Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
వారిద్దరు ప్రజాపతి వద్దకు వెళ్లినారు. "మాలో దూతగా ఎవరు అర్హులు?" అని అడిగినారు.
"మానుషాగ్నీ! నీవే దూతగా అర్హుడవు. యజమానికి సంబంధించిన హవిర్దానమును దేవతలకు వినపడునట్లుగా చెప్పుము. యాజ్యపాఠము మూలమున నీవే హోతృకృత్యము నంతను దేవతలకు చెప్పుము" అని ప్రజాపతి మానుషాగ్నిని దూతగా అంగీకరించినాడు. అందువలన దేవతలకు గొప్పదనము అసురులకు పరాభవము కలిగినది.
ఈ విషయములను తెలిసికొని యజమాని ప్రవరను వరించినచో అతనికి శ్రేష్ఠత్వము కలుగును. అతడు శత్రువులను పరాభవించును.
26. బ్రాహ్మణ, అబ్రాహ్మణ విషయము చర్చకు వచ్చినపుడు విజ్ఞుడగు వాడు బ్రాహ్మణుడు అధికుడని చెప్పవలెను. అందువలన తన ఆధిక్యమును చెప్పుకున్నట్లగును.
బ్రాహ్మణుని తక్కువ వానిగా చెప్పినచో తననే తక్కువ వానిగా చెప్పుకున్నట్లగును. తస్మాద్ర్భాహణో నపరోచ్యః - కావున బ్రాహ్మణుని పరాభవించరాదు.
పన్నెండవ అనువాకము
1. అగ్ని సంబంధమైన దానికి 'ఆయుష్యోవిశ్వతో దధత్' పురోనువాక్య, 'ఆయుర్దా అగ్నేహవిషో జుషాణః' యాజ్య.
సోమదేవతాకమునకు 'ఆప్యాయస్వ సమేతుతే' పురోనువాక్య. "సంతే పయాగంసి సముయన్తు వాజాః" యాజ్య.
వరుణ దేవతాకమునకు "అవతేహేడః" పురోను వాక్య. 'ఉదుత్తమమ్' యాజ్య.
సరస్వతీ దేవతాక చరుకు 'ప్రణోదేవీ' అనువాక్య. "ఆనోదివో బృహతః" యాజ్య.
అగ్నివిష్ణు దేవతాకమునకు 'అగ్నా విష్ణూమహి తద్వామ్, అనువాక్య. 'అగ్నావిష్ణూ మహిధామ్న' యాజ్య.
వారుణ చతుష్క పాలమునకు 'ఇమంమే వరుణ' పురోనువాక్య. 'తత్త్వాయామి' యాజ్య.
సూర్య దేవతాకమునకు 'ఉదుత్యజాతవేదసమ్' అనువాక్య. 'చిత్రం దేవానామ్' యాజ్య.
2. 'అపాం న పాత్త' దేవత వక్రగతి' గల జలముల మీద వర్తించువాడు. అతడు మెరుపులు బట్టలుగా గలవాడు. అతడు తన ఉపవేశన స్థలమును పొందును. భారీ వర్షము అతని ప్రశస్త మహత్తును ప్రకటించును. మెరుపుల నడుమ బంగరు రంగు పులుముకున్న జలములు ఆ దేవుని చుట్టు వ్యాపించి ఉండును.
3. కాలువలు ఒకదానితో ఒకటి కలసి ప్రవహించును. కొన్ని జలములు పారవు. నిలిచి ఉండును. నిలిచిన, పారునట్టి జలములకు అపాంనపాత్తుడు సమానుడు. సముద్రుడు బడబాగ్ని కలవాడు. నదులు అతనిలో చేరి అతనికి ప్రీతి కలిగించును. అపాంనపాత్తుడు బడబాగ్నికి జననస్థానము. అతడు జలములను నశింపచేయనివాడు. అతనిని పరిశుద్ధ జలములు చుట్టుకొని ఉండును.
4. అపాంనపాత్తు నిత్యయవ్వనుడు. జలములు అతనికి అనుకూలములు. నిత్యయవ్వనలు. శోధించబడునవి. అవి అతనికి చుట్టుకొని ఉండును.
అపాంనపాత్తు ప్రకాశయుతుడు. ధనవంతుడు. నేతిని కరిగించి శోభించువాడు. అతడు కర్రలు లేకుండగనే జలము లందు తేజరిల్లును.
5. ఇంద్రావరుణులు ఎంతగానో ప్రకాశించువారు. మమ్ము రక్షించుమని వారిని ప్రార్థించు చున్నాము. వారు మాకు రక్షణలు కలిగించి మమ్ము సుఖవంతులను చేయవలెను.
6. ఇంద్రావరుణులారా! మాకు ఆపదలను బాపు సుఖములను ప్రసాదించండి. అది మాకు యాగానుష్ఠానమును, పరివారక్షేమమును, ప్రజాసమృద్ధిని కలిగించును. మమ్ము దీర్ఘకాలము పీడించునట్టి పాపాత్ముని మేము పీడించగలము. మేము బాధారహితులము కాగలము.
7. 'ఆవో మిత్రా వరుణా' పురోనువాక్య. 'ప్రబాహవా' యాజ్య.
అగ్నిని ఉద్వాసన చేయువాడు అగ్నిని హింసించిన వాడు అగును. అతనిని వరుణుడు జలోదరమున పీడించును.
8. అగ్నీ! మా భక్తిశ్రద్ధలను గుర్తింపుము. వరుణునకు మాపై గల కోపమును తొలగించుము. నీవు యాగ నిష్పాదకుడవు. దేవతలకు హవ్యవాహనుడవు. ఎంతో ప్రకాశించువాడవు. సర్వద్వేషముల నుండి మమ్ము విముక్తులను చేయుము.
9. అగ్నీ! నీవు ఉషః కాలము దాటిన ప్రాతః కాలమున అవతరింతువు. నీ రక్షణలచే మాకు రక్షకుడవు అగుము. మాకు వరుణుని వలన కలిగిన పాపాదికముల నుండి విడిపించుము. ఆటలాడుచు సుఖప్రదమగు మా హవిస్సును స్వీకరించుము. మాకు ఆహ్వాన సులభుడవు అగుము.
10. యజమాని హవిస్సు అందించువాడు. అగ్ని అతని ఆహ్వానములను శ్రద్ధగా ఆలకించును గాక.
అగ్ని సూర్యుని వలె తేజరిల్లువాడు. యుద్ధములందు సర్వత్ర జయము కలిగించువాడు. దేవతలకు హితుడు. శుభప్రదుడు. అతడు మావద్దకు అతిథివలె వచ్చును గాత.
11. అగ్నీ! నిన్ను ఎంతో యజించున్నాము. నీ అనుగ్రహము ఎంతో పొందుచున్నాను. యాగములందు నమస్కరించ వలసిన రీతిన నమస్కరించుచున్నాను. నీవు సనాతనుడవు. తేజోవంతుడవు. యజమాని నిన్ను యజించవలెననుకొనుచున్నాడు. హవిస్సులు అర్పించ దలచుచున్నాడు. అతనికి సంతోషము కలిగించుము. అతని ఎడారియందు ఒయాసిస్సువు అగుము.
12. ఇవి అగ్నికి యాజ్యా, పురోనువాక్యలు: -
"విపాజసా పృథునా శోశుచానః" పురోనువాక్య. "విజ్యోతిషా బృహతా" యాజ్య.
13. అగ్నీ! యాగశాల విశాలము. అందు నీవు జ్వలించుచున్నావు. కర్మ ప్రారంభమైనంతనే సర్వ రాక్షస జాతులను దహించుము.
14. అగ్ని శుభారంభము కలవాడు. మమ్ము మంగళవీక్షణముల చూచువాడు. మా యాగములకు విచ్చేయువాడు. భక్తుల భావములు తెలిసినవాడు. మేము అతని మహిమలు ఎరుగము. అయినను అతడు మమ్ము అనుగ్రహించినాడు. అతనిని యజించ గోరువారందరి అభిప్రాయములను తెలసికొనును. అగ్ని మా హవ్యములను గూర్చి దేవతలకు చక్కగా చెప్పును గాత.
15. మూడు హవిస్సుల యాజ్య పురోనువాక్యలు : -
'అగం హోముచే ప్రభరేమ' ఇది ప్రథమ హవిస్సునకు పురోనువాక్య. 'వివేషయన్మ' యాజ్య.
"విన ఇంద్ర మృధః" రెండవ హవిస్సునకు పురోనువాక్య. "ఇంద్ర క్షత్ర మభివామమ్" యాజ్య.
'ఇన్ద్రియాణి శతక్రతో' మూడవ హవిస్సునకు పురోనువాక్య. "అనుతే దాయిమహే" యాజ్య.
శ్రీమాదాంధ్ర వచన కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహిత
రెండవ కాండమునందలి అయిదవ ప్రపాఠకము సమాప్తము.





