Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    36. విశేష ధనవంత ఇంద్రా ! నీమిత్రుల సమృద్ధిగురించి విన్నవిస్తాను. వారి పుత్రుల విషయము విన్నవిస్తాను. నీ మానసుమాత్రము నానుండి మరల కుండ వలెను.

    37. మానవులారా ! ఇంద్రుడు కాక ద్వేషములేని మిత్రుడు ఎవడు? అడగకముందే నేను ఎవరిని బాధించను, అని అడుగు వాడెవ్వడు? మమ్ముచూచి భయపడి పోరువాడెవ్వడు?

    38. అభీష్టప్రద ఇంద్రా ! సోమము అభిషుతము అయినపుడు 'ఎవార' నామకవ్యక్తి వద్దకు వెళ్లదు. వానికి బహుధనము లొసంగదు ధూర్త వలె నీ వద్దకే చేరును. తలలు వంచుకొని దేవతలు తప్పుకున్నారు.

    39. ఇంద్రా ! సుందర రథమున మంత్రములతో పూన్చబడు హర్యశ్వములను నేను ఆకర్షింతును. "యదీంబ్రహ్మభ్య ఇద్దదః" నీవు బ్రాహ్మణులకే ధనమిచ్చువాడవు.

    40. ఇంద్రా ! నీవు సకల శత్రువులను చీల్చుము. హింసించుము. యుద్ధము నిలుపుము. మాకొరకు అభిలషణీయధనము తెమ్ము.

    41. ఇంద్రా ! నీవు గట్టిచోట ధనము ఉంచినావు స్థిరప్రదేశమున ధనము ఉంచినావు సందిగ్థస్థానమున ధనము  తీసికొనిరమ్ము.

    42. ఇంద్రా ! నీవు జలనుకు ధనము ఇచ్చినావు. నీకు గుర్తున్నంతలో అట్టి అభిలషణీయ ధనమును తెమ్ము.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత ఎనిమిదవ మండలము ఆరవ అష్టకమున మూడవ అధ్యాము సమాప్తము.)

        ఓం నతామినన్తి మాయనో నధీరావ్రదేవానాం ప్రథమాధ్రవాణి
        నరోదసే అద్రుహా వేద్యాభిర్న పర్వతాన్ని నమే స్థివాంసః

               నాలుగవ అధ్యాయము         నలుబది ఆరవ సూక్తము
 ఋషి - అశ్వపుత్ర వశాఖ్యుడు దేవత - ఇంద్ర - వాయువులు  ఛందస్సు - వివిధములు
   
    ఓం త్వావతః పురూవసో వయమన్ద్ర ప్రణేతః స్మసిస్థాతర్హరీణామ్

    1. ఇంద్రా! నీవు బహు ధనవంతుడవు కర్మ ప్రాపకుడవు. నీ వంటి వానికే మేము  ఆత్మీయులము. మేము హర్యశ్వములకు అధిష్ఠాతలము కావలెను.

    2. వజ్రధారి ఇంద్రా ! నీవు అన్నదాతవు - ధనదాతవు ఇదిమాకు తెలియును.

    3. ఇంద్రా ! నీ రక్షణలు అవధులు లేనివి. నీవు బహుకర్మ వంతుడవు. నీ మహిమను స్తోతలు స్తుతులతో పాడుదురు.

    4. ద్రోహశూన్యులగు మరుత్తుల రక్షణ పొందిన వారును, ఆర్యమ, మిత్రుల రక్షణ పొందినవారును సుందర యజ్ఞవంతులు.

    5. ఆదిత్యుని అనుగ్రహము పొందిన యజమాని గోవులు, అశ్వములు గలవాడగును. వీర్యయుక్తుడగును. వర్థిల్లును. బహుసంఖ్యక, అభిలషనీయ ధనముతో పెంపొందును.

    6. ఇంద్రుడు ప్రఖ్యాతుడు బలప్రయోగముచేయువాడు. నిర్భయుడు ఎల్లరకు దొర అతనిని ధనమునకు యాచించుచున్నాము.

    7. సర్వత్రగామి, నిర్భయ, సహాయక మరుద్గణసేన  ఇంద్రునిది మాత్రమే అగును. గతిశీలములగు హర్యశ్వములు - బహుధనదాత ఇంద్రుని - హర్షమ కొరకు అభిషుత సోమము వద్దకు చేర్చవలెను.

    8. ఇంద్రుని ముదము - వరణేయము. దానితోనే ఇంద్రుడు ఎందరో శత్రువులను వధించును. శత్రువుల ధనము గుంజుకొనును - యుద్ధమున దాటిపోవును.

    9. ఇంద్రా ! నీవు సర్వరేణ్యుడవు. యుద్ధమున దుర్ధమున  దుర్ధర్షుడవు. శత్రువును పరాభావించువాడవు. సర్వత్ర విఖ్యాతుడవు. అందరిని మించిన బలవంతుడవు నివాస ప్రదాతవు ఇంద్రా! ఆమదముతోనే యజ్ఞమునకు విచ్చేయుము.

    10. మహాధని ఇంద్రా ! మాకు గోవులు, అశ్వములు, రథముల మీద ఆశ కలుగును అట్టితరి - పూర్వమువలెనే - వాటిని మా కొసంగుము.

    11. శూరింద్రా ! వాస్తవముగా నీధనపు అంతు ఎరుగము. ధనవంత వజ్రధర ఇంద్రా మాకు  తొందరగా ధనమును ఇమ్ము అన్నమున  మా కర్మలను కాపాడుము.

    12. ఇంద్రుడు దర్శనీయుడు ఋత్విక్కుల మిత్రుడు అనేకులు స్తుతించువాడు లోకములందలి సకల ప్రాణులను తెలిసినవాడు సమస్త జనులు హవ్యములు చేబూని బలవంతుడగు ఇంద్రుని పిలుస్తారు.

    13. అట్టి విశేషధనవంతుడు, మఘవ, వృత్రహంత యుద్ధక్షేత్రమున మమ్ము రక్షించవలెను, అగ్రగామి కావలెను.

    14. ఇంద్రుడు శత్రుహంత. విశిష్టప్రజ్ఞావంతుడు సర్వత్ర ప్రసిద్ధుడు శక్తిశాలి. స్తోతలారా! మీ హితమునకుగాను - ఇంద్రునకు సోమమువలన కలిగిన మత్తునాకు - మీ వాక్యము స్ఫూర్తి కావలెను. ఇంద్రుని - అతనికి అనుకూలము, మహత్తమ మగు స్తుతితో అర్పించండి.

    15. ఇంద్రా ! నా దేహపోషణకుగాను ఇప్పుడే ధనదాత వగుము. యుద్ధములందు అన్నవంత ధనదాత వగుము. అనేకులు ఆహ్వానించు ఇంద్రా ! మా పుత్రులకు ధనము ప్రసాదించుము.

    16. సకల ధనాధిపతి, యుద్ధములందు వడకించువాడు, శత్రుంజయుడగు ఇంద్రుని స్తుతించండి. అతడు వెంటనే ధనము దానము చేయువాడు.

    17. ఇంద్రా ! నీవు మహా మహుడవు. నేను నీ రాకను ఆపేక్షించుచున్నాను. నీవు గమనశీలుడవు సంపూర్ణగామివి. సేచకుడవు. యజ్ఞము, స్తుతులతో నిన్ను స్తుతింతుము. నీవు మరుత్తులనేతవు, సకల జనుల ఈశ్వరుడవు. నమస్కరించియు, స్తుతించియు నీ గుణ కీర్తనము చేయుదుము.

    18. మరుత్తులు - మేఘముల ప్రాచీనము, బలకరమగు - జలము వెంట సాగుదురు. అట్టి ధనికులగు మరుత్తుల కొరకు మేము యజ్ఞము చేస్తాము. ఆ యజ్ఞమున మహాధ్వని కలిగిన మరుద్గణము లందించు సుఖములను పొందగలము.

    19. ఇంద్రా! నీవు దుర్జుర్ధి వినాశకుడవు మేము నిన్ను యాచించుచున్నాము. మా కొరకు యోగ్యధనము తీసుకొని రమ్ము. నీ బుద్ధి నిరంతరము ధనప్రేరణ తత్పరము. దేవా! మా కొరకు ఉత్తమ ధనము  తెమ్ము.

    20. దాత. ఉగ్రుడు, విచిత్రుడు, సత్యభాషి, శత్రు పరాభవకర్త, అందరి ప్రభువగు ఇంద్రా! యుద్ధమునందు మాకు  ఓడించగల, భోగయోగ్యమను, ప్రవృద్ధమగు ధనమును ప్రసాదించుము.

    21. అశ్వపుత్రుడు 'వశుడు' కన్యాపుత్రుడు "వృథుశ్రవరాజు" ధనమును ప్రాతఃకాలమున తిసికొన్నాడు దేవశూన్యుల ధనమునంతను తీసికొన్నందున 'వశుడు' ఇచ్చటికి రావలెను.

    22. వశుడు అన్నమాట :-

    "నేను  ఆరువేల మరియి పదివేల గుఱ్ఱములను పొందినాను. ఇరువది వందల ఒంటెలను అందుకున్నాను. నలుపురంగువి పదివందల ఆడగుఱ్ఱములు నాకు లభించినవి. మూడు స్థానములందు శుభ్రవర్ణముగల పదివేల గోవులు లభించినవి"

    23. "పది నలుపురంగు గుఱ్ఱములు రథచక్రములను లాగును. అవి వేగవంతములు, బలవంతములు, మంథన కర్తలు."

    24. "ఉత్కృష్టధనవంతుడు, కన్యాపుత్రుడు పృథుశ్రవుడు చేసిన దానమిది అతడు బంగారు రథము ఇచ్చినాడు. అతడు దాత. ప్రాజ్ఞుడు అత్యంత ప్రవృద్ధకీర్తిని పొందినాడు."

    25. వాయువా ! మహాధనము, పూజనీయబలము ప్రసాదించుటకు మా వద్దకు రమ్ము నీవు విశేష ధనదాతవు మేము నిన్ను స్తుతింతుము. నీవు వచ్చినంతనే మేము నిన్ను స్తుతిస్తాము.

    26. వాయువు దీప్తుడు పవిత్ర సోమపాయ అతడు పృథుశ్వా, అవములతో వచ్చును. గృహమున నివసించును. త్రిగుణితసప్త సప్తతి గోవులతో వచ్చును. అభిషవకర్తలను కలుసుకొనును.

    (త్రిగుణిత సప్తసప్తతి అనగా త్రిఃసప్తేతి 70 x 3 = 210. సప్తతీనాం త్రిసప్త 70 x 21 =1470 అని శాయణుడు. 77 x 77 x 77 4,65, 533 కూడ కావచ్చును.)

     27.పృథుశ్రవుడు నాకు ఈ గోవులు, అశ్వములు ఇవ్వదలచి ప్రసన్నుడై కర్మాధ్యక్షలగు "అరటుడు" "అక్షుడు" "నహుషుడు" "సుకృత్వుడు" అను వారికి ఆజ్ఞాపించినాడు.

    28. వాయువా! "ఉచథ్య" "వపు" నామక రాజులు సహితము అధిక సామాజ్యవంతులు. వారు ఘృతము వంటి  ఆరువది  వేల ప్రియములను  గోవులు కూడ నాకు లభించినవి.

    30. ఆవులు తమ మందలోనికి పోయినట్లు - పృథుశ్రవుడునాకు దానము చేసిన ఎద్దులు నావద్దకు వచ్చును.

    31. ఒంటెలను మేపుటకు ఆడవికి పంపునప్పుడు వంద ఒంటెలను నా కొరకు తెచ్చినాడు. శ్వేతవర్ణ గోవులమధ్య ఇరువది వందల గోవులను తెచ్చినాడు.

     32. నేను  విప్రుడను నేను గోవుల, అశ్వములరక్షకుడను. 'ఒల్బూధ' నామక  దుస్యువలన  నాకు  వందగోవులు, అశ్వములు లభించినవి వాయువా ! వీరందరు నీ వారే. వీనిని ఇంద్రుడు, ఇతర దేవతలు రక్షింతురు. అవి అనిందితములగును.

    33. ఇప్పుడు పృథుశ్రవరాజు దానము చేసిన స్వర్ణా భరణ భూషితలు, పూజనీయలగు కన్యలు 'ఆశ్వ' పుత్రుడగు 'వశుని' ముందుకు తెచ్చుచున్నారు.
   
                                 నలుబది ఏడవ సూక్తము
    ఋషి - ఆస్త్య త్రితుడు, దేవత - ఆదిత్యుడు - ఉష, ఛందస్సు - పంక్తి.

    1. మిత్రావరుణులారా ! మీకు హవి సమర్పించు యజమానులకు మీరు కలిగించు రక్షణ అమోఘము. మీరు శత్రువునుండి రక్షించిన యజమానిని పాపములు అంటజాలవు. ఉపద్రవములు చేరవు మీ రక్షణ శోభాయమానము.

    2. ఆదిత్యులారా! మీరు దుఃఖనివారణము ఎరుగుదురు. పక్షులు తమ పిల్లను రెక్కల కింద దాచిన రీతి మాకు సుఖములు కల్పించండి. "అనేహసోవుతయఃసు ఉతయో ఊతయః" "మీ రక్షణలు ఉపద్రరహితములు. మీ రక్షణలు శోభాయమానములు"

    3. ఆదిత్యులారా! మీ వద్ద ఉన్న సుఖములు పక్షుల రెక్కల వంటివి. వానిని మాకు ప్రసాదించండి. గృహమునకు ఉపయుక్తములగు సమస్త ధనములను అర్థించుచున్నాము. "అనేహసోవ ఉతయః సుఊతయో ఊతయః"

    4. మంచి మనసులుగల ఆదిత్యగణములు - ఎవనికి గృహమునకు, జీవనమునాకు పనికి వచ్చు ధనము ఇచ్చెదరో - అట్టివానికి వారు సకల మానవధనములకు స్వాములు అగుదురు. "అనేహసోవ ఊతయః సుఊతయో ఊతయః"

    5. రథమును లాగు అశ్వములు దుర్గమ మార్గమును త్యజించును. అట్లే పాపములను పరిత్యజింతుము. మాకు ఇంద్రుని సుఖము, ఆదిత్యుల రక్షణ లభించవలెను. "అనేహసోవ ఊతయః సుఊతయో ఊతయః"

    6. కష్టపడినవానికే మీధనము లభించును. దేవతలారా ! మీ గమనము వేగవంతము. మీరు అనుగ్రహించిన యజమానికి అధిక ధనము లభించును. "అనేహసోవ ఊతయః సుఊతయో ఊతయః"

    7. ఆదిత్యులారా ! మీరు మరిన్ని సుఖములు కలుగ చేసినవారు - కుటిలుడయ్యు క్రోధమున నిర్విఘ్నడగును. అతనిని అపరిహర్య దుఃఖముసహితము చేరదు. "అనేహసోవ ఊతయః సుఊతయో ఊతయః"

    8. ఆదిత్యులారా ! యోధులు కవచమును ఆశ్రయించినట్లు మేము నిన్ను ఆశ్రయించుచున్నాము. మమ్ము మహా అనిష్టములనుండియు. అల్ప అనిష్టములనుండియు రక్షించండి. "అనేహసోవ ఊతయః సుఊతయో ఊతయః"

    9. అదితి మమ్ము రక్షించవలెను. అదితి మాకు సుఖములు ప్రదానము చేయవలెను. ఆమె  ధనవతి - మిత్ర, వరుణ, ఆర్యమలతల్లి. "అనేహసోవ ఊతయః సుఊతయో ఊతయః"


    10. ఆదిత్యులారా ! మీరు మాకు శరణ్యము, అనుభవయోగ్యము, రోగశరాన్యము, త్రిగుణయుక్తము, గృహయోగ్యమగు సుఖములను ప్రసాదించండి. "అనేహసోవ ఊతయః సుఊతయో ఊతయః"


    11. మనిషి పైన ఉండి పదార్థమును చూచును. అట్లె పైన ఉన్నమీరు క్రింద ఉన్న మమ్ము చూడండి.  గుఱ్ఱమును  మంచి రేవునకు తీసికొని  వెళ్లినట్లు మమ్ము సన్మార్గములనడిపించండి. "అనేహసోవ ఊతయః సుఊతయో ఊతయః"

    12. ఆదిత్యులారా ! బలవంతులై మమ్ము హింసించువానికి సుఖము కలుగరాదు. గోవులు, అశ్వములు అన్నభిలాషియైన బలవంతునకు సుఖములు కలుగవలెను. "అనేహసోవ ఊతయః సుఊతయో ఊతయః"

    13. ఆదిత్య దేవుళ్లారా! బయట పడిన పాపము, దాగిన పాపము ఆరోంటిలో ఏదియు "ఆప్త్యత్రితుడ, నమనాకు తగులురాదు పాపములను దూరముగా ఉంచండి. "అనేహసోవ ఊతయః సుఊతయో ఊతయః"




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.