Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||
ముప్పదవ అధ్యాయము
1. దేవ సవితః ప్రసువ యజ్ఞం ప్రసువ యజ్ఞపతిం భగాయ |
దివ్యోగన్ధర్వః కేతపూః కేతం నఃపునాతు వాచస్పతి ర్వాచంనః స్వదతు||
సవితాదేవా! యజ్ఞమును ప్రేరణ కలిగించుము. యజమాని సంపదకు ప్రేరణ కలిగించుము. వాణిని ధరించువాడును, దివ్యమగు విజ్ఞానమును పునీతము చేయునట్టివాడు మా విజ్ఞానమును పావనము చేయును గాథ. వాచస్పతి మా స్తుతులను ఆస్వాదించవలెను.
2. సవితా దేవత వరణీయ తేజము మా కర్మలను బుద్ధులను ప్రోత్సహించును గాత. ఆ తేజమే మాలో ప్రవేశించును గాత.
3. సవితా దేవా! మాలోని సమస్త దుర్గుణములను తొలగింపుము. శుభ గుణములను మాలో ప్రవేశపెట్టుము.
4. విచిత్ర ధనదాత సవిత; నరుల వాస్తవ రూపమును దర్శించువాడు సవిత. సవితను ఆహ్వానించుచున్నాము. "హవామహే"
5. (ఇవి పురుష మేధ మంత్రములు. ఈ యాగమున పదకొండు యూపములు ఉండును. మొదటి యూపమునకు నలుబది ఎనిమిది నరులను, మిగిలిన పదింటికి ఒక్కొక్కదానికి పదకొండుగురి చొప్పున కట్టబడుదురు.)
బ్రహ్మ కొరకు ప్రియ బ్రాహ్మణుని, క్షత్రియుల కొరకు క్షత్రియుని, మరుత్తుల కొరకు వైశ్యుని, తపస్సు కొరకు శూద్రుని, అంధకారమునకు తస్కరులను, నరకమునకు నష్టాగ్నులను, పాపమునకు నపుంసకులను, అయోగ్యులకు అయోగ్యులను, కామమునకు వ్యభిచారులను, అతికృష్టులకు మాగధును కట్టుచున్నాను.
6. నృత్యమునకు సూతుని, గీతమునకు శైలూషుని ధర్మమునకు సభాచరుని, నరిష్ఠకు భీమలుని, నర్మమునకు రేభముమ, హసునకు కరణవిశిష్టుని, ఆనందమునకు స్త్రీ సఖుని, ప్రమదమునకు కుమారీపుత్రుని, మేధకు రథకారుని, ధైర్యమునకు సూత్ర ధారిని యూపమునకు కట్టుచున్నాను.
7. తపమునకు కులాలుని, మాయకు కమ్మరిని, రూపమునకు మణికారుని, శుభమునకు గింజలు విత్తువానిని, శరవ్యమునకు బాణకారుని, హేతికి ధనుస్సులు చేయువానిని, కర్మ కొరకు జ్యానిర్మాతను, దిష్ట కొరకు రజ్జుకారుని , మృత్యువునకు వ్యాధిని, యమునకు కుక్కలచే వేటాడు వారిని యూపమునకు కట్టుచున్నాము.
8. నదులకు పుల్కసపుత్రుని, ఎలుగుబంట్లకు నిషాదుని, పురుష వ్యాఘ్రమునకు ఉన్మత్తుని, గంధర్వ, అప్సరలకు వ్రాత్యుని, ప్రియంగులకు ఉన్మత్తుని, సర్పములకు పంగుని, అయులకు కితవుని, ఈర్యతకు అకితవుని, పిశాచములకు విదల కారిని, యాతుధానులకు కంటకీకారుని కట్టుచున్నాను - యూపమునకు.
9. సంధ్యకు జారుని, గోహకు ఉపపతిని, ఆర్తికి పరివృత్తిని, నిర్రుతికి ఇతుని, అపరాధ్యకు అవివాహితుని, నిష్కృతికి రూపకరిని, సంజ్ఞనమునకు స్మరకారిని, ప్రకామోద్యకు ఉపసదుని అగ్నిష్ట యూపమున బంధించుచున్నాను.
రెండవ యూపమున వర్ణమునకు అనురుధని, బలమునకు ఉపదను.
10. ఉత్సాదులకు కుబ్జను, ప్రముదకు వామనుని, ద్వారాములకు స్రాముని, స్వప్నమునకు అంధుని, అధర్మమునకు బధిరుని, పవిత్రమునకు వైద్యుని, ప్రజ్ఞానమునకు జ్యోతిశ్యుని, ఆశిక్షకు శకునములు అడుగువానిని, ఉపశిక్షకు అభిప్రశ్నకర్తను బంధించుచున్నాను.
మూడవ యూపమున మర్యాదకు ప్రశ్నవక్తను.
11. అర్ములకు హస్తిపాలుని, జవమునకు అశ్వపాలుని, పుష్టికి గోపాలుని, వీర్యమునకు అవిపాలుని, తేజమునకు అజపాలునిని ఇరకు కీనాశుని, కీలాలమునకు సురాకారుని, భద్రమునకు గృహపాలుని, శ్రేయస్సునకు మహాజనుని, ఆధ్యక్ష్యమునకు అనుక్షత్తారుని బంధించుచున్నాను.
12. నాలుగవ యూపమున మాయకు కట్టెలు కొట్టువానిని, ప్రభకు అగ్ని వర్థకుని, సూర్య లోకమునకు అభిషేక్తను, శ్రేష్ఠ స్వర్గమునకు పరివేషణ కర్తను, దేవలోకమునకు పేశితను, మనుష్య లోకము కొరకు ప్రకరితను, సర్వ లోకములకు ఉపసేక్తను, అమరుతి వధకు ఉపమన్దితను, మేధకు రాజకుని, ప్రకామమునకు రంగులవానిని ఋతమునకు స్తేన హృదయుని కట్టుచున్నాను.
13. అయిదవ యూపమున వైరహత్యకు పిశునుని వివిక్తకు క్షత్తను, ఔపద్రష్ట్యకు అనుక్షత్తమ, బలమునకు అనుచరుని, భూమికి పరుష్కందుని, ప్రియమునకు ప్రియవాదిని, అరిష్టమునకు అశ్వవాదిని, స్వర్గమునకు భామదుధను, శ్రేష్ఠ నాకమునకు పరివేష్ఠుని, మన్యుకు లోహతాపకుని, క్రోధమునకు నిసరుని, యోగమునకు యోగిని కట్టుచున్నాను.
14. ఆరవ యూపమునకు శోకమునకు అభిసర్తను, క్షేమమునకు విమోక్తను, ఉత్కూల నికూలములకు శీతవానుని, విపుషకు మానకారిని, శీలమునకు కజ్జకారిని, నిరృతికి కోశకారిని, యమునకు వంధ్యను, యుముని కొరకు కవలల వానిని, అధర్యులకు అవతోకమును, సంవత్సరమునకు పర్యాయణిని బంధించుచున్నాను.
15. ఏడవ యూపమునకు పరివత్సరమునకు అవిజాతుని, ఇదావత్సరమునకు కులటను, ఇది వత్సరమునకు ప్రదర రోగినిని. వత్సరమునకు వదులు వంటి దానిని, సంవత్సరమునకు శ్వేత కౌశను, ఋభువులకు చర్మకారుని, సంధ్యలకు చెప్పులు కుట్టువానిని, సరులకు ధీవరుని, ఉపస్థావరులకు దాశుని, వైశంతులకు బైందుని, నంగలమునకు మత్య్సకారుని కట్టుచున్నాము.
16. ఎనిమిదవ యూపమున పారమునకు మార్గరిని, అవారమునకు కైవర్తుని, విషములకు మైనాలుని, స్వనములకు పర్ణకుని, గృహములకు కిరాతుని, సానువులకు జంభకుని, పర్వతములకు కింపురుషుని, బీభత్సమునకు పుల్కసుని వర్ణమునకు స్వర్ణకారుని, త్రాసునకు వర్తకుని. తీర్థములకు ఆంధుని కట్టుచున్నాను.
17. తొమ్మిదవ యూపమున పశ్చాదోషమునకు గ్లాబిని, సర్వ భూతములకు సిధ్మలుని. భూతికి జాగరణుని, అభూతి కొరకు శయనమును, ఆర్తికి జనవాదిని, వ్యర్ధికి ఉపగల్భుని, సశరమునకు ప్రచ్ఛిదుని, అక్షరాజమునకు కితవుని, కృతమునకు ఆదినవదర్శుని, త్రేతకు కల్పకుని, ద్వాపరమునకు అధికల్పిని బంధించుచున్నాను.
18. పదవ యూపమున ఆస్కంధమునకు సభాస్థాణుని మృత్యువునకు గోవ్యచ్ఛుని, అంతకునికి గోఘాతిని, క్షుధకు గోమాంసయాచకుని, దుష్కృతమునకు చరకాచార్యుని, పాపమునకు సైలగుని, ప్రతిశ్రుత్కమునకు అర్తనుని, ఘోషమునకు భషుని, అనంతమునకు మూగవానిని, శబ్దమునకు కోలాహలకారిని, అంతమునకు బహువాదిని బంధించుచున్నాను.
19. పదకొండవ యూపమున మహసమునకు వీణావాదిని, క్రోశమునకు వేణువాదిని, అవరత్పరము కొరకు శంఖవాదిని, వనమునకు వనపాలకుని, అరణ్య శేషమునకు దానపాలకుని.
20. నర్మమునకు వ్యభిచారిని, హంసకు చాకరిని, యాదసమునకు శావలిని- గ్రామణ్యం గ్రామనేతారం, గణకం జ్యోతిర్విదం, అభిక్రోశకం నిందకం- బంధించుచున్నాము.
21. అగ్నికి లావువానిని, పృథ్వికి కుంటివానిని, వాయువునకు చండాలుని, అంతరిక్షమునకు వెదురుగడమీద ఆటలాడు వానిని, దినమునకు బట్టతల వానిని, సూర్యునకు హరిత నేత్రుని, నక్షత్రములకు కిర్మీరుని, చంద్రునకు కిలాసుని, పగటికి శుక్లవర్ణ పింగాక్షుని, రాత్రికి కృష్ణవర్ణ పింగాక్షుని ఏర్పరచవలెను.
22. అథైతానష్టౌ విరూపానలభతే, ఈ ఎనిమిది మంది విరూపులను సాధించవలెను.
అబ్రాహ్మణులు, అశూద్రులగు, 1. అతి పొడవరి 2. అతి పొట్టి 3. అతి లావు 4. అతి సన్నన 5. అతి తెల్లన 6. అతి నల్లన 7. వెంట్రుకలు లేనివాడు 8. అతి వెంట్రుకలవాడు. వీరు ప్రజాపతి దేవతా సంబంధులు.
అబ్రహ్మణులు, అశూద్రులయిన మాగధి పుశ్చలుడు, జూదరి, నపుంసకుడు, ఈ నలుగురు ప్రజాపతి సంబంధులు.
(మంత్రములందలి వానిని అటు నిటు మార్చి యూపములకు సరిపోవునట్లు చేసినాము.
ఇందు 158 మానవ భేదములను చూపుట జరిగినది. వీనిలో కొన్నింటికి నేటి అర్థములు తెలియకున్నవి. ఇందు జనవాదులు, జాగరణులు మున్నగువారున్నారు. వాద్యకారులున్నారు. ఇవి వృత్తులగునా? గుణములగునా? పరిశోధించవలసి ఉన్నది. ఇందు శ్రమవిభజన స్పష్టముగా అగుపించుచున్నది. ఇంతటి శ్రమ విభజన గలది ఎంతటి విశిష్ట సమాజము కావలెను!)
దాశరథి లక్ష్మణాచార్య బుచ్చమాంబల పౌత్రుండును, విద్వాన్ దాశరథి వేంకటాచార్య వేంకటాంబల పుత్రుండును, అంధ్రప్రదేశ్ ఆస్థానకవి దాశరథి కృష్ణమాచార్యుల అనుజుండును, కమలానామ్ని ధర్మ పత్నీ సమేతుండును, "చిల్లరదేవుళ్ళు" "మాయజలతారు" మోదుగుపూలు" "జనపదం
"రానున్నది ఏది నిజం" "శరతల్పం" "మానవత" "పావని" మున్నగు విశిష్ట నవలా రచయితయునగు దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్రవచన శుక్ల యుజుర్వేద సంహిత యందలి నరమేధిక పశుప్రకథితమను ముప్పదవ అధ్యాయము సమాప్తము.
సర్వే భవంతు సుఖినః





