Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
"తన దైవత్వాన్ని గురించి ఎప్పుడూ చెప్పనైనా చెప్పుకొని అమాయక బాలికను బెంగాల్లోని వేలకొద్ది బాలికల్లో ఒకతే అయిన బాలికను - జగన్మాతను చేసి గుళ్ళో రాతికంటే బ్రహ్నండమైన బూటకం సృష్టించాను ."
ముందు వరుసలో కూర్చున్న పూజారి విశాసర్పపు కౌగిలి నుంచి విముక్తుడైనట్లు లేచి నుంచొని పిచ్చికేక పెట్టాడు." వీడు మనతో మురికి తినిపించాడు. జన్మ జన్మాలపాటు మునిగి ఉండే పాప పంకిలం లో ముంచేశాడు. తగిన శాస్తి చెయ్యాలి" అని అరిచాడు అతని గడ్డం వణికింది.
సభికులంతా గొంతు చించుకొని కేకలు వేశారు. " దొంగ! రక్కసి! తన్నండి . ఎముకలు విరక్కోట్టండి."
"మనతో మురికి తినిపించాడు ....... యమకూపపు రక్కసి ..... జన్మజన్మాల పాప పంకోలం పంకిలంలో ముంచేశాడు...... నరరూపరాక్షసుడు ...." వారి గొంతులు దురుసుగా ఉన్నాయి. పిడికిళ్ళు బిగించిన చేతులు పైకెత్తారు.
కాలూ మళ్ళీ ప్రారంభించాడు.
"ఆగండి . కధ ఇంకా ఉంది .' గొంతు పెద్దది చేసుకొని అరచాడు.
ప్రతిమలకు ప్రాణం వచ్చింది. కూర్చున్న చోటు నించి ఎవరూ కదలకున్నా పిచ్చి కేకలు వేశారు. బెదిరించారు. పూజారి వేదిక ఎక్కాడు. మోతీచంద్ ఏదో సంజ్ఞ చేశాడు. గుసగుస చెప్పాడు. "ఆ సరే... సరే ....' అని తల ఊపాడు.
ఓక రాయి టప్పుమని కాలూ రొమ్మును తగిలింది. మాట ఆగిపోయింది . వేదిక మీది గొప్పవారంతా చలవరాతి స్తంభాల చాటున నక్కారు.
కాలూ రొమ్ము నించి రక్త బిందువులు టపటపా రాలేయి. కాని అతడు కేనీసం తుడవడానికైనా ప్రయత్నించలేదు. చంద్రలేఖ పరుగెత్తుకొని వచ్చి చేతులు చాచి తండ్రిని చుట్టి వేసింది. తండ్రి శరీరానికి తన మేమను కవచం చేసింది. కాలూ ఆమెను ప్రక్కకు నెట్టేశాడు. చేత్తో పక్కన నుంచోపెట్టాడు. పర్వతంలా కదలకుండా నుంచున్నాడు.
"అది చూడు . దాని ముఖం చూడు. సిగ్గూ శరం లేవు. దాని కళ్ళు చూడు. బోగం దాని కళ్ళూ అదీ. నాకీ అనుమానం ఎన్నడో వచ్చింది..... నా పెళ్ళాం దాని కండ్లు చూసి ఏనాడో చెప్పేసింది...."
"ఆ పోరడు దాని కొడుకే అయి ఉండాలి."
"కమ్మరి ! వాడి రంగూ అదీ మసిబొగ్గులా ఉన్నాడు. చూస్తేనే తెలుస్తుంది. వాడి ముఖం చెప్పడంలా? ఏ చెప్పులు కుట్టే చాండాలుడో అయి ఉండాలి. అబ్బే అదీ కాదు పాకీవానిలా ఉన్నాడు."
"ఇదెక్కడి పాపం! ఆ ముగ్గురి మీదా పిడుగుపడా."
"వాళ్ళ పీనుగుల్ను కాకులకూ గద్దలకూ వేయాలి."
కాలూ గాబరా పడుతున్న ముఖాల్లోకి సూటిగా చూశాడు. అతనికి ఏమాత్రం కోపం రాలేదు. ఆ యావన్మంది శక్తి కంటే కాలూ లో ఎక్కువ శక్తి - అపరితమైన శక్తి మూర్తిభవించింది. ఉద్రేకం, ఉక్రోషం తగ్గిపోయాయి. ప్రశాంతంగా నుంచున్నాడు. అతని ముఖంలో విచారమూ, కళ్ళలో చిత్రమైన సానుభూతీ కనిపిస్తున్నాయి.
"సోదరులారా! రాళ్ళు వేయకండి. మండపం మీద పెద్దవాళ్ళున్నారు. ఇంకోరకంగా ....."
"చీల్చేస్తాం రాక్షసుణ్ణి . ఆ దొంగముండా వాడు మా కులం నాశనం చేశారు. నరకంలోకి తోశారు. మర్రి చెట్టుకు ఉరి తీయండి .
ముందటి వరుస వారిలో ఉద్రేకం పెరిగిన కొద్దీ, పచ్చగడ్డిలో వెనుక కూర్చున్న అనాహ్వానితుల్లో కలవరం బైల్దేరింది. అక్కడ కూర్చున్న వారంతా సామాన్యులు. వారిలో వీధులు ఊడ్చేవారు, రిక్షాలూ లాగేవారూ , కూలీలూ ప్రక్కనే ఉన్న హేమాసోప్ ఫ్యాక్టరీ కార్ముకులూ ఉన్నారు. వారంతా యజ్ఞం చూడ్డానికి వచ్చారు. సభను చూసేసరికి ఆశ్చర్యం అయింది. కొంతసేపు అక్కడ జరిగేదేమీ అర్ధం కాలేదు. కాలూ మాటలు వారి మనస్సులో పాతుకుపోయాయి. కొంతమంది నిశిత బుద్ది కలవారికి విషయమంతా వెంటనే తెలిసింది. వారు మందబుద్దులకు వివరించి చెప్పారు.
"మంచిపని చేశాడు. గొప్పవారితో మురికి తినిపించాడు.
"కళ్ళు నెత్తికి వచ్చిన పెద్దలు మనసు పురుగుల కంటే హీనంగా చూసేవారు. పురుగుల్ను చూసినా మైలపడేవారు కారు. కాని మనసు చూస్తె మైలపడిపోతారట!"
"దేవుడు పెద్ద బాపడైపోయినట్లు అక్కడికి."
"మాలవాళ్ళు కూడా పుణ్యం సంపాదించుకుంటే స్వర్గంలో తమతో భుజాలు రాచుకొని తిరుగుతారని వారి భయం."
వెనుకవరుసల్లో ఇలా సాగింది. మండపంలో ఉన్న మనుషులకు ప్రాణం వచ్చింది.
ఒక స్థంభం చాటున దాగిన జడ్జి, యింకో స్తంభం చాటున దాగిన వకీలుతో " దుర్మర్గుడిని కోర్టుకు లాగాలి.
"ఇది స్పష్టమైన మోసపు కేసు (Fraud) లాయరు మెదడు క్రిమినల్ కోడ్ సెక్షన్లను వెదికింది.
"ఆ చార్జి నెగ్గకుంటే ప్రభుత్వం ప్రివెంటివ్ టెన్షన్ చట్టం ప్రయోగించాలి. ఈ యుద్ద సమయంలో ప్రజల విశ్వాసంతో ఆటలాడనివ్వడం భావ్యం కాదు" అన్నాడు ఒక సెక్రటేరియట్ అధికారి." ఎందుకూ? కాస్త ఓపికపట్టి చూడండి. ప్రజలే ప్రత్యక్ష చర్యకు దిగేట్టున్నారు. వాళ్ళను ప్రజల కోపం కాల్చి వేసినా కాల్చి వేయవచ్చు. అందులో ఆశ్చర్యం ఏమీలేదు." అన్నాడు తెల్ల వెంట్రుకల రాజకీయనాయకుడు.
అబాలబందు చివరి స్తంభం చాటున దాక్కున్నాడు. వచ్చే నవ్వును ఆపుకోలేక అతని ముఖం కంద గడ్డ అయింది.
పగలబడి నవ్వాడు. "ఎంత వ్యాపారచతురత! ఎంత గొప్ప ఉపాయం! ఇలాంటివారు ఒకరిద్దరు నా దగ్గరుంటే ఎంత బావుండేది?' అతని పక్క స్తంభం చాటున నక్కిన మోతీచంద్ ను చేత్తో తట్టి పిలిచి "భాయీ , ఎంతైనా నీ పన్నాగం!" అన్నాడు.





