Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    3. ప్రాతిగామిని తిరిగి సభకు పంపుటలో ద్రౌపది తన చాతుర్యమును ప్రదర్శించినది. ఆమె సభలోని ధర్మరాజు స్థితిని గురించి తెలిసికొనదలచినది. అతడు నిర్వీర్యుడు అని తెలుసుకోనిన తరువాతనే సభకు వచ్చినది. వచ్చి తన రక్షణ కొఱకు గాంధారి వద్దకు ఉరికినది. లాభము లేకపోయినది. కన్నీరు మున్నీరుగా ఏడ్చినది. కరిగినవాడు కనిపించలేదు. ఆమె శరీరములోని బలము చచ్చినది. మనోబలమును పెంచుకున్నది. తన ప్రజ్ఞా పాటవములతో సభవారిని ప్రశ్నించి ముచ్చేమటలు పోయించినది.
    అది సభ కాదు. పురుష ప్రపంచము. ఆమె ద్రౌపది మాత్రము కాదు. స్త్రీమూర్తి. సమస్త స్త్రీ జాతికి ప్రతినిధి. ఆమె వేసిన ప్రశ్నలకు పురుషజాతి వద్ద ఉత్తరము లేదు. అది నాడు లేదు - నేడు లేదు.
    "జూదమునందు ఓడుటకు స్త్రీ పురుషుని సొత్తగునా?"
    ఈ ప్రశ్నకు ఉత్తరము సభలో లభించలేదని వ్యాస భగవానుడు చెప్పి ప్రపంచమున లభించదని వివరించినాడు. స్త్రీ జాతి ప్రశ్నలకు పురుషజాతి వద్ద సమాధానములు లేవు. అతడు తన బలదర్పముతో ఆమెను లొంగదీయుచున్నాడు. ద్రౌపది విషయమున అదే జరిగినది.
    స్త్రీ మాతృమూర్తి ఆమెను అవమానించుట అవనిలో ఎవరికిని అలవి కాదు. తన మానమును రక్షించుకొనగల శక్తి స్వరూపిణి స్త్రీ  రాజకీయ మదాంధతగల కౌరవ ప్రపంచము ఆమె ముందు చిత్తుగా ఓడుట అందుకు నిదర్శనము.
    4. మానవుడు అన్నింటికి స్వశక్తి మీద అధారపడును. తాను చేయు ప్రయత్నమూలన్నియు చేయును. అన్నింట విఫలము అయినపుడు, మరో దిక్కు లేనపుడు, దైవమును ఆశ్రయించును. ద్రౌపది అట్లే చేసినది. గజేంద్రుడు అట్లే చేసినాడు. ఇవి మానవుని మనస్తత్వమునకు ఉదాహరణలు.
    5. మానవుని దుర్మార్గమును, దౌష్ట్యమును మానవుడు ఎదిరించలేనపుడు ప్రకృతి ప్రతికూలించును అని చెప్పబడినది. మానవుడు బలహీనుడు అయినపుడు రచయిత ప్రకృతిని ప్రతికూలింపచేయును. వ్యాసుడు అదే చేసినాడు.
    6. ధృతరాష్ట్రుడు చతురుడు. ప్రకృతి వైపరీత్యములను విన్నాడు. అన్యాయము, అధర్మము ఎక్కడ జరిగినదో గ్రహించినాడు.
    జూదమాడినారు, రాజ్యము పోగొట్టుకున్నారు. అది న్యాయము కావచ్చు.పరుల భార్యను గెలుచుట తప్పు. గెలిచివారుపో! సభకు ఈడ్చి తెచ్చుట తప్పు. తెచ్చినారుపో! అవమానించుట తప్పు. అవమానించివారుపో! బట్టలు లాగుట మహాదోషము.
    అది గ్రహించిన గుడ్డి రాజు ద్రౌపదికి వరములు ఇచ్చినాడు. ఆమెకు వరములిచ్చి తన సంతానమును రక్షించుకొనుట అతని ఉద్దేశ్యము.
    
                                               రాజ్యాపహరణము

    దుర్యోధనుని ప్రయత్నములు అన్నియు విఫములు అయినవి. అందుకు అతని మనసు ఏడ్చినది. పాండవులు మరల రాజ్యము ఎలుటను సహించలేక పోయినాడు. అతను శకుని సైంధవులతో మంతనములు సాగించినాడు. వ్యూహము రచించినారు. అప్పుడు దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వెళ్ళినాడు . ఏడ్చినాడు:-
    "తండ్రీ! నీవు నీ కొడుకులను ఆపదలను తోసినావు. పాండవులు మనకు శత్రువులు అయినారు. వారికి నీవు రాజ్యము ఇచ్చినావు. క్రూర సర్పములకు కోపము తెప్పించినాము. వారు మమ్ములను విడువరు. అర్జునుడు అరివీర భయంకరుడు. అతడు గాండీవము పట్టి నిలిచిన మేము ఎదిరించలేము. హతులము కావలసినదే. భీముడు కాలయముడు. అతడు గదపట్టి నిలిచినా మేము ఎదిరించలేము. హతులను కావలసినదే. ఏ విధమున అయినను శత్రువును జయించవచ్చునని పూర్వము బృహస్పతి చెప్పినాడు. కాబట్టి మా మేలు కోరదునేని మమ్ము వినాశనము నుండి కాపాడ దలతునేని పాండవులను మరల ఇచ్చటికి రప్పింపుము జూదమందు వారిని ఓడింతుము. వారిని అడవులకు పంపుదము. ఆ విధముగా చేయకున్న మా వినాశము నిశ్చయము" అని దుర్యోధనుడు ధృతరాష్ట్రునకు భయము కల్పించినాడు వెళ్ళినాడు.
    ధృతరాష్ట్రుడు తొలుత సమ్మతించలేదు. తుదకు సమ్మతించినాడు. ప్రాతిగామిని పిలిచినాడు. ఇంద్రప్రస్థమునకు వెళ్ళి జూదమాడుటకు ధర్మరాజును తీసుకొని రావలసినదని ఆదేశించినాడు. ధృతరాష్ట్రుని ఆదేశము మేరకు ప్రాతిగామి ఇంద్ర ప్రస్థమునకు వెళ్ళినాడు. "ధర్మరాజా! మీ తండ్రీ ధృతరాష్ట్రుడు మిమ్ము హస్తినకు తీసుకొని రమ్మని నన్ను పంపినాడు. నిన్ను తీసుకొని వెళ్ళుటకు నేను వచ్చినాను" అని విన్నవించినాడు.
    ధర్మరాజు తండ్రి మాటను అతిక్రమించరాదు అనుకున్నాడు. హస్తినకు బయలుదేరినాడు. ధర్మరాజు వెంట నలుగురు తమ్ములు, ద్రౌపది ,దౌమ్యుడు మున్నగు విద్వాంసులు ధర్మరాజు పక్షమున గల సకల జనులు సాగినారు. ధర్మరాజాదులు హస్తినకు చేరినారు.
    ఒకనాడు ధర్మరాజాదులు సభా మంటపమున కూర్చొని ఉన్నారు. అక్కడికి శకుని వచ్చినాడు. తనకు నచ్చిన సొగటకాయలు తెచ్చినాడు. "ధర్మజా! పూర్వము నీవు మాకు రాజ్యమును ఓడినావు. అది సాంతము మహారాజు నీకు తిరిగి ఇచ్చినాడు. కావున ఇది వరకు వేయని పందెము వేసి జూదము అడుము. పందెము ఏమనగా:-
        "ఓడిన వారు కృష్ణాజినములు దరించవలెను. కందమూలములు భక్షించవలెను. బ్రహ్మచర్యము అవలంబించవలెను. ఆవిధముగా పన్నెండెండ్లు వనవాసము చేయవలెను. అటు తరువాత పదమూడవ సంవత్సరము జనులుండు దేశమందు ఉండవలెను. కాని వారిని ఇతరులు ఎరుగరాదు. అజ్ఞాత వాసమందు పరులచే ఎరుగబడిన మరల పన్నెండెండ్లు వనవాసము పదమూడవ ఏట అజ్ఞాత వాసము చేయవలసి ఉండును. అరణ్య అజ్ఞాత వాసములు చేయు శక్తి నీకు ఉన్నచో జూదము అడుము" అని శకుని జూదము ఆడుటకు ధర్మరాజును పిలిచినాడు.
    జూదమునకు పిలిచిన తరువాత ఆడకుండరాదని ధర్మరాజు శకుని చెప్పిన పందెమునకు ఒప్పుకున్నాడు. జూదము ఆడినాడు. ఓడినాడు. రాజ్యము పోగొట్టుకున్నాడు. విధి విహితము వలన పాండవులు జూదము రెండవసారి ఓడినారు. రాజ్యము కోల్పోయినారు.
    పాండవులు కృష్ణాజినములు ధరించినారు. అడవులకు వెళ్ళుటకు సిద్దపడినారు. ధృతరాష్ట్ర , కృపాచార్య, ద్రోణ చార్యుల వద్ద సెలవు తీసుకున్నారు. విదురుని అనుమతి కోరినారు. అప్పుడు విదురుడు అన్నాడు:-




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.