Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



                     జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                    ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||

                              ఇరువది తొమ్మిదవ అధ్యాయము


1.    సమిద్దో అజ్జ్ఞన్కృదరం మతీనాం ఘృతమగ్నే మధుమత్పిన్వమానః|
    వాజీవహన్వాజినం జాతవేదో దేవానాం వక్షిప్రియమా సదస్థమ్|

    హే జాత ప్రజ్ఞాన అగ్నీ! సమిద్ధ బుద్ధుల ఉదరములను ప్రకటించుము. స్వాదిష్ట ఘృతమును దేవతలందు నింపుము. వేగవంతుడవగుము. దేవతలకు హవి అందించుము. దేవతలకు ప్రియమగు యజ్ఞమునకు దేవతలను తోడ్కొని రమ్ము.

    2. అశ్వము దేవయాన మార్గమును ఎరుగవలెను. తనవంటికి నేతిని పూయవలెను. దేవతలను చేరుకోనవలెను. సర్పణశీల అశ్వమా! నిన్ను సకల దిశలు సేవించును గాత. ఈ యజమానికి అన్నము అందింపుము. స్వధామస్మై యజమానాయ ధేహి"

    3. వేగవంత అశ్వమా! నీవు స్తుత్యుడవు. వందనీయుడవు. మార్గములందు వ్యాపనశీలుడవు. పవిత్రుడవు. దేవతలకు ప్రియతముడగు అగ్ని నిన్ను దేవతలకు చేర్చును గాత.

    4. దర్భాసనమును మేము చక్కగా పరచుచున్నాము. ఇది వేది మీద విశాలముగ పరచబడినది. దేవతలు ఆసీనులగు దర్భాసనము సేవించునదియు సుప్రీతయగు అదితి దేవి దీనిని సుఖాసనము చేయును గాత. దీనిని స్వర్గమునకు చేర్చును గాత.

    5. ద్వార దేవేరులు సౌభాగ్యశాలినులు. నానారూపవతులు. రాకపోకల రెక్కలను తెరచువారు. గమనశీలులు. సమీచీనలు. శబ్దకారిణులు. వారు సుగమనలు అగుదురు గాథ. సుప్రయాణాభవస్తు.


    6. ఉషా రాత్రులు ద్యావాపృథ్వులమధ్య సంచరించునవి. యజ్ఞముఖ అగ్నికి కాలము గుర్తు చేయునవి. సువర్ణాలంకృతలు. ఒకరిలో ఒకరు లయమగునవి. నేను వారిని ఆ ఉషా రాత్రులను యజ్ఞవేది మీద ఆసీనులను చేయుచున్నాను.

    7. యజమాన దంపతులారా! మీరు ప్రథమ భావనలు సమాన రథులు. శుభ్ర వర్ణులు. "పశ్యన్తో భువనాని విశ్వా" సమస్త భావనములను చూడగలవారు. అగ్ని వాయువు మీ కర్మలను నిర్ణయించువారు. ఆహవనీయులు, పరంజ్యోతిని ఉపదేశించువారు. దేవీహోతలు. వారిని సంప్రీతులను చేయుచున్నాను.

    8. ఆదిత్య సహితయై భారతి మా యజ్ఞమును ఆశించవలెను. రుద్ర సహితయై సరస్వతి మమ్ము రక్షించవలెను. వసువులు సహితముగా ఆహ్వానించబడిన సుప్రీతి ఇడ, మమ్ము కాపాడవలెను. ఈ ముగ్గురు దేవేరులు మా యజ్ఞమును అమర దేవతలందు స్థాపించవలెను. యజ్ఞంనో దేవేరమృతేషు ధత్త"

    9. దేవకామియు, యోగ్య వీర పుత్రుడగు ఇంద్రుని త్వష్ట పుట్టించినాడు. వేగవంతమగు అశ్వమును త్వష్ట సృష్టించినాడు. "త్వేష్టేదం విశ్వం భవనం జజాన" త్వష్ట సమస్త భవనములను కల్పించినాడు.

    హోతా! అనేకము కల్పించిన త్వష్టణు యజింపుము.

    10. అశ్వము స్వయముగా ఘృతమును పులుముకొనును గాథ. అది కాల ప్రకారము హవియై దేవతలను చేరును గాథ.

    వనస్పతి యూపము దేవలోకపు దేవతలను ఎరింగినది. అగ్నిచే ఆస్వాదించబడిన హవిస్సులను యూపము దేవలోకమునాకు చేర్చును గాత.

    11. అగ్నీ! నీవు అడవులందు పుట్టినావు. "ప్రజాపతేస్తపసావావృధానః" ప్రజాపతి తపమున వర్ధిల్లినావు. యజ్ఞమును భరించుచున్నావు. స్వాహా అన్న హవిముందు సాగు అగ్నీ! దేవలోకమునాకు వెళ్ళుము. దేవతలు సాధు హవిని సేవింతురు గాత.

    12. అశ్వమా! నీవు సాగరమున పుట్టినావు. అశ్వమునకు పుట్టినావోగాని భీషణ రావము చేసినావు. గొప్పగా పుట్టిన అశ్వమా! శ్యేనము వంటి నీ రెక్కలు, హరిణము వంటి నీ పాదములు అత్యంత స్తుత్యములు.

    13. యముడు ఇచ్చిన అశ్వమును తొలుత 'త్రిత' పూన్చినాడు. ఇంద్రుడు తొలుత అధిరోహించినాడు. విశ్వావసు గంధర్వుడు తొలుత కళ్ళెము పట్టినాడు. వసువులు సూర్యుని నుండి అశేఅమును పొందినారు.

    14. అశ్వమా! నీవే యముడవు. నీవే ఆదిత్యుడవు. నీవే ఉర్వవు. నీ గుహ్య కర్మలచే నీవే త్రితవు. ప్రతిజ్ఞచే నీవు సొమము నందు ఏకీభూతవు. దేవలోకమున నీకు ఋగ్యజుస్సామమను మూడు బంధములు ఉన్నవి.

    15.  అశ్వమా! నీకు ద్యులోకమున మూడు జలములందు మూడు, అంతరిక్షమున మూడు, బంధములు ఉన్నవని చెప్పుదురు. నిన్ను వరుణుడు ప్రశంసించును. నీ పరమ జన్మను మరెందరో చెప్పుకుందురు.

    16. అశ్వమా! ఇదిగో ఇక్కడ నీ మార్జనమును చూచుచున్నాను. ఇది నీవు ఖురములచే తోడుచోటు. నిన్ను యజ్ఞమునందు రక్షించు పగ్గములను ఇచట చూచుచున్నాను.

    17. అశ్వమా! అంతరిక్ష మార్గమున సూర్యుని చేరునట్టి నీ ప్రాణమును నేను చాలా దూరము వరకు మనసున చూచినాను.

    18.  అశ్వమా! వర్షమును జయించు కోరికచే ఈ సూర్య మండలమున నీ ఉత్తమ దేవస్వరూపమును  చూచినాను. మానవుడు నిన్ను మేతకు విడిచినపుడు -అత్యంత భ్రమణశీలుడవగు నీవు గడ్డి మున్నగు ఓషధులను మేయుదువు.

    19. అశ్వమా! రథములు, మానవులు, గోవులు, కన్యల సంపదలెల్ల నీ మీదనే ఆధారపడియున్నవి. మానవ సమాజము నీ మైత్రిని కోరును. దేవతలు సహితము నీ వీరకృత్యములను ప్రశంసింతురు.

    20. ఇంద్రుడు స్వర్ణ కిరణములవాడు. అశ్వమును తొలుత అధిరోహించినవాడు. అతడు  సహితము మహింయందు ఈ అశ్వమును మించజాలడు. "అస్యపదామనోజవా" దీని కాళ్లకు మనోవేగము ఉన్నది. దేవతలు అశ్వపు హవిని ఆరగించుటకు ఆత్రపడుచుందురు.

    21. అశ్వము రౌతుగలది. సంకుచిత మధ్యభాగం. తీక్ష్ణ వీరభావము కలది. దివ్య గమనశీల యుద్ధము సంభవించినపుడు అశ్వము హంసల వలె వరుసగా సాగును.

    22. అశ్వమా! నీ దేహము సహజముగానే గమన శీలము. నీ మనసు వాయుగతి గలది. నీ జ్యోతులు అనేక స్థానములందు ఉన్నవి. అవి అరణ్యములందు వికసించుణు - సంచరించును.

    23. అశ్వము వేగవంతము, దేవగామి. అది ధ్యానించుచు వధ్య స్థలమునకు చేరును. దాని ముందు ఒక మేకను- వెనుక ఒక మేకను తీసికొనివచ్చెదరు. మేక వెనుక స్తుతి కర్త ఋత్విక్కు నడుచును.

    24. అశ్వము తన మాతా పితరుల పరమ స్థానమగు స్వర్గమును చేరినది. ఎంతో రుచిగల హవి స్వరూప అశ్వము నేడు దేవతలను చేరుకున్నది. ఇక ఈ అశ్వము హవిర్ధాత యజమానికి ధనము కోరును.

    25. జాతవేద అగ్నీ! యజమాని యజ్ఞ గృహమున సమిద్ధుడవై నేడు నీవు దేవతలను యజింతువు. నీవు మిత్రులకు మాన్యత కలిగించువాడవు. కవివి. విశాల హృదయుడవు. దేవతలను యజ్ఞమునకు తెమ్ము.


    26. అగ్నీ! నీవు జలములకు పౌత్రుడవు. శుభజిహ్వ గల వాడవు. యజ్ఞపు దేవమార్గ హవిస్సులను నేతితో తడుపుము. స్వకర్మముల యజ్ఞముణు సమృద్ధము చేయుము. ఈ యజ్ఞమునకు దేవప్రాప్తి కలిగించుము.

    27.  ఈ దేవతలందు ఈ ఋత్విజులచే ప్రశంసనీయుడు. యజ్ఞము లందు యజనీయ అగ్ని మహిమను  మేము ప్రస్తుతించుచున్నాము. దేవతలు సుకర్ములు. పవిత్రులు. యజ్ఞ ధర్తలు. వారు సొమము, హవి రెండింటిని సేవింతురు.

    28. అగ్నీ! నీవు స్తుత్యుడవు. వందనీయుడవు. దేవతల మహాన్ ఆహ్వాతవు. యజనము చేయబడుచున్న నీవు వసు సహితుడవై ఈ యజ్ఞమునకు విచ్చేయుము. అత్యంత పూజనీయుడవు ఆగుము. దేవతలణు యజింపుము.

    29. వేది మీద పరచబడునని దర్భలు. వానిని స్తుతి వాక్యానుసారము - తొలి సంధ్యలో కోయబడును. కుశలు పవిత్రాతి పవిత్రములు. సుఖకరములు. వానిని దేవతలు మరియు అదితి కొరకు పరచబడును.

    30. ద్వారములు సావకాశములు. పొడవు వెడల్పు గలవి. అవి భర్తల కొరకు స్త్రీలు తొడలు చాచినరీతి పూర్తిగా తెరచుకొనవలెను. మహిమ గలవియు, స్వరగమనలగు ద్వారదేవేరులు నేడు దేవతలు సుప్రవేశలు కావలెను.

    31. ఉషా రాత్రులు సాధు స్వరూపలు. యజనీయులు. నికట వర్తినులు. దివ్య స్త్రీలు. ఆభరణవతులు, సురూపలు, శుభ్రకపిశలు. వారు రూపములు దాల్చి యజ్ఞవేది మీద ఆసీనులు కావలెను.

    32. అగ్ని వాయువులు దైవీహోతలు. ప్రథమ భావులు. శుభవాక్కులు. యజ్ఞనిర్వాహకులు. యజ్ఞములందు కర్మలు నడిపించువారు. శృతిచే ఉభయ సంధ్యలందు ఆహవనీయులు. ఆదేశించువారు. వారు యజ్ఞమునకు రావలెను.
       
    33. భారతి త్వరత్వరగా మా యజ్ఞమునకు రావలెను. మానవుని చైతన్యవంతుని చేయు సరస్వతియు, ఇడయు యజ్ఞమునకు రావలెను. సరస్వతి మున్నగు సుకర్మలగు మువ్వురు దేవేరులు దర్భాసనములపై ఆసీనులు కావలెను.

    34. హోతా! నీవు యజనకారివి. విద్వాంసుడవు. నాచే అర్థించబడుచున్నావు. ఉత్పాదికలగు దివాపృథ్వులను, సమస్త లోకములను ఆకారము, అవయవములు కలవానిగా సృష్టించిన వాడున్నాడే వానిని ఈ యజ్ఞమున సేవించుము.

    35. హోతా! నీవు స్వయముగా, కాలప్రకారము, దేవతలకు రుచికర హవిస్సులను ఘృత యుక్తము చేసి సమర్పించుము. వనస్పతి యూపమా! వధించువాడా! అగ్నిదేవా! ఈ పశుహవిని మధు ఘృతయుక్తము చేసి స్వాదిష్టము చేయండి.

    36. అప్పుడే పుట్టిన అగ్ని యజ్ఞ నిర్మాణము చేయును. అగ్ని దేవతలకు పురోగామియగును. "అగ్నిర్దేవానామభవత్పురోగాః" అగ్ని దైవీహోత. అతని అనుశాసనమున అతని ఆహ్వానము అతని వాని యందు స్వాహా యందు స్వాహా అనబడిన హవిని దేవతలు సేవించవలెను.

    37. అజ్ఞాని మానవునకు జ్ఞానము కలిగించిన - రూపము లేను వానికి రూపము కలిగించిన అగ్నిదేవా! నీ వద్దనే నివసించు ఋత్విజ, యజమానుల  సహితుడవై వ్యక్తమగుము.

    38. కవచధారి వీరుడు యుద్ధమధ్యమున దూకినపుడు మబ్బులు క్రమ్మి, ఉరుములు ఉరిమి పిడుగులు పడినంత భయంకరుడు అగును. వీరుడా! అనావిద్ధ దేహమున నీవు శత్రువును జయింపుము. జవచపు మహిమ నిన్ను ఎల్లప్పుడూ రక్షించును గాత.

    39.  ధనుస్సుచే గోవులను జయింతుము. మార్గములను జయింతుము. సంగ్రామములను జయింతుము.  ధనుస్సు శత్రువును హతమార్చును. ధనుస్సు సకల దిశలను జయించును.

    40. ఆకర్ణాంతము సంధించిన బాణము చెవిలో ఏదో చెప్పుచున్నట్లుండును. మాటిమాటికి ఆలింగనము చేసికొను మిత్రుని వలె మాటిమాటికి ధనుస్సున సంధించబడును. ధనుస్సుకు కట్టిన 'జ్యా' విజయము కలిగించి ప్రియురాలివలె గుసగుసలాడును.

    41. సమాన మనస్క యువతులు వలె ధనుస్సు రెండు కొనలు ఒకదాని అభిప్రాయము మరొకదానికి తెలిసినట్లుండును. తల్లి బిడ్డను చంకకు ఎత్తుకున్నట్లు ధనుస్సు తన నడుమ బాణమును దాల్చును. ఆ ధనుర్బణములు అమిత్ర శత్రువులను ఓడించవలెను.

    42. ఈ ధనువు బహుశర రక్షకము. శరములు ధనువునకు పుత్రవంతములు. యుద్ధమున ప్రయుక్తమైన బాణము 'తిశ్చ' మను ధ్వని చేయును. యోధుని వెన్నున నిలిచినా తూణీరము సకల సేనలను జయించును.

    43. రథసారథి రథమున కూర్చుండును. గుర్రములను తాను అనుకున్న చోటికి పురోగమింప చేయును. కళ్లెములు వెనుక ఉండి గుర్రములను ముందునకు ఉరికించును. గుర్రములను అదుపుచేయును. మానవులారా! ఆ కళ్లెములను స్తుతించండి.

    44. గుర్రము నెక్కిన రౌతు కేకలు పెట్టును. అశ్వములు రథములకు తగులును. గుర్రము వెనుకకు చూడదు. శత్రువును తన కాళ్లక్రింద నలిపివేయును.

    45. ఈ రథమునకు 'హవిర్ధానము' అని పేరు. దీని మీద యోధులున్నారు. 'ఆయుధములు' ఉన్నవి. అట్టి సుఖద రథమునే మేము సదా అధిష్ఠింతుము గాత.

    46. రథసారథి ఆసనపటువు, రక్షణ కుశలుడు, ఆయుష్మంతుడు, కష్టములందు సహాయకుడు. శక్తిశాలి, గంభీరుడు, సేనావంతుడు, శరధని, స్వయంవీరుడు, ఉదారుడు, శత్రు సమూహములను చండాడ గలవాడు కావలెను.

    47. బ్రాహ్మణాసః, పితరుః, సోమ్యాసః శివములగు ద్యావాపృథ్వులు మాకు శుభప్రదములు కావలెను. పూష మమ్ము వినాశము నుండి రక్షించవలెను. సత్యవర్ధక దేవతలారా! మమ్ము యుద్ధములందు రక్షించండి. పాపి, నిందకుడగు శత్రువు మాకన్న సమర్ధుడు కారాదు.

    48. బాణపు మొదలు ఈకలు కలది. దీని వాడి మొన పగవానిని వెదకును. ధనుస్సు నరమున దూరి ప్రయోగించబడి శత్రువు మీద దూకును. యుద్ధము నందు జనులు ఇటునటు ఉరుకునపుడు బాణము మాకు సుఖము కలిగించును గాత.

    49. ఋజుగమన బాణమా! మమ్ము విడువుము. మా దేహములు రాతివంటివి కావలెను. సోమము మాకు జీవనము ప్రసాదించవలెను. అదితి దేవి మాకు సుఖములు ప్రసాదించవలెను.

    50.అశ్వప్రేరక చోదకమా! నీవు అశ్వపు మాంసిల స్థానములను బాదెదవు. దాని కటి భాగమును కొట్టెదవు. ప్రకృష్ట చిత్త అశ్వములను యుద్ధములకంపుము.

    51. పాము పాడగా వలె చేతిని క్రమ్ము కొనునదియు, ధనుస్సు నార్పు బాధను సహించుదినయు, శూరుల సమస్త రక్షణ ఉపాయముల నెరిగినదియునగు "హస్తత్రాణము' యోధులను సర్వత్ర రక్షించును గాత.

    (హస్తత్రాణము - చేతిని రక్షించు తొడుగు)

    52. రథమా! నీవు మా మిత్రుడవు. రక్షకుడవు. వీరుడవు. దృఢ అవయవముల దానవు. నీవు చర్మాదులచే బంధించబడినావు. నిన్ను ఎక్కునట్టి వీరుడు విజయి, శత్రు ధన విజయి అగును గాత.

    53.  ఇంద్రుని రథము వజ్రాంశము. ద్యావాపృథ్వుల నుండి వెలువడిన ఓజస్సు. వనస్పతుల బలము. జలముల సారము. చర్మ సంబద్ధము. అధ్వర్యులారా! అట్టి ఇంద్రుని రథమును యజించండి.

    54. రథము ఇంద్రుని వజ్రాంశము. మరుత్తుల ముఖ స్వరూపము. వరుణుని నాభి. అట్టి రథ దేవతా! ఈ హవి ఆహుతిని స్వీకరింపుము. శత్రువు యొక్క హవిర్యోగ్య ధనమును గుంజుకొని రమ్ము.

    55. రణభేరీ! నీ ధ్వనిని ద్యావాపృథ్వులందు నింపి వేయుము. లోకములందు ఎక్కడ వున్న వారయినను నీ ధ్వనిని వినవలెను. నీవు ఇంద్రుడు, అన్య దేవతల సహితముగ సంప్రీతవగుము. శత్రువు ఎంత దూరమున ఉన్నను వారి కదలికను నిలిపివేయుము.

    56. దుందుభీ! ఆక్రందయ! మాకు ఓజో బలములను కలిగించుము. శత్రువును అదరగొట్టునట్లు ధ్వనించుము. దుఃఖదాయి  శత్రువులను పీడించుము. నీవు ఇంద్రుని పిడికిలివి. బలిష్ఠమగుము. "ఇంద్రస్య ముష్టిరసి వీడయస్వ"

    57. ఇంద్రా! ఈ శత్రు సేనలను చిందరవందరసేయుము. ముందడుగు వేయు సేనలను వెనుకకు గెంటుము. విజయ దుంధుభి మ్రోగుచున్నది! మా  అశ్వికులు సర్వే సర్వత్ర సంచరించుచున్నారు!! ఇంద్రా! మా రథికులే జయించవలెను. "అస్మాకమిన్ద్ర రథినో జయన్తు"

    58. నల్లమెడ మేక అగ్ని పశువు. గొర్రె సరస్వతి సంబంధి. పసుపు పచ్చ పశువు బృహస్పతిది. నల్లనిది పూష దేవతది. నల్లని పొట్టది బృహస్పతిది. విచిత్ర వర్ణ విశ్వేదేవతలది. ఎర్రనిది ఇంద్రునిది. మట్టి రంగుది మరుత్తులలది. దృఢాంగము ఇంద్రాగ్నులది. క్రింద నలుపుది సవితా దేవతది. నల్లనిది, ఒక కాలు నలుపుది వరుణ దేవతాకము.

    59. ముఖమున ఎరుపు తిలకము ఎద్దు అగ్నిది. కింద తెలుపున్న రెండు సవితవి. రెండు శ్వేతనాభి పశువులు పూషా దేవతవి. కొమ్ములు లేని రెండు పసుపు రంగువి విశ్వేదేవతలవి. మట్టిరంగువి మరుత్తులవి. నల్లమేక అగ్ని దేవతది. ఆడమేక సరస్వతి సంబంధి. వేగవంత పశువు వరుణ దేవతాకము.

    60. అగ్ని గాయత్రి ఛందమున, తివృత్సోమమున, రథంతర సామమున స్తుతించవలసినవాడు. అతని కొరకు ఎనిమిది కపాలములందు పురోడాశము వండవలెను.

    ఇంద్రుడు త్రిష్టుప్ ఛందమున పంచదశస్తోమమున బర్హి తసామమున స్తుతించవలసినవాడు. అతని కొరకు పదకొండు కపాలములందు - పురోడాశము వండవలెను.

    విశ్వే దేవతలు జగతీ ఛందము, సప్త దశ స్తోమము వైరూప సామమున స్తుతించవలసిన వారు. వారి కొరకు పన్నెండు కపాలములందు పురోడాశము వండవలెను.

    మిత్రా వరుణులు అనుష్టుప్ ఛందము, ఏక వింశత్సోమము, వైరాజసామమున స్తుతించవలసినవాడు, అతని కొరకు పాలలో 'చరు' వండవలెను.

    బృహస్పతి పంక్తి చ్ఛందము, త్రయత్రింశత్సోమము రేవత్సామమున స్తుతించవలసిన వాడు. అతని కొరకు పన్నెండు కపాలములందు పురోడాశము వండవలెను.

    ప్రజాపతికి, అదితికి, విష్ణుపత్నికి చరు పాకము చేయవలెను.

    వైశ్వానరాగ్నికి పన్నెండు కలశములందును, అనుమతి దేవతకు ఎనిమిది కలశము లందును పురోడాశము వండవలెను.

    (కపాలము కలశమగును.)



       
                                   దాశరథి రంగాచార్య విరచిత
                   శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
        శిష్టాశ్వమేధ ముంతముల ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
                        సోమాఅధిబ్రవీతునో అదితిః శర్మయచ్ఛతు




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.