Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



                             మూడవ అష్టకము

        శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
        ప్రసన్నవదనం ధ్యాయేత్పర్వ విఘ్నోపశాంతయే ||

            మూడవ మండలము

    మొదటి అధ్యాయము             మొదటి అనువాకము

                             ఏడవ సూక్తము
   
        ఋషి విశ్వామిత్రుడు, దేవత-అగ్ని, ఛందస్సు-త్రిష్టుప్.

    1. అగ్ని శ్వేతపృష్ఠుడు. సకలము ధరించువాడు. అగ్ని కిరణములు ఉత్తమముగా ఉదయించును. అవి అగ్నికి మాతా పితృరూపులయిన ద్యావాపృథ్వులందు ప్రవేశించును. అవి సప్తనదులందు ప్రవేశించును. నలువైపులున్న అగ్నికి మాతాపితరు రూపులయిన ద్యావాపృథ్వులు సకలమున వ్యాపించి ఉన్నవి. చక్కగా యజ్ఞము జరుగుటకుగాను అవి అగ్నికి దీర్ఘాయువు ప్రసాదించును.   

    2. ద్యులోకవాసియగు ధేనువే అభీష్టవర్షి అగ్నికి అశ్వము. జలవాహినులు, ప్రకాశవంతులగు నదులు అగ్నికి నివాస స్థానము. అగ్నీ ! నీవు 'సత్యము' యొక్క గృహమున నిలువదలతువు. "ఋతస్య త్వాపదపి" నీ జ్వాలను ప్రసాదింతువు. అగ్నీ ! ఒక్క ఆవు లేక మాధ్యమిక వాక్కు నిన్ను సేవించును.

    3. అగ్ని ధనవంతులలో శ్రేష్ఠ ధనస్వామి. జ్ఞానవంతుడు. అధిపతి. అతసు సుఖమును నియంత్రించగల వడవలను, అధిరోహించినాడు. అగ్ని శ్వేతపృష్ఠుడు. నలువైపుల వ్యాపించువాడు. అతడు తన నిరంతర గమనమునకుగాను వడవలను విడిచినాడు.

    (శాయణుడు వడవాః అన్నాడు. ఇవి సుశిక్షితములగు అశ్వములు లేక కిరణములు కావచ్చును. అగ్ని అంటుకున్నపుడు కిరణములుండును. జ్వాలామూర్తి అయినపుడు కిరణములను విడుచును).

    4. నదులు జలము కలిగించునవి. ప్రవహించునవి. అవి అగ్నిని ధరించినవి. అగ్ని మహితాత్ముడు. త్వష్ట పుత్రుడు. జరారహితుడు. సకల విశ్వములను ధరించు అభిలాషి, పురుషుడు ఒకే స్త్రీ వద్దకు పోవును. అట్లే అగ్ని నదుల వద్దకు పోవును. ప్రదీప్తుడు అగును. ద్యావాపృథ్వులందు ప్రవేశించును.

    5. అగ్ని అభీష్టవరదుడు. అహింసకుడు. జనులు అగ్నియొక్క ఆశ్రయ జనిత సుఖమును ఎరుంగుదురు. అగ్నికి అజ్ఞానువర్తులు అగుదురు. మానవుల శ్రేష్ఠ స్తుతిరూప వాక్యములు ఎన్నదగినవి అయినపుడు వారు ద్యులోకదీప్తికర్తలు, శోభనులు, దీప్తియుక్తులు అయి విరాజిల్లుదురు.

    6. మహామహులకు మహామహులయిన మాతా పితృరూప ద్యావా పృథ్వులను అగ్ని గ్రహించినాడు. అట్టి అగ్నిని యజమాని ఉచ్ఛస్వరమున స్తుతించినాడు. అట్టి స్తుతి జనిత సుఖము అగ్నిని చేరినది. జలసేచన కర్త అగ్ని రాత్రిపూట నలువైపుల వ్యాపించిన స్వకీయ తేజస్సును స్తోతవద్దకు పంపినాడు.

    7. అయిదుగురు అధ్వర్యులు, ఏడుగురు హోతల సహితులయి గమనశీల అగ్నిప్రియ స్థానమును రక్షింతురు. దేవతలు దేవతుల్య స్తోతల యజ్ఞములకు విచ్చేయుదురు. అందువలన సోమపానము కొఱకు పూర్వదిశకు వెళ్లుజరారహిత, సోమరస వర్షి స్తోతలు ప్రసన్నులు అగుదురు.

    8. దైవ హోతవరులు-దివ్యస్వరూపులునగు రెండు ముఖ్య అగ్నులను నేను, విశ్వామిత్రుడును అలంకరించుచున్నాము. హోతలు ఏడుగురు సోమము ద్వారా ప్రసన్నులు అగుదురు. స్తోతకర్త, యజ్ఞ రక్షకుడు. దీప్తిశాలి అగు హోత "అగ్నియే సత్యము" అగును. "ఋతమిత్త ఆహు"

    9. అగ్నీ ! నీవు దేదీప్యమానుడవు. దేవదూతవు. మహాహనుడవు. అందరిని అతిక్రమించువాడవు. అనేక వర్ణములవాడవు. అభీష్టవర్షివి. నీ కొఱకు అతి విస్తృతములు, సర్వత్ర వ్యాప్తములగు జ్వాలలు వృషభమువలె సంచరించును. నీవు మాదకుడవు. జ్ఞానివి. నీవు పూజ్య దేవతలను, ద్యావాపృథ్వులను ఈ యజ్ఞమునకు ఆహ్వానింతువు.

    10. ఉషఃకాలమున అన్నము ద్వారా యజ్ఞము ప్రారంభము అగును. ఉషఃకాలము శుభంకరవాక్య యుక్తము అగును. ఉషఃకాలము మానవులసందడి, పక్షుల కిలకిలారావములతో మనోహరము అగును. అట్టి ఉషస్సులు గమనశీలుడగు అగ్నికొఱకు ధనవంతము, ప్రకాశవంతము అగును. అగ్నీ ! నీవు మహిమాన్వితుడవు. యజమాని పాపములను నశింప చేయుము.

    11. అగ్నీ ! స్తోతలకు కర్మభూమియు, ధేను ప్రదాత్రియునగు భూమిని ప్రసాదించుము. మాకు వంశవర్ధనుడు, సంతతిజనియు అగు పుత్రుడు కలుగవలెను. నీవు మమ్ము అనుగ్రహింపుము. 

                              ఎనిమిదవ సూక్తము

         ఋషి - విశ్వామిత్రుడు, దేవత - యూపము, విశ్వదేవతలు
                  ఛందస్సు - అనుష్టుప్, తక్కినవి త్రిష్టుప్.

    1. వనస్పతులారా ! దేవతల అభిలాషులు అగు అధ్వర్యులు దేవసంబంధమగు మధువుద్వారా మిమ్ము అభిషేకింతురు. మీరు ఉన్నత ఆశయము కలవారయినను మాతృభూతము భూమి వడిలో శయనించినను మాకు ధనములు ప్రసాదించుడు.   

    ("మధుదివ్యం యదాజ్యం" అన్నాడు శాయణుడు. దైవమధువు అనగా ఆజ్యము అని అర్థము. మధుర భావము అని దయానందుడు. దైవ్య గానములు అని గ్రీఫిత్. మధువు తేనె కూడ అగును)

    2. యూపమా ! నీవు సమిద్ధ లేక ఆహవనీయ అగ్నికి పూర్వదిశలో నిలువుము. అజరము, సుందరము, అపత్యయుక్తమగు ధనములు ప్రసాదించుము. మహా సంపదల ఔన్నత్యమునకు ఎదుగుము.

    (యజ్ఞమున స్థాపించు బలిస్తంభము యూపము)

    3. వనసప్తీ ! నీవు భూమిమీద ఉత్తమ యజ్ఞప్రదేశమున ఉత్పన్నమగుము. నీవు సుందర పరిమాణయుక్తవు. యజ్ఞ నిర్వాహకునకు అన్నము అనుగ్రహింపుము.

    4. యూపము దృఢాంగము, సుందర జిహ్వవంతము, జిహ్వాపరివేష్టితము. అట్టి యూపము విచ్చేయవలెను. సమస్త వనస్పతులకన్న యూపమే ఉత్తమ రూపమున ఉత్పన్నమయినది. జ్ఞానులగు మేధావులు హృదయములందు దేవతలను నిలిపి, మంచిధ్యానమున, యూపమును ఆరోహింప చేసెదరు.

    5. భూమి మీద యూపము వృక్షరూపమున ఉత్పన్నమయినది. మానవులతోపాటు యజ్ఞమున సుశోభితము అయినది. యూపము దినములను సుదినములు చేయును. కర్మనిష్ఠులు, విద్వాంసులు అధ్వర్యులు ఆ యూపమును ప్రక్షాళనచేసి పరిశుద్ధము చేసెదరు. దేవతల యాజకులు మేదావులగు హోతలు మంత్రోచ్చారణ చేయుదురు.

    6. యూపమా ! దేవాభిలాషులు, కర్మలకు నాయకులు అధ్వర్యాదులు నిన్ను అవటమున ప్రతిష్టించినారు. పాతినారు. కుఠారము గొడ్డలి నిన్ను కొట్టినది. నీవు కాష్ఠఖండములుగల దీప్తిమంతుడవు. మాకు అపత్య సహితమగు ఉత్తమ ధనమును ప్రసాదించుము.

    7. యూపము భూమిమీద పరశువుతో కోయబడినది. ఋత్విక్కులచే పాతబడినది. అది యజ్ఞ సాధకము అగును. ఆ యూపములు అన్నియు మా హవ్యములను దేవతలకు చేర్చవలెను.

    8. ఆదిత్యుడు, రుద్రుడు, వసువు, ద్యావాపృథ్వులు, అంతరిక్షము వీరందరు కలిసి ఈ యజ్ఞమును రక్షించవలెను. యూపధ్వజారోహణము చేయవలెను.

    9. దీప్త వస్త్రమున ఆచ్చాదితము, హంసలవలె శ్రేణీపూర్వక గమనవంతము, ఖండయుక్త యూపము మా వద్దకు రావలెను. మేధావులు అధ్వర్యులచే యజ్ఞపూర్వ దిశన ఆరోహించబడిన యూపములు అన్నియు దేవమార్గమును అవలంబించును.

    10. సుస్వరూపలు ఖండవంతములగు యూపములు పశువుల శృంగములవలె భూమికి శృంగములయి మొలిచినట్లు కనిపించును. యజ్ఞమున ఋత్విక్కుల స్తుతులను విను యూపము యుద్ధమున మమ్ము రక్షించవలెను.

    11. వనస్పతీ ! మొదటికి నరుకబడిన స్థాణువా ! ఈ పదునైన పరశువు నీకు మహా సౌభాగ్యమును ప్రసాదించినది. నీవు వందల శాఖలు గలదానవయి పుట్టుము. మేము కూడ వేలశాఖలు గలవారలమై ఆవిర్భవింతుము. "సహస్ర వల్శావివయం రుహేమ." 

                                తొమ్మిదవ సూక్తము

        ఋషి - విశ్వామిత్రుడు, దేవత - అగ్ని, ఛందస్సు 1-8 బృహతి, 9 త్రిష్టుప్.

    1. అగ్నీ ! నీవు జలములకు పౌత్రుడవు. సుందర ధనవంతుడవు. దీప్తిమంతుడవు. నిరుపద్రవివి. లోకములకు ప్రాప్తవ్యుడవు. మేము నీకు మిత్రులవంటి వారలము. మనుష్యులము. మా రక్షణకుగాను నిన్ను ప్రార్థించుచున్నాము.

    2. అగ్నీ ! నీవు సమస్త అరణ్యములను రక్షింపుము. మాతృరూప జలమున చేరి శాంతుడవు అగుము. నీవు సర్వదా శాంతముగా ఉండుట సహించరానిది. కావున దూరముగా ఉన్నను సన్నిహితుడవు అగుము. "దూరేపన్నిహాభవ"

    3. అగ్నీ ! నీవు స్తోతల మనోకామనలను గుర్తింతువు. సంతుష్టుడవు అగుదువు. నీవు పదహారుమంది ఋత్విక్కులతో స్నేహముగా ఉందువు. వారిలో కొందరు విశేషరూపమున హోమము చేయుటకు సాగుదురు. మిగిలినవారు నలువైపుల కూర్చుందురు.

    4. అగ్ని గుహలో ఉన్న సింహమువలె జలములందు ఉన్నవాడు, శత్రువులను, బహుసేనలను ఓడించువాడు. అట్టి అగ్నిని ద్రోహరహితులు, చిరంజీవులగు విశ్వదేవతలు గ్రహించినారు.

    5. గాలి తిరుగుడు కొడుకును తండ్రి గుంజుకొని వచ్చును. అట్లే స్వచ్చందముగా దాగినవాడును మంథనమున లభించువాడును అగు అగ్నిని "మాతరిశ్వ' దేవతల వద్దకు తెచ్చినది.

    6. అగ్ని సర్వదా మానవుల హితము కోరువాడు. నిరంతర తరుణ వయస్కుడు. అగ్నీ ! నీవు నీ మహిమవలన సమస్త యజ్ఞములను విశేష రూపమున పాలించెదవు. అందువలననే హవ్యవాహనుడవు అగు నిన్ను మానవులు దేవదూతగా గ్రహించినారు.

    7. అగ్నీ ! సాయంకాలమున నీవు సమిధవంతుడవు అగుదువు. అప్పుడు సకల జంతువులు నీవద్ద కూర్చుండును. ఈ నీ మనోహర కార్యము బాలునివలె అజ్ఞునకు సహితము ఫలప్రదానము చేసి సంతుష్టి కలిగించును.

    (బాలుడు పసివాడు అందరిని మురిపించును. అట్లే అగ్నియు. అతనిని ఎరుగవలసిన పనిలేదు)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.