Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "ధర్మజా! నీ తల్లి కుంతి వనవాస క్లేశములను అనుభవింపలేదు. ఆమె నా గృహమందు ఉండును. ఆమెను నేను భక్తిగా పూజింతును. కుంతీదేవిని నావద్ద ఉంచి పొండు.
    "ధర్మజా! నీవు సకల ధర్మములు తెలిసినవాడవు. భీముడు మహా బలపరాక్రమములు కలవాడు. అర్జునుడు సకల యుద్ద విద్యలందు సమర్ధుడు. నకులుడు మహా బుద్దిమంతుడు. సహదేవుడు ఇంద్రియ నిగ్రహము కలవాడు. ద్రౌపది మహా బుద్ది శాలిని. మీ పురోహితుడు దౌమ్యుడు వేదాంత విద్యలందు సమర్ధుడు.
    "మీరు అన్యోన్యము స్నేహము కలిగి ఉండుడు. అన్యులు మిమ్ము ఆదరింతురేగాని విరోధబుద్ది కలిగింపజాలరు. మీకు దైవబలమున్నది. మానుషబలమున్నది.
    "మీ పరాక్రమము వలన మీరు రాజులు అగుదురు. ధర్మ చరిత్ర వలన ఋషులు అగుదురు. మహానుభావత్వము వలన కుబేరాది దేవశ్రేష్ఠుల వంటివారు అగుదురు. మీరు సకల కార్యములయందు అప్రమత్తులయి ప్రవర్తించవలెను. భూమి, వాయువు, సూర్య, చంద్రాదులు మిమ్ము సర్వదా రక్షింతురు గాక! మీరు వనవాసమునకు వెళ్ళుడు మరల మీ దర్శనమగు గాక."
    పాండవులు కుంతికి నమస్కరించినారు. ఆమె శోక దేవతవలె ఉన్నది. తనకు పాదాభివందనము చేసిన కొడుకులను, కొడలును చూచినది. ఆమె గుండె చెరువయినది. కన్నీరు జలజలరాల్చినది. వారిని కౌగలించుకొని గోడుగోడున ఏడ్చినది:-
    "మీ తండ్రి పుణ్యాత్ముడు, ఇవన్నియు చూడకనే పోయినాడు. మాద్రి అదృష్టవంతురాలు. ఆమె భర్తతో వెళ్ళిపొయినది. నేను పాపములు చేసుకొన్నాను. ఇంతటి దుఖమును భరించుటకు ఇంకా జీవించి ఉన్నాను.
    "మహాత్మా! శ్రీకృష్ణా! నాకొడుకులు నీ పాదములను ఆశ్రయించి ఉన్నారే! వారికి ఎందుకు ఇన్ని ఇక్కట్లు తెచ్చి పెట్టినావు! నా కొడుకులను రక్షింపుము. రక్షించకుండుట నీకు ధర్మమూ కాదు."
    కుంతి కడవానిని చూచినది. సహదేవుని కౌగలించుకున్నది. కన్నీటితో తలతడిసినది. "నాయనా! నీ వన్న నావద్ద ఉండరాదా!" అని ఏడ్చి ద్రౌపదిని దగ్గరకు తీసుకున్నది. కౌగలించుకున్నది. "అమ్మా ద్రౌపది! నీవు పుట్టి ద్రుపదుని వంశమును ప్రకాశవంతము చేసినావు. భరత కులమందు ప్రవేశించినావు. పాండవులకు మహాకీర్తి కలిగించినావు. భర్తల వెంట వెళ్ళి వారికి ఉపచారములు చేయుటకు పుణ్యము చేసుకున్నావు." అని గోడుగోడున ఏడ్చుచున్న కుంతిని విదురుడు తీసుకొని వెళ్ళి పోయినాడు.
    పాండవులు అడవులకు సాగినారు. వారి వెనుక ద్రౌపది సాగినది. ఆమె శిఖ ఊడి ఉన్నది. అది చూచినారు దుర్యోధనుని స్త్రీలు. వారికి దుఃఖము పొంగినది. వారు తలలు వంచుకున్నారు.
    భీముడు జనసందోహమును చూచినాడు. కోపము పట్టజాలక గర్జించినాడు:-
    "గదాయుధము ధరించి, శివకేశవులు అడ్డు వచ్చినను ఘోర యుద్దమున దుర్యోధనాదులను నూరుగురను హతమార్తును. దుర్యోధనుని పడకొట్టి నాకాలితో వాని తలను తన్నుదును. దుశ్శాసునుని డొక్కా చీల్చి వాని వేడిరక్తము తాగుదును" భీముడు భయంకరమయిన ప్రతిజ్ఞ చేసినాడు.
    అర్జునుడు గాండీవము చూపి "పదునాల్గు సంవత్సరముల తరువాత ఇదే గాండీవముతో కర్ణాది దుర్జనులందరును హతమార్తును" అని ఉరిమినాడు.
    "శకుని దుర్మార్గుడు. మాయాజూదమున మా రాజ్యము హరించినాడు. యుద్దమున వాని చేతులు నరికి వానిని చంపుదుము" అని నకుల సహదేవులు ప్రతిజ్ఞ చేసినారు.
    ఆ విధముగా ప్రతిజ్ఞలు చేసిన పాండవులు జనులందురు చూచుచుండగా , కన్నీరు రాల్చుచుండగా , వనవాసమునకు సాగినారు.
    అప్పటికి అక్కడికి వచ్చిన నారదుడు "మహాజనులారా! నేడు మొదలు పదునాలుగవ సంవత్సరమున విపత్కరమైన భారత యుద్దము జరుగుచున్నది. ఆ మహారణమున భీమార్జున పరాక్రమము వలన పాండవులకు విజయము కలుగనున్నది" అని ప్రకటించినాడు.
    జనులు ఆశ్చర్యపడి చూచినారు. విన్నారు.
    అప్పుడు ఉత్పాతములు కలిగినవి.
    ధృతరాష్ట్రుని ఇంట పట్టపగలే నక్కలు అరచుచు పరుగులు పెట్టినవి.
    అపసవ్యముగా ఉల్కలు రాలినవి.
    ఆకసమున మబ్బులు వేల మెరుపులు మెరిసినవి.
    అమావాస్య కాకున్నను రాహుగ్రహము సూర్యుని కప్పివేసినది. చిమ్మ చీకట్లు కమ్మినవి. భూకంపములు కలిగినవి.
    ధృతరాష్ట్రుడు ఉత్పాతములను గురించి విన్నాడు. ఆదరిపదినాడు. ఏదో ఆపదరానున్నదని శంకించినాడు. విదురుని పిలిపించినాడు. అడిగినాడు:-
    "దౌమ్య ద్రౌపదీ సహితులయిన పాండవులు అడవులకు వెళ్ళిన విధమును, కారణమును వివరింపుము" విదురుడు వివరించినాడు:-
    "మహారాజా! ధర్మరాజు ముఖమున గుడ్డ కప్పుకొని వెళ్ళినాడు. ఎందుకనగా ధర్మరాజు ధర్మమూర్తి . శాంత స్వరూపుడు. దుర్యోధనుడు అతనికి దుఃఖము, కోపము కలిగించినాడు. కోపమున అతని కనులందు జ్వాలలున్నవి. ఆ చూపులకు జనులు దహింప బడుదురని ముఖమున గుడ్డ కప్పుకొని పోయినాడు.
    "భీముడు తన రెండు చేతులను విసరుచు పోయినాడు. ముందు మహాయుద్దము జరుగనున్నది. అందు తన భుజ బలమును ప్రదర్శింతునని చేతులు విసరుచు పోయినాడు. "అర్జునుడు ఇసుక చల్లుచు వెళ్ళినాడు. రానున్న యుద్దమున చల్లిన ఇసుక కంటే దట్టముగా బాణములను కురిపింతునని చెప్పుటకు ఇసుక చల్లుచు వెళ్ళినాడు."
    "నకులుడు దమ్ము పూసుకొని వెళ్ళినాడు. సుందరమయిన తన దేహము చూచి జనులు దుఃఖింతురని నకులుడు దుమ్ము పూసుకొని వెళ్ళినాడు." 'సహదేవుడు తల వంచుకొని వెళ్ళినాడు" దుఃఖము కలిగిన తన ముఖము చూచిన జనులకు కీడు కలుగునని తల వంచుకొని వెళ్ళినాడు.
    "ద్రౌపది తడి వస్త్రమును కట్టుకొని తల విరియబోసుకొని, దుఃఖము కలిగి వెళ్ళినది. రానున్న యుద్ధమున దుర్యోధనాది కౌరువులందరు బంధు , పుత్ర, మిత్ర సహితముగా చచ్చినపుడు వారి భార్యల దుస్థితిని సూచించుచు ఆమె వెళ్ళినది."




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.