Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    గోవింద ద్వారకా వాసిన్ కృష్ణ గోపజనప్రియ!
    కౌరవైః పరిభూతాం మాల కిం నజానాసి కేశవ!
    హేనాద! హీరమానాద! వ్రజనాదార్తి నాశన!
    కౌరవార్ణవ మగ్నాం మాముర్ధరస్వ జనార్ధన!
    కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన్!
    ప్రపన్నాం పాహిగోవింద కురుమధ్యే వసీదాతీమ్
    
    కృష్ణుడు ద్రౌపది ఆర్తనాదమును విన్నాడు. విహ్వాలుడు అయినాడు. శయ్యాసనములు వీడినాడు. కాలినడకన సాగినాడు. అవ్యక్త రూపమున ద్రౌపది వస్త్రములందు ప్రవేశించినాడు.
    ద్రౌపది ప్రార్ధించుచున్నది.
    దుశ్శాసనుడు బట్టలు లాగివేయుచున్నాడు. అతడు ఒకటి లాగిన మరొకటి వచ్చుచున్నది. ఎన్ని వస్త్రములు లాగినను ద్రౌపది పిక్కల పర్యంతము కనబడకుండు నట్లు వస్త్రము ఉండు చున్నది. దుశ్శాసనుడు లాగిన బట్టలు గుట్టల వలె పడినవి. అది చూచి సభవారు సంతోషించినారు బట్టలు గుంజి గుంజి దుశ్శాసనుడు అలసిపోయినాడు. ఇహ గుంజ లేక గర్వము విడిచి ఆశక్తుడయి సిగ్గుపడి ఊరుకున్నాడు.
    ద్రౌపదిని దుశ్శాసనుడు అమానుషముగా నిండు సభలో అవమానించినాడు. భీముడు అది చూచి సహించలేక పోయినాడు. మందిపోయినాడు. అతడు నిప్పులు కక్కినాడు. కనులు అగ్ని జ్వాలలు అయినవి. పండ్లు పటపట కొరికినాడు. అగ్గి కురిసినాడు:-
    "కురువృద్దుల్ గురువృద్దభాంధవులనేకుల్ సూచుచుండన్ మదో
    ద్దురుడై ద్రౌపది నిట్లు సేసిన ఖలున్ దుశ్శాసనున్ లోక భీ
    కరలీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘని
    ర్ఘర ముర్వీపతి సూచుచుండనని నాస్వాదింతు నుగ్రాకృతిన్"
    ఇట్లు సేయనైతినేని పితృపితమహుల గతి కిందప్పిన వాడనగుదునని ఘోర,మయిన ప్రతిజ్ఞ చేసినాడు.
    భీముని ప్రతిజ్ఞ విన్నారు. సభలోని వారు ఆశ్చర్యపడినారు. ధృతరాష్ట్రుని వలన పుణ్యవంతులయిన పాండవులకు కీడు సంభవించినదని లోలోన ధృతరాష్ట్రుని నిందించినారు.
    అప్పుడు అవమానముచే కృంగిన సాధ్వి ద్రౌపది ధైర్యమున ఎలుగెత్తి మరొకసారి సభను ప్రశ్నించినది.
    "మహాత్ములారా! నాడు నా స్వయంవరమున సకల రాజన్యులు నన్ను మహావిభవముగా చూచినారు. నేను అవిక్ర పరాక్రమంతులు పాండవులకు భార్యను, శ్రీకృష్ణునకు చెల్లెలును, ఇప్పుడు నన్ను దుర్యోధనాదులు అవమానించినారు. దుశ్శాసనుడు నీచముగా ప్రవర్తించినాడు. అది మీరందరు చూచినారు. అయినను కిమ్మనకున్నారు. ఇప్పుడయినను నోరు విప్పండి, చెప్పండి, నేను కౌరవులకు దాసిని అగుదునా! కానా?" ద్రౌపది ప్రశ్నలు వేసి కొంగు కప్పుకొని ఏడ్చినది.
    "అమ్మా! ద్రౌపది! ధర్మసూక్ష్మమును ఎరుగుట ఎవరికి సాధ్యపడదు. ధర్మరాజునకే సాధ్యమగును. అతడే నీ ప్రశ్నలకు సమాధానము చెప్పవలెను. నిన్ను అవమానించిన కౌరవులు చెడిపోవు కాలము ఎంతో దూరము లేదు" అన్నాడు భీష్ముడు. ధర్మమూ చెప్పలేక శాపము పెట్టినాడు.
    నిర్వీర్యులయి ఉన్న కురువృద్దులను, దిక్కులేక దీనమయి వలవల ఏడ్చుచున్న ద్రౌపదిని చూచి కర్ణుడు కూతలు కూసినాడు. "ద్రౌపది! దాసీ! చేతకాని అయిదుగురు భర్తలెందుకే! జూదమున ఓడని ఒక్కని భర్తగా ఎంచుకొనుము" అన్నాడు.
    కర్ణుని మాటలు విన్నాడు దుర్యోధనుడు, క్రొవ్వినాడు. తన తొడ మీదికి ఎక్కుటకు రమ్మని ద్రౌపదికి సైగ చేసినాడు. భీముడు అది చూచినాడు. ఉగ్రుడయినాడు పిడుగులు కురిసినాడు:-
    
    ధారుణి రాజ్య సంపద మదంబున గోమలి గృష్ణజూచి రం
    భోరు నిజోరు దేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు
    ర్వార మదీయ బాహు పరివర్తత చండ గదాభిఘాత భ
    గ్నోరు తరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్"
    అని ప్రళయ కాలరుద్రుని వలె నున్న భీముడు ఆయుధములు ఉన్న దిక్కును చూచి, అనుమతించమన్నట్లు ధర్మరాజును చూచినాడు.
    భీముని రౌద్ర రూపమును చూచిన సభాసదులు గడగడలాడినారు. భీష్మద్రోణ విదురాదులు ఇది సమయము కాదని భీముని శాంతింపచేసినారు.
    భీముడు శాంతించినాడు.
    దీన అయి దుఖిత అయిన ద్రుపద రాజపుత్రి, పాండవ పత్ని ద్రౌపది ప్రశ్నకు సమాధానము చెప్పగల "మగవాడు" కనిపించలేదు.
    ఆ విధముగా దుర్యోధన సభ అర్దాంతరముగా ముగిసినది.
    సభ ముగిసినది. ద్రౌపదికి జరిగిన అమానుష అవమానమునకు సభవారు చలించలేదు. ప్రకృతి ఊరుకోనలేకపోయినది. ప్రకృతి ప్రతికూలించినది.
    ధృతరాష్ట్రుని అగ్నిహోత్ర గృహములలోనికి ముసలి నక్కలు దూరి ఊళలు వేసినవి. కౌరవంగనల చిత్తములు భ్రమించినవి. దుర్యోధనాదుల పడకటీండ్లు కాకులు కూసినవి. గుడ్లగూబలు అరచినవి.
    గాంధారి అట్టి ఉత్పాతములు చూచినది. గడగడలాడినది. విదురుని వెంట పెట్టుకున్నది. గుడ్డి రాజు దగ్గరకు పోయినది. ఉత్పాతములు వివరించినది. ఇదంతయు దుశ్శాసనుని పాపకార్యములకు ప్రతిఫలమన్నది. ప్రకృతి ప్రాతికుల్యము నుండి కురు కులమును కాపాడమని వేడుకున్నది.
    ధృతరాష్ట్రుడు ఉత్పాతములను గురించి విన్నాడు. అతని గుండె గడగడలాడినది. జరిగిన అన్యాయము గ్రహించినాడు. రానున్న ఆపద గ్రహించినాడు. నివారించదలచినాడు. దుర్యోధనుని పిలిపించినాడు. "దుర్యోధనా! ద్రౌపది పతివ్రత. తపస్విని. పాండవ పత్ని. సాద్వి. ధర్మాత్మురాలు. ఆమెను నిండు సభలో అవమానించినావు. అది మంచిది కాదు. నీకు బాల్యము నుండి దుష్టసహవాసము కలిగినది. నీవు పాండవుల విషయమున పగ విడువుము" అని చెప్పి దుర్యోధనుని పంపించినాడు. తరువాత ద్రౌపదిని పిలిపించినాడు. సాంత్వన వాక్యములు పలికినాడు. అన్నాడు:-
    'అమ్మా! ద్రౌపది! నా కోడండ్లలో నీవు ఉత్తమురాలవు. బుద్దిమంతురాలవు. నీకు ప్రియమైన కార్యము చేతును నీకు ఇష్టమగు వరము కోరుకొనుము ఇత్తును."
    "మామగారూ! మీకు నాయందు దయకలిగిన సర్వలోక పూజ్యుడగు ధర్మరాజునకు దాస్య విముక్తి కలిగించుము. అందువలన నా పెద్దకొడుకు ప్రతివింధ్యునకు దాసపుత్రత్వము తొలగును" అని ద్రౌపది వరము అడిగినది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.