Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    8. అగ్ని పావనదీప్తిమంతుడు. కాష్ఠాదులందు శయనించువాడు. సుకర్ముడు. అగ్ని హోమము చేయుడు.

    అగ్ని బహువ్యాప్తుడు. దూత స్వరూపుడు. శీఘ్రగామి సనాతనుడు. స్తుతియోగ్యుడు. దీప్తిమంతుడు. అగ్నిని పూజించుడు.

    9. మూడువేల మూడువందల ముప్పదితొమ్మిదిమంది దేవతలు అగ్నిని పూజించినారు. ఘృతమున అగ్నిని సిక్తము చేసినారు. అగ్నికొఱకు విశాలములగు కుశలు పరచినారు. అనంతరము దేవతలు అగ్నిని హోతగా భావించి కుశలమీద ఆ సీనుని చేసినారు.

    ఆలోచనామృతము

    1. లోచనమునకు అందనిది ఆలోచనము. మానవుని సర్వావయవములను శాసించునది మనసు. మనసు ఆదేశించనిది ఏ అవయవమును పనిచేయదు. కన్ను చూచినట్లున్నను మనసు లేనిది కానలేము. మనిషి అక్కడే ఉండును. మనసులేకున్న గ్రహించలేడు. అట్లని ప్రాణము లేదనలేము. చలనము ఉన్నది. ప్రాణము జీవించుటకు మాత్రము పనికివచ్చును.

    జీవితమునకు మనసు ఆవశ్యము.

    ఇతర ప్రాణులకు లేనిది, మనిషికి ఉన్నది, విశిష్టమయినది మనసు మాత్రమే !

    మనువు సంతతి అయినందువలనకాదు మనసు ఉన్నందున మానవుడు అయినాడు. "మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః" అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు గీతలో. బంధమోక్షములకు కాయిక కర్మకాదు. మానసిక కర్మ కారణము.

    పసివానిచేయి జారిపడిన అద్దమును గురించి నేను కావలెనని పడవేయలేదు. అనుమాట వచ్చును. అట్లన్న అనుకొనక చేసిన పని తప్పుకాదని పసివానికి సహితము తెలియును.

    శాసనరీత్యా కూడా అనుకొనక చేసినది నేరముకాదు. ఆలోచనము మనసునకు సంబంధించినది. మనసు ఆకాశము వంటిది. దానికి అవధులు లేవు. ఇప్పటికి శాస్త్ర రంగమున శబ్దమును మించిన వేగము సాధించినాము. కాని మనసును మించిన కాదు. మనసును పోలిన వేగమును సాధించుట దుస్సాధ్యమే కాదు. అసాధ్యము.

    అయినను మనసు చెప్పినదంతయు సత్యము కాదు.

    మానవుడు ఇంకను సత్యమును ఎరుగవలసి ఉన్నది.

    నా మనసుకు అందినదే ఆలోచనామృతము.

    2. ఋగ్వేదమున పది మండలములు ఉన్నవి. వీరిలో రెండవ మండలము నుండి ఎనిమిదవ మండలము వరకు ప్రతి మండలమునకు ఒకడే ద్రష్ట, స్మర్త అగును. ఒకటి, తొమ్మిది, పదిమండలములకు ద్రష్టలు అనేకులు.

    ఈ మూడవ మండలమునకు గాధేయ విశ్వామిత్రుడు ద్రష్ట.

    మనకు పరిచయమున్న విశ్వామిత్రుడు పురాణ విశ్వామిత్రుడు. అతడు కోపిష్టి. హరిశ్చంద్రుని కథయందలి విశ్వామిత్రుని గుణగుణములు మనకు తెలియును.

    శ్రీ మద్రామాయణమునందలి విశ్వామిత్రునకు పురాణ విశ్వామిత్రునకు పోలిక ఏమాత్రము లేదు. రామాయణ విశ్వామిత్రుడు క్షత్రియ పక్షపాతి. తపస్సంపన్నుడు. నరమేధమువంటి వాటిని అంతమొందించిన గొప్ప సంస్కర్త. "అన్యమింద్రం కరిష్యామి" అని బెదిరించి మరొక స్వర్గమును సృష్టించిన గొప్ప శాస్త్రజ్ఞుడు.

    ఉభయ విశ్వామిత్రులను గాధేయులుగానే చెప్పినారు. అయినను నామసామ్యమును బట్టి వేదర్షులను, పురాణ ఋషులు అనుకొనుటకు వీలులేదు.

    వేదములకు పురాణములకు మధ్య అనంతము అగాధమగు కాలమున్నది.

    ఏదో ఒక విశేష కార్యము సాధించనివాడు ఋషి - ద్రష్ట - స్మర్త కాలేడు. కాలమును ఎదిరించి ఇంతకాలము నిలువలేడు.

    i) ఈ మండలపు 4వ సూక్తము 5, 6 మంత్రములో దేవతలను "నృపేశః" నరరూపులనుగా పేర్కొనుట జరిగినది. "విగ్రహ వత్యోయజ్ఞద్వారాభిమానిన్యో దేవతాః" అని శాయణుడు వ్యాఖ్యానించినాడు. ఏతన్వ్కావిరూపే, "విరూపే పృథగ్రూపే తన్వాప్రకాశరూపేణ శరీరేణ" అని శాయణుడు.

    వేదమున ఇంతవరకు అలవోకగా ఒకచోట తప్ప ప్రకృతి శక్తులను రూపము ఉన్నవారిగా పూజించుట జరుగలేదు. ప్రకృతి శక్తులకు అనుగ్రహములున్నట్లే చెప్పబడినది. ఆగ్రహము ఉన్న జాడలు కనిపించవు.

    ఇక్కడ తొలిసారిగా ప్రకృతి శక్తులను మానవరూపులుగా విగ్రహవంతులుగా ప్రవేశపెట్టుటకు ప్రయత్నము జరిగినది.

    మహాయాన బౌద్ధులు విగ్రహారాధన ప్రారంభించిరి అనుట సరికాదనుటకు ఇది నిదర్శనము.

    అహింసను గురించి సహితము వేదమున పెక్కుసార్లు పేర్కొనుట జరిగినది. మహావేర వర్ధమానుడు, గౌతమ బుద్ధుడు మాత్రమే అహింసను ప్రతిపాదించినారనుటను గురించియు ఆలోచించవలసి ఉన్నది. వారిద్దరు అహింసను ప్రజలలో ప్రచారముచేసి, అహింసను ఒక జీవన విధానముగా స్థాపించినారనునది తిరుగులేని నిజము.

    ii) యజ్ఞము జరిపించు ఋత్విజాదులకు ఉన్నత స్థానము ఇచ్చుట జరిగినది. 7వ సూక్తము 8వ మంత్రమున వారిని దివ్యులుగను, అగ్నిసములుగను పేర్కొనుట జరిగినది. "దైవ్యహోతారా ప్రథమాన్యుంజే".

    iii) గృత్సమదుడు పక్షిని ప్రవేశ పెట్టినాడు. విశ్వామిత్రుడు స్థావరమునకు పవిత్ర స్థానము కల్పించినాడు. యూపము ధ్వజ స్తంభమునకు పూర్వరూపము కావచ్చును. 8వ సూక్తమున యూపమునకు దేవతా స్థానము కల్పించబడినది.

    ఇంతకుముందు అశ్వమేధ సందర్భమున బలి ఇచ్చిన అశ్వమునకు పద్గతులు కలుగును అని చెప్పినాడు. ఇప్పుడు యూపము కొఱకు నరికిన చెట్టునకు వందల శాఖలు కలుగును అనుచున్నాడు. "శతవల్శో విరోహ."

    మంచి పనికి సద్గతులు కలుగును అను సత్ సంప్రదాయము.

    iv) క్రతువునకు కర్మకాండ నిర్ణయించుట జరుగుచున్నది. యూపారోహణ పద్ధతి వివరించబడినది. నేటి ధ్వజా రోహణమును తలపించుచున్నది.

    9-3 మంత్రమున 16మంది ఋత్వికులను గురించి చెప్పబడినది. వారిలో 12మంది ఋత్విజులు వివిధ కార్యములు నిర్వహించుచు వచ్చిపోవుచుందురని నలుగురు ఉద్గాత ప్రభృతులు కూర్చొని మంత్రములు చదువుదురనియు శాయణాచార్యులు వ్యాఖ్యానించినారు.

    5-9-9వ మంత్రమున త్రీణిశతా త్రీసహస్రాణ్యగ్నిం త్రింశాచ్చ దేవా నవంచాసపర్యన్. ఇది 3339 అగును. ఇది అగ్నిని పూజించు దేవత సంఖ్య.

    ఇంతకు ముందు 33మంది దేవతలను గురించి చెప్పినారు. వీరిలో 11మంది భూమిమీద 11గురు అంతరిక్షమున 11గురు ద్యులోకము ఉన్నట్లు చెప్పినారు.

    బృహదారణ్యకమున ఆనందగిరి ఈ సంఖ్యను 3336గా పేర్కొన్నారు.

    దేవతలకు స్థిరసంఖ్య సాధ్యపడదు. ఋభువులు దేవత్వము సాధించుచుందురు.

    9-2న అగ్నిని 'దూరేసన్నిహాభవ' దూరముగా ఉండి దగ్గరగా ఉన్నట్లు ఉండుము అంటున్నారు. దూరమున అదృశ్యముగా ఉన్న నీవు అరణులందు పుట్టి సన్నిహితుడవు అగుము, అవి శాయణుని సుందర వాఖ్య.

    కొన్ని అందములయిన వర్ణనలు ఉన్నవి.

    9-5 గాలి, తిరుగుడు కొడుకును తండ్రి గుంజుకొని వచ్చినట్లు మాతరిశ్వ అగ్నిని దేవతలకు చేర్చినది.

    9-7 అగ్నిని బాలునితో పోల్చినాడు. తెలిసినవాడు. తెలియనివాడు అను భేదము లేక బాలుడు అందరికి ఆనందము కలిగించును. అట్లే అగ్నియు అన్నాడు.

    9-4 "సింహమ్ ఇవ శ్రితమ్" గుహయందు సింహమువలె. అగ్ని జలములందు ఉన్నది అన్నాడు. గుహయందు ఉన్నపుడు సింహము శాంతముగా ఉండును. బయటికి లంఘించిన భయంకరము అగును. అగ్నియు అంతే ! జలములందు ఉన్నపుడు శాంతుడు. బయటపడిన భయంకరుడు.

    "వ్యాఘ్రీవ తిష్ఠతి జరా" అంటాడు భర్తృహరి. వార్థక్యము పులివలె పొంచి ఉన్నది అన్నాడు. ఎంత అందముగా చెప్పినాడు ! పొంచి ఉన్న పులిని చూస్తే భయం ! దుమికిన భయము. మనము ఉండము.

    8-10 "శృంగాణి విచ్చ్రంగిణాం డదృశ్రే" యూపములు నేలకు కొమ్ములవలె ఉన్నవి.

                             పదవ సూక్తము

        ఋషి-విశ్వామిత్రుడు, దేవత-అగ్ని, ఛందస్సు-ఉష్ణిక్.

    1. అగ్నీ ! నీవు ప్రజల అధిపతివి. దీప్తిమంతుడవు. నిన్ను బుద్ధిమంతులు ఉద్దీప్తుని చేతురు.

    2. అగ్నీ ! నీవు హోతవు. ఋత్విక్కువు. అధ్వర్యుడు యజ్ఞమున నిన్ను నుతింతురు. నీవు యజ్ఞ రక్షకుడవు. యజ్ఞ గృహమునందు దీప్తుడవు అగుము.

    3. అగ్నీ ! నీవు జాతవేదుడవు. యజమానులు నీకు ఆజ్యపురోడాశయుక్తమగు హవ్యము అర్పింతురు. వారికి వీర పుత్రులు కలుగుదురు. వారు పశుపుత్రాదులతో సమృద్ధులు అగుదురు.

    4. అగ్ని యజ్ఞ ప్రజ్ఞాపకుడు. అతడు ఏడుగురు హోతల ద్వారా సిక్తుడు అగును. అతడు యజమానికొఱకుగాను దేవతల సహితుడయి విచ్చేయవలెను.

    5. అగ్ని తేజమును ధరిచువాడు. లోకముల విధాత. దేవతలను ఆహ్వానించువాడు. అట్టి అగ్ని కొఱకుగాను ప్రాచీనము మహంతము అగు వాక్యమును ఆర్జించుడు.

    6. మహాన్నము, ధనము కొఱకు అగ్ని దర్శనీయుడు. అగ్నిని ప్రశంసించు వాక్యమే మా స్తుతి వాక్యము అగును. అగ్నిని వర్థిల్ల చేయును.

    7. అగ్ని యజ్ఞకర్తలలో శ్రేష్ఠుడు. అగ్నీ ! నీవు యజమానుల కొఱకు దేవతల యాగము చేయుము. నీవు యజమానులు, హోతలకు హర్షదాయకుడవు. నీవు శత్రువులను జయించి విరాజిల్లుచున్నావు.

    8. పావకా ! నీవుమాకు కాంతివంతము, శోభన శక్తిమంతము అగు ధనమును ప్రసాదించుము. స్తోతలకు శుభములు కలిగించుటకు వారివద్దకు వెళ్లుము.

    9. అగ్నీ ! నీవు హవ్యవాహనుడవు. అమరుడవు. మంథనరూప బలమున వర్థిల్లుదువు. ప్రబుద్దులగు మేధావి స్తోతలు ఆజ్యపురోడాశముల ద్వారా నిన్ను ఉద్దీప్తుని చేసెదరు.

    (అరణులు మధించగా పుట్టిన అగ్ని బలవంతుడగును)

                         పదకొండవ సూక్తము

         ఋషి-విశ్వామిత్రుడు, దేవత-అగ్ని, ఛందస్సు-గాయత్రి.

    1. అగ్నీ ! నీవు హోతవు. పురోహితుడవు. యజ్ఞ ద్రష్టవు. అగ్ని యజ్ఞమును క్రమబద్ధముగా ఎరుగును.

    2. హవ్యవాహనుడు, అమరుడు, హవ్యాభిలాషి, దేవదూత, అన్నప్రియుడు అగు అగ్ని ప్రజ్ఞావంతుడు అగుచున్నాడు.

    3. అగ్ని యజ్ఞ కేతన స్వరూపుడు. ప్రాచీనుడు. అతడు తన ప్రజ్ఞాబలమున సర్వజ్ఞుడు అయినాడు.

    4. బలపుత్రుడు, సనాతనుడు సుప్రసిద్ధుడు, జాతవేదుడు అగు అగ్నిని దేవతలు హవ్యవాహుని చేసినారు.

    5. అగ్ని మానవులకు నాయకుడు. శీఘ్రకారి. రథసముడు. సదా నవీనుడు. అగ్ని యజ్ఞమును హింసించగలవాడులేడు.

    6. అగ్ని సకల శత్రుసేనల విజేత, శత్రువులకు అవధ్యుడు. దేవతల పోషకుడు. అతడు వివిధ అన్నయుక్తుడు.

    7. హవ్యదాతయగు మానవుడు హవ్యవాహక అగ్నివలన సమస్త అన్నములను పొందుచున్నాడు. అట్టి మానవుడు పవిత్రకారకుడు, దీప్తి విశిష్ఠుడగు అగ్ని వలన గృహము పొందును.

    8. అగ్ని మేధావి - జాతవేద. మేము అతనిని స్తుతించి కోరిన సమస్త ధనములను పొందగలము.

    9. అగ్నీ ! మాకు అభిలషించిన ధనములన్నియు లభించవలెను. దేవతలు మాలో ప్రవేశించవలెను.

                             పన్నెండవ సూక్తము

        ఋషి - విశ్వామిత్రుడు, దేవత-ఇంద్రుడు, అగ్ని; ఛందస్సు - గాయత్రి.

    1. ఇంద్రాగ్నులారా ! మేము స్తుతుల ద్వారా ఆహ్వానించుచున్నాము. స్వర్గమున సిద్ధమయినదియు వరణీయమును అగు సోమము కొఱకు విచ్చేయుడు. మా భక్తిని గుర్తించి సోమపానము చేయండి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.