Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    12. 'సాధుతే' మంత్రమునకు 'యోఅగ్నిగం హోతారమవృథా' అను శాఖాంతర పాఠమును చేర్చి చదివిన యజమానికి రెండుప్రక్కల అగ్ని అంటుకొని మరణించును.

    13. జుహువు యజమాని దేవతగా కలది. ఉపభృత్ శత్రువు దేవతగా కలది. ఈ రెంటికి సమాన ప్రాధాన్యమిచ్చి - ద్వివచన 'స్రుచౌ' - గా చదివిన యజమానికి శత్రువులు పుట్టుదురు. 'స్రుచమ్' అని ఏకవచనముగ 'ఘృతవతీ' మంత్రము వలె ఉచ్ఛరించిన యజమాని వర్ధిల్లును.

    14. జుహువు దేవతలను కాపాడుచున్నది. అందువలన అది 'దేవాయువ' అయినది. జుహువు రాక్షసులు చేయు విఘ్నములను నివారించుచున్నది. అందువలన దానికి విశ్వవారామ్ అను పేరు వచ్చినది.

    15. మానవులు స్తుతి ప్రియులు. పితరులు నమస్కార ప్రియులు. దేవతలు యజ్ఞప్రియులు. అందువల్ల యజమాని దేవతల కొరకు యజించుచున్నాడు. పితరులకు నమస్కరించుచున్నాడు. మానవులను తగు రీతిన స్తుతించుచున్నాడు. ఆ విధముగా అతడు అనుష్ఠించుచున్నాడు.

                                     పదవ అనువాకము

    1. పట్టాభిషిక్తుడగు రాజునకు "ప్రవోవాజాః" 'అగ్న ఆయాహివీతయే' 'త్వం వరుణ' అనుమూడు సామిధేని మంత్రములు పఠించవలెను.

    క్షత్రియులు కాకా బ్రాహ్మణ, వైశ్య, శూద్రులు మూడు వర్ణముల వారు కదా! ఆ పఠనము వలన ఆ మూడు వర్ణముల వారు రాజునకు అనుకూలురు అగుదురు.

    2. రాజు కొరకు పంచదశస్తోమమును అవిచ్చిన్నముగ చదువవలెను. రాజు పంచదశస్తోమ సంబంధి అగును. అందువలన రాజును స్వస్తోమమున చేర్చినట్లగును.

    3. హోత రాజు కొరకు త్రిష్టుప్ ఛందస్కమగు 'త్వంవరుణ' అను సామిధేని మంత్రముచే పరిధానము చేయవలెను. త్రిష్టుప్చందము ఇంద్రియ సంబంధి. రాజు ఇంద్రియ బలము కోరుచుండును. అందుకే అతడు యాగము చేయును. అతనికి త్రిష్టుప్ ఛందస్కమగు మంత్రముచేతనే ఇంద్రియ సామర్థ్యము కలుగును.

    4. రాజు బ్రహ్మవర్చస్సు కోరినచో గాయత్రీ ఛందస్కమైన 'ఆజుహోత దువస్యతా' అను సామిధేని మంత్రముచే పరిధానము చేయవలెను. గాయత్రి బ్రహ్మవర్చో రూపము కదా! కావున రాజునకు బ్రహ్మవర్చస్సు కలుగును.

    5. వైశ్యుని కొరకు సప్తదశస్తోమమును ఉచ్చరించవలెను. వైశ్యుడు సప్తదశస్తోమ స్వరూపుడు. అందువలన వైశ్యుని అతని స్తోమము నందే చేర్చినట్లగును.

    6. పశువులను కోరు వైశ్యుని కొరకు జగతీ ఛందస్కమైన 'సమిధ్యమానో అమృతస్య రాజసీ' అను మంత్రమున పరిధానము చేయవలెను. పశువులు జగతీ ఛందస్క మంత్రమే పశువులను కలిగించును.

    7. గౌరవ ప్రతిష్ఠలు కోరువాని కొరకు ఏకవింశతి స్తోమములను పఠించవలెను. ఏక వింశతి సంఖ్య సోమముల యందు ప్రతిష్ఠావహమగును. దానివలన గౌరవ ప్రతిష్ఠలు కలుగును.

    8. బ్రహ్మ వర్చస్సు కోరువాని కొరకు హోత ఇరువది నాలుగు స్తోమములను ఒకదానివెంట ఒకటి అవిచ్చిన్నముగా పఠించవలెను. ఇరువది నాలుగు అక్షరములు గల గాయత్రి బ్రహ్మవర్చోరూపమగును. కావున యజమానికి గాయత్రీ ఛందస్సు బ్రహ్మవర్చస్సు ప్రసాదించును.

    9. అన్నము కోరువాని కొరకు హోత ముప్పది స్తోమములను అవిచ్చిన్నముగ చదువవలెను. విరాట్ ఛందస్సు ముప్పది అక్షరములు కలది. దాని అనుష్ఠానమున అన్నము లభించును. విరాట్టు అన్న స్వరూపము. విరాట్ ఛందము గల మంత్రము వలననే యజమానికి శ్రేష్ఠమగు అన్నము కలుగును.

    10. ప్రతిష్ఠ కోరువాని కొరకు హోత ముప్పది రెండు స్తోమములను అవిచ్చిన్నముగ చదువవలెను. అనుష్టుక్ ఛందము ముప్పదిరెండు అక్షరములది. అనుష్టుక్ ఛందస్సులలో ప్రతిష్ఠావహము. దాని వలన ప్రతిష్ఠ కలుగును.

    11. పశువులను కోరువాని కొరకు హోత ముప్పదియారు స్తోమములను వెంట వెంట చదువవలెను. బృహతి ముప్పది ఆరు అక్షరముల ఛందస్సు. బృహస్పతిని అనుష్ఠించుట వలన పశువులు లభ్యమగును. బృహతి అను ప్రవచనము వలన యజమానికి పశువులు కలుగును.

    12. ఇంద్రియసామర్థ్యము కోరు యజమాని కొరకు హోత నలుబదినాలుగు స్తోమములను అనుప్రవచనము చేయవలెను. త్రిష్టుప్ ఛందస్సు నలుబదినాలుగు అక్షరములు కలది. ఆ ఛందస్సు ఇంద్రియ సామర్థ్య స్వరూపము. యజమానికి త్రిష్టుప్ ఛందస్క మంత్రము ఇంద్రియ సామర్థ్యము కలిగించును.

    13. పశువులు కోరువాని కొరకు హోత నలుబది యెనిమిది సామిధేనీ మంత్రములను అనుప్రవచనము చేయవలెను. జగతీ ఛందస్సు నలువది ఎనిమిది అక్షరములది. పశువులు జగతీ ఛందస్సు అనుష్ఠించుట వలన లభించును. కావున యజమానికి పశువులు కలుగును.

    14. బహుయాజి అగువాని నిమిత్తము హోత ఛందస్సు లన్నింటిని చదువవలెను. అందువలన బహుయాజి సర్వఛందస్సులను పొందుచున్నాడు.

    15. బహుయాజి యగు సోమయాజికి అపరిమిత ఫలము కలుగుటకు గాను సంఖ్యాపరిమితి లేకుండ ఛందస్సులను అనుప్రవచనము చేయవలెను.

                                    పదకొండవ అనువాకము

    1. యజ్ఞోపవీతము మానవ కార్యములందు వినీతము - మెడలో దండవలె - ఉండవలెను. పితృకార్యములందు ప్రాచీనావీతిగా - కుడి భుజము మీద ఉండవలెను. దేవ కార్యములకు ఉపవీతముగా - ఎడమ భుజము మీద ఉండవలెను.

    2. యాగకర్తకు యజ్ఞోపవీతము ఉపవీతముగా ఉండవలెను. ఉపవీతము దేవచిహ్నము అగును.

    3. సామిధేని మంత్రములను నిలుచుండి ఉచ్చరించవలెను. అందువలన చాలాదూరము వరకు వినిపించును.

    4. కూర్చున్న వాని కన్న నిలుచున్న వానికి స్వర్గము ప్రత్యాసన్నమగును. కావున హోత నిలుచుండి సామిధేని మంత్రములు చదువవలెను.

    5. యాజ్యను హోత కూర్చుండియే చదువవలెను. అందువలన ప్రతిష్ఠ కలుగుచున్నది.

    6. క్రౌంచము బిగ్గరగా అరుచును. అది రాక్షసప్రియము. మెల్లగా చదివిన మానుషము అగును. ఆ రెంటికి మధ్యమ స్వరము దేవతలకు ప్రియమగును. కావున దేవతల ప్రీతి కొరకు మధ్యమ స్వరమున మంత్రములు చదువవలెను.

    7. పూర్వము విద్వాంసులే హోతలు అయినారు. అప్పుడు మార్గములు సంకీర్ణములు కాకుండినవి. విశాలములుగా ఉండినవి. విద్వాంసులగు హోతలు కుడికాలును వేదిబయట ఎడమపాదమును వేది మధ్యన ఉంచలేదు. కావున హోతలు కుడికాలు వేదిలోనను, ఎడమకాలు వేది బయటకు పెట్టి సామిధేనీ మంత్రములు చదువవలెను.

    8. కుడికాలు వేదిలోన ఉంచుటవలన భూతకాలిక ఫలము లభించును. ఎడమకాలు వేదిబయట పెట్టుటవలన భవిష్యత్కాలిక ఫలము కలుగును. మొదటి దానివలన పరిమిత ఫలమును, రెండవ దానివలన అపరిమిత ఫలితమును పొందును. అంతేకాక గ్రామ పశువులను, అరణ్య పశువులను పొందును. ఇంకను మొదటిదాని వలన దేవలోకమును - రెండవ దానివలన మానవలోకమును జయించును.

    9. దేవతలు సామిధేనీ మంత్రములను పఠించినారు. అయినను వారికి యజ్ఞము దర్శనమీయలేదు. అప్పుడు ప్రజాపతి మంత్రోచ్చారణ లేకయే అఘారహోమము చేసినాడు. అప్పుడు దేవతలకు యజ్ఞదర్శనమైనది.

    మంత్రోచ్చారణ లేకుండ మౌనముగా అఘారహోమము చెసినట్లయిన యజ్ఞగత కార్యము నిర్వహించినట్లగును.

    10. సామిధేని సమిధలను నేతిలో ముంచవలెను.

    11. ఆ విధముగా సమిధను నేతిలో ముంచినవాడు కఠినాత్ముడు కాకుండును.

    12. అంతేకాక అతడు సామిధేని దేవతలను సంతృప్తులను చేసినవాడగును.

    13. ఈ విధముగా ఎరిగిన వానికి సంతానము, పశువులు సంతృప్తి కలిగింతురు.

    14. ఒక ఋక్కుచేత ఆఘారము చేసిన ఒక దేవతకు ప్రీతి కలిగించినట్లగును. రెండు ఋక్కుల చేత ఆఘారము చేసిన ఇద్దరు దేవతలకు ప్రీతికలిగించినట్లగును. మూడు ఋక్కులచే ఆఘారము చేసిన ఎంతో చేసిన వాడు అగును. కావున మనసుచే ఆఘారము చేయవలెను.

    మనసా హ్యనాప్త మాప్యతే - అందనిది కూడ మనసునకు అందగలదు.

    15. అధ్వర్యుడు - వైయర్థ్యము లేకుండునట్లు దక్షిణ దిక్కు నుంచి ఆజ్యస్రావమును ఆరంభించి ఉత్తర దిక్కున సమాప్తినొందించవలెను.

    16. మాట - మనసు రెండును స్వాతిశయమును చాటినవి.

    దేవతలకు హవ్యము వహించుచున్నాను అని వాక్కు పలికినది. 'దేవతలకు హవ్యము వహించుచున్నాను' అని మనసు పలికినది.

    అవి తను ఆధిక్యతను గూర్చి ప్రజాపతిని అడిగినవి.

    'మనిషి తొలుత మనసులో అనుకున్న దానిని నోటితో చెప్పుచున్నాడు. కావున వాక్కు మనసునకు దూతి అగును' అని ప్రజాపతి పలికినాడు.

    'అటులైనచో ప్రజాపతీ! నీకు మాటచే హోమము జరుగకుండును గాత' అన్నది వాక్కు.

    అందువలన ప్రజాపతికి మనసుతోనే హోమము జరుగుచున్నది. మన ఇవ హి ప్రజాపతిః ప్రజాపతి మనసు వంటివాడు కదా! అందువలన ప్రజాపతి ప్రాప్తి కలుగుచున్నది.

    17. అగ్నీధ్రుడు పరిధులను దర్భలతో సమ్మార్జనము చేయవలెను. అందువలన వాటిని పవిత్రము చేసినట్లగును.

    18. మధ్యమ పరిధిని మూడు మారులు సమ్మార్జనము చేయవలెను. అందువలను మూడు ప్రాణములను సార్వత్రి జయించును.

    దక్షిణార్ధపరిధిని మూడు మారులు సమ్మార్జనము చేయవలెను. అందువలన అతడు భూలోక, అంతరిక్షలోక, స్వర్గలోకములను మూడింటిని జయించును.

    ఉత్తరార్ధపరిధిని మూడు మారులు సమ్మార్జనము చేయవలెను. అందువలన దేవయానములు మూడింటిని జయించును.

    (స్వర్గలోక యమలోక బ్రహ్మలోక విషయాస్త్రయః పన్థానః అని సాయణాచార్యులు. "త్రయోవై దేవయానా పన్థానః" గోపథ ఉత్తర బ్రాహ్మణము.)

    19. దర్భకట్టచేత అగ్నిని మూడు పర్యాయములు చుట్టు త్రిప్పవలెను. అందువలన దేవలోకములు మూడింటిని జయించును.

    20. మధ్యమ, దక్షిణ, ఉత్తరపరిధులు, అగ్ని ఈ నాలుగింటికి మూడు సార్లు చుట్టు త్రిప్పుట వలన మొత్తము సంఖ్య పన్నెండు అగును. అవి పన్నెండు మాసములు. అట్లు ఒక సంవత్సరము అగుచున్నది. అందువలన సంవత్సరము యజమానికి అనుకూలము అగుచున్నది. అది స్వర్గ ప్రాప్తికి కారణము అగుచున్నది.

    21. అధ్వర్యుడు తిర్యంచముగ ఆఘారహోమము చేయవలెను. స్వర్గము తిర్యక్కుగా ఉన్నది. అందువలన యజమానికి స్వర్గము ప్రకాశించును.

    22. ఆఘార హోమము వంకరలేని సూటి దానిగ చేయవలెను. విచ్చిత్తి లేకుండ చేయవలెను. అది ప్రాణము, అన్నము. సంతతి కలుగుటకును, రాక్షస వినాశనమునకును అగుచున్నది.

    23. ఒకని చావు కోరువాడు వంకర ఆఘారహోమము చేయవలెను. అందువలన ప్రాణవాయువు వంకర అగును. అతడు వెంటనే మరణించును.

    24. ఆఘారము యజ్ఞమునకు మకుట ప్రాయము. ధ్రువము యజ్ఞమునకు ఆత్మ. ఆఘారమును, ధ్రువమును అంటించవలెను. అప్పుడు అధ్వర్యుడు తనయందే యజ్ఞ మకుటమును దాల్చినవాడగును.

    25. మానుషాగ్ని దేవతలకు దూత అయినాడు. దేవలోకము నందు ఉండు 'నాక' అగ్ని అసురులకు దూత అయినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.