Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
నలుబదవ సూక్తము
ఋషి - నాభాకుడు, దేవత - ఇంద్రాగ్నులు , ఛందస్సు -
మహాపంక్తి - 2 శక్వరి - 12 త్రిష్టుప్.
1. ఇంద్రాగ్నులారా ! శత్రువులను పరాజితులను చేయండి వారి ధనము మాకు అందించండి వాయుసహాయమున అగ్ని అరణ్యములను ధ్వంసము చేయుము అట్లే మీరు అందించిన ధన సహాయమున శత్రుబలమును ధ్వంసము చేయుదుము. "సకల శత్రువులను వధించండి - నభంతామన్యకేసమే"
2. ఇంద్రాగ్నులారా ! మేము మిమ్ముధనము యాచించము అందరిని మించిన బలవంతుడు, నేతలకునేత ఇంద్రుని యజ్ఞము చేయుదుము. ఇంద్రుడు ఇప్పుడు ఆశ్వారూఢడై యజ్ఞప్రాప్తికి వచ్చును ఒకప్పుడు అన్న ప్రాప్తికి వచ్చును "నభంతామన్యకేసమే"
3. ఇంద్రాగ్నులు ప్రసిద్ధులు. వారు యుద్ధమధ్యమున నివసింతురు. పండితులు కోరినపుడు మీమైత్రికోరు యజమానుల సకర్మములను వ్యాపింపచేయుదురు "నభంతామన్యకేసమే"
4. నాభాకులారా ! ఇంద్రాగ్నులను యజించండి - స్తుతించండి - పూజించండి. వారు సమస్తలోకములందు ఉన్నారు వారి వడిలోనే మహతి, మహి, ద్యులోకము ధనమును పొందును. "నభంతామన్యకేసమే"
5. నాభకునితో సములగు ఋషులు ఇంద్రాగ్నులకు స్తుతులతో ప్రేరణ కలిగింతురు. ఇంద్రాగ్నులు సవిబందువులు. వారు మూసినా తలుపుల సంద్రమును వెలుగులతో కప్పుదురు. ఇంద్రుడు బలమువలన ఈశ్వరుడు. "నభంతామన్యకేసమే"
6. ఇంద్రా ! ప్రాచీన మానవుడు తీగలను తెగనరికినట్లు - నీవు శత్రువులను తెగనరకుము. 'దాస' నామక శత్రుబలమును నాశము చేయము. ఇంద్రుని అనుగ్రహమున దాసుని ధనమును మేము పంచుకొందుము. "నభంతామన్యకేసమే"
7. మానవులు ధనము కొరకు, స్తుతులతో ఇంద్రాగ్నులను ఆహ్వానింతురు. వారిలో బలమును వారి సాయమున శత్రువులను ఓడింతుము. స్తుతిమంతులగు శత్రువులను చేర్చుకొందుము. "నభంతామన్యకేసమే"
8. శ్వేతవర్ష ఇంద్రాగ్నులు దిగువనుండి దీప్తితో ద్యులోకముపైకి చేరుదురు. వారి కోరికే యజమాని హవిని వహించును - కర్మానుష్ఠానము చేయును. ఆ ఇంద్రాగ్నులే సింధుమున్నగు నదులను విముక్తముచేసినాడు. "నభంతామన్యకేసమే"
9. ఇంద్రా ! నీవు హర్యశ్వవంతుడవు - వజ్రదరుడవు. ప్రేఅరకుడవు. ప్రీతీకరుడవు. వీరుడవు. ధనికుడవు నిన్ను ఉపమించు వస్తువులు అనేకములు నీకు సంబంధించిన ప్రాచీన ప్రశస్తులు అనేకములు. ఆప్రశస్తులు మాబుద్ధికి సిద్ధి కలిగించ వలెను. "నభంతామన్యకేసమే"
10. స్తోతలారా! దీప్తుడు - ధనప్రాతుడు - ఋగ్మంత్ర యోగ్యుడగు ఇంద్రుని ఉత్తమ స్తుతులతో అర్చించండి. ఇంద్రుడు 'శుష్మ' నామక అసురుని సంతానమును సంహరించినాడు. ఆ ఇంద్రుడే స్వర్ణజలములను గెలిచినాడు. "నభంతామన్యకేసమే"
11. స్తోతలారా ! సుందర యజ్ఞవంతుడు, అవినాశ్యుడు, ధనవంతుడు, మహాయోగ్యుడగు ఇంద్రుని స్తుతులతో అర్చించండి. యజ్ఞాభిముఖముగా సాగు ఇంద్రుడే శుష్మని సంతానమును సంహరించినాడు - స్వర్గజలములను గెలిచినాడు. "నభంతామన్యకేసమే"
12. పిత మాంధాత మరియు అంగిరులతో సమానముగా నేను ఇంద్రాగ్నులకు నవీన స్తుతులు రచించినాను. వారు మూడు అంతరముల గృహమునుండి మమ్ము పాలించవలెను. మేము ధనాదిపతులము అగుదుము.
నలుబది ఒకటవ సూక్తము
ఋషి - నాభాకుడు, దేవత - వరుణుడు, ఛందస్సు - మహాపంక్తి.
1. స్తోతా! విశేషధనప్రాప్తికిగాను -వరుణుని, అతిశయ విద్వాంసులగు మరుత్తులను యజించండి. వరుణుడు తన కర్మతో - మానవుల పశువులను గోవులవలె రక్షించును. "నభంతామన్యకేసమే"
2.యోగ్యస్తుతులతో వరుణుని స్తుతింతును. పితరులను స్తుతింతును. వారిని నాభాకృషి స్తుతులతో స్తుతింతును. వరుణుడు నదులవద్ద నిలుచును. ఆ నదులకు ఏడుగురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. వారు మధ్యములు. "నభంతామన్యకేసమే"
3. రాత్రులు వరుణుడు కౌగిట గడుపును. వరుణుడు దర్శనీయుడు. ఆతడు ఉపరిదిశకు సాగును తన మాయతో సకల భవనములను దాల్చును. అతని కర్మాభిలాషులగు మానవులు ఉదయ, మధ్యాహ్న, సాయంసంధ్యలను వర్థిల్ల చేయుదురు. "నభంతామన్యకేసమే"
4. వరుణుడు భూమి మీది దిశలను ధరించును. అతడు దర్శనీయుడు నిర్మల స్వర్గమునకు, భూమికి ప్రభువు అతడే ఈశ్వరుడై మాగోవులను కాపాడును. "నభంతామన్యకేసమే"
5. వరుణుడు సకల భువనముల ధర్త కాంతులందు అంతర్షితుడు. గుహ్యనామములు తెలిసినవాడు. అతడు ప్రాజ్ఞుడు అనేక కావ్యములవాడు వాటిని ద్యులోకసమముగా పోషించువాడు. "నభంతామన్యకేసమే"
6. సకలకవికర్మలు - చక్రమునందలి ఇరుసువలె - వరుణుని ఆశ్రయించి ఉన్నవి. వరుణుడు స్థానత్రయ. అతనిని అర్చించండి కొట్టములోనికి ఆవుపోయినట్లు - శత్రువుమనను ఓడించుటకుగాను - యుద్ధముకొరకు - గుఱ్ఱములను సిద్ధముచేయును. "నభంతామన్యకేసమే"
7.వరుణుడు సకల దిశలందు నిండి ఉన్నాడు. పలువైపుల వ్యాపించి ఉన్న శత్రునగరములను ధ్వంసము చేయును వరుణుని రథము ముందు సమస్తదేవతలు కర్మానుష్ఠానము చేతురు "నభంతామన్యకేసమే"
8. వరుణుడు సముద్ర స్వరూపుడు. అతడు అంతర్షితుడై, ఆదిత్యసమునిగా స్వర్గారోహణము చేయును నలుదిశల ప్రజలకు దానములిచ్చును. అతడు ద్యుతిమంతమగు పదమున నిలుచును. ఘాతను నశింపచేయును స్వర్గమునకు సాగును "నభంతామన్యకేసమే"
9. వరుణుడు అంతరిక్షవాసి శుభ్రవర్ణుడు మూడు తేజస్సులతో త్రిభువనముల ప్రసిద్ధుడు అతని స్థానము అవిచలము. అతడు సప్తసింధులకు అధీశ్వరుడు. "నభంతామన్యకేసమే"
10. వరుణుడు పగలు శుభ్రవర్ణుడు - రాత్రి కృష్ణవర్ణుడగును. అతడు తనకర్మలకుగాను ద్యులోక, అంతరిక్షములను నిర్మించినాడు. ఆదిత్యుడు ద్యులోకమును ధరించినట్లు వరుణుడు అంతరిక్షము ద్వారా ద్యావా, పృథ్వులను ధరించినాడు. "నభంతామన్యకేసమే"
నలుబది రెండవ సూక్తము
ఋషి - అర్చనానుడు లేక నాభాకుడు, దేవత - వరుణుడు,
ఛందస్సు - అనుష్టువ్ - త్రిష్టువ్.
1. వరుణుడు సర్వజ్ఞుడు బలవంతుడు అతడు ద్యులోకమును నిలిపి ఉంచినాడు పృథ్విని విస్తరపరచినాడు సకల భువనములకు సామ్రాట్టు అయినాడు వరుణుడు ఇట్టి పనులు అనేకము చేసినాడు.
2. స్తోతా ! బృహత్ వరుణునకు ప్రణమిల్లుము అమృత రక్షకుడు, ప్రాజ్ఞుడగు వరుణునకు నత మనస్కుడవగుము. వరుణుడు మాకు మూడంతస్తుల మేడ ఇవ్వవలెను. మేము అతని వడిలో ఆడుదుము, ద్యానా పృథ్వులు మమ్ము రక్షించవలెను.
3. దివ్యవరుణా ! నేను కర్మాను ష్ఠాతను. నా కర్మమును, ప్రజ్ఞానమును, బలమును తీక్షము చేయుము. మేము సకల దుష్కర్మలను దాటించగల నావను ఎక్కెదము.
4. అశ్వినులారా! మీరు సత్యస్వరూపులు ప్రాజ్ఞులగు విప్రులు, సమస్త అభిషవశిలలు మీ సోమపానమునకుగాను తమ తమ కార్యములతో మీ ముందుకు వచ్చుచున్నారు. "నభంతామన్యకేసమే"
5. నాసత్య అశ్విద్వయమా ! ప్రాజ్ఞుడగు అత్రి తన స్తుతుల ద్వారా మిమ్ము సోమపానమునకు ఆహ్వానించినట్లు నేను మిమ్ము ఆహ్వానించుచున్నాను. "నభంతామన్యకేసమే"
6. నాసత్యద్వయమా ! మేధావులు మిమ్ము సోమపానమునకు పిలిచినట్లు - నేను రక్షణల కొరకు మిమ్ము పిలుతును. "నభంతామన్యకేసమే"
(ఆధ్రవచన ఋగ్వేద సంహిత ఆరవ అష్టకము ఎనిమిదవ మండలమున అయిదవ అనువాకము సమాప్తము.)
ఆరవ అనువాకము నలుబది మూడవ సూక్తము
ఋషి - అంగిరస విరూపుడు, దేవత - అగ్ని, ఛందస్సు - గాయత్రి
1. మాస్తోతలు అగ్నిని స్తుతింతును. అగ్ని మేధావి విధాత అతడు యజమానులను బాధించడు.
2. అగ్నీ ! నీవు జాతధనివి దర్శనీయుడవు. దాతవు కావున నీ కొరకు చక్కని స్తుతులు రచింతును.
3. అగ్నీ ! నీవు వంకరజ్వాలలు. అవి పశువువలె దంతములతో అడవులను తినును.
4. హరణశీల, వాయుప్రేరిత, ధూమధ్వజ అగ్నులన్నియు వేరువేరుగా అంతరిక్షమునకు చేరును.
5. హౌతులచే వేరు వేరుగా సమిద్ధమైన అగ్ని ఉషస్సు కేతనము వలె కనిపించును.
6. అగ్ని జాతప్రజ్ఞుడు అతడు భూమి మీద ఎండిన కట్టెలను ఆశ్రయించినపుడు, పైకిఎగసి దుమ్మును సహితము నలుపు చేయును.
7. అగ్ని ఓషధులను అన్నముగా భావించును భక్షించును అయినను శాంతించడు లేతోషధులవైపు సాగును.
8. అగ్ని తన నాలుకతో వనస్పతులను భక్షించును తేజస్సుతో ప్రజ్వలితుడగును. అరణ్యమును శోభిల్ల చేయును.
9. అగ్నీ !జలమధ్యము నీ ప్రవేశస్థానము. నీవు ఓషధులను నిలుపుదువు మరల వాటి గర్భముననే జన్మింతువు.
10. అగ్నీ ! ఘృతమున ఆహూతుడవైన నీవు స్రుక్కు అగ్రమును నాకుదువు. అందువలన నీ జ్వాల శోభిల్లును.
11. అగ్ని హవ్య భక్షకుడు అతని అన్నము అభిలషనీయము అతడు సోమపృష్ఠుఢు అభీష్టప్రదాత అట్టి అగ్నిని స్తోత్రములతో అర్చింతుము.
12. అగ్ని దేవతల ఆహ్వాత ప్రజ్ఞావంతుడు అగ్నికి నమస్కరించియు, సమిధలు సమర్పించియు, యాచింతుము.
13. శుద్ధుడవు, ఆహూతడవగు అగ్నీ !మేము నిన్ను భృగు, మనువుతో సమానముగా ఆహ్వానింతుము.
14. అగ్నీ! నీవు విప్రులలో విప్రుడవు. సాధువులలో సాధువవు. మిత్రులలో మిత్రుడవు. విప్రుల సమిధలలో కూడి ప్రజ్వరిల్లుదువు.
15. అగ్నీ! నీవు హవ్యదాత విప్రులకు సహస్ర సంఖ్యాకధనమును వీరపుత్రాదియుక్త అన్నమును ప్రసాదించుము.
16. అగ్నీ ! నీవు యజమానులకు భ్రాతృరూపుడవు. బలముతో పుట్టినవాడు రోహితనామక అశ్వవంతుడవు పరిశుద్ధ కర్మవి. నీవు మా స్తోత్రములను ఆశ్రయింపుము.
17. అగ్నీ! ఆవులు ఉత్సాహమున అంబారాములు చేయుచు దూడల కొరకు గోశాలకు సాగినట్లు - మా స్తుతులు నీ వద్దకు సాగుచున్నవి.
18. అగ్నీ! నీవు అంగిరులలో శ్రేష్టుడవు సమస్తప్రజతమ కోరికలు తీర్చుకొనుటకు నిన్ను అశ్రయింతురు.
19. మునీషులు, ప్రాజ్ఞులు, అన్నప్రాప్తికి అగ్నిని ప్రసన్నుని చేయుదురు.
20. అగ్నీ! నీవు బలవంతుడవు హవ్యవాహకుడవు. హేతవు ప్రసిద్ధుడవు గృహమందు యజ్ఞమును విస్తరింప చేయు స్తోతలు నిన్ను స్తుతింతురు.
21. అగ్నీ! నీవు ప్రభువవు, సర్వత్ర సకల ప్రజకు సమదర్శివి. అందువలనేమేము నిన్ను యుద్ధములందు ఆహ్వానింతుము.
22. అగ్ని ఘృతము ద్వారా ఆహూతుడగును శోభిల్లును మా పిలుపును ఆలకించిన అగ్నిని మేము స్తుతింతుము.
23. అగ్నీ ! నీవు జాతధనవి శత్రుహింసకుడవు మా ఆహ్వానము ఆలకించువాడవు అందుకే నిన్ను మేము పిలుస్తాము.
24. అగ్నిమానవులకు ప్రభువు మహామహుడు కార్యములకు అధ్యక్షుడు నేను అగ్నిని స్తుతిస్తాను. అగ్ని వినవలెను.
25. అగ్ని సర్వత్రగామి బలశాలి శక్తిశాలి మానవులకు సమానహితకరుడు అశ్వమువలె అగ్నిని బలిఇస్తాము.
26. అగ్నీ !నీవు హింసకులను వధించుము. రాక్షసులను దహించుము. తీక్ణ తేజమున దీప్తిచెందుము.
27. అంగిరులలో శ్రేష్ఠుడవగు అగ్నీ! మానవులు నిన్ను మనువుతోసమముగా అర్చింతురు నీవు మానవుని వలె నాస్తుతిని అర్థము చేసికొనుము.
28. అగ్నీ! నీవు స్వర్గము, అంతరిక్షమునందలి బలములమూలమున జన్మించినావు. నిన్ను స్తుతించి ఆహ్వానించుటకు వేరు వేరు హవిరూప అన్నములను సమర్పింతురు.
29. వీరందరు, ఈ సమస్తప్రజ నీవు ఆరగించుటకు వేరు వేరు హవిరూప అన్నములను సమర్పింతురు.





