ష్ ను పిలిచాడు. పీర్ బక్ష్ వచ్చాడు. ఇద్దరు కలిసి ఎడ్లబండి మీద పడేశారు. ప్రాణాలు బిగపట్టుకుని కూర్చున్నాను. ఏం చేయగలను? రాక్షసుని గుప్పిట్లో ఉన్నాను. బండిలో దిలా పర్ ఖాన్ నన్ను మోకాళ్ళ మధ్య అదిమి పెట్టి కూర్చున్నాడు. చేతిలో కత్తి కళ్ళు రక్తం కురుస్తున్నాయి. పీర్ బక్ష్ బండి తోలుతున్నాడు. బండి సాగిపోతోంది. కొద్దిసేపట్లో సాయంకాలం అయింది. చీకట్లు వ్యాపించాయి. చలికాలం గాలి రివ్వున వీస్తుంది. చలి ఎముకలు కొరుకుతుంది. ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. కన్నీటి జాలు నిలవడం లేదు. ఎలాంటి ఆపదలో చిక్కుకున్నాను! నాన్న కొలువు నుంచి ఇంటికి వచ్చి ఉంటాడు. నాకోసం వెతుకుతూ ఉండచ్చు. అమ్మ తల బాదుకుంటుందేమో! తమ్ముడు ఆటల్లో పడి ఉంటాడు. వాడికేం తెలుసు నా గతి ఇలా అయిందని ? అమ్మా .....నాన్నా ......ఇల్లు.......తమ్ముడు...... వస్తారా......వంటిల్లు అన్నీ నా కళ్ళల్లో అడేయి. ఈ ఆలోచనలన్నీ ఒకవైపు, ప్రాణభయం మరొకవైపు. దిలావర్ ఖాన్ తేపతేప కత్తి చూపిస్తున్నాడు. ఏ క్షణంలోనో ఆ కత్తి నా గుండెల్లో దిగిపోతుందన్నట్లుంది. నోట్లో గుడ్డలు లేవు. అయినా భయం. నోటి నుండి మాట పెగలడం లేదు. నా గతి ఇలా ఉంటె దిలావర్ ఖాన్ , పీర్ భక్ష్ నవ్వుతూ బాతాఖానీ సాగించారు. మాట కోక తిట్టు తిడ్తున్నారు. నన్నూ నా తలిదండ్రులనూ!
దిలావర్ ఖాన్: చూచావా పీర్ బక్ష్! సిపాహీ మనిషి పన్నెండేండ్ల తరవాత తన పంతం నెగ్గించుకుంటాడు. ఇప్పుడెలా ఉంది ...... విలవిలలాడుతుంటాడు.
పీర్ బక్ష్: సామెత సార్ధకం చేశావు భాయీ! పన్నెండెండ్లయింది కదూ జైలుకు వెళ్ళి?
దిలా : సరిగ్గా పన్నెండేడ్లు . లక్నో లో ఎన్నెన్ని కష్టాలు పడ్డాను! వాడికీ ఆరోజులు జ్ఞాపకం రావాలి. ఇది నా మొదటి దెబ్బ. దీని ప్రాణాలు తీసేస్తాను. చంపేస్తాను.
పీర్: అదా భాయీ నీ నిశ్చయం?
దిలా: ఏమనుకున్నావు మరి! దీన్ని చంపకుంటే పఠాన్ కు పుట్టినట్లే కాదు.
పీర్ : భాయీ! నువ్వు అన్నంత పనీ చేసేవాడివే! చేసి చూపిస్తావు కూడా.
దిలా: చూస్తావుగా.
పీర్: కాకుంటే మాత్రం ఏం చేసుకొంటావు దీన్ని?
దిలా: చేసేదేమిటి? ఇక్కడే ఎక్కడో చంపి ఏ కాలవలోనో, పూడ్చేస్తా . రాత్రికి రాత్రి ఇంటికి వెళ్ళిపోదాం.





