Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||
ఇరువది ఎనిమిదవ అధ్యాయము
1. హోతా యక్షత్సమిధేన్ద్రమిస్పదే నాభాపృథివ్యాఅధి|
దివే వర్ష్మన్సమిధ్యత ఓజిష్ఠశ్చర్షణీసహాం వేత్వాజ్యస్య హోతర్యజ||
హోత పృథ్విస్థానమగు వేదిమీద ఇంద్రునకు, అగ్నిభావమున సమిధలు అర్పించి యజించవలెను. అంతరిక్షపు నాభి ప్రదేశమునను, ద్యులోకపు ఉత్తమ స్థానమునను, విద్యుత్, సూర్య రూపములచే ఇంద్రుడు యజించబడుచున్నాడు.
ఇంద్రుడు సమర్థుల తలలు వంచగల ఓజస్వి అతడు ఘృతమును సేవించును గాత.
మానవహోతా! నీవు సహితము యజింపుము. హోతర్యజ.
2. ఇంద్రుడు జేత. అపరాజితుడు, స్వర్ణవేత్త, హోతలు ఇంద్రుని, తనూనపాత అగ్నిని, రక్షణలతోను, అత్యంత మధుర హవిస్సులతోను యజించవలెను. తేజస్వియగు నరాశంస అగ్ని సహితుడైన ఇంద్రుడు ఘృతమును సేవించును గాత. "హోతర్యజ"
3. ప్రయాజ దేవతలగు ఇడల సహితముగ సంస్తుతించబడువాడును. అమరుడును అగు ఇంద్రుని హోతలు యజింపవలెను. దేవసమ బలశాలి, వజ్రహస్తుడు, అసురపుర ధ్వస్త ఇంద్రుడు ఘృతము సేవించును గాత. "హోతర్యజ"
4. ఇంద్రుడు దర్భాసనములపై ఆసీనులగువారిలో శ్రేష్ఠుడు. అభీష్టవరదుడు. యజమానికి హితపు కలిగించువాడు. హోతలు ఇంద్రుని దర్భాసనమున యజించుచున్నారు. వసు, రుద్ర, ఆదిత్య సహితుడై ఇంద్రుడు దర్భాసనమున ఆసీనుడు కావలెను. ఘృతము సేవించివలెను. "హోతర్యజ"
5. ఇంద్రునిలో ఓజస్సు, వీర్యము, సహనము పెంచునట్టి ద్వారదేవేరులను హోత యజించవలెను. సేచక ఇంద్రుని కొరకు గాను, సుగమనలు, యజ్ఞవర్ధినులగు, ద్వారాదేవేరులు ఘృతము సేవింతురు గాత. హోతర్యజ"
6. ఇంద్రుని చక్కని పాడియావులను, మహా మాతలగు ఉషారాత్రులను హోత యజించును గాత. వారిరువురు ఒకేతీరు దూడల ఆవుల వలె, ఇంద్ర రూపవత్సము యొక్క తేజస్సును వర్ధిల్ల చేయుదురు గాత. ఉషారాత్రులు ఘృతమును సేవింతురు గాత. హోతర్యాజ
7. అగ్ని వాయువులు వైద్యులు. పరస్పర మిత్రులు. దైవీ హోతలు. వారిని హోత యజించును గాత. క్రాంతద్రష్టులు విద్వాంసులగు వారలిద్దరు ఇంద్రునకు శక్తి కలిగించుచున్నారు. అగ్ని వాయువులు ఘృతము సేవింతురు గాత. హోతర్యజ
8. ఇడ, సరస్వతి, భారతి అను ముగ్గురు దేవేరులు అగ్ని, వాయు, ఆదిత్య లోకములను ధరించినవారు. భేషజులు, కర్మవంతులు. హోత వారిని యజించును గాత. ఇంద్రుని పాలించువారును, హవిర్యుక్తలగు మువ్వురు దేవేరులు ఘృతమును సేవింతురు గాత. హోతర్యజ.
9. త్వష్ట ఐశ్వర్యవంతుడు, ద్యోతమానుడు, వైద్యుడు సుయజనీయ ఘృతమున శోభిల్లువాడు, అనేక రూపుడు, సువీర్య వంతుడు, ధనవంతుడు, హోత త్వష్టను యజించును గాత. త్వష్ట ఇంద్రునకు ఇంద్రియ శక్తిని ప్రసాదించును. త్వష్ట ఘృతమును సేవించును గాత. హోతర్యజ.
(త్వష్టః సమిధాంపతే అని తైత్తరీయము)
10. వనస్పతి యూపము హవిసంస్కర్త. శమిత శక్తివంత హూత యూపమును యజించును గాత. యూపము సుగమ ఆహుతులను మధుర ఘృతమున యజ్ఞయుక్తము చేయును. వానిని దేవతలచే ఆస్వాదింపచేయును. యూపము ఘృతమును సేవించును గాత. హోతర్యజ.
11. హోతలు ఇంద్రుని యజింతురు గాత. ఘృత దేవతలకు స్వాహా. మేద దేవతలకు స్వాహా. మేద బిందువులకు స్వాహా. స్వాహా దేవతలకు స్వాహా. హవ్య సూక్తవంత దేవతలకు స్వాహా. ఘృత పాయి దేవతలు ఘృతము సేవింతురు గాత. ఇంద్రుడు ఘృతము సేవించును గాత. హోతర్యజ
12. వేది మీద పరచిన దర్భాసనము ఋత్విజాదులచే సనాధమైనది. ఇంద్రుడు మున్నగు వారి యుక్తము అది ఇంద్రుని వర్ధిల్ల చేయునది. పగలు కోయబడి రాత్రి అల్లబడి, దర్భత్వ ధనమున ఇతర పదార్థములను తలదన్నిన దర్భ, యజమానికి ధనము కలిగించుట కొరకు ఘృతమును సేవించును గాత. యజ.
13. ద్యోతమాన ద్వారము, కడపచే సంపన్నమైనంత దృఢమై వర్ధిల్ల చేయును. ఉరుకులు పెట్టు యువకులు చేతను, అల్లరి పిల్లలచేతను ఏర్పరచబడి దుమ్ము నిండిన కూపాదులను ద్వారదేవత తొలగించును గాత. యజమాని ఇంట ధనము నింపుటకు ద్వారాదేవేరులు ఘృతము సేవింతురు గాత. యజ.
(యజ్ఞ భ్రంశక రాణి కూపాదీని యజ్ఞమార్గాదపన యన్విత్యర్థః ఇతి ఉవటః| యజ్ఞమునకు ఆటంకము కలిగించు కుపాదులను యజ్ఞమార్గమునుంచి తొలగించమనుట)
14. ద్యోతమాన ఉషా, రాత్రులు ఇంద్రుని యజ్ఞమును ఆహ్వానింతురు గాత. దైవీప్రజ వసు, రుద్ర ఆదిత్య సహితులై ఘృతమును అందుకొందురు గాత. సుప్రసన్నలు. హితకారిణులగు ఉషా, రాత్రులు, యజమాని ఇంట ధనము నింపుటకు ఘృతము సేవింతురు గాత. యజ.
15. ద్యావాపృథ్వులు కాంతిమతులు. సుప్రీతలు. ధనధారులు. వారు ఇంద్రుని వర్ధిల్ల చేయుదురుగాత. వారిరువురిలో ఒకరు పాపములను తొలగింతురు. మరొకరు ధనమును ప్రసాదింతురు. జ్ఞానవతులగు వారు ఉభయులు యజమాని ఇంట ధనమును నింపుటకు, ఘృతము సేవింతురు గాత. యజ.
16. దుగ్ధదాయి మరియు ఊర్జాహుతి దుగ్ధములచే ఇంద్రుని వర్ధిల్ల చేయుదురు గాత. వారిలో ఒకటి అన్నము, బలము కలిగించును. మరొకటి సహభజన, సమపానములు కలిగించుణు. దయామయి ఉర్జాహుతి పురాతన అన్నములచే సూతన అన్నములను కల్పించును. దుగ్ధదాయి యజమానికి ధనము, కోరిన పదార్థములు తెచ్చును. యజమాని ఇంట ధనము నింపుటకు వారిద్దరు ఘృతమును సేవింతురు గాత. యజ.
17. దైవీ హోతలు అగ్ని, వాయు, ఇంద్రదేవతలను వర్థిల్ల చేయుదురు గాత. నిందకులను వధించు ఆ ఇద్దరు దేవతలు యజమానికి ధనము, కోరిన పదార్థములు ప్రసాదింతురు గాత. యజమాని ఇంట ధనము నింపుటకు వారిరువురు ఘృతము సేవింతురు గాత. యజ.
18. ముగ్గురు దేవేరులు పాలకుడగు ఇంద్రుని వర్ధిల్ల చేయుదురు. భారతి ద్యులోకమును స్పృశించును. సరస్వతి రుద్ర సహితమై యజ్ఞమును స్పృశించును. ధనవతి ఇడ, గృహముల పృథ్విని స్పృశించును. యజమాని ఇంట ధనము నింపుటకు ముగ్గురు దేవేరులు ఘృతము సేవింతురు గాత. యజ.
19. యజ్ఞము ఋత్విజులచే ప్రశంసితము. ద్యుతిమంతము. ధనశాలి. మూడు స్థానములు, మూడు బంధములు కలవాడు. అతడు ఇంద్రుని వర్ధిల్ల చేయును. ఈ యజ్ఞము నలుపు వీపు గల వందల గోవులు కలది. వేల గోవులచే ప్రవర్తిమగునది. మిత్రావరుణులు ఇఅతనికి హోతృకర్మ యోగ్యులు. బృహస్పతి ఉద్గాతృకర్మయోగ్యుడు. అశ్వినులు అధ్వర్యు కర్మయోగ్యులు. యజమాని ఇంటధనము నింపుటకు వారు ఘృతము సేవింతురు గాత, యజ.
20. యూప దేవత దేవతలచే హిరణ్యవర్ణమైనది. మధుర శాఖాయుతము. అశ్వినులు, సరస్వతిచే ఫలవంతము. యూపము ఇంద్రుని వర్ధిల్ల చేయును గాత. ఈ యూపపు అగ్రభాగము ద్యులోకమును, మధ్యభాగము అంతరిక్షమును తాకును. మిగిలిన భాగము భూమిని గట్టి పరచును. యజమానికి ధనము కలిగించుటకును, యజమాని ఇంట ధనము నింపుటకును యూపము ఘృతము సేవించును గాత. యజ.
21. బర్హి ఓషధులందు శ్రేష్ఠము. ఆ బర్హి "దేవమిన్ద్రమ వర్ధయత్" బర్హి సుఖముగా నిలిచినది. ఇంద్రునితో కూడినది. ఇతర బర్హులందు శ్రేష్టమైనది. ఆబర్హి ఇంద్రుని వర్ధిల్ల చేయును గాత. యజమానికి ధనము ప్రసాదించుటకును, అతని ఇంట ధనమును నింపుటకును బర్హి ఘృతము సేవించును గాత. యజ.
22. చక్కని యజనకారి అగ్ని "దేవమిన్ద్రమవర్ధయత్" నేడు అగ్ని సుయజనము చేయుచు మా కోరికలను తీర్చును గాత. యజమానికి ధనదామునకును, అతని ఇంట ధనము నింపుటకును, అగ్ని ఘృతము సేవించును గాత. యజ.
23. నేడు ఈ యజమాని అగ్నిని హోతగా వరించినాడు. వండదగిన వానిని ఉడికించుచు, పురోడాశమును పచనము చేయుచు అగ్ని ఉపస్థితుడైవాడు.
వనస్పతి యూపదేవత ఇంద్రుని కొరకు మేకను కట్టుకొని యజ్ఞమునకు ఉపస్థితిమైనది.
అశ్వినులు మున్నగు దేవతలకు యజమాని పశువు సమర్పించినాడు. వారు మేధతో ప్రారంభించి పశువు యొక్క సర్వాంగములను భక్షించినారు. వండిన మిగత అవయవములను కూడా ఆరగించినారు. వారు పురోడాశమున వృద్ధి చెందినారు.
అగ్నీ! హోతలు నిన్ను నేడు ఆర్షేయ పద్ధతిన వరించినారు.
24. అగ్ని మహా యశోవంతుడు. సమిధ్యమానుడు. వరణీయుడు. హోత అగ్నిని, అన్నదాత ఇంద్రుని యజించును గాత. గాయత్రీ ఛందము శక్తి, సంవత్సరన్నర గోవును సమర్పించి యజించును గాత. ప్రయాజ దేవతా సహితుడై ఇంద్రుడు ఘృతమును సేవించును గాత. హోతర్యజ
25. దైవీహోత తనూనపాత అగ్ని మరియు యజ్ఞ ఫలదాత ఇంద్రుని యజించును గాత. ఉష్ణిక్ ఛందము, శక్తి. రెండేళ్ళ ఆవు అన్నముచే ఇంద్రుని యజించును గాత, ప్రయాజ దేవతా సహితుడై ఇంద్రుడు ఘృతము సేవించును గాత. హోతర్యజ.
26. ఇంద్రుడు స్తుత్యుడు, స్తుతుడు, వృత్రహంత, బలమున సోమసముడు, సోమము వంటి ఆహ్లాదకుడు. అనుష్టుప్ ఛందము, శక్తి, రెండున్నర యేళ్ళ ఆవు, ఆయుష్యములచే హోత ఇంద్రుని యజించును గాత. ప్రయాజ దేవతా సహితుడై ఇంద్రుడు ఘృతము సేవించును గాత. హోతర్యజ.
27. బర్హి శోభాయమానము. పూషాయుక్తము. అమరము. అనశ్వరము. అన్నదాత ఇంద్రుడు బర్హి మీద ఆసీనుడై ఉన్నాడు. బృహతీఛందము, శక్తి, మూడు దూడల ఆవు, ఆయుష్యములచే హోత ఇంద్రుని యజించవలెను. ప్రయాజ దేవతా సహితుడై ఇంద్రుడు ఘృతము సేవించును గాత. హోతర్యజ.
28. ద్వారాదేవేరులు సావకాశలు, సుగమనలు, యజ్ఞ వర్ధికలు, సువర్ణరూపలు. వారిని, అన్నదాత ఇంద్రుని హోత, పంక్తి ఛందము, శక్తి, మూడున్నర ఏండ్ల ఆవు, వయసులతో, యజింతును. గాత. ప్రయాజ దేవతా సహితుడై ఇంద్రుడు ఘృతము సేవించును గాత. హోతర్యజ.
29. ఉషారాత్రులు సుస్వరూపలు, సుకుశలలు, మహిమాన్వితలు, దర్శనీయలు. ఇంద్రుడు అన్నదాత. హోత వారిని, త్రిష్టుప్ ఛందము, శక్తి, మూడేళ్ళ గోవు, ఆయుష్యములచే యజించును గాత. ప్రయాజ దేవతా సహితుడై ఇంద్రుడు ఘృతము సేవించును గాత. హోతర్యజ.
30. అగ్ని వాయువులు విశిష్ఠ జ్ఞానవంతులు. ఉత్తమ యశః స్వరూపులు. క్రాంతద్రష్టలు. పరస్పర సంగతులు. వారిని, అన్నదాత ఇంద్రుని, జగతీ ఛందము, శక్తి, ఎద్దు, వయసులతో హోత యజించవలెను. ప్రయాజ దేవతా సహితుడై ఇంద్రుడు ఘృతము సేవించును గాత. హోతర్యజ.
31. భారతి, సరస్వతి, ఇడ దేవేరులు సుస్వరూపలు. సువర్ణ రూపలు. మహా మహిమాన్వితలు. హోత వారి సహితముగా ఇంద్రుని విరాట్ ఛందము, శక్తి, నవగ్రసూత గోవు వయసులచే యజించును గాత. ప్రయాజ దేవతా సహితుడై ఇంద్రుడు ఘృతము సేవించును గాత. హోతర్యజ.
32. త్వష్ట సువీర్యశాలి. పుష్టివర్ధనుడు, రూపధారి. అట్టి త్వష్టను "పృథక్పుష్టిమిన్ద్రం" హోత యజించును గాత. ద్విపద ఛందము, శక్తి, వృషభము, ఆయువులచే హోత యజించును గాత. ప్రజాయ దేవతా సహితుడై ఇంద్రుడు ఘృతమును సేవించును గాత. హోతర్యజ.
33. హవిని సంస్కరించునదియు, శతమఖమును, హిరణ్యవర్ణయు, పగ్గము పట్టునదియు, వశమునందుంచునదియు నగు వనస్పతి యూపమును మరియు అన్నదాత ఇంద్రుని కకుప్ ఛందము, శక్తి, వంధ్యయు గర్భఘాతినియగు గోవు, వయసును సమర్పించి హోత యజించును గాత. ప్రజాయదేవతా సహితుడై ఇంద్రుడు ఘృతము సేవించును గాత.
34. స్వాహా కృతీరగ్నిం, గృహపతిం, పృథిగ్వరుణం, భేషజం కవిం. ఆయుధవంతుడు. ఆయుర్ధాత ఇంద్రుని అతి ఛందము, శక్తి, బృహదృషభములతో హోత యజించును గాత. ఇంద్రుడు ఘృతమును సేవించును గాత.
35. ద్యుతిమంత బర్హి ఆయుర్ధాత ఇంద్రుని వర్ధిల్ల చేయును గాత. గాయత్రీ ఛందము, శక్తి, చక్షు, ఆయుష్యము, ఇంద్రుని యందు చేర్చుచు, ధనదానము చేయుచు, ధనము చేర్చుచు బర్హి దేవత ఘృతము సేవించును గాత. యజ.
36. ద్వార దేవేరులు, ఆయుర్దాతము, పవిత్రుడగు ఇంద్రుని యందు, ఉష్ణిక్ ఛందము, శక్తి, ప్రాణము, ప్రాయములను చేర్చుదురు గాత. ధనదానము చేయుచు చేర్చుచు ద్వార దేవేరులు ఘృతము సేవింతురు గాత. యజ.
37. ద్యుతిమంత ఉషా రాత్రులు, ఆయుర్ధాత ఇంద్రుని యందు అనుష్టుప్ ఛందము, శక్తి, బలము, ప్రాయమును చేర్చుదురు గాత. ధనదానము చేయుచు, ధనము చేర్చుచు ఉషా రాత్రులు ఘృతము సేవింతురు గాత. యజ.
38. దీప్య మానలు, ధనదర్తలగు దేవేరులు, ఇంద్రుని యందు బృహతీఛందము, శక్తి, శ్రోతము, ప్రాయమును కలిగింతురు గాత. ధనదానము చేయుచు ధనము అందించుచు దేవేరులు ఘృతము సేవింతురు గాత. యజ.
39. దుగ్ధ దాయినియు ఊర్జాహుతియు దుగ్ధములచే ఇంద్రుని వర్ధిల్ల చేయుదురు గాత. పంక్తి ఛందము, శక్తి, బలము ఆయుష్యము ఇంద్రునకు కలిగింతురు గాత. ధనదానము చేయుచు ధనము కూర్చుచు దేవేరులు ఘృతము సేవింతురు గాత. యజ.
40. దైవీహోతలగు అగ్ని వాయువులు అన్నదాతయగు ఇంద్రుని యందు త్రిష్టుప్ ఛందము, శక్తి, దీప్తి, వయసు చేర్చి వర్ధిల్ల చేయుదురు గాత. ధనదానము చేయుచు ధనము కూర్చుచు అగ్ని వాయువులు ఘృతము సేవింతురు గాత. యజ.
41. భారతి, సరస్వతి, ఇడ యను ముగ్గురు దేవేరులు, వయోధసుడు, పాలకుడగు ఇంద్రుని జగతీ ఛందము, శక్తి, బలము, ఆయుష్యము కలిగించి వర్ధిల్ల చేయుదురు గాత. ధనదాన, ధన ధారణల కొరకు దేవేరులు ఘృతము సేవింతురు గాత. యజ.
42. ఋత్విజులచే స్తుతించబడు యజ్ఞ దేవత అన్నదాత ఇంద్రుని విరాట్ ఛందము, శక్తి, రూపము, వయసులతో వర్ధిల్ల చేయును గాత. ధనదాన ధనధారణల కొరకు యజ్ఞ దేవత ఘృతమును సేవించును గాత. యజ.
43. వనస్పతి యూప దేవత వయోధస ఇంద్ర దేవుని ద్విపద ఛందస్సు, శక్తి, ఐశ్వర్యము, ఆయుష్యములచే వర్ధిల్ల చేయుదురు గాత. ధనదాన, ధనధారణల కొరకు యూప దేవత, ఘృతము సేవించును గాత. యజ.
44. ఓషధులకు దేవతయగు బర్హిదేవత, వయోధస ఇంద్రుని కకుప్ ఛందము, శక్తి, వయసు, యశస్సు కలిగించి వర్ధిల్ల చేయును గాత. ధనదాన, ధనధారణల కొరకు బర్హి దేవత ఘృతమును సేవించును గాత. యజ.
45. స్విష్ఠికృత అగ్ని, వయోధస ఇంద్రుని అతిచ్ఛంము, శక్తి, క్షాత్రము, ప్రాయములచే వర్ధిల్ల చేయును గాత. ధనదాన, ధనధారణలకు అగ్ని ఘృతము సేవించును గాత. యజ.
46. అగ్ని మద్య హోతారమవృణీతాయం యజమానః పచన్పురోడాశం బధ్నన్నిన్ద్రాయ వయోధసేఛాగమ్| సూపస్థ్యా అద్య దేవో వనస్పతి రభవదిన్ద్రాయ వయోధసేఛాగేన| అధత్తం మేదస్తః ప్రతి పచతాగ్రభీదవీ వృధత్పురోడాశేన|| త్వామద్య ఋషే||
అర్థమునకు 23వ మంత్రము చూడండి.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
సౌత్రామణీ సంబంధి ప్రయాజానయాజ ప్రైషనిరూపణమను
ఇరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
మాకశ్చిద్దుఃఖభాగ్భవేత్





