Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
బిటేన్ తన్ను పురికొల్పడంతో అనంతర దశ ప్రారంభం అయింది. అతడు మాటల్తో కాదు, చేతల్తో తన్ను పురికొల్పాడు. ఆదర్శాలకై అభిలాషల్ను వదులుకోవడమే అతడు తనకు నేర్పిన పాఠం.
బిటేన్ ఒకనాడు జరుగబోయేదాన్ని గురించి జోస్యం చెప్పాడు. ఆ రోజు - ఆ స్థితి - రానే వచ్చింది. కాని లేఖ? ఆమె ఆత్మ నాశనానికి సిద్దపడింది. ఒకరకపు నిర్ణయం చేయవలసిందిగా తన్ను వత్తిడి చేసింది. అదే తన చేతికి బలాన్నీ , శక్తినీ సమకూర్చింది. తన హస్తం పులి గుండెలో బాకును గుచ్చడానికి సిద్దం అయింది.
యజ్ఞం జరుగుతుంది. హవిస్సుల కమ్మని వాసన దిక్కులన్నిటా వ్యాపిస్తుంది. వేదమంత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇదే సమయం . ఈ విషయం లేఖకు సహితం తెలియదు. ఇదంతా నాటకంలా జరిపిస్తున్నాడు. ఇంక నాటకం ఆడే అవసరం తీరిపోతుంది. తాను పులుముకున్న రంగు ఈనాటితో కరిగిపోతుంది. ఇది నాటకానికి భారత వాక్యం.
"నవ్వుతున్నారు కదూ? నవ్వండి. నగ్నసత్యం మీ దోక్కల్లో చేరి ఇనప గుండులా తిరిగే దాకా నవ్వండి. అన్నలూ, తమ్ములూ నవ్వండి. నవ్వండి."
ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు.
"మీముందు ఉపన్యసించడానికి నాకు అర్హత లేదు అన్నాను. అది ఉబుసు పోక కన్నమాట అనుకున్నారు. నాకు జ్ఞానం అతి స్వల్పం అని చెప్పాను. హాస్యానికి చెపుతున్నననుకున్నారు. నా రక్త మాంసాల్లో అనుభవం జీర్ణించివుంది. అది నాకో గుణ పాఠం నేర్పింది. మీ మంత్రం తంత్రాలు నేర్పే దానికంటే గొప్ప గుణ పాఠం నేర్చుకున్నాను. పురోహితులారా, పండితులారా, వాస్తవం వినండి. కల లేదు. కలలో దేవుడూ లేడు. అంతా కల్ల. వట్టి బూటకం. ఈ బూటకపు దేవుణ్ణి నిలిపింది నేను. ఆ రాతి ముందు పాప ప్రాయశ్చిత్తాలు చేయించి మీ ముఖాలకు మసి పూశాను. ఈ పాపానికి మీ శాస్త్రాలలో ఎక్కడా ప్రాయశ్చిత్తం లేదు. శాస్త్రాలు వ్రాసేవాళ్ళు ఇలా జరుగుతుందని కనీసం ఊహించి అయినా ఉండరు. కులం తెలియని, దిక్కులేని కుర్రాడికి నీడ ఇచ్చానని మీరు నామీద మండి పడ్డారు. కాని కులం డబ్బు - వీటితో అవినీతికి పాల్పడ్డ మీ ఆత్మలకు అధినేత ఒక కమ్మరి అనే విషయం తెలియజెప్పుతున్నాను."
జనానికి ఎటూ తోచలేదు. ఏమీ అర్ధం కాలేదు, దిగాలు పోయారు. "ఏమిటీ వినాశకాలం. అలా కావడానికి వీల్లేదు" అనే ఏకైక కంఠం వినిపించింది.
కాలూ ఉక్కు ముఖంలో భగ్గున అగ్గి మండింది. తన మీద ఉన్న పసుపు రంగు పట్టు కండువాను రెండు చేతుల్తోనూ లాగి పారేశాడు. ఆశ్చర్యం! జందెం లేదు!!
భయోత్పాతం తో వేయి కళ్ళు అతని నగ్న వక్షాన్ని చూశాయి. వారి చూపు వక్షం నుంచి కదలలేదు.
నిశ్శబ్ద వాతావరణంలో గుసగుసలు బైల్దేరాయి. శీతాకాలపు దీర్ఘ నిద్ర తర్వాత మేల్కొన్న పాములా ఉంది ఆ జన సమూహం.
"మీకు తెలిసిపోయిందన్న మాట. నేను అతి దూరం నుంచి వచ్చిన కమ్మరిని. ఆకలి నన్ను జన్మ భూమి నుంచి ఇక్కడికి లాక్కొచ్చింది. ఆకలి నన్ను జేలుకు తీసికెళ్ళింది. అక్కడి నుంచి నేను సరాసరి నరకం లోకే వెళ్ళాను. దుష్టత్వాన్నీ , దుర్మార్గాన్నీ, నగ్నంగా నా కళ్ళతో చూశాను. కొద్ది ఆదాయంతో పొట్ట పోసుకునే నేను నా ఆత్మను ఒక ప్రశ్న అడిగాను. నాకు జరిగిన అవాంతరాలన్నింటిని గురించి ఆలోచించుకుంటే నాకు నిద్రపట్టలేదు. చివరకు నా అంతరాత్మ నాకు జవాబు చెప్పింది. బూటకాని కంటే వాస్తవం లేదు. ఆత్మవంచన చేసుకొని ఇతరుల్ని ఎంత వంచించగలుగుతే అంత వాస్తవం అయిన వాడిగాను, సత్యవంతుడివి గానూ ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. దుర్మార్గాన్ని జయించడానికి దుర్మార్గపు కత్తులె కావాలి వాటితోనే దుర్మార్గాన్ని జయించాలని నా అంతరాత్మ పలికింది."
ఆగాడు. వాడి చూపు వేదిక మీది వారి మీదికి విసిరాడు. సర్ ఆబాల బంధు దీన్ని వినోదంగా చూస్తున్నాడు. వింతగా నవ్వుతున్నాడు. మోతీచంద్ వింతగా చూస్తున్నాడు. జోగీష్ కళ్ళద్దాల్ను తుడుస్తూ ఉంటే చేతులు వణికాయి. కాలూ చంద్రలేఖను చూశాడు.
ఆమె దృక్కులు పితృపూజ చేస్తున్నాయి. తండ్రి మీది గౌరవం తరంగాలుగా పొంగుతుంది. కాలూ ఆమెను ఆ దశలో చూడక చాలా కాలం అయింది. లేఖ బాల్యంలో కాలూ గుర్రపు నాడెను ఎర్రగా కాల్చి సమ్మెటతో వంగ తీస్తున్నప్పుడు ఇలాగే చూసేది. ఒకనాటి అర్ధరాత్రి భూగోళంలో మునిగి ఉన్న కాలూ ను లేఖ చూసినప్పుడు సహితం ఆమె కళ్ళలో ఇలాంటి గౌరవం కనిపించింది. ఆ చూపుతో బూటకాన్ని నాశనం చేసి ప్రేమ జల్లు కురిపించే శక్తి వచ్చేసింది. ఇప్పుడతడు తన చేతుల్తో భూమిని కదిలించి వేయగలడు. మౌనంగా యమదూతను సైతం భరించగలడు.
పదఘాతం నుంచి తెరుకోనైనా తేరుకొని జనాన్ని మళ్ళీ కాలూ చూశాడు.
"అదీ అసలు కధ. మొట్ట మొదలు నన్ను నేను బాపడ్ని చేసుకున్నాను. భుజం మీద జందెం వ్రేలాడింది. నన్ను మోసగాడని నిందించండి. నేను బ్రాహ్మణత్వంలో మీకంటే ఏమాత్రం తక్కువకాదు. అప్పుడు ఒక గారడీ చేశాను. " కొన్ని లిప్తలు ఆగాడు. అతనిలో మాత్న తేజం ప్రవేశించింది. "ఇక్కడ కూడిన మిత్రుల్లో అనేక మంది రోజూ ఇలాంటి జిత్తులు ఎన్నో చేస్తుంటారు. ఇది మాత్రం నా స్వంత ఉపాయం. ఒక రాతిని లింగంలా చెక్కాను. ఇప్పుడు గుడి ఉన్న స్తలంలో దాన్ని పాతి పెట్టాను. రాతి కింద రెండు సేర్ల శనగలు పోశాను. నీళ్ళు చల్లుతున్న కొద్దీ శనగలు ఉబ్బి రాతిని పైకి నెట్టాయి. ఏదో అద్భుతం జరుగాబోతుందని ప్రజాలంతా గుమిగూడి వింతగా చూశారు."
మహాసర్పం మేల్కొంది. పూర్తిగా మేల్కొంది. పడగ విప్పింది. కోరల్లో విషం నింపింది.
"దేవుడు వెలిశాడు. గుడి మొదలైంది. గొప్పవాళ్ళు సంచుల కొద్దీ డబ్బు కురిపించరు. ఆ మహామహులకు స్వంత అవసరాలూ, జిత్తులూ ఎత్తుగడలూ ఉన్నాయి. వారి ఎత్తుగడల ముందు నా ఎత్తుగడ పేలవంగా తోస్తుంది. ఇప్పుడో బ్రహందమైన ఎత్తు వేశారు."
పులిగుండెలో చివరి పోటు పొడవడానికి కాలూ ఊపిరి బిగపట్టాడు. సభ చిత్తరువులా నిశ్చలంగా ఉండిపోయింది. మరొకసారి లేఖ ముఖాన్ని చూశాడు. ఆమె ముఖంలోంచి పితృ విషయికమైన గౌరవం ప్రవాహంగా వస్తుంది.





