Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
2. ఇంద్రాగ్నులారా ! స్తోతలకు సహాయకము, యజ్ఞసాధకము, ఇంద్రియములకు హర్షవర్ధకము అగు సోమము సిద్ధముగా ఉన్నది. ఈ అభిహుత సోమమును సేవించుడు.
3. యజ్ఞసాధక సోమమున ప్రేరితులయి స్తోతలకు సుఖములు ప్రసాదించు ఇంద్రాగ్నులను నేను సేవింతును. ఈ యజ్ఞమున సోమపానము చేయుడు. తృప్తులు అగుడు.
4. శత్రునాశకులు, వృత్రహంత విజయులు అపరాజితులు మరింత అన్నము అందించువారు ఇంద్రాగ్నులను ఆహ్వానించుచున్నాను.
5. ఇంద్రాగ్నులారా ! మంత్రశాలురయి జనులు మిమ్ము పూజింతురు. స్తోత్రములు తెలిసినవారు మిమ్ము అర్చింతురు. అన్న ప్రాప్తికొఱకు నేను మిమ్ము ఆరాధింతును.
6. ఇంద్రాగ్నులారా ! మీరు ఒక్కుమ్మడిగా చేసిన దస్యుల (దాసుల) తొంబది నగరములు గడగడలాడినవి.
7. ఇంద్రాగ్నులారా ! స్తోతలు యజ్ఞమార్గము లక్ష్యముగా మా కర్మల నలుదిశలకు వచ్చినారు. విచ్చేయండి.
8. ఇంద్రాగ్నులారా ౧ మా బలము అన్నము ఒకే తీరువి. వానకురిపించు పని మీ ఇద్దరిమధ్య నిహితమై ఉన్నది.
9. ఇంద్రాగ్నులారా ! మీరు స్వర్గ ప్రకాశకులు. మీరు యుద్ధములందు సర్వత్ర విభూషితులు అగుదురు. మీ సామర్ధ్యము ఆ యుద్ధ విజయమును వెల్లడి చేయును.
(శ్రీమదాంధ్ర వచన ఋగ్వేదసంహితము మూడవ అష్టకమున మూడవ మండలమున
మొదటి అనువాకము సమాప్తము)
రెండవ అనువాకము పదమూడవ సూక్తము
ఋషి-విశ్వామిత్ర పుత్రుడు ఋషభుడు, దేవత-అగ్ని, ఛందస్సు-అనుష్టుప్.
1. అధ్వర్యులారా ! యధేచ్చగా అగ్నిని స్తుతించుడు. అతడు దేవతల సహితుడయి మా వద్దకు విచ్చేయవలెను. యాజక శ్రేష్ఠుడగు అగ్ని కుశలపై ఆసీనుడు కావలెను.
2. అగ్ని వశమున ద్యావాపృథ్వులు ఉన్నవి. అగ్ని బలమున దేవతలు సేవింతురు. అగ్ని సంకల్పము వ్యర్థము కాదు.
3. అగ్ని మేధావి. యజమానుల ప్రవర్తకుడు. యజ్ఞ ప్రవర్తకుడు. సర్వ ప్రవర్తకుడు. అగ్ని కర్మఫలము, ధనముల దాత. మీరు అట్టి అగ్నికి సేవలు చేయండి.
4. మా అనుభవమునకుగాను, అగ్ని అత్యంత సుఖప్రదమగు గృహమును ప్రసాదించవలెను. భూమి, ఆకాశము అంతరిక్షమునకు సంబంధించి అగ్నివద్ద సమృద్ధ ధనము మాకు చేరవలెను.
5. అగ్ని దీప్తిమంతుడు. నిత్యనూతనుడు. దేవతలను ఆహ్వానించువాడు. ప్రజా పాలకుడు. స్తోతలు అట్టి అగ్నిని ఉత్తమ స్తుతుల ద్వారా ఉద్దీప్తుని చేయుదురు.
6. అగ్నీ ! స్తుతించు సమయమున మమ్ము రక్షించుము. నీవు దేవతల ప్రధాన ఆహ్వాన కర్తవు. మంత్రోచ్చారణ సమయమున మమ్ము రక్షించుము. నీవు వేల దానముల దాతవు. మరుత్తులు నిన్ను వర్థిల్ల సేతురు. నీవు మా సుఖములను వృద్ధిపరచుము.
7. అగ్నీ ! నీవు మాకు పుత్రయుక్తము పుష్టి కారకము దీప్తిమంతము సమర్థవంతము అత్యధికము అక్షయమగు సహస్ర సంఖ్యాక ధనమును ప్రసాదించుము.
పదునాలుగవ సూక్తము
ఋషి-విశ్వామిత్ర పుత్రుడు ఋషభుడు దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.
1. అగ్ని దేవతలను ఆహ్వానించువాడు. స్తోతల ఆనంద వర్థకుడు. సత్యప్రతిజ్ఞుడు. యజ్ఞకారి. అత్యంత మేధావంతుడు. లోకవిధాత. అట్టి అగ్ని మా యజ్ఞమునకు విచ్చేయవలెను. అగ్ని రథము ద్యుతిమంతము. అతడు కేశశిఖుడు. అతడు బలపుత్రుడు. అతడు భూమిమీద కాంతులు ప్రసరించును.
2. యజ్ఞవంతుడవగు అగ్నీ ! నీకు నమస్కరించుచున్నాను. నీవు బలవంతుడవు. కర్మజ్ఞాతవు. నీకు నమస్కృతులు అర్పించబడును. వానిని స్వీకరించుము. నీవు విద్వాంసుడవు. విద్వాంసులను తీసికొని రమ్ము. మాకు ఆశ్రయము ఇచ్చుటకుగాను కుశలమీద ఆసీనుడవు అగుము.
3. అన్న సంపాదకమగు ఉష - రాత్రి అగ్ని లక్ష్యముగా సాగుము. అగ్నీ ! వాయు మార్గమున నీవు వాటి సమ్ముఖమునకు వెళ్లుము. ఆ సమయమున ఋత్విక్కులు హవ్యములు అర్పించి సనాతనుడవగు నిన్ను అర్చింతురు. యుగద్వయమువలె ఉషారాత్రులు పరస్పర సంసక్తములు. ఉషారాత్రులు మా ఇంటికి మరలమరల విచ్చేయవలెను.
4. అగ్ని బలమునకు పుత్రుడు. అగ్నీ ! నీవే సూర్యుడవు. నీవే స్వామివి. మానవులకు దారిచూపు కిరణములు ప్రసరింపచేయు కాంతిలో నీవు సూర్యసముడవు. అందువలన మిత్ర, వరుణ, సకల దేవతలు నిన్ను స్తుతింతురు.
5. అగ్నీ ! నేడు మేము చేతులెత్తి నీకు శోభన హవ్యము సమర్పించుచున్నాము. మా నమస్సులకు ప్రసన్నుడవు అగుము. యజ్ఞాభిలాషివి అగుము. యజ్ఞమున ప్రభవించిన స్తోత్రముల ద్వారా దేవతలను పూజింపుము.
6. బలపుత్రుడవగు అగ్నీ ! ప్రభూత రక్షణలు నీ నుండి యజమాని వద్దకు చేరును. అన్నములను చేరును. ప్రియ వచనముల ద్వారా అచలము సహస్రసంఖ్యాక ధనమును ప్రసాదించుము. "త్వందేహిసహస్రిణంరయిం."
7. సమర్ధుడవు, సర్వజ్ఞుడవు, దీప్తిమంతుడవు అగు అగ్నీ ! మేము మానవులము. మేము యజ్ఞములందు నీకు హవ్యములు అర్పింతుము. వాటిని నీవు ఆస్వాదించుము. యజమానులను రక్షించుటకు అప్రమత్తుడవు అగుము.
పదిహేనవ సూక్తము
ఋషి ఉత్కీలుడు, దేవత-అగ్ని, ఛందస్సు-త్రిష్టుప్.
1. అగ్నీ ! నీ తేజము విశాలము. ప్రకాశము అత్యంతము. నీవు శత్రువులను రోగరహిత రాక్షసులను నాశము చేయుము. అగ్ని ఉత్కృష్టుడు. మహాహనుడు. సుఖదాత. ఉత్తమ ఆహ్వానవంతుడు. నేను అట్టి అగ్ని రక్షణముననే ఉందును.
("అమీవాః - రోగ రాహిత్యేవ సామర్థ్యో పేతా రాక్షసాః" అన్నాడు శాయణుడు. రాక్షసులు రోగరహితులు అనుచున్నాడు)
2. అగ్నీ ! ఉష ప్రకటమయినపుడు సూర్యుడు ఉదయించినపుడు నీవు మమ్ము రక్షించుటకు జాగృతుడవు అగుము. అగ్నీ ! నీవు స్వయం భువుడవు. తండ్రి పుత్రుని గ్రహించిన రీతి నీవు స్తోత్రములను గ్రహించుము.
3. అభీష్టవరదా ! అగ్నీ ! నీవు మానవద్రష్టవు. నీవు చీకటి రాత్రులందు ఎక్కువ వెలుగుదువు. నీవు అనేక జ్వాలలను విస్తరింప చేతువు. తండ్రీ ! మాకు కర్మఫలము ప్రసాదించుము. మా పాపములు నివారించుము. మమ్ము ధనాభిలాషులను చేయుము.
4. అగ్నీ ! శత్రువులు నిన్ను పరాజితుని చేయజాలరు. నీవు అభీష్ట వరదుడవు. నీవు సమస్త శత్రుపురములను, ధనములను గెలిచి ప్రకాశించినావు. జాతవేదుడవగు అగ్నీ ! నీవు మహా ఆశ్రయదాతవు. ప్రథమ యజ్ఞ నిర్వాహకుడవు అగుము.
5. అగ్నీ ! నీవు జగములను జీర్ణింప చేయువాడవు. సుమేధవు. దీప్తిమంతుడవు. దేవతల కొరకగు సమస్త కర్మలను లోపరహితము చేయుము. నీవు ఇక్కడనే నిలిచి రథమువలె మా హవ్యములను దేవతలకు చేర్చుము. ద్యావాపృథ్వులను ఉత్తమ రూప యుక్తులను చేయుము.
6. అభీష్టవరదా ! అగ్నీ ! నీవు మమ్ము వర్థిల్ల చేయుము. నీవు సుందర దీప్తులతో సుశోభితుడవు అగుము. దేవతల సహితుడవయి ద్యావాపృథ్వులను దోహనయోగ్యములు చేయుము. మనుష్యుల దుర్బుద్ధి మా వద్దకు రాకుండవలెను.
7. అగ్నీ ! స్తోతలకు కర్మభూమియు, ధేను ప్రదాత్రియునగు భూమిని ప్రసాదించుము. మాకు వంశవర్ధనుడు, సంతతిజనియు అగు పుత్రుడు కలుగవలెను. నీవు మమ్ము అనుగ్రహించుము.
పదహారవ సూక్తము
ఋషి - ఉత్కీలుడు, దేవత - అగ్ని, ఛందస్సు - 1-2 జగతి, తక్కినవి బృహతి.
1. అగ్ని ఉత్తమ సమర్ధవంతుడు. మహా సౌభాగ్యముల స్వామి. గోయుక్తుడు. ఆపత్యవంతుడు. ధనాధిపతి. వృత్రహంతలకు ఈశ్వరుడు అగును.
2. మరుత్తులారా ! మీరు నేతలు. సౌభాగ్యవంతుడగు అగ్నితో కలవండి. అగ్నిలో సుఖవర్థక ధనములు ఉన్నవి. సేనలు గల మరుద్గణములు సంగ్రామమున శత్రువులను పరాజితులను చేయును. వారు సదా శత్రువులను హింసింతురు.
3. బహుధనశాలి, అభీష్టవరదుడవగు అగ్నీ ! ప్రభూతము, ప్రజాయుక్తము, ఆరోగ్యకరమగు బలమును సమర్థవంతమగు ధనమును ప్రసాదించి మా చురుకును పెంపొందించుము.
4. అగ్ని జగత్కర్త. సకల జగములందు ఉన్నాడు. అతడు భారము వహించి దేవతలకు హవ్యములు చేర్చును. అగ్ని స్తోతల వద్దకు విచ్చేయును. యజ్ఞనేతల మంత్రములవద్దకు విచ్చేయును. మానవుల యుద్ధములకు విచ్చేయును.
5. బలపుత్రుడవగు అగ్నీ ! నీవు మమ్ము శత్రుగ్రస్తులను, వీరశూన్యులను, పశుహీనులను, నిందనీయులను చేయకుము. మా పై ద్వేషము వహించకుము.
పదిహేడవ సూక్తము
ఋషి - వైశ్వామిత్ర కతుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.
1. అగ్ని ధర్మధారకుడు. జ్వాలాకేశుడు. సమస్త జనులకు స్వీకరణీయుడు. దీప్తిరూపుడు. పవిత్రుడు. సుక్రతువు. అగ్ని యజ్ఞ ఆరంభమున క్రమముగా ప్రజ్వరిల్లును. దేవతల యజ్ఞమున ఘృతాదులతో తడిసిపోవును.
2. అగ్నీ ! నీవు జాతవేదివి. సర్వజ్ఞుడవు. నీవు భూమికి హవ్యము ఇచ్చినావు. ద్యులోకమునకు హవ్యము ఇచ్చినావు. మా హవ్యములతో దేవతల యజ్ఞము చేయుము. మనువు యజ్ఞమునువలె మా యజ్ఞమును పూర్తి చేయుము.
3. జాతవేదివగు అగ్నీ ! నీ అన్నము ఓషధి, సోమరూపమగు త్రివిధమయినది. ప్రకాహ, ఆహీన, సమగతనామక త్రి ఉషస్సులు నీకు మాతలు. నీవు వారిని కూడి దేవతలకు హవ్యములు అర్పింపుము. అగ్నీ ! నీవు విద్వాంసుడవు. యజమాని సుఖ, శుభములు కారకుడవు.
4. అగ్నీ ! నీవు జాతవేదివి. దీప్తిశాలివి. సుదర్శనుడవు. స్తుతియోగ్యుడవు. మేము నీకు నమస్కరించుచున్నాము. దేవతలు నిన్ను ఆసక్తిలేని హవ్యవాహనుని చేసినారు. అమృతనాభిని చేసినారు. "అకృణ్వ న్నమృతస్య నాభిమ్."
5. అగ్నీ ! నీకన్న ముందటివారు, విశేష యజ్ఞకర్తలగు హోతలు మధ్యమ, ఉత్తమనామక స్థానములందు స్వధవెంట కూర్చుని సుఖించినారు. వారి ధర్మమే లక్ష్యముగా యజ్ఞము చేయుము. తదనంతరము దేవతలను ప్రసన్నులను చేయుటకుగాను మా, యీ యజ్ఞమును ధరించుము.
పదునెనిమిదవ సూక్తము
ఋషి - వైశ్వామిత్ర కతుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.
1. మిత్రుడు మిత్రుని; తలిదండ్రులు పుత్రుని హితాభిలాషులు అగుదురు. అట్లే అగ్నీ ! మావద్దకు విచ్చేయుటకు ప్రసన్నుడవయి మాకు హితాభిలాషివి అగుము. మనిషికి మనిషియే ద్రోహి. అందువలన విరుద్ధాచార శత్రువులను అగ్నీ ! నీవు భస్మము చేయుము.
2. అగ్నీ ! నీవు అంతర శత్రువును బాధించుము. హవ్యరహిత శత్రువుల కోరికలను విష్ఫలము చేయుము. నివాస దాతవు. సర్వజ్ఞుడగు అగ్నీ ! నీవు చపలచిత్తులగు మానవులను తపింప చేయుము. నీ కిరణములు జరారహితములు బాధా శూన్యములు కావలెను.
3. అగ్నీ ! నేను ధనములు కోరుచున్నాను. నీ వేగము బలమునకుగాను సమిధలు, ఆజ్య సహితమగు హవ్యము సమర్పించుచున్నవి. స్తోత్రముల ద్వారా నిన్ను స్తుతించుచు నేను ఉన్నంత కాలము నాకు ధనము ప్రసాదించుము. ఈ స్తుతిని అపరిమిత ధనదానమునకుగాను దీప్తమొనరించుము.
4. బలపుత్రుడవగు అగ్నీ ! నీవు నీ తేజస్సుతో తేజోవంతుడవు అగుము. స్తుతులను అందుకొని, నిన్ను కీర్తించు విశ్వామిత్ర వంశధరులను ధనవంతులను చేయుము. అన్నమును, ఆరోగ్యమును, అభయము ప్రదానము చేయుము. కర్మకారకుడవగు అగ్నీ ! మేము తేపతేప నీ శరీర పరిమార్జనము చేయుదుము.
5. అగ్నీ ! నీవు దాతవు. ధనములందు శ్రేష్ఠ ధనమును ప్రసాదించుము. నీవు సమిధల యుక్తుడవు అయినపుడు అట్టి ధనమునే ప్రసాదించుము. భాగ్యవంతుడగు స్తోత ఇంట ధనము కలిగించుటకు అందములయిన నీ బాహువులను చాచుము.
పందొమ్మిదవ సూక్తము
ఋషి-గాధి, దేవత-అగ్ని, ఛందస్సు-త్రిష్టుప్.
1. అగ్ని దేవతల స్తోత. మేధావి. సర్వజ్ఞుడు. అమూఢుడు. అట్టి అగ్నిని, మాయీ యజ్ఞమున హోత రూపమున స్వీకరించుచున్నాము. అగ్ని సర్వాపేక్షల యజ్ఞపరాయణుడు కావలెను. అగ్ని మా కొఱకు దేవతల యజ్ఞము చేయవలెను. ధనము, అన్నమునకుగాను వారు మా హవ్యములను గ్రహించవలెను.





