Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
9. 'ప్రవోవాజాః' ఇత్యాది ఋక్కులను పఠించవలెను. అందువలన ప్రముఖరేతో వర్తియగు యోషిచ్చరీరమునకు పోవునట్టి రేతస్సు గర్భాశయమునందు స్థాపించబడును.
10. 'అగ్న ఆయాహి వీతయే' అనునది ప్రథమ సామిధేని ఋక్కు. చరమ పాదముతో కూడ ఆ యాహివీతయే పఠించవలెను. అందు "ఆయాహి" అను పదము ఉండుటవలన ప్రత్యఙ్ముఖ సదృశులగు ప్రజలు జన్మింతురు.
11. దేవతలారా! యజమానులు యజ్ఞములు చేయుచున్నారు. మాసములు, పక్షములు, హవిష్మంతులగు దేవతలు, ఘృతమును అందించు గోవులు అనుకూలురు అగుదురు గాక. ఈ యజ్ఞము దేవతలను చేరును గాక. యజమానికి సుఖములు కలుగును గాత.
'ప్రవోవాజాః' అను ఋక్కును ఉచ్చరించవలెను. మాసములు వాజశబ్దవాచ్యములు. పక్షములు అభిద్యవ శబ్దవాచ్యములు. హవిష్మంతులు దేవతలు. గోవు ఘృతాచీ శబ్ద వాచ్యము. యజ్ఞము దేవతలను చేరవలెను. యజమాని సుఖించవలెను.
12. సామధేనీ ఋక్కులచే ప్రజ్వరిల్లుచున్న అగ్నీ! నీవు మాసముల, పక్షముల, దేవతల స్వరూపము అగుచున్నావు. అదియే "ప్రవోవాజాః" యొక్క తాత్పర్యము. అందువలన యజమాని ప్రజ్వరిల్లుచున్న అగ్నియొక్క ఆహుతి స్థానమును సాధించినవాడు అగును.
13. ఒకడు పరిపూర్ణాయువు కోరును. అందుకు "ప్రవోవాజాః" అను ప్రథమ సామిధేనీ ఋక్కును పఠించవలెను. వెంటనే - విరామము లేకుండ 'అగ్న ఆయాహి వీతయే' అను ఋక్కు యొక్క ప్రథమ భాగమును ఉచ్చరించవలెను. అవిచ్చిన్న పఠనము వలన యజమాని ప్రాణవాయువుతో అపాన వాయువును ధరింపచేసిన వాడు అగును.
14. సామధేని ఋక్కుల అరత్నిని తెలిసికొన్న వాడు శత్రువును తనచేత ఉంచుకొనును.
ఋక్కుల రెండు భాగములను సంధానము చేయవలెను. దీనినే సామిధేని ఋక్కుల అరత్ని అందురు. ఈ విషయము తెలిసిన వాని చేతనే శత్రువు ఉండును.
15. సామిధేని ఋక్కులు ఋషి ప్రోక్తములు. ఆ సామధేనీ ఋక్కులను సంధించకున్నచో యజమానికి ప్రజా, పశునష్టము కలుగును.
కావున ఋక్కుల అర్థభాగములను సంధానము చేయవలెను. అట్లు సంయోజనము చేసిన యజమానికి సమస్త ఆశీస్సులు లభించుచున్నవి.
ఎనిమిదవ అనువాకము
1. సామము లేని యజ్ఞము కానేరదు. 'అగ్న ఆయాహి వీతయే' అను రెండవ సామిధేనీ ఋక్కు రథంతర సామమునకు వర్ణము.
"తంత్వా సమిద్భిరఙ్గిరః" అను మూడవ సామిధేనీ ఋక్కువామదేవ్య సామమునకు వర్ణము.
'బృహదగ్నే సువీర్యమ్' అను నాలుగవ సామిధేనీ ఋక్కు బృహత్సామమునకు వర్ణము.
ఈ మంత్ర సముదాయమును పఠించవలెను. అందువలన యజ్ఞము సామవంతము అగును.
2. పూర్వము అగ్ని ద్యులోకము నందు ఉండెను. సూర్యుడు భూలోకమున ఉండెను. అందువలన ఉభయ లోకములందు శాంతి కొరవడినది. దేవతలు ఈ స్థితిని చూచినారు. వారిలోవారు ఆలోచించినారు. అగ్ని, ఆదిత్యులను ఒకరి స్థానమున మరొకరిని ఉంచవలెనని నిశ్చయించినారు.
అగ్ని ఆయాహివీతయే అను సామిధేనీ ఋక్కును ఉచ్చరించినారు. అందువలన అగ్నిని ద్యులోకము నుండి రప్పించి భూలోకమున స్థాపించినారు.
బృహదగ్నే సువీర్యమ్, బృహదగ్నే సూవీర్యమ్ అను సామిధేనీ ఋక్కును ఉచ్చరించినారు. అందువలన సూర్యుని భూలోకము నుండి ఎత్తి ద్యులోకమున స్థాపించినారు.
ఆ మార్పు వలన ఉభయ లోకములకు శాంతి కలిగినది.
ఆ విధముగా పఠించుట వలన రెండు లోకములకు శాంతి కలుగును. ఈ విషయము గ్రహించిన యజమానికి ఉభయలోకములు శాంతిని ప్రసాదించును.
3. సామిధేని ఋక్కులు పదిహేను. వానిని పఠించవలెను. పక్షమునకు రాత్రులు పదిహేను. సామిధేనీ ఋక్కులు ఆ సంఖ్యకు సరిపోవుచున్నవి. పక్షముల లెక్కననే సంవత్సరము అగుచున్నది.
4. సామిధేనీ ఋక్కులు పదిహేను. వీనిది గాయత్రీ ఛందస్సు. గాయత్రికి ఇరువది నాలుగు అక్షరములు. అందువల్ల 15 x 24 = 360 అగుచున్నది. ఇది సంవత్సరము నందలి దినముల సంఖ్య అగుచున్నది.
5. సృమేధుడు, పురుచ్చేపుడు అను ఋషులు మంత్ర సామర్థ్యమును గురించి వాదించుకున్నారు. తమలో ఎవరు సామిధేనీ మంత్రమున అత్యంత కుశలుడో నిశ్చయించదలచినారు. సామిధేనీ మంత్రమును జపించుచు తడి కట్టెయందు నిప్పు పుట్టించువాడు అత్యంత కుశలుడు అనుకున్నారు.
నృమేధుడు తడిసిన కట్టె మీద సామిధేని మంత్రమును ప్రయోగించినాడు. ఆ కట్టె నుండి పొగపుట్టినది. కాని అగ్ని పుట్టలేదు.
పురుచ్చేపుడు తడికట్టె మీద సామిధేని మంత్రమును ప్రయోగించినాడు. అందువల్ల తడి కట్టె నుండి అగ్ని పుట్టినది.
పురుచ్చేదా! నీవు అతీంద్రియ ద్రష్టవైనావు. మన ఉభయుల సామిధేనీ మంత్రము సమానమే కదా! నేను పుట్టించలేని అగ్నిని నీవెట్లు పుట్టించినావు?" అని అడిగినాడు.
"నృమేధా! నేను సామిధేని మంత్రపు రహస్య తేజస్సును తెలిసికున్నాను. ఘృతశబ్దోపేతమైన మంత్రపాదము ఆ తేజస్సు అగును. ఆ పాదము 'తంత్వాసమిద్భిరఙ్గిరః' అను మంత్రము నందు ఉన్నది.
"సామధేనీష్వేవ తజ్జ్యోతి ర్జనయతి - అ మంత్రము సామధేనులకు జ్యోతిని కలిగించుచున్నది" అన్నాడు.
6. ఋక్చబ్దము స్త్రీలింగము. గాయత్రి స్త్రీలింగము. సామిధేనీ శబ్దము స్త్రీలింగము. కావున 'వృషన్' శబ్దమును పఠించవలెను. ఆ పాదము వలన పురుషవంతములు, ఇంద్రియవంతములు, మిథునములు ఏర్పడును.
7. దేవతలు తమకు దూతగా అగ్నిని ఏర్పరచినారు. రాక్షసులు శుక్రుని పుత్రుడగు ఉశనసుని తమకు దూతనుగా నియమించినారు. అగ్ని, ఉశనసులు ప్రజాపతి వద్దకు వెళ్లినారు. 'మా ఉభయులలో ఎవరి దూతము సరియైనది' అని అడిగినారు. ప్రజాపతి 'అగ్నిం దూతం వృణీమహే' - అగ్నిని దూతగా వరించుచున్నాను అన్నాడు. ఉశనసుని నుండి మరలినాడు. అగ్నికి అభిముఖుడు అయినాడు. అందువలన దేవతలు గెలిచినారు. రాక్షసులు ఓడినారు.
ఈ విషయము తెలిసికొని 'అగ్నిం దూతం వృణీమహే' ఇత్యాది మంత్రములు చదివిన యజమాని విజయవంతుడగును. అతని శత్రువునకు పరాజయము కలుగును.
8. అధ్వర శబ్దోపేతమైన 'సమిధ్యమానే అధ్వరే' ఇత్యాదికమగు ఋక్కును పఠించవలెను. అందువలన యజమానికి గల శత్రువు నశించును.
9. 'శోచిష్కేశస్తమీమహే' అను మూడవ పాదమును చదువవలెను. అందువలన యజమాని పవిత్రుడు అగును.
(శోచిష్కేశ - శుచిమంతములగు కిరణములను కేశములు కలవాడని రథము. అందువలన అది పావనము చేయును.)
10. 'సమిద్ధో అగ్ని ఆహుత' దశమసామిధేని అగును. ఈ మంత్రము చదువుట వలన నాశము అంటకుండుటకు పరిధి ఏర్పరచినట్లగును. ఆ మంత్రము చదివిన తరువాత 'ఆజుహోత దువస్యత' అని మంత్రము చదువుచు సమిధను వేయవలెను. అందువలన పరిధికి అవతల హవిస్సు ఉంచినట్లు అగును.
11. అగ్నులు ముగ్గురు. ఒక అగ్ని దేవతలకు హవిస్సు చేరవేయువాడు. రెండవ అగ్ని పితరులకు కవ్యము చేరవేయువాడు. మూడవ అగ్ని అసురులకు సహరక్షస్సు. ఈ ముగ్గురు అగ్నులును యజ్వ తననంటే తననే కోరుకొనును అనుకుందురు. కావున దేవతలారా! హవ్యవాహనుని వరించుడు అనిపదకొండవ సామిధేని మంత్రము వచించినది. దేవతలకు ఎవడు అగ్ని అగుచున్నాడో యజ్య ఆ అగ్నినే వరించవలెను.
12. యజమాని తన ఋషిగోత్ర సంతతిని చెప్పుకొనవలెను. అందువలన అతడు బంధువులకు దూరము కాడు.
(ప్రవర చెప్పునపుడు ఆయాగోత్రముల ఋషులను చెప్పుట విధి.)
13. యజమాని అపత్య పరంపరగా అర్వాచీనులను వరించవలెను. అందువలన పూర్వపితరులు, అర్వాచీన మనుష్యులను చెప్పినట్లగును.
(అపత్య పరంపర అనగా తొలినుండి తండ్రి కొడుకులను పేర్కోనుట - భృగుపుత్రుడు చ్యవనుడు. చ్యవన పుత్రుడు అప్నవానుడు ఇత్యాదులు.)
తొమ్మిదవ అనువాకము
1. "అగ్నే మహానసి బ్రాహ్మణ భారత | అసావసౌ ||" అనునది మంత్రము.
అగ్ని సర్వహవిస్సులు ధరించువాడు. అందువలన అగ్ని మహానుడు.
అగ్ని బ్రాహ్మణుడు.
దేవతలకు హవిస్సు వహించుట వలన భారతుడు.
అసౌ అసౌ, భృగ్వాది మహర్షుల నామ నిర్దేశమును సూచించు చున్నది.
2. దేవతలు ఈ అగ్నిని ప్రజ్వలింపచేసినారు. కావున ఈ అగ్ని 'దేవేద్దుడు' అయినాడు.
3. తరువాత అగ్నిని మనువు ప్రజ్వలింప చేసినాడు. అందువలన ఈ అగ్ని 'మన్విద్ధః' అయినాడు.
4. ఋషులు స్తుతించినందున అగ్ని "ఋషిష్టుతుడు" అయినాడు.
వేదాధ్యయశ సంపన్నులు విప్రులు. విపులచే సంతోషపరచబడిన వాడు అయినందున అగ్ని 'విప్రానుమదితుడు' అయినాడు.
వేదాధ్యయన సంపన్నులు కవులు. కవులచే ప్రశంసించ బడుటచే అగ్ని 'కవిశస్తుడు' అయినాడు.
మంత్రములచే తీక్ష్ణముగా చేయబడినవాడు అగుటవలన 'బ్రహ్మసంశితుడు' అయినాడు.
అగ్నికి ఘృతాహుతి ఇష్టమైనందున అగ్ని ఘృతావహనుడు అయినాడు.
5. అగ్ని యజ్ఞములకు నేత. అందువలన "ప్రణీర్య జ్ఞానామ్" అయినాడు.
అగ్ని యజ్ఞములకు రథము. కావున 'రథీరధ్వరానామ్' అయినాడు.
ఏ దేవతయు అగ్నిని అతిక్రమించుట లేదు. "అతూర్తః హోతా" అయినాడు.
అగ్ని సర్వదేవతల హవిస్సును అందుకొనును. కావున 'తూర్ణిః హవ్యవాట్' అయినాడు.
6. అగ్ని దేవతలకు ఘృతము అందించు జుహువు వంటివాడు. కావున అగ్నిని 'అస్పాత్రం జుహుః దేవానామ్' - లోహపాత్ర వంటి దృఢమైన జుహువు న్నారు.
అగ్ని దేవతలు పానము చేయుటకు ఉపయోగపడు చమసము వంటివాడు. అందువలన 'చమసోదేవపానః' అనబడుచున్నాడు.
అగ్ని దేవతల యందు అంతటను వ్యాపించి ఉండువాడు. అగ్నీ రథనేమి వలె నీవు దేవతల యందంతటను వ్యాపించి ఉన్నావు అని చెప్పబడినది.
దేవతలను అభిలషించువాడు. హే అగ్నీ! అనుటవలన అతనికి శత్రువులు కలుగుచున్నారు. అందువలన యజమాని కొరకు దేవతలను ఆహవ అని మంత్రము చెప్పినది.
'ఆహవదేవాస్య జమానాయ' అనుట వలన యజమానికి అభ్యుదయము కలుగును.
7. అగ్నిమగ్న ఆవహ - అగ్నీ అగ్నిని ఆవహింపుము. సోమమానహ - సోమమును ఆవహింపుము. అనుటవలన దేవతలను క్రమముగా ఆజ్యభాగములకు ఆహ్వానించినట్లగును.
8. జాతవేద అగ్నీ! దేవతలను ఆవహింపుము. యజ్ఞమును చక్కగా నిర్వహింపుము. అట్లని ఆవాహన మంత్రము పఠించినందున అగ్ని తీక్ష్ణత కలవాడు అగును. ఆ విధముగ తీక్ష్ణ కృతుడగు అగ్ని యజమాని హవిస్సులను దేవతలకు అందించును.
9. అగ్ని దేవతలకు హోత. దేవతల హోతయగు అగ్నినే మానవహోత వరించుచున్నాడు.
10. స్మోవయమ్ - మేము అనుచున్నాము అనుట వలన మానవ హోత తనయందు దైవ్యహోత యగు అగ్నిని ప్రవేశపెట్టు కున్నవాడు అగుచున్నాడు.
11. యజమానీ! నీవు అగ్నిని హోతగా వరించినావు. కావున దేవతలు హవి స్వీకరించుచున్నారు. 'వారు మంచి ఫలమును ఇచ్చెదరు గాత' అనునది యజమానికి ఆశీస్సు అగుచున్నది. ఇది 'సాధుతే యాజమాన దేవతా' అను ఆవాహన మంత్రము.





