Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
ఆదాబ్
ఉర్దూ అంటే సేన, దండు, సేనాని. ఉర్దూ సైన్యం కోసం ఏర్పడిన భాష, భారతదేశాన్ని ముస్లిములు - విచ్చిన్నంగా- సుమారు వేయి సంవత్సరాలు పాలించారు. వారి సైన్యంలో అన్ని భాషల వారూ ఉండేవారు. సమన్వయ భాషగా ఉర్దూ అవతరించింది.
ఉర్దూకు స్వంత లిపి లేదు. పారసీ లిపిని ఊర్దుకు వాడుకుంటున్నారు. ఉర్దూ కవితా సంప్రదాయాలు సహితం పారసీక దేశపువే. అయినా ఉర్దూ భారతీయ భాష, ఒక మతపు బాష కాదు. ఏ మతానికీ స్వంత భాష లేదు - ఉండదు.
ఉర్దూ కవిత సుందరమూ, సుకుమారమూ అయింది. అది మనసులను గంతులు వేయిస్తుంది.
దిల్ కి బస్తీ భీ అజీబ్ బస్తీ హై
జో లూట్నే వాలేపర్ తనరస్తే హై"
ఈ నునో నగరం విచిత్రమైంది.
దోచుకునే వానికై పరితపిస్తుంది.
ఉర్దూ వచనమూ పసందైందే, ఇప్పుడు హిందీ పేర వస్తున్నా సినిమాల మాటలు పాటలు ఉర్దూవియే.
ప్రస్తుతపు నవల ఉమ్రాన్ జాన్ అనే వేశ్య జీవిత కధ. ఆమె మనసెరిగిన మగువ. మంచి కవయిత్రి. ఆమె కలం పేరు అదా! అదా అంటే హొయలు -- నాట్య భంగిమ.
ఉమ్రాన్ జాన్ అదా తన కధ'ను మిర్జా రుస్వాకు వినిపిస్తుంది . మిర్జాకు రుస్వా తఖల్మూస్ అంటే కలం పేరు. రుస్వా అపనిందే - భంగపాటు
సొగసు చూడండి .
హొయలు తన కధ భంగపాటుకు వినిపిస్తున్నది!
లుత్స్ కిస్ కహనిమే క్యాహై
అప్ బీతీ సునావూఁ కేజాన్ బీతి
దీని అనువాదానికి భాయి ఖాన్ చిరంజీవి, నేనూ పెగ్గులు ఖాళీ చేశాం. లుత్స్ కు సరియైన తెలుగు పదం దొరకదు. అనువాదం ఆస్వాదించండి.
ఏమున్నది స్వారస్వం
ఏకధ లో మాత్రం?
నా కధనే చెప్పనా
లోకం కధ విప్పనా?
ఆమె చాతుర్యం పరిశీలించండి. తన కధ లోకం కధ అంటుంది. దీనితో నవల మొదలవుతుంది.
ఓ జీవితమా! మరణమాసన్నమైనదే!
నీవన్న మాకిపుడు విసుగుపుట్టెనే!
అనే కవితతో ముగుస్తుంది.
ఇది 1857 నాటి ప్రధమ స్వాతంత్య సంగ్రామానికి పూర్వపు లక్నో నవాబులవిలస జీవిత వృత్తాంతం . నవల చివరన స్వాతంత్య సంగ్రామపు చరిత్ర ఉంది.
ప్రస్తావన
ఏమున్నది స్వారస్యం
ఏ కధలో మాత్రం?
నా కధనే చెప్పనా,
లోకం వ్యధ విప్పనా?
మిర్జా రుస్వా సాహెబ్! ఇంత ఇదిగా అడుగుతున్నారే. నా దౌర్భాగ్యకధలో మీరు వినదగిందేముందని? నా జీవితానికి ఒక ధ్వేయం లేదు. ఒక లక్ష్యం లేదు. వంశం లేదు. అంశం లేదు. తెగిన గాలిపటాన్ని. అల్లాంటి నా కధలో ఇంపా? సోంపా?
అయినా అడిగారు కనక వినండి , ఓపిగ్గా వింటారుగా?
తండ్రి తాతల పేర్లు గొప్పతనం అపాదించుకోవడం వల్ల ఏం ప్రయోజనం? నిజానికి నా కవి గుర్తే లేవు. నాకు గుర్తున్నదల్లా పై బజారు చివర మా యిల్లు ఉండడం. ఇంటి కట్టడం గట్టిదే. ఇరుగుపోరుగున కొన్ని పెంకుటిండ్లు , పూరిండ్లూ ఉండేవి. వాటిల్లో ఉండేవాళ్ళూ అలాంటి వాళ్ళే. నీళ్ళు మోసేవాళ్ళూ, మంగళ్ళూ, చాకళ్ళూ , కుమ్మర్లూనూ మా యిల్లే వీధిలో ఎత్తయింది. అయినా ఎత్తయిన ఇల్లు మరొకటుండేది. అది దిలాఫర్ ఖాన్ ది.
మా నాన్న ఉద్యోగం బహూ బేగం సమాధి వద్ద. ఆ ఉద్యోగం పేరేమిటో , జీతం బత్తెం ఎంతో తెలీదు కాని అంతా నాన్నను జమేదార్ అనడం మాత్రం గుర్తుంది.
పగలంతా తమ్ముణ్ణి ఆడించడం నా పని. వాడికి నేనేంటే ప్రాణం. క్షణం ఉండేవాడు కాడు నన్ను విడిచి.
సాయంకాలానికి కొలువు నించి వచ్చేవాడు మా నాన్న. అప్పుడు చూడాలి మా సరదా. అమాంతంగా నడుం పట్టుకు వ్రేలాడేదాన్ని. తమ్ముడంటారా? పరిగెత్తేవాడు నాన్నా, నాన్నా అంటూ అంగీ పట్టుకునేవాడు. నాన్న ముఖం చాటంత అయ్యేది. నా వెన్ను తట్టి నిమిరేవాడు. తమ్ముణ్ణి ఎత్తుకునేవాడు. ముద్దులు కురిపించేవాడు. వట్టి చేతుల్తో వచ్చేవాడే కాడు. ఒకప్పుడు బత్తీసాలు, మరొకప్పుడు నువ్వులుండలు -- ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి తెస్తూనే ఉండేవాడు. వాటి పంపకంలో మా గొడవ చూడాలి . అక్కడే పోట్లాడుకునే వాళ్ళం. ఎంత బావుండేదో. బత్తీసాలు లాక్కుపోయేవాడు తమ్ముడు. నువ్వులుండలు లాక్కుపోయేదాన్ని నేను. అమ్మకు వంటింటి పని. అలా వచ్చి కూర్చుంటాడో లేదో తగదా మొదలు. "నాన్నా! బొమ్మలు తేలేదా?" అని ఒకరు , "నా గొలుసు కంసాలి ఇంకా తేనేలేదు . పిన్ని కూతురుకు పాలు మాన్పిస్తున్నారు. నేనేం వేసుకొని వెళ్ళాలి అక్కడికి? కట్టేది లేదు. విన్నావా?" అంటాన్నేను. అమ్మ వంట ముగించిందంటే నాకు విముక్తి. రొట్టెల పళ్ళెం , కూరగిన్నె తేవడం , దస్తర్ ఖాన్ పర్చడం నా పని. వడ్డించడం అమ్మ వంతు. కలసి భోం చేసేవాళ్ళం అంతా. నాన్న వేకువనే మేల్కొని నమాజు చేసేవాడు. నేను చప్పున లేచేదాన్ని. మళ్ళీ మొదలు.
"నాన్నా! ఇవ్వాళ మాత్రం బొమ్మలు తేవడం మరిచిపోకేం! జామకాయలూ, నారింజ కాయలూ అన్ని తేవాలి."
నమాజుముగించి అల్లాను స్మరిస్తూ డాబా మీదికి ఎక్కేవాడు. పావురాళ్ళను వదిలి గింజలు వేసేవాడు. ఒకటిరెంటిని ఎగరవేసేవాడు కూడా. అమ్మ పాచిపని, వంటపని ముగించేది. పొద్దు ఎక్కక ముందే ఉద్యోగానికి వెళ్ళిపోయేవాడు నాన్న. అమ్మ కుట్టు పనిలోనో, మరొక పనిలోనో పడిపోయేది. నేను తమ్ముణ్ణి ఎత్తుకొని వీధిలోకి వెళ్ళి పోయేదాన్ని. ఒక పెద్ద చింత చెట్టుండేది. అక్కడికి చేరేవాళ్ళు ఆడపిల్లలూ, మగపిల్లలూ , తమ్ముణ్ణి దింపి వాళ్ళతో ఆటల్లో పడిపోయేదాన్ని.కమ్మని రోజులు చీకూ చింత లేదు. చక్కని భోజనం, మంచి బట్టలూ ఉండేవి. తోటి పిల్లలందర్లో నేనే మెరుగు. మనసుకు దిగులులేదు. చూపు విరుపు లేరుగదు. మా ఇంటి ముందు ఎదురుబొదురుగా రెండు వసారాలు, పెద్ద వసారా ముందు రెండు పెంకుటి గదులు , వసారాకు ఎదురుగా వంటిల్లు , డాబా మీద రెండు పెంకుటి గదులు ఇల్లు విశాలమైంది. పాత సామాగ్రి అవసరాని కంటే ఎక్కువే ఉండేది. మూడు నాలుగు పరుపులూ, దుప్పట్లూ ఉండేవి. వీధిలో వాళ్ళంతా ఇలాంటి వస్తువుల కోసం మా ఇంటికే వచ్చేవారు. వీధిలో ఆడవాళ్ళంతా నూతి నుంచి నీళ్ళు తోడి తెచ్చుకునేవారు. కాని మాకు పనిమనిషి తెచ్చేవాడు. మా నాన్న డ్రెస్సు వేసుకొని బయల్దేరాడంటే జనం వంగి వంగి సలాము చేసేవాళ్ళు. వీధి వాళ్ళంతా కాలినడకన పేరంటానికి వెళ్తే మా అమ్మ మేనాలో వెళ్ళేది.
నిజానికి నేను అందకత్తెలలో జమ కాదు. కాని తోటి వాళ్ళలో, అందకత్తెనే అనాలి. జామపండు చాయ, వికారం కాని ముక్కూ ముఖమూ, కాస్త ఎత్తు నొసలు, వెడల్పయిన కళ్ళు, పాల బుగ్గలు, వయసుకు తగిన పొడవూ, లావూ బాగానే ఉండేదాన్ని. ఇప్పటి లావు మాత్రం కాదు. ఇప్పుడు గాని అప్పుడు గాని వన్నెల చిన్నారుల్లో లేక్కేం కాదు. ఆ వయసులో మందారపు రంగు పైజమా చిన్నచిన్న పూలచొక్కా , జరీ ఓణీ , చేతికి మూడేసి వెండి గాజులు మెడలో గొలుసు, బంగారపు ముక్కు పుడక- మిగతా అమ్మాయిలకు వెండి పుడక లుండేవి అప్పుడే కుట్టించిన చెవులు - వాటికి నీలిరంగు దారం కట్టేవారు -- పోగులు చేయడానికి బంగారం ఇచ్చారు కంసాలికి.
నా పెళ్లి నిశ్చయం అయింది. వరుడు మేనత్త కొడుకే. వర నిశ్చయం తొమ్మిది సంవత్సరాల వయసులోనే జరిగిపోయింది. మా అత్తను నవాజ్ గంజ్ కు ఇచ్చారు. మా మామ భూస్వామి. మాకంటే బాగా ఉన్నవారు మా అత్తవారు. వర నిశ్చయానికి ముందు చాలాసార్లు అమ్మతో అక్కడికి వెళ్ళాను. అక్కడి వ్యవహారాలు అదొక రకం. ఇల్లు మట్టి గోడలదే గాని విశాలమైంది. ఆవులు, గేదెలు, ఎడ్లు ఉండేవి. పాడి సమృద్ధం. ధాన్యం పుష్కలం. మొక్క జొన్నకాలం వస్తే కండెలు బుట్టల్తో వచ్చేవి. చెరకు గుట్టలు గుట్టలుగా పడి ఉండేది. ఎంతకని తింటారు?





