Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


 
    9.అశ్వినులారా ! డేగలవలె వేగముగా అభిషుత సోమము వైపు సాగండి. మహిషములవలె సోమమును తీసి కొనండి. ఉష, సూర్యులతో కూడ త్రిమార్గమున పయనించండి.

    10. అశ్వద్వయమా! సోమపానము చేయండి తృప్తులుకండి. మాకు ధనమును, సంతానమును ప్రసాదించండి. ఉష, సూర్యులతో కూడి మాకు బలమునొసగండి.

    11.అశ్వినులారా! మీరు శత్రువులను జయించండి. స్తోతలను ప్రశంసించండి రక్షించండి. మాకు ధనము, సంతానము ప్రసాదించండి. ఉష, సూర్యులతో కూడా మాకు బలమునొసగండి.

    12. అశ్వినులారా! మీరు శత్రువునునాశము చేయండి. మంత్రి యుక్తముగా సంచరించండి. మాకు ధనము, సంతానము ప్రసాదించండి. ఉష, సూర్యులతో కూడి మాకు బలమునొసగండి.

    13. అశ్వినులారా! మీరు మిత్ర, వరుణ, ధర్మవంతులగు మరుత్తులతో కూడిన వారు మీరు  స్తోతల ఆహ్వానమువైపు సాగండి. ఉష, సూర్య, ఆదిత్యులతో కలిసి సాగండి.

    14. అశ్విద్వయమా ! మీరు అంగిర, విష్ణు, మరుత్తులతో కూడినవారు. మీరు స్తోతల పిలుపువైపు సాగండి. ఉష, సూర్య, ఆదిత్యులతో కలిసి  నడవండి.

    15. అశ్విద్వయమా ! మీరు ఋభు, అభీష్టవర్ధి, వాజ, మరుత్తులతో కూడినవారు. స్తోతల పిలుపు వైపుసాగండి. ఉష, సూర్య, ఆదిత్యులతో కలసి కదలండి.

    16. అశ్వినులారా ! మీరు శత్రువును గెలవండి. కర్మను గెలవండి. రాక్షసులను శాసించండి -వధించండి. ఉష, సూర్యులతో కలసి అభిషవ కర్త సోమమును ఆస్వాదించండి.

    17. అశ్వినులారా ! మీరు బలములను గెలవండి, యోద్ధలను గెలవండి. రాక్షసులను శాసించండి - వధించండి. ఉష, సూర్యులతో కలసి అభిషవకర్త సోమమును ఆస్వాదించండి.

    18. అశ్వినులారా ! గోవులను గెలవండి. వర్తకులను గెలవండి. రాక్షసులను శాసించండి వధించండి. ఉష, సూర్యులతో కలిసి అభిషవకర్త సోమమును ఆస్వాసించండి.

    19. అశ్విద్వయమా ! మీరు శత్రువుల గర్వమును విరుచువారు మీరు 'అత్రి' స్తుతులను విన్నట్లే శ్వావాశ్వుని ప్రధానస్తుతులు వినండి. ఉష, సూర్యులతో కూడి ప్రాతఃకాల యజ్ఞమున సోమపానము చేయండి.

    20. అశ్విద్వయమా! శ్యావాశ్వుని చక్కని స్తుతిని - ఆభరణమువలె - స్వీకరించండి. ఉష, సూర్యులతో కూడి ప్రాతఃకాల యజ్ఞమున సోమపానము చేయండి.
   
    21.అశ్వినులారా! గుఱ్ఱమును కళ్లెము లాగినట్లు - శ్యావాశ్వుని యజ్ఞమువైపు తరలండి. ఉష, సూర్యులతో కూడి ప్రాతఃకాల యజ్ఞమున సోమపానము చేయండి.

    22. అశ్వినులారా ! మీ రథము మాముందుకు తెండు సామరూప మధువును సేవించండి. ఉష, సూర్యులతో కూడి ప్రాతఃకాల యజ్ఞమున సోమపానము చేయండి.

    23. అశ్విద్వయమా ! మీరు నేతలు. నేను హవిసమర్పించువాడను. నమస్కరించి ప్రార్థించుచున్నాను. మా యజ్ఞమునకు సోమపానము చేయ రండి. రక్షణాభిలాషికై మిమ్ము పిలుచుచున్నాను. హవ్యదాతనగునాకు రత్నములు ప్రసాదించండి.

    24. అశ్వినీ దేవతలారా ! మీరు అభిషుత, స్వాహాకృత సోమమును సేవించండి. తృప్తినొందండి, యజ్ఞమునకు సోమపానము చేయరండి. రక్షణాభిలాషివై మిమ్ము పిలుచుచున్నాను. హవ్యదాతనగునాకు రత్నములు ప్రసాదించండి.

                              ముప్పది ఆరవ సూక్తము
    ఋషి - శ్యావాశ్వ, ఆత్రేయుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు -శక్వరి.

    1. శక్రతు ఇంద్రా! సొమము అభిషవించు వానికి కుశల విస్తరించువాడగు యజమానికి నీవు రక్షకుడవు. నీవు సజ్జనులకు స్వామివి. మరుత్తుల యుక్తుడవు. దేవతలు నీకొరకు సోమభాగమును నిశ్చయించినారు. నీవు శత్రుసేనను  దాని విశేషవేగమును విరిచినప్పుడు జలమధ్యమున విజేతవైనపుడు ఉన్నతుడవగుటకుగాను - అట్టిసోమభాగమును సేవింపుము.

    2. ధనిక ఇంద్రా! స్తోతలను రక్షింపుము. సోమపానము చేసి నిన్ను నీవు రక్షించుకొనుము. సజ్జనస్వామి, మరుద్యుక్త ఇంద్రా! దేవతలు నీ కొరకు సోమభాగమును నిశ్చయించినారు. నీవు సకల శత్రుసేనను, దానివేగమును విరిచిప్పుడు - జలమధ్యమున విజేతవై నపుడు ఉన్మత్తుడవగుటకుగాను - అట్టి సోమభాగమును సేవింపుము.

    3. అన్నమున దేవతలను రక్షింతువు - నీబలమున నీవే నిన్ను రక్షించు కుందువు. సజ్జనస్వామి, మరుద్యుక్త  ఇంద్రా! దేవతలు నీ కొరకు సోమభాగమును నిశ్చయించినారు. నీరు సకల శత్రుసేనను, దానివేగమును  విరిచినప్పుడు - జలమధ్యమున విజేతవైనపుడు ఉన్మత్తుడవగుటకుగాను - అట్టి సోమభాగమును సేవింపుము.

    4. నీవు ద్యులోకము మరియు భూలోకములకు జనకుడవు. సజ్జనస్వామి, మరుద్యుక్త ఇంద్రా దేవతలు నీ కొరకు సోమభాగమును నిశ్చయించినారు. నీవు సకల శత్రుసేనను, దానివేగమును విరిచినప్పుడు - జలమధ్యమున విజేతవై నపుడు ఉన్మత్తుడవగుటకుగాను అట్టి సోమభాగమును సేవింపుము.

    5. నీవు అశ్వములకు, గోవులకు సజ్జన స్వామి, మరుద్యుక్త నీవు సకల శత్ర్రుసేనను, దానివేగమును విరిచినప్పుడు - జలమధ్యమున విజేతవై నపుడు ఉన్మత్తుడవగుటకుగాను - అట్టి సోమభాగమును సేవింపుము.

    6. పర్వతవంత ఇంద్రా! అత్రిజనులమగు మా యజ్ఞమును  పూజితము చేయుము. సజ్జనస్వామి, మరుద్వంతుడవగు ఇంద్రా! దేవతలు నీ కొరకు సోమభాగమును నిశ్చయించినారు. నీవు సమస్త శత్రుసేనలను, వాటివేగమును విరిచినప్పుడు, జల మధ్యమున విజేతవైనపుడు ఉన్మత్తుడవగుటకుగాను - అట్టి సోమభాగమును సేవింపుము.

    7. ఇంద్రా ! నీవు యజ్ఞకర్త అత్రిఋషి స్తుతిని విని ఉన్నావు. అట్లే సోమాభిషవకర్త శ్యావాశ్వుని స్తుతులు వినుము. నీవు ఒక్కడవే నిలిచి యుద్ధమున స్తోత్రములను వర్తిల్ల చేసినావు. ఒక్కడవే త్రసదస్యుని రక్షించినావు.

                                   ముప్పది ఏడవ సూక్తము
                     ఋషి - శ్యావాశ్వ ఆత్రేయుడు, దేవత - ఇంద్రుడు ,
                  ఛందస్సు - మొదటిది అతిజగతి - మిగిలినవి మహాపంక్తి.


    1. యజ్ఞపతి ఇంద్రా ! యుద్ధమున సకల రక్షణలతో ఈ బ్రాహ్మణమును - స్తోత్రమును రక్షింపుము- సోమాభిషవమును కూడ రక్షింపుమును కూడ రక్షింపుము. "అనింధ్యుడు, వజ్ర, వృత్రఘ్న ఇంద్రుడు మధ్యందిన సవనపు  సోమమును  పానము చేయవలెను" "మధ్యం దినస్ప సవనస్య వృత్రహన్ననేధ్య పిబసోమస్య వజ్రవః"

    2. కర్మపతియు, ఉగ్రుడవగు ఇంద్రా ! శత్రునేనలను పరాభవించి సకల రక్షణలతో బ్రహ్మణమును - స్తోత్రమును - రక్షింపుము. " మధ్యందినస్స సవనస్స వృత్రహన్న నేద్య పిబసోమస్య వజ్రవః"

    3.యజ్ఞపతి ఇంద్రా ! ఈ  భువనములకు  ఏకమాత్ర ప్రభువవు. సకల రక్షణలయుక్తుడవై శోభిల్లుదువు. " మధ్యందినస్స సవనస్స వృత్రహన్న నేద్య పిబసోమస్య వజ్రవః"

    4. యజ్ఞపతి ఇంద్రా ! ఈ ఉభయలోకములు సమాన రూపముగలవి వానిని నీవే వేరుచేసినావు. " మధ్యందినస్స సవనస్స వృత్రహన్న నేద్య పిబసోమస్య వజ్రవః"

    5. యజ్ఞపతి ఇంద్రా! సకల రక్షణల. ఉక్తుడవగు నీవు సమస్తలోకములకు, శుభములకు, యోగక్షేమములకు ఈశ్వరుడవు. " మధ్యందినస్స సవనస్స వృత్రహన్న నేద్య పిబసోమస్య వజ్రవః"

    6. యజ్ఞపతి ఇంద్రా! సమస్త రక్షణయుక్తడవై  లోకములకు బలమవగుము. ఆశ్రితులకు రక్షకుడవగుము. "మధ్యందినస్సవస్స వృతరహన్ననేద్య పిబసోమస్స వజ్రవః"

    7. ఇంద్రా ! నీవు యజ్ఞకర్త అత్రిఋషి స్తుతులు విని ఉన్నావు. అట్లే సోమాభిషవకర్త శ్యావాశ్వుని స్తుతులు వినుము. నీవు ఒక్కడవే నిలిచి యుద్ధమున స్తోత్రములను వర్థిల్ల చేసినావు ఒక్కడవే త్రసదస్సు రక్షించినావు.
   
                                ముప్పది ఎనిమిదవ సూక్తము
       ఋషి - శ్యావాశ్వుడు దేవత - ఇంద్రాగ్నులు ఛందస్సు - గాయత్రి

    1. ఇంద్రాగ్నులారా! మీరు పరిశుద్ధలు. ఋత్విక్కులు. "యుద్ధములందున, కార్యములందును యజమానినగు ణా స్తుతిని గ్రహించుము...." వాజేషు కర్మసు! ఇంద్రాగ్నేతస్య బోధితమ్.

    2. ఇంద్రాగ్నులారా! మీరు శత్రుహింసకులు రథములందు సంచరించువారు. వృత్రఘ్నలు. అజేయులు ఇంద్రాగ్నేతస్య బోధితమ్, మీరు నన్ను గుర్తించండి.

    3.యజ్ఞనేతలు మీ కొరకు శిలలతో ఈ మదకర సోమమును సిద్ధము చేసినారు. "ఇంద్రాగ్నేతస్యబోధితమ్" ఇంద్రాగ్నులారా నన్ను గుర్తించండి.

    4. ఒకేసారిస్తుత్యులు, నేతలగు ఇంద్రాగ్నులు యజ్ఞమును సేవించవలెను.  యజ్ఞముకొరకు అభిషుత సొమ్ము వైపు విచ్చేయండి. "ఆగతంనరా"

    5. ఇంద్రాగ్నులారా ! మీరు నేతలు. మీరు దేనిద్వారా హవ్యము సేవింతురో ఆసవనమును స్వీకరించండి. రండి "ఆగతంనరా"

    6. నేతలగు ఇంద్రాగ్నులారా ! గాయత్రిమార్గపు సుందర స్తుతినిస్వీకరించండి. రండి. "ఆగతంనరా"

    7. ధనవిజేతలగు ఇంద్రాగ్నులారా ! ప్రాతఃకాలమున దేవతల సహితులై సోమపానమునకు విచ్చేయండి.

    8. ఇంద్రాగ్నులారా ! సోమపానమునకుగాను - సోమాభిషవ కర్త శ్వావాశ్వుని ఋత్విజుల ఆహ్వానము వినండి.

    9. ఇంద్రాగ్నులారా ! ప్రాజ్ఞులు మిమ్ముపిలిచినారు. వారి వలెనే నేను రక్షణ, సోమపానమునకు మిమ్ము పిలుచుచున్నాను.

    10. సామగానములు చేయబడునట్టి స్తుతివంతులగు ఇంద్రాగ్నులను రక్షణల కొరకు ప్రార్ధించుచున్నాను.
   
                                 ముప్పది తొమ్మిదవ సూక్తము
        ఋషి - కాణ్వనాభాకుడు, దేవత - అగ్ని , ఛందస్సు - మహాపంక్తి.

    1. అగ్ని ఋక్మంత్రయోగ్యుడు నేను అతనిని స్తుతింతును. యజ్ఞమునకుగాను స్తుతులతో అగ్నిని స్తుతింతును. అగ్ని మా యజ్ఞమందు హవ్యములందించి, దేవతలను పూజించవలెను. కవియగు అగ్ని స్వర్గ - భూములమధ్య దౌత్యము నిర్వహించును. అగ్ని సకల శత్రువులను వధించవలెను.

    2. అగ్నీ! నవీన స్తోత్రములతో మా శత్రువులను వధించుము హవ్యదాత శత్రువులను దహించుము. ఎదురుగా ఏతెంచు మూఢశత్రువు లందరు వెళ్లపోవలెను. అగ్ని సకల శత్రువులను వధించవలెను.
   
    3. అగ్నీ! ఇది ఘృతసమాన సూక్తము. దీనితో నీ నోటిలో హౌమము చేయుదురు. దేవతలందు నీవు మా స్తోత్రము వినుము. నీవు ప్రాచీనుడవు. సుభదుడవు దేవదూతవు. నీవు సకల శత్రువులను వధించుము.

    4. స్తోతలు వివిధమగు అన్నము అర్థిందురో అగ్ని ఆవిధముగా అన్నమును అందించును యజమానులు అగ్ని అన్నద్వారమున ఆహ్వనింతురు. అగ్ని వారికి శాంతియుత సుఖమును ప్రసాదించును. అగ్ని దేవతల ఆహ్వానములందు ఉండును. అగ్ని సకల శత్రువులను వధించవలెను.
   
    5. అగ్ని అభిషవ కారకములగు అనేక కార్యములు చేసినాడు. అతనిని జనులు ఆకర్మముల వలననే తెలిసి కొందురు. అతడు సమస్త దేవతలకు హౌత. అతనిని పశువులు చుట్టుముట్టినవి. అతడు శత్రువులకు ఎదురుగా ఏనుగు. అగ్ని సకల శత్రువులను వధించవలెను.

    6. అగ్నికి దేవతల జన్మలు తెలియును. మనుష్యుల రహస్యములు తెలియును. అగ్ని ధనప్రదాత. అగ్ని అభివన హవ్యములతో ఆహ్వానించ బడును. ధనముద్వారా ప్రకటితుడు అగ్ని సకల శత్రువులను వధించవలెను.

    7. అగ్ని దేవతలలో ఉండును. యజ్ఞార్హ ప్రజాగణమున ఉండును. భూమి సమస్తజగత్తులను పోషించును అట్లే అగ్ని సంతోషముగా సమస్త కార్య దేవతలందు యజ్ఞయోగ్యుడు. అతడు సకల శత్రువులను వధించవలెను.

    8. అగ్ని ఏడుగురు మానవులవాడు. సకల నదులందు ఉన్నవాడు. మూడుస్థానములందు వసించువాడు. యవ్వనాశ్వ పుత్రుడు మాంధాతకొరకు అగ్ని ఎక్కువమంది దస్యులను వధించినాడు. అగ్ని యజ్ఞములందు ముఖ్యుడు. అగ్ని సకల శత్రువులను వధించవలెను.

    (ఏడుగురు మానవులు సప్తసింధుప్రాంతమున వశించువాడు మూడు స్థానములు భూమి, ద్యులోకము, అంతరిక్షము)

    9. అగ్ని పండితుడు అతడు మూడు స్థానములందుండును. అగ్నిదూత అగ్ని ప్రాజ్ఞుడు అగ్ని అలంకరించుకోని ఈ యజ్ఞమున ముప్పదిముగ్గురు దేవతల యజ్ఞము చేయవలెను మా కోరికలు తీర్చవలెను. అగ్ని సకల శత్రువులను వధించవలెను.

    10. ప్రాచీన అగ్నీ! నీవు వంటరివి అయినను మానవులకు దేవతలకు ఈశ్వరుడవు. నీవు సేతు స్వరూపుడవు నీనలువైపుల జలము ప్రవహించును. అగ్ని సకల శత్రువులను వధించవలెను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.