Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

     ధృతరాష్ట్రుడు ద్రౌపదికి అడిగిన వరము ఇచ్చినాడు. మరొక వరము కోరమన్నాడు.
    "మహారాజా! ధర్మరాజు తమ్ములు భీమార్జున, నకుల, సహదేవులకు దాస్య విముక్తి కలుగవలెను. వారివారి వస్త్రాది భూషణములు శస్త్రాస్త్రాది సాధనములు వారికి లభించవలెను."
    ధృతరాష్ట్రుడు ద్రౌపది అడిగిన వరము ఇచ్చినాడు. మరొక వరము కోరమన్నాడు.
    "మామగారూ! వైశ్యస్త్రీ ఒక్క వరమును, క్షత్రియస్త్రీ రెండు వరములను , శూద్ర స్త్రీ మూడు వరములను , బ్రాహ్మణ స్త్రీ  నూరువరములను కోరవచ్చును. అంతకుమించి కోరరాదని చెప్పబడినది. కాబట్టి నేను మూడవ వరము కోరను" అన్నది ద్రౌపది.
    ద్రౌపది గుణములకు జ్ఞానమునకు ధృతరాష్ట్రుడు మెచ్చినాడు. అతడు ధర్మరాజాది పాండవులకు పిలిపించినాడు.
    "ధర్మజా! నీవు జూదమందు ఓడిన సర్వజనులను సంపదలను రాజ్యమును, నీవే గ్రహింపుము. నీవు ఎప్పటివలె సర్వజన సంపద రాజ్యము కలవాడవై ఇంద్రప్రస్థమునందు సుఖముగా ఉండుము. నీవు పెద్దలను సేవించినావు. సకల ధర్మములు తెలిసినావు. నా కొడుకు దుర్యోధనుడు తెలివిలేనివాడు. వాడు నీకు అపరాధము చేసినాడు. ఆవిషయమును నీవు మరువవలెను. మనసున విరోధము లేకుండుట, మంచి గుణములను గ్రహించి చెడు గుణములను విడుచుట శ్రేష్ఠ పురుషుల లక్షణము. నేను బుద్దిలేనివాడను అయినాను. జూదము మాన్పించలేక పోయినాను. నేను అల్పబుద్దిని. పుట్టంధుడను. కాబట్టి నన్ను, నీ తల్లి గాంధారిని తలచుకొని దుర్యోధనుని మన్నింపుము. అతని దుర్గుణములను తలపునకురానీయకు. సర్వశాస్త్రవేత్త విదురుడు నాకు మంత్రి, సర్వధర్మవేత్తవగు నీవు నాకు రక్షకుడవు. మీరిద్దరి వలన కురుకులమునకు మేలు కలుగును. సుఖముగా వెళ్ళుము. నీకు మేలు కలుగును."
    ఆ విధముగా ద్రౌపది వలన పాండవులకు మరల రాజ్య సంపదలు లభించినవి. భీమునకు అది నచ్చలేదు. అతడు ధర్మరాజుతో "అన్నా! ద్రౌపది మనకు రాజ్యము ఇప్పించినది. స్త్రీ మూలకముగా ఆస్తిని ఆర్జించుట కున్న హీనము ఈలోకమున లేదు. అంతకన్న పౌరుష హీనత్వము మరొకటి లేదు. కావున ఆయుధము ధరించి విజ్రుంభీంతును. యుద్దమున సర్వశత్రువులను సంహరింతును. రాజ్యమును సాధింతును." అని కోపమున నిప్పులు కురిపించినాడు.
    ధర్మరాజు భీముని శాంతింప చేసినాడు. ధృతరాష్ట్రుని అజ్ఞ ప్రకారము తమ్ములను ద్రౌపదిని వెంట బెట్టుకొని బంగారు రధమును ఎక్కి ఇంద్ర ప్రస్థము చేరుకున్నాడు.

                                                          ఆలోచనామృతము

1. రామాయణమున అయోధ్యకాండము, భారతమున సభాపర్వము కధాగమనమున ప్రధానములయిన మలుపులకు కారకములు. ఒకదాన సవతి తల్లి దురాలోచన, మరొక దానియందు పెదతండ్రి దురాలోచన తరువాతి పరిణామములకు కారణములు.
    అక్కడ, ఇక్కడ పుత్రేషణయే ప్రధాన కారణములు. మరెన్నో సారూప్యతలు ఉన్నవి. వానిని గురించి చర్చించుటకు ఇది సమయము కాదు. స్థలము చాలదు.
2. దుర్యోధన సభ ఒక సభ మాత్రము కాదు. మానవ లోకమునకు వ్యాసమహర్షి కల్పించిన ప్రతిరూపము. ఇందు మానవ సమాజమునకు సంబంధించిన అనేక మౌలిక సూత్రములు, నిత్య సత్యములు ఇమిడి ఉన్నవి.
    i) కష్టపడి అర్జించుకున్నంత మాత్రము చాలదు. దానిని కాపాడుకొనుట ముఖ్యము. పాండవులు తమ బలపరాక్రమములతో రాజ్యమును సాధించుకున్నారు. సామాన్య మానవుడు కూడ అంతే! తాను కష్టించి సంపాదించుకొనుము.
    ii) శ్రమ ఫలితము కాజేయుశక్తులు సర్వకాలములందున్నవి. అవి ఎన్నో మాయోపాయములను ప్రయోగించును. వారు స్వయముగా కష్టించరు. ఇతరుల శ్రమను కాజేతురు వారు పరాన్నభక్కులు. పాండవులు శ్రమించి ఆర్జించుకున్న దానిని జూదపు నెపమున దుర్యోధనుడు సునాయాసముగా కాజేసినాడు.
    iii) శ్రమించి సాధించుకున్నవారు అప్రమత్తులై ఉండకున్న వారికి శ్రమ ఫలితము దక్కదు.
    iv) రాజకీయ మదాంధత ముందు ఏ శాస్త్రమును పనికి రాకున్నది. దుర్యోధనుని సభ యందు భీష్మ ద్రోణాది ధర్మజ్ఞులున్నారు. అయినను దుర్యోధనుని మదాంధత ముందు పెదవి కదల్పలేకపోయినారు.
    నేటి పరిస్థితి అందుకు ఏమాత్రము భిన్నముగా లేదు. జాతీయముగను, అంతర్జాతీయముగను శాస్త్రజ్ఞులు , ధర్మజ్ఞులు, శాంతి, న్యాయము, ధర్మమును గురించి ఎలుగెత్తి చాటుచున్నారు. అయినను రాజకీయ బలము కలవారు మారణాయుధములను సృష్టించి అశాంతిని, తమ బలము కొఱకు అన్యాయమును పరులను లేక పరదేశములను బలహీనపరచుటకు అధర్మమును బహిరంగముగా ఆచరించుచున్నారు.
    నీతి శాస్త్రములు సామాన్యుని కొఱకు , రాజకీయబలము వాటిని లెక్కచేయదు.
v. ఒక్కొక్కసారి రాజకీయ మదాంధత తాను ఏర్పరచుకున్న హద్దులను కూడ అతిక్రమిస్తుంది. అమానుష కృత్యాలు చేస్తుంది. అప్పుడు ఆ దౌష్ట్యమును ఎదిరించువారు లేనప్పుడు రాజకీయాలలోనే అసమ్మతి కలుగును. వ్యక్తము అగును.
    దుర్యోధనుడు చేయుచున్న అమానుష, కృత్యమును ఎదిరించుశక్తి బయటవారికి లేకపోగా కౌరవులలోని వాడే వికర్ణుడు అసమ్మతి వ్యక్తపరచినాడు. ధృతరాష్ట్రుడే దుర్యోధనుని ప్రయత్నమును వమ్ము చేసినాడు.
    ఇందుకు ఈమధ్య జరిగిన ఒక వృత్తాంతమును ఉదాహరించవచ్చు. ఇజ్రాయిల్ దేశము తన బల గర్వమున అంతర్జాతీయ సూత్రములన్నింటిని అతిక్రమించి లెబనాన్ దేశముపై దండెత్తి, పాలస్తీనా శరణార్ధులను దారుణముగా అమానుషముగా ఊచకోత కోసినది. అందుకు వ్యతిరేకముగా ప్రపంచము సాంతము ఆక్రోశించినది. ఇజ్రాయిల్ వినలేదు. అంతరంగిక అసమ్మతికి ఇజ్రాయిల్ లొంగవలసి వచ్చినది. ఎదుటివారు నిర్వీర్యులయినపుడు తన వారిలోనే ప్రతిపక్ష బీజములు మొలకేత్తును. నేటి భారతదేశపు రాజకీయ స్థితి కూడ ఇట్లే ఉన్నది. ఒక్క వికర్ణునితో ఇంత మహత్తర సత్యమును నిరూపించినాడు వ్యాసదేవుడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.