Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    30.  అగ్నీ! నీ కొరకే మేము సుకృతులము అగుదుము సర్వదర్శనములము అగుదుము. అన్ని దుర్గమస్థానములను దాటుదుము.

    31. అగ్ని ప్రసన్నుడు బహుప్రియుడు యజ్ఞశాయి పవిత్ర దీప్తియుక్తుడు. మేము హర్షయుక్త స్తోత్రమున అగ్నిని యాచింతుము.

    32. అగ్నీ ! నీవు వెలుగులు పరచెదవు సూర్యునివలె - కిరణములతో బలమును  విస్తరింతువు అంధకారమును నాశము చేయుదువు.

    33. బలశాలి అగ్నీ! దానయోగ్యము, వరణేయమగు నీ ధనము క్షీణించునదికాదు. దానిని ప్రసాదించుమని నిన్ను మేము ప్రార్థించుచున్నాము.

                                    నలుబది నాలుగవ సూక్తము.
        ఋషి - అంగర విరూపుడు దేవత - అగ్ని ఛందస్సు - గాయత్రి

    1. ఋత్విక్కులారా ! అగ్ని అతిథిసముడు అతనిని హవ్యముతో సేవించండి హవ్యముతో మేల్కొల్పండి. అగ్నికి ఆహుతులు అర్పించండి.

    2. అగ్నీ! మా స్తోత్రములను స్వీకరించుము. ఈ మనోహర స్తోత్రమున వర్థిల్లుము. మా స్తోత్రములను అభిలషించుము.

    3. దేవదూత, హవ్యవాహకుడు అగ్ని. అగ్నిని నాముందు స్థాపిస్తాను. స్తుతిస్తాను. అగ్ని దేవతలను పిలువలెను.

    4. అగ్నీ! నీవు ప్రజ్వలితుడవైనపుడు - మహత్తరములు, ఉజ్వలములగు - నీ  జ్వాలలు పైపైకి పాకును.

    5. అభిలాషగల అగ్నీ! ఘృతమునందించు మాసృక్కు నీ వద్దకు చేరవలెను. నీవు మా హవ్యమును అందుకొనుము.

    6. నేను ప్రసన్నహౌతను ఋత్విక్కును. విలక్షణ దీప్తి, దీప్తిధనుడగు అగ్నిని స్తుతింతును అగ్ని నాస్తుతులు వినవలెను.
   
    7. అగ్ని ప్రాచీనుడు హౌత స్తుతియోగ్యుడు. ప్రీతీపాత్రుడు కవి, కార్యకర్త యజ్ఞమున ఆశ్రితుడు. నేను అగ్నిని స్తుతింతును.

    8. అంగిరశేష్ఠ అగ్నీ ! క్రమముగా ఈ హవ్యములను అందుకొనుము. అప్పుడప్పుడు యజ్ఞమును సుసంపన్నము చేయుము.

    9. పూజ్యుడవు, ఉజ్వలదీప్తవంతుడవగు అగ్నీ ! నీవు సమిధలతో ప్రజ్వలుడవైనంతనే దేవతలను గుర్తించి ఈ యజ్ఞమునకు తీసికొనిరమ్ము.

    10. అగ్ని మేధావి హౌత ద్రోహరహిరతుడు ధూమధ్వజుడు విభానసుడు. యజ్ఞపతాకస్వరూపుడు మేము అగ్నిని అభీష్టములు అడుగుదుము.

    11. బలములనుండి పుట్టిన అగ్నీ ! మమ్ము హింసకులనుండి కాపాడుము. శత్రువును చీల్చుము.

    12. అగ్ని కాంతికర్ముడు. అతడు ప్రాచీనములు, మనోహోర స్తోత్రములతో తన దేహమున వెలిగించుకొనును. విప్రులతో వర్ధిల్లును.

    13. అగ్ని అన్నపుత్రుడు పవిత్రదీప్తవంతుడు. అతనిని హింసలేని యజ్ఞమునకు  ఆహ్వానిస్తాను.

    14. అగ్ని మిత్రులకు పూజనీయుడు. అతడు దేవతల సహితుడై, ఉజ్వల తేజమున యజ్ఞమున ఆసీనుడు కావలెను.

    15. ధనప్రాప్తికొరకు తనగృహమున అగ్నిని అర్చించు వానికి - అగ్ని ధనము ప్రసాదించును.

    16. అగ్ని దేవతల మస్తకుడు ద్యులోకపునూపురము పృథ్వికి భర్త జలములకు వీర్య రూపుడు అగ్ని ప్రాణులను ప్రసన్నులను చేయును.

    17. అగ్నీ ! నీ ప్రభలు దీప్తములు నిర్మలములు శుభ్రవరదులు అవి నీ తేజస్సులకు ప్రేరణ కలిగించును.

    18. అగ్నీ! నీవు స్వర్గమునకు స్వామివి. వరణేయము, దాన యోగ్యమగు ధనమునకు ఈశ్వరుడవు శుభముల కొరకు నేను నీస్తోతను అయినాను.

    19. అగ్నీ ! విద్వాంసులు నిన్ను స్తుతిస్తారు. నిన్నేతను పనులతో ప్రసన్నుని చేయుదురు. మాస్తుతులు నిన్ను వర్థిల్లుచేయునుగాత.

    20. అగ్నీ ! నీవు హింసలేనివాడవు బలశాలివి దేవదూతవు స్తోతవు. మేము నిరంతరము నీ మైత్రికోరి ప్రార్థింతుము.

    21. అగ్ని  అత్యంత పరిశుద్ధ కర్మలవాడు పవిత్రుడు విప్రుడు కవి, అతడు ఆహ్వనితుడై శోభిల్లును.

    22. అగ్నీ! నా పనులు, స్తుతులు నిన్ను సదా వర్థిల్లు చేయవలెను. మన బంధుత్వమును నీవు సదాగ్రహించుము.

    23. అగ్నీ! నేను బహు ధనవంతుడనైనను నీవు నీవుగను నేను నేనుగనే ఉందుము. నీ ఆశీస్సులు సత్యములగును "సత్యాఇహాశిషః"

    24. అగ్నీ ! నీవు నివాసప్రదుడవు ధనపతివి దీప్త ధనశాలివి మేము నీ అనుగ్రహము అడుగుచున్నాము.

    25. అగ్నీ ! నీవు ఘృతకర్మవు నదులు సాగరమువైపు సాగినట్లు - శబ్దవంతములగు నా స్తుతులు నీవైపుసాగును.

    26. అగ్ని యువకుడు జగత్పతి కవి సర్వభక్షకుడు బహుకర్మ అతనిని స్తుతులతో నేను శోభిల్లచేయుదును.

    27. అగ్ని యజ్ఞనేత వంకరజ్వాలలవాడు బలవంతుడు మేము అగ్నిని స్తోత్రములతో స్తుతించ కోరుదుము.

    28. అగ్ని శోధకుడు భజనీయుడు మాస్తోతలు అగ్ని విషయమున ఆసక్తులు కావలెను అగ్ని వారిని సుఖవంతులను చేయవలెను.

    29. అగ్నీ! నీవు ధీరుడవు హవ్యములిచ్చు విప్రుడు జాగృతుడై కూర్చొని ఉండును. అట్లే నీవు నిరంతర జాగరూకుడవై అంతరిక్షమున వెలుగొందుదువు.

    30. వాసదాత. కవి అగ్నీ  ! పాపులు, హింసకులనుండి మమ్ము రక్షింపుము మా ఆయువు పెంచుము.
   
                                    నలుబది అయిదవ సూక్తము
        ఋషి - కాణ్వత్రి శోకుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - గాయత్రి.

    1. ఋషులు - అగ్నిని ప్రదీప్తము చేయువారు, ఇంద్రుడు మిత్రుడుగాగలవారు - వారు పరస్పరము కలసి కుశలు పరుస్తారు.

    2. ఈ ఋషుల సమిధ మహిమగలది వీరి స్తోత్రము విశేషము విశేషము వీరిస్వరూపము మహంతము. తరుణ ఇంద్రుడు వీరికి మిత్రుడు.

    3. అయోద్ధుడై - శత్రువులు చుట్టు ముట్టినవాడై - స్వబలమున బలశాలియై శత్రువును గెలువగల వాడెవ్వెడు?

    4. ఇంద్రుడు జన్మించినాడు బాణము పట్టినాడు. తన తల్లిని అడిగినాడు "ఈలోకమున ఉగ్రబలశాలురు ఎవరు?" అని.

    5. బలవతియగు తల్లి బదులు పలికినది "నీతో శత్రుత్వము కోరువాడును, పర్వతమందలి దర్శనీయగజమువలె పోరుసల్పువాడును." అని.

    6. ధనిక ఇంద్రా ! మా స్తుతులు వినుము - స్తోత అడిగిన దానిని ఇచ్చువాడవు. నీవు బలవంతుని చేయదలచినవాడె బలవంతుడగును.

    7. యుద్ధకర్త ఇంద్రుడు చక్కని అశ్వమును కోరి యుద్ధమునకు వెడలినపుడు రథికులలో ప్రధాన రథికుడగును.

    8. వజ్రధర ఇంద్రా! ఆకాంక్షలుగల సమస్తజనులు బుద్ధిగలవారగునట్లుగా ప్రవర్థిల్లుము మా కొరకు  మిక్కిలి అన్నము కలవాడవగుము.

    9. ఇంద్రుని హింసకులు సహితము బాధించలేరు. ఆ ఇంద్రుడు మాకు అభీష్టములు ప్రసాదించవలెను అతడు రథముపై మాముందుకు రావలెను.

    10. ఇంద్రా! మేము నీ శత్రువుల ముందు నిలువరాదు నీవు అనేక గోవులు కలవాడవు కావలెను. అప్పుడు మా కోరికలు తీర్చుమని  మీ ముందు నిలుస్తాము.

    11. వజ్రధర ఇంద్రా ! క్రమముగా మేము అశ్వవంతులము, బహుధనవంతులము, ఉప్రవరహితులము అగుదుము.

    12. ఇంద్రా ! యజమాని నీస్తోతలకు ప్రతి దినము వందల, వేల, ప్రియ వస్తువులు ఇచ్చును.

    13. ఇంద్రా !నీవు ధనంజయుడవు పరాక్రమశాలివి శత్రుమంథనుడవు ధనాపహారివి గృహమువలె ఉపద్రవ రక్షకుడవు అట్లని మాకు తెలియును.

    14. ఇంద్రా! నీవు కవివి దర్షకుడవు వణిక్కువు. మేము నిన్ను అభీష్టములు అడిగినపుడు నీవు సోమమత్తున ఉండవలెను.

    15. ఇంద్రా ! ఒకడు ధనికుడై దానము చేయడు ఒక ధనదాత నిన్ను చూచి ఈర్షపడును అటువంటివారి ధనమును మా కొరకు కొనితెమ్ము.

    16. ఇంద్రా! జనులు గిడ్డంగి అందుకొన్ని పశువులను చూచెదరు. అట్లె మా మిత్రులు సోమాభిషవము చేసి నిన్ను దర్శింతురు.

    17. ఇంద్రా ! మేము బధిరులము కారాదు. నీ చెవి వినగలది కావున రక్షణ కొరకు ఈ యజ్ఞమునకు - నిన్ను దూరము నుండి పిలుస్తాము.

    18. ఇంద్రా ! ఇంద్రా ! నీవు మాపిలుపులు వినుము. నీబలము శత్రు దుస్సహము కావలెను నీవు మాకు దగ్గర చుట్టమగుము.

    19. ఇంద్రా ! మేము దారిద్య్రపీడితులమైనపుడు నీ వద్దకు చేరుదుము. నిన్ను స్తుతింతుము. అప్పుడు మాకు గోదానము చేయుటకు మేల్కోల్పుము.

    20. బలపతీ ! మేము క్షీణించినాము. నీ చేతి కర్రవంటి వారమైనాము యజ్ఞమును నిన్ను తలుస్తాము.

    21. విశేష ధనవంతుడు, దానవంతుడగు ఇంద్రుని స్తుతించండి. యుద్ధమున ఇంద్రుని ఎంతటివాడును ఓడించజాలడు.

    22. బలశాలి ఇంద్రా! సొమము అభిషుతమైనది దానినే నీపోనమునకు అందింతును. నీవు తృప్తుడవగుము. మదకర సోమము సేవించుము.

    23. ఇంద్రా ! మూర్జులు, రక్షణాభిలాషులై, నిన్ను కొట్టరాదు. వారు నిన్ను హింసించరాదు నీవు బ్రాహ్మణద్వేషులను ఆశ్రయించరాదు.

    24. ఇంద్రా ! మహాధనప్రాప్తి కొరకు ఈ యజ్ఞమున మానవులు దుగ్ధాది మిశ్రిత సోమపానము చేసి ఆనందించవలెను. గౌరమృగము సరోవరమున నీరు త్రావినట్లు నీవు సోమపానము చేయుము.

    26. ఇంద్రా ! నీవు రుద్రర్ది అందించిన సోమమును సేవించినావు. "సహస్రబాహు" నామక శత్రువును సంహరించినావు అప్పుడు నీ పౌరుషము పరివ్యాప్తమైనది.

    27. ఇంద్రా! 'తుర్వాశ' 'యదు' నామక రాజుల కర్మములు సత్యములని భావించినావు. వారికొరకు 'అన్హవాయ్య' ని వధించినావు.

    28. స్తోతలారా ! మాపుత్రాదుల రక్షకుడు, శత్రుదమనుడు, గోవిశుష్టు, అన్నదాత, సాధరణుడగు ఇంద్రుని నేను స్తుతిస్తాను.

    29. ఇంద్రుడు జలవర్థకుడు  మహానుభావుడు సోమాభిషవము అయనంత ఉక్థలు ఇచ్చరించనపుడు -ధనము కొరకు - ఇంద్రుని స్తుతిస్తాను.

    30. ఇంద్రుడు జలనిర్గమన మునకుగాను - ద్వారరూపము, విశాలమగు మేఘమును త్రిశోక ఋషి కొరకు - బద్దలు కొట్టినాడు అతడే జలము సాగుమార్గము కల్పించినాడు.

    31. ఇంద్రా ! నీవు ప్రసన్నుడవైనపుడు మంచి వస్తువులు ధరింతువు - పూజింతువు - దానము చేతువు, అవన్నియు మా కొరకు ఏలచేయవు? మమ్ము సుఖవంతులను చేయుము.

    32. ఇంద్రా !నీవు చేసిన దానిలో ఏ కొంత చేసినను మానవులు భూమి మీద ప్రసిద్ధులగుదురు. నీ మనసునావైపు మరలవలెను.

    33. ఇంద్రా ! నీవు మమ్ము దేనితో సుఖవంతులను చేయుదువో ఆఖ్యాతి, ఆస్తుతినీకు చెందవలెను.

    34. ఇంద్రా ! మేము ఒక్క అపరాధము చేసినప్పుడు మమ్ము శిక్షించవద్దు రెండు, మూడు, అనేక అపరాధములు చేసినప్పుడు కూడ శిక్షించవద్దు.

    35. ఇంద్రా! నీ వంటి ఉగ్రుడు, శత్రుదమనుడు, పాపుల వినాశకుడు, శత్రుహింసణు భరించు మరొక దేవతతో నాకు ఎటువంటి భయములేదు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.