Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    10. ధనాభిలాషులగు ప్రజలు తమ ప్రభువగు మేధావి అగ్నిని కరవాలము చక్కపరచినట్లు సంస్కరింతురు. అగ్ని ఉన్నత, నిన్ను ప్రదేశములకు వ్యాపించును. సాగును. సకల భువనములను గర్భమున ధరించును.

    11. వైశ్వానర అగ్ని నవజాతుడు. అభీష్టవరదుడు. అతడు నానాస్థానములందు సింహమువలె గర్జించును. అనేక జఠరములందు వర్ధిల్లును. అతడు అత్యంత తేజస్వి. మరణ రహితుడు. యజమానికి రమణీయ వస్తువులు ప్రసాదించును.

    12. వైశ్వానరుడు స్తోతలకు స్తవనీయుడు. అతడు అనాది పురుషుని వలె అంతరిక్షపు వీపున ఎక్కును. అతడు ప్రాచీన ఋషులవలె యజమానులకు ధనములు ప్రసాదించును. జాగృతులను చేయును. వైశ్వానరుడు దేవతల సాధారణ మార్గమున సూర్యరూపమున పరిభ్రమించును.

    13. ద్యులోకవాసులు బలవంతులు. యజ్ఞార్హులు. మేధావులు. స్తుతియోగ్యులు. వారు అగ్నిని ద్యులోకము నుండి తెచ్చినారు. వాయువు ద్వారా పృథ్విమీద ప్రతిష్ఠింప చేసినారు. అట్టి అగ్ని నానాగతిమంతుడు. పింగళ కిరణవంతుడు. ప్రకాశమానుడు. ఆ అగ్ని నుండి మేము నవీన ధనమును అర్థించుచున్నాము.

    14. అగ్ని ప్రదీప్తుడు. యజ్ఞగమనకారి. సర్వపదార్థజ్ఞాత. ద్యులోకమునకు పతాక స్వరూపుడు. సూర్యాంతర్గతుడు. ఉషఃకాలమున జాగృతుడు. అన్నవంతుడు. మహామహుడు. అట్టి అగ్నిని మేము స్తోత్రముల ద్వారా యాచించుచున్నాము.

    15. అగ్ని స్తోతవ్యుడు. దేవతలను ఆహ్వానించువాడు. సర్వదా పరిశుద్ధుడు. అకుటిలుడు. దాత. శ్రేష్ఠుడు. విశ్వదర్శకుడు. రథమువలె బహువన్నెలవాడు. దర్శనీయరూపి. సదామానవుల కళ్యాణ కర్త. అట్టి నేను ధనము యాచింతును.

                             మూడవ సూక్తము

        ఋషి-విశ్వామిత్రుడు, దేవత-వైశ్వానర అగ్ని, ఛందస్సు-జగతి.

    1. మేధావులగు స్తోతలు సన్మార్గ ప్రాప్తికొఱకు బహు బలశాలి. వైశ్వానరుని గూర్చిన యజ్ఞమున రమణీయ స్తోత్రములను పఠింతురు. అమరుడగు అగ్ని హవ్యప్రదానము ద్వారా దేవతలను సేవించును. అందువలన ఎంతటివాడును, సనాతన యజ్ఞమును దూషితము చేయలేడు.

    2. అగ్ని దర్శనీయుడగు హోత. అతడు దేవదూతగా ద్యావాపృథ్వులమధ్య సంచరించును. ధీమంతుడగు అగ్ని దేవతల ద్వారా ప్రేరితుడగును. యజమానిముందు ప్రతిష్ఠించబడును. ఉపవిష్టుడగును. మహాయజ్ఞమును అలంకృతము చేయును.

    3. అగ్ని యజ్ఞకేతన స్వరూపుడు. యజ్ఞసాధకుడు. మేధావిజనులు తమవీరకృత్యముల ద్వారా అగ్నిని పూజింతురు. స్తోతలు తమకు యోగ్యములయిన కర్మలను అగ్నికి అర్పింతురు. అగ్ని అట్టి యజమానుల సుఖములను ఆశించును.
    4. అగ్ని యజ్ఞ పిత. స్తోతలకు బలదాత. ఋత్విక్కులకు జ్ఞానదాత. యజ్ఞాది కర్మలకు సాధనభూతుడు. అట్టి అగ్ని పార్థివ, వైద్యుతాది రూపముల ద్యావాపృథ్వులందు ప్రవేశించును. అత్యంత ప్రియుడు, తేజస్వి అగ్ని యజమానులచేత స్తుతించబడును.

    5. వైశ్వానరాగ్ని ఆహ్లాదకుడు. ఆహ్లాద జనక రథపువాడు. పింగళవర్ణుడు. జలమధ్యవాసి. సర్వజ్ఞుడు. సర్వ వ్యాప్తుడు. శీఘ్రగామి. బలశాలి. భర్త. దీప్తివంతుడు. దేవతలు వైశ్వానరాగ్నిని ఈ లోకమున స్థాపించినారు.

    6. యజ్ఞసాధక దేవతలు, ఋత్విక్కులతో కలిసి కర్మ ద్వారా యజమానిచేయు నానావిధ యజ్ఞసాధకమగు అగ్ని మరియు నేత, శీఘ్రగామి, శత్రునాశకమగు అగ్ని మాత్రమే ద్యావాపృథ్వుల మధ్యకు వెళ్లగలడు.

    7. మేము సుపుత్రవంతులము, దీర్ఘాయుష్మంతులము కావలెను. అందుకుగాను అగ్నీ ! నీవు దేవతలను స్తుతించుము. అన్నము ద్వారా వారిని ప్రీతులను చేయుము. మాకు ధాన్యము కలుగుటకు వర్షము కలిగించుము. అన్నదానము చేయుము. సర్వదా అప్రమత్తుడవగు అగ్నీ ! నీవు మంచి కర్మలవాడవు. దేవతలకు ప్రియుడవు. యజమానికి అన్నమును ప్రసాదించుము.

    8. అగ్ని మానవులకు భర్త. మహామహుడు. అతిథి భూతుడు. బుద్ధినియంత. ఋత్విజప్రియుడు. యజ్ఞజ్ఞాపకుడు. వేగయుక్తుడు. సర్వభూతజ్ఞుడు. నేతృజనులు సమృద్ధి కొఱకుగాను అగ్నికి నమస్కరింతురు. స్తుతింతురు. ప్రశంసింతురు.

    9. దీప్తిమంతుడు, స్తవ్యుడు, కమనీయుడు, సుందరుడు రథవంతుడగు అగ్ని స్వబలమున సమస్తప్రజలను వ్యక్తపరచును. అనేకుల పాలకుడు, గృహమునందు నివసించు అగ్నియొక్క సకల కర్మములను, మేము సుందర స్తోత్రముల ద్వారా ప్రకాశితము చేతుము.

    10. వైశ్వానరా ! నీవు విజ్ఞుడవు. నీవు సర్వజ్ఞుడవు అగుటకు కారణభూతమగు తేజస్సును నేను స్తుతింతును. పుట్టగానే నీవు ద్యావాపృథ్వులను, సమస్త భువనములందు వ్యాపించినావు. నీవు సకల భూతములను వ్యాపింప చేసెదవు.

    11. వైశ్వానరుడు యజ్ఞాది కర్మలు చేయగోరు యజమానులకు ప్రసాదించును. వైశ్వానరుని కర్మముందు అనంత ధనము ఉన్నది. వీరుడగు వైశ్వానరుడు తన తలిదండ్రులగు ద్యావాపృథ్వులను పూజించుచు ఉద్భవించినాడు.

                           నాలుగవ సూక్తము

        ఋషి-విశ్వామిత్రుడు, దేవత-వేరువేరు, ఛందస్సు-త్రిష్టుప్.

    1. సమిద్ధాగ్నీ ! అనుకూల మనస్కుడవయి మేల్కొనుము. నీవు అత్యంత గతిశీల తేజోవంతుడవు అగుము. మాకు ధనమును అనుగ్రహింపుము. జ్యోతిర్మంతమగు అగ్నీ ! నీవు దేవతలను యజ్ఞమునకు తీసికొని రమ్ము. నీవు దేవతల సఖుడువు. మేము మంచి మనసుతో దేవతల యజ్ఞము చేయుదుము.

    (సమిధలతో వేలుగునది సమిద్ధాగ్ని)

    2. వరుణ, మిత్ర అగ్నులు 'తనూనపాత' అగ్నిని నిత్యము మూడు మారులు యజ్ఞము చేయుదురు. వారే జలకారకమగు ఈ యజ్ఞమునకు వృష్టిమున్నగు ఫలములను ప్రసాదించవలెను.

    3. దేవతలను ఆహ్వానించు అగ్నివద్దకు సర్వజన ప్రియములగు స్తోత్రములు చేరవలెను. అగ్ని ప్రధానుడు. అభీష్టవర్ష, వందనీయుడు. ప్రసన్నత కలిగించుటకుగాను ఇళ అగ్ని వద్దకు చేరవలెను. అగ్ని యజ్ఞకర్మములందు కుశలుడు. మా ప్రేరణతో అగ్ని యజ్ఞము చేయవలెను.

    4. అగ్ని మరియు బర్హిరూప అగ్ని కొఱకు యజ్ఞమున ఒక ఉన్నత మార్గము ఏర్పడినది. దీప్తియుక్తమగు హవ్యము పైకి వెళ్లును. దీప్తిమంతమగు యజ్ఞగృహమున హోత ఉపనిష్టుడయి ఉన్నాడు. దేవతల ద్వారా వ్యాప్తములయిన కుశలను మేము పరచెదము.

    5. జలముల ద్వారా లోకములను ప్రసన్నములను చేయు దేవతలు సప్తయజ్ఞములకు వెళ్లుదురు. వారు నిష్కపట చిత్తమున నరరూపులయి ప్రత్యక్షముగ మా ఈ యజ్ఞమునకు విచ్చేయవలెనని ప్రార్థించుచున్నాము.

    ("విగ్రహవత్యో యజ్ఞద్వారాభిమానిన్యో దేవతాం" అని శాయణుడు. యజ్ఞములందు విగ్రహరూపమున నెలకొల్పబడిన దేవతలు)

    6. దివారాత్రములు అగ్నిరూపములు. అవి కలిసిగాని, వేరువేరుగాని సశరీరులయి ప్రకాశించుచు రావలెను. మిత్ర, వరుణ, ఇంద్రులు ఏరూపమున మమ్ము అనుగ్రహింతురో తేజోవంతములగు ఆ రూపములు ధరించవలెను.

    7. నేను దివ్యులు, ప్రధానులు, అగ్నిరూపులగు ఉభయ హోతలను ప్రసన్నులను చేతును. యజ్ఞాభిలాషులు, అగ్ని స్వరూపులగు ఋత్విక్కులు హవ్యము ద్వారా అగ్నిని ప్రమత్తుని చేయుదురు. వ్రత రక్షకులు, దీప్తిశాలురు, ఋత్విక్కులు ప్రత్యేక వ్రతమునందు యజ్ఞరూపాగ్నితో ఈ మాట చెప్పుదురు.

    8. సూర్యసంబంధువులతో అగ్నిరూపి అగు భారతి విచ్చేయవలెను. దేవతలు, మానవులతో ఇళ విచ్చేయవలెను. అగ్ని విచ్చేయవలెను. సారస్వతగణ సహితయై సరస్వతి విచ్చేయవలెను. ఈ ముగ్గురు దేవేరులు సమ్ముఖస్థ కుశలపై ఆసీనులు కావలెను.

    9. అగ్నిరూప త్వష్టా ! నీవు సంతృప్తుడగు అగుము. వీరుడు, కర్మకుశలుడు, బలశాలి, సోమాభిషవమునకు ప్రస్తరహస్తుడు, దేవాభిలాషి అగు పుత్రుడు కలుగునట్లు మాకు త్రాణకుశలము, పుష్టికరము అగు వీర్యమును ప్రసాదించుము.

    10. అగ్నిరూప వనస్పతీ ! నీవు దేవతలను తీసికొనిరమ్ము. పశువుల సంస్కారాగ్నియగు వనస్పతి దేవతలకు హవ్యము అగును.

    దేవతల జన్మమును తెలిసినవాడు అగ్ని. అట్టి అగ్ని యజ్ఞరూప దేవతలను ఆహ్వానించవలెను. యజ్ఞము చేయవలెను.

    11. అగ్నీ ! నీవు దీప్తియుక్తుడవు అగుము. ఇంద్రుని శీఘ్రతాకారి దేవతలను వెంటతీసికొనుము. వారి సహితముగ ఒకే రథముమీద మా ముందునకు విచ్చేయుము. సుపుత్రయుక్త అదితి కుశలపై కూర్చుండవలెను. నిత్యులగు దేవగుణములు స్వాహాకారవంతులయి, తృప్తులు కావలెను.

                           అయిదవ సూక్తము

        ఋషి-విశ్వామిత్రుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్ని ఉషను తెలిసినవాడు. మేధావియగు అగ్ని జ్ఞానవంతుల మార్గమున సాగుటకు మేల్కొనును. అత్యంత తేజస్వియగు అగ్ని దేవాభిలాషులగు వ్యక్తులద్వారా ప్రదీప్తుడు అగును. అజ్ఞాన ద్వారములను భేదించును.

    2. అగ్ని పూజ్యుడు. స్తోతల స్తోత్రములు, వాక్యములు, మంత్రముల ద్వారా వర్ధిల్లును. దేవదూత అగ్ని అనేక యజ్ఞములందలి దీప్తిని పొందకోరి ప్రాతఃకాలమున ప్రకాశమానుడు అగును.

    3. అగ్ని యజమానులకు మిత్రుడు. యజ్ఞము ద్వారా కోరికలు తీర్చువాడు. జలములకు పుత్రుడు. అగ్ని మానవుల మధ్య నిలిచినాడు. అగ్ని స్పృహణీయుడు. యజనీయుడు. అగ్ని ఉన్నతస్థానమున ఆసీనుడు అయినాడు. జ్ఞాని అగు అగ్ని స్తోతల స్తుతియోగ్యుడు.

    4. అగ్ని సమిధలను కూడినపుడు మిత్రుడు అగును. అతడే మిత్ర హోత, సర్వజ్ఞ వరుణుడు అగును. ఆ మిత్రుడే దానశీల అధ్వర్యు, ప్రేరకవాయువు అగును. అతడు నదులకు, పర్వతములకు మిత్రుడు.

    5. సుందరాగ్ని సర్వవ్యాప్త పృథివిని రక్షించును. మహాగ్ని సూర్యుడు విహరించు అంతరిక్షమును రక్షించును. అంతరిక్ష మధ్యమున మరుత్తులను రక్షించును. దేవతల ప్రసన్న కారకము అగు యజ్ఞమును రక్షించును. 

    6. అగ్ని మహామహుడు. జ్ఞాతవ్యులకు జ్ఞాత. అతడు ప్రశంసనీయమగు సుందర జలములను కలిగించును. నిద్రించినపుడు సహితము అగ్ని చర్మము, రూపము దీప్తిమంతముగా ఉండును. అగ్ని దానిని జాగ్రత్తగా రక్షించును.

    7. దీప్తిమంతుడు, స్తోత్రవ్యుడు, స్వస్థాన ప్రియుడగు అగ్ని ఆరూఢుడు అయినాడు. దీప్తిశాలి, శుద్ధుడు, మహంతుడు, పతిత్రుడు, అగ్ని మాతాపితలగు ద్యావా పృథ్వులను నవీనతరము చేయును.

    8. అగ్నిని జన్మించగనే ఓషధులు ధరించినవి. అప్పుడు పిల్లకాలువల నీటివలె శోభించు ఓషధులు జలముల ద్వారా పెరిగి ఫలములను ఇచ్చినవి. మాతాపితలగు ద్యావాపృథ్వుల వడిలో పెరిగిన అగ్ని మమ్ము రక్షించవలెను.

    9. మా స్తుతుల దీప్తిద్వారా అగ్ని మహామహుడు అయినాడు. అగ్ని పృథివి నాభిస్థానమున నిలిచి, అంతరిక్షమును వెలిగించుచున్నాడు. సర్వజనుల మిత్రుడు, స్తుతియోగ్యుడు, అరణి ప్రదీప్తుడగు అగ్ని దేవదూత కావలెను. యజ్ఞమునకు దేవతలను ఆహ్వానించవలెను.

    10. 'మాతరిశ్వ' భృగువుల కొఱకు గృహస్థిత, హవ్యావాహక అగ్నిని ప్రజ్వలింప చేసినపుడు తేజస్వులలో శ్రేష్ఠుడగు మహాగ్ని తన తేజస్సున స్వర్గమును స్తబ్ధము చేసినాడు.

    11. అగ్నీ ! స్తోతలకు కర్మభూమియు, ధేను ప్రదాత్రియునగు భూమిని ప్రసాదించుము. మాకు వంశ వర్ధనుడు. సంతతి జనితయు అగు పుత్రుడు కలుగవలెను. నీవు మమ్ము అనుగ్రహింపుము.

                           ఆరవ సూక్తము

        ఋషి-విశ్వామిత్రుడు, దేవత-అగ్ని, ఛందస్సు-త్రిష్టుప్.

    1. యజ్ఞకర్తలారా ! మీరు సోమాభిలాషులు. మీరు మంత్రము ద్వారా ప్రేరితులు కండు. దేవార్చన సాధకము అగు స్రుక్కును తెండు. దానిని ఆహవ అగ్నియొక్క దక్షిణ దిశకు చేర్చవలెను. అన్నవంతము అగు అగ్రభాగము పూర్వదిశయందు ఉన్నదియు, అగ్నికొఱకు అన్నము ధరించునదియు, ఘృతయుక్తము అగు స్రుక్కు వెళ్లును.

    2. అగ్నీ ! నీవు జన్మించగనే ద్యావాపృథ్వులను పూరింపుము. యాగయోగ్యుడవు, మహిమాన్వితుడవగు నీవు అంతరిక్షము, పృథ్విని మించుము. నీ అంశభూతములగు అగ్ని యొక్క సప్తజిహ్వలు పూజించబడవలెను.

    3. అగ్నీ ! నీవు హోతవు. దేవాభిలషులు, హవ్యయుక్తులగు మానవులు దీప్తిమంతమగు నీ తేజస్సును స్తుతింతురు. అప్పుడు అంతరిక్షము, భూమి, యజ్ఞార్హ దేవతలు యజ్ఞ సంపాదనకునిన్ను స్తుతింతురు.

    4. యజమానులకు ప్రియుడవగు మహాగ్నీ ! నీవు ద్యావాపృథ్వుల నడుమ మహిమాన్వితమగు నీ స్థానమున కూర్చున్నావు. ఆక్రమణశీల, సపత్నీభూత, జరారహిత, అహింసిత, క్షీరప్రదాయినులగు ద్యావాపృథ్వులు అత్యంత గమనశీల అగ్నికి గోవులు అగును.

    5. అగ్నీ ! నీవు సర్వోత్కృష్టుడవు. నీ కర్మ గొప్పది. నీవు యజ్ఞము ద్వారా ద్యావా పృథ్వులను విస్తృత పరచినావు. నీవు దూతవు. అభీష్ట వరదుడవు. నీవు జన్మించగనే యజమానికి 'నేత' వు అగుము.

    6. ద్యుతిమంతా ! అగ్నీ ! నీ అశ్వములు 'రోహిత' నామకములు. అవి ప్రశస్త కేశములు కలవి. రజ్జుయుక్తములు. ఘృతస్రవములు. వానిని యజ్ఞసమ్ముఖమున సమారోపింపుము. అనంతరము దేవతలందరిని ఆహ్వానించుము. సర్వభూతజ్ఞా ! వారిని సుందర యజ్ఞయుక్తులను చేయుము.

    7. అగ్నీ ! నీవు అరణ్యములందలి జలములను శోషింప చేసినపుడు నీ వెలుగు సూర్యుని మించిపోవును. సనాతనము, ప్రకాశమానము అగు ఉష వెనుక నీవు అవతరింతువు. స్తుతియోగ్యుడు, హోత అగ్నిని స్తోతలు స్తుతింతురు.

    8. విస్తీర్ణ అంతరిక్షమున ఉన్న దేవగణములు, ఆకాశపు వెలుగులందు ఉన్న సర్వదేవతలు, 'ఉమ్' సంజ్ఞక యజనీయ పితరులు ఆహూతులయిన వచ్చినవారందరు రథియగు అగ్నికి అశ్వములు అగుదురు.

    9. అగ్నీ ! పైన చెప్పిన దేవతలందరితో ఒక రథమునగాని నానా రథములపైగాని మాముందునకు విచ్చేయుము. ఏలననగా నీ అశ్వములు సమర్థములు. దేవతలను వారి భార్యల సహితముగా అన్నము కొఱకు తీసికొనిరమ్ము. సోమముతో వారిని పరితుష్టులను చేయుము.

    10. సువిశాల ద్యావాపృథ్వులు సమృద్ధికొఱకు విశేష యజ్ఞమున అగ్నిని ప్రశంసింతురు. వారే దేవతలకు హోతలు. సుందరరూపులు, జలవతులు, సత్యస్వరూపులగు ద్యావా పృథ్వులు యజ్ఞమువలె సత్యము నుండి ఆవిర్భవించి నహోత-అగ్నికి అనుకూలుడు.

    11. అగ్నీ ! స్తోతలకు కర్మభూమియు, ధేను ప్రదాత్రియునగు భూమిని ప్రసాదించుము. మాకు వంశవర్ధనుడు, సంతతి జనియు అగు పుత్రుడు కలుగవలెను. నీవు మమ్ము అనుగ్రహింపుము.

                                           ఇయ్యది:-

    దాశరథి లక్ష్మణాచార్య బుచ్చమాంబల పౌత్రుండును, విద్వాన్ వేంకటాచార్య వేంకటాంబల పుత్రుండును ఆంధ్ర ఆస్థానకవి దాశరథి కృష్ణమాచార్య అనుజుండును కమలానామ్మి ధర్మపత్నీ సహితుండును సుందర సులభవచన శ్రీమద్రామాయణ, శ్రీమద్భాగవత, సీతాచరిత, హరివంశ సహిత, శ్రీమహాభారత, శ్రీమద్భగవద్గీత, భారత సూక్తాది అనేక గ్రంథ కర్తయునగు దాశరథి రంగాచార్య విరచిత ఆంధ్ర వచన ఋగ్వేద సంహితమున రెండవ అష్టకము సమాప్తము.

                                        ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.