Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
3. శకుంతమా ! నిన్ను డేగ చంపరాదు. గరుడపక్షి చంపరాదు. బలవంతులు, ధనుర్ధారులు, వీరులు నిన్ను చంపరాదు. దక్షిణ దిశన మరలమరల శబ్దము చేయుము. మంగళ సూచకమగు అగుము. మాకు ప్రియవాదినివి అగుము. "భద్రవాదీవదేహ"
4. శకుంతమా ! శుభసూచకమవు, ప్రియవాదినివి అగుము. గృహపు దక్షిణ దిశన పలుకుము. అందువలన దొంగలు, దుష్టులు మా మీద పెత్తనము చేయకుండవలెను. మేము పుత్ర, పౌత్రవంతులమయి ఈ యజ్ఞమున ప్రభవించు స్తోత్రమును గానము చేసెదము.
ఆలోచనామృతము
1. తొలిసారిగా ఒక పక్షిని ప్రవేశ పెట్టినాడు. అందముగా, మృదువుగా ప్రవేశ పెట్టినాడు. శుభంకరమును ప్రవేశపెట్టినాడు.
2. శకునములను సూచించినాడు. గృహపు దక్షిణ భాగమున పక్షికూసిన దొంగల దోపిళ్ల భయము ఉండదని సూచన.
నలుబది మూడవ సూక్తము
ఋషి-శౌనక గృత్సమదుడు, దేవత-శకుంతము,
కపింజలరూపి ఇంద్రుడు, ఛందస్సు -1-3 జగతి, 2 అతిశక్వరి.
1. సమయ సమయ సమయమున అన్నాన్వేషణ చేయు యజమానులవలె శకుంతములు ప్రదక్షిణచేసి పలుకులు పలుకవలెను.
సామగాయకులు గాయత్రి త్రిష్టుపులను ఉచ్ఛరింతురు. అట్లే కపింజలుడు రెండు వాక్యములు ఉచ్ఛరించును. శ్రోతలను అనురక్తులను చేయును.
2. శకుంతమా ! ఉద్గాత సామగానము చేయునట్లు నీవు పాడుము. యజ్ఞమున బ్రహ్మపుత్ర ఋత్విక్కువలె నీవు పలుకుము. మగ గుఱ్ఱము ఆడ గుఱ్ఱము వద్దకు వెళ్ళి శబ్దము చేసినట్లు నీవును చేయుము.
శకుంతమా ! నీవు సర్వత్ర మా కొఱకు శుభ సూచకము, పుణ్యప్రదమగు పలుకు పలుకుము. "శకునే భద్రమావద విశ్వతోనః శకునే పుణ్యమావద"
3. శకుంతమా ! నీవు పలుకునపుడు మాకు శుభములు సూచింతువు. పలుకక కూర్చున్నపుడు మా విషయమున ప్రసన్నవగుదువు. ఎగురునపుడు 'కర్కర' వాద్యమువలె ధ్వనింతువు.
మేము పుత్ర పౌత్రవంతులమయి ఈ యజ్ఞమున ప్రభవించిన స్తోత్రములను గానము చేసెదము.
(శ్రీమదాంధ్ర వచన ఋగ్వేదసంహితము రెండవ అష్టకమున రెండవ మండలము సమాప్తము)
(నాలుగవ అనువాకము సమాప్తము)
జ్ఞానానందమయం దేవం విర్మలస్ఫతికాకృతిం|
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మ హే||
మూడవ మండలము
ఎనిమిదవ అధ్యాయము రెండవ అష్టకము
మొదటి అనువాకము మొదటి సూక్తము
ఋషి-విశ్వామిత్రుడు, దేవత-అగ్ని, ఛందస్సు-త్రిష్టుప్.
(మండలద్రష్ట విశ్వామిత్రునకు నమస్కారము.)
1. అగ్నీ ! యజ్ఞము చేయుటకుగాను నన్ను సోమవాహకుని చేసినావు. అందువలన నన్ను బలవంతుని చేయుము. నేను ప్రకాశమానుడనయి, దేవతల కొఱకు, అభిషవ ప్రస్తరఖండము చేతపట్టి స్తుతింతును. నీవు నా దేహమును రక్షింపుము.
2. అగ్నీ ! మేము చక్కగా యజ్ఞము చేసినాము. సమిధ, హవ్యములతో జనులు నీకు పరిచర్య చేయవలెను. ద్యులోకము నుండి దేవతలు వచ్చినారు. స్తోతలకు స్తుతులు నేర్పించినారు. స్తోతలు స్తవనీయుడవు, ప్రవర్ధకుడవు అగు నిన్ను స్తుతించ కోరుచున్నారు.
3. విశుద్ధ జలశాలురు, జన్మతో ఉత్కృష్ట బంధువులయిన మేధావులు, ద్యులోక సుఖప్రకారమును ఎరుంగుదురు. వారికొఱకును, యజ్ఞకర్మకొఱకును దేవతలు అగ్నిని నదీజల మధ్యమున కనుగొన్నారు.
4. అగ్ని శుభధనవంతుడు. శుభ్రవంతుడు. స్వకీయ మహిమ వలన దీప్తిమంతుడు. అట్టి అగ్ని జన్మించగనే సప్తనదులు అతనిని పెంచినవి. ఆడ గుఱ్ఱము నవజాత శిశువువద్దకు పోయినట్లు నదులు అగ్ని వద్దకు వెళ్లినవి. దేవతలు అగ్నిని పుట్టుకతోనే ప్రకాశవంతుని చేసినారు.
5. అగ్ని శుభ్రవర్ణ తేజమున అంతరిక్షమున వ్యాపించును. అగ్ని యజమానిని స్తుతియోగ్యుని, పవిత్ర తేజోవంతుని చేయును. అగ్ని యజమానిని వెలుగులతో కప్పును. అతనికి అన్నము, ప్రభవించు ధనము, సంపూర్ణ సంపద ప్రసాదించును.
6. అగ్ని జలములందు నలుదిశల విహరించును. ఆ జలములు అగ్నిని ఆర్పలేవు. అంతరిక్షమున ఆవిర్భవించిన అగ్నికి వస్త్ర ఆచ్చాదన లేదు. అయినను జల ఆచ్చాదకుడు కాన దిగంబరుడుకాడు. సనాతనములు, తరుణములు, ఏకస్థాన జనితములగు సప్త సింధువులు అగ్నిని గర్భమున దాల్చినవి.
7. అగ్ని, గర్భ స్వరూపుడు. అంతరిక్ష స్థితుడు. నానావర్ణుడు. జలమును వర్షించిన తరువాత అగ్నికి కిరణములు మొలుచును. ఈ కిరణములు సకల జనులకు ప్రీతిదాయకములు అగును. సుందరరూపులయిన ద్యావాపృథ్వులు దర్శనీయుడగు అగ్నికి మాతా పితరులు.
8. అగ్నీ ! నీవు బలపుత్రుడవు. నిన్ను సకల జనులు గ్రహింతురు. అప్పుడు నీవు ఉజ్జ్వలములు వేగవంతములగు కిరణములు కలవాడవు అగుదువు. అంతట, నీవు ఆత్యంతములు ప్రకాశించుము. యజమాని స్తోత్రములకు అగ్ని అభివృద్ధి చెందును. మధుర జలధారలు వర్షించును.
9. పుట్టుకతోనే అగ్ని తన తండ్రి అంతరిక్షపు అధస్తన జలములను తెలిసికున్నాడు. అధస్తన సంబంధమగు వర్షమును ఎరింగినాడు. అంతరిక్షమునుండి వజ్రమును పడవేసినాడు. శుభంకరులకు వాయువు మున్నగు బంధవులతో కూడిన అగ్ని అంతరిక్షమున ఆవిర్భవించిన జలసహితుడయి గుహాగర్భమున వసించును. ఈ అగ్నిని ఎవరును పొందజాలరు.
10. అగ్ని తన తండ్రియగు అంతరిక్షమును, వర్షరూపమున గర్భమున ధరించును. ఒక అగ్ని బహు బుద్ధిమంతుడయి ఓషధులను భుజించును. బంధువులకు, మానవులకు హితకరములగు ద్యావాపృథ్వులు అభీష్టవరుదుడగు అగ్నికి బంధువులు. అగ్నీ ! నీ బంధువులు ద్యావాపృథ్వులను చక్కగా రక్షించుము.
11. అగ్ని మహామహుడు. అంతరిక్షము విశాలము, అసంబద్ధము. అగ్ని అంతరిక్షమున వర్థిల్లును. జలముల జన్మస్థానము అంతరిక్షము. అగ్ని అంతరిక్షవాసి. అట్లయ్యు అక్కచెల్లెండ్రవంటి నదుల జలమున అగ్ని ప్రశాంతచిత్తమున శయనించును.
12. అగ్ని సమస్త లోకములకు జనకుడు. జలగర్భుడు. మానవ రక్షకుడు. మహామహుడు. శత్రువులను ఆక్రమించువాడు. సంగ్రామమున మహంతమగు తన సేనకు రక్షకుడు. దర్శనీయుడు. స్వకీయ తేజమున ప్రకాశవంతుడు. అట్టి అగ్నియే యజమాని కొఱకు జలములను ఉత్పత్తి చేసినాడు.
13. అగ్ని దర్శనీయుడు. నానారూపుడు. జలగర్భుడు. ఔషధ గర్భుడు. అట్టి అగ్నిని సౌభాగ్యశాలి అయిన అరణి ఆవిర్భవింప చేసినది. స్తుతియోగ్యుడు, ప్రవృద్ధుడు సద్యోజాతుడు అగ్ని వద్దకు సమస్త దేవతలు విచ్చేసినారు. అగ్నిని స్తుతించినారు. అగ్నికి పరిచర్యలు సహితము చేసినారు.
14. సూర్య గణములు దీప్తిమంతమయిన మహా విద్యుత్తు వంటివి. అవి సముద్ర మధ్యమున అమృతమునకు దోహదకారులు అగును. అవి గుహవంటి తమ అంతరిక్ష భవనమున ప్రవృద్దులయి తమ ప్రభారాశితో ప్రదీప్తమగు అగ్నిని ఆశ్రయించుచున్నవి.
15. నేను యజమానిని. అగ్నీ ! నిన్ను స్తుతించుచున్నాను. ధర్మక్షేత్రమున జ్ఞానమును ఆర్జించు కోరిక గలవాడను. అందువలన నీ బంధుత్వము కొఱకు ప్రార్థించుచున్నాను. దేవతల సహితుడవయి విచ్చేయుము. నీ దుర్దమ తేజమున నన్ను నా పశ్వాదులను రక్షింపుము.
16. అగ్నీ ! నీవు మంచి నాయకుడవు. మేము నీ ఆశ్రయము అర్థించుచున్నాము. మేము సమస్త ధనసాధనకు కారణభూతమగు కర్మలను చేసెదము. హవ్యములు సమర్పింతుము. వీర్యవంతము అన్నమును సమర్పింతుము. అందువలన మేము దేవతారహితులను, అహితకారులను జయించగలము.
17. అగ్నీ ! నీవు దేవతలకు స్తవనీయుడవు. నీవు సమస్త స్తోత్రజ్ఞాతవు. మానవులకు వారి ఇండ్లలో నివాసము కల్పింతువు. నీవు రథివి. దేవతల కార్యములను సాధింతువు. వారి వెంట వెళ్లుదువు.
18. నిత్యము రాజగు అగ్ని యజ్ఞసాధనము చేయును. మానవుల గృహములందు ఆసీనుడు అగును. అగ్ని సమస్త స్తోత్రజ్ఞాత. అగ్ని శరీరము ఘృతమున దీప్తివంతము అగును. అగ్ని విస్తారుడు. వెలుగుల రేడు.
19. అగ్ని గమనేచ్చగలవాడు. మహామహుడు. శుభంకరమైత్రి కొఱకును, మహారక్షణల కొఱకును అగ్ని విచ్చేయవలెను. అగ్ని మాకు బహుళము, నిరుపద్రవము, శోభాయమానము, స్తుతిమంతము, శక్తిశాలియగు ధనమును ప్రసాదించవలెను.
20. అగ్నీ ! నీవు పురాణ పురుషుడవు. నిన్ను లక్ష్యముగా చేసికొనియే ఈ సమస్త, నవీన, అధునాతన స్తోత్రములను మేము పఠింతుము. సర్వభూతజ్ఞుడగు అగ్ని మానవుల మధ్య ఉపస్థితుడు అగును.
21. అగ్ని సర్వమానవులందు నిహితుడు. సర్వ భూతజ్ఞుడు. అగ్ని విశ్వామిత్రుని ద్వారా అనవరతము ప్రదీప్తము చేయబడుచున్నాడు.
22. అగ్నీ ! నీవు బలవంతుడవు. శోభన కర్మవంతుడవు. సదా విహరించువాడవు. ఈ యజ్ఞమును దేవతలవద్దకుకొని పొమ్ము. దేవతలను ఆహ్వానించు అగ్నీ ! మాకు అన్నములను, మహాధనములను ప్రసాదించుము.
23. అగ్నీ ! సర్వకర్మల హేతుభూతము, ధేను ప్రదాత్రి అగు భూమిని యజమానికి ప్రసాదించుము. మాకు వంశమును వర్థిల్ల చేయువాడును, సంతతి జనయిత అగు పుత్రుడు కలుగవలెను. అగ్నీ ! మమ్ము అనుగ్రహింపుము.
రెండవ సూక్తము
ఋషి-విశ్వామిత్రుడు, దేవత-వైశ్వానర అగ్ని, ఛందస్సు-జగతి.
1. వైశ్వానరుడు యజ్ఞవర్ధకుడు. అతనిని విశుద్ధ ఘృతమువంటి ప్రసన్నప్రదాయక స్తుతుల నుతింతుము. కుఠారము రథమును సంస్కరించును. అట్లే సాధారణ మానవులు, ఋత్విక్కులు దేవతలను ఆహ్వానించు గార్హపత్య ఆహవనీయ అగ్నులను సంస్కరింతురు.
2. అగ్ని హవ్యవాహుడు. జరారహితుడు. అన్నదాత. అహింసితుడు. ప్రభాధనుడు. అగ్ని జన్మించగనే ద్యావాపృథ్వులను ప్రకాశవంతములు చేసినాడు. అగ్ని తలిదండ్రులకు అనుకూల పుత్రుడు అయినాడు. అగ్ని మానవులకు అతిథివలె పూజ్యుడు.
3. జ్ఞానులగు దేవతలు ఆపదోద్ధారక బలముద్వారా యజ్ఞమునందు అగ్నిని ఆవిర్భవింప చేయుదురు. బరువుమోయువాడు అశ్వమును స్తుతించును. అట్లే అన్నాభిలాషి దీప్తిమంతుడు, స్వతేజమున ప్రకాశమానుడగు మహా అగ్నిని స్తుతించును.
4. స్తుతియోగ్యుడగు వైశ్వానరుని శ్రేష్ఠము, లజ్జారహితము, ప్రశంసనీయము అగు అన్నమును అభిలషించి భజింతును. భృగువంశీయుల అభిలాషప్రదుడు, అభిలషనీయుడు, ప్రజ్ఞావంతుడు, స్వర్గసంబంధ దీప్తిద్వారా శోభాయమానుడగు అగ్నిని భజింతును.
5. అగ్ని అత్యంత ప్రకాశవంతుడు. సకల దేవతల హితాభిలాషి. దుఃఖనాశకుడు. యజమానుల యజ్ఞసాధకుడు. అట్టి అగ్నిని సుఖప్రాప్తికిగాను ఋత్విక్కులు కుశలు పరిచియు, సృక్కులు ఎత్తియు స్తుతించుచున్నారు.
6. అగ్నీ ! నీవు దీప్తిమంతుడవు. దేవతలను ఆహ్వానించువాడవు. యజమానులు నిన్ను సేవించు అభిలాష కలిగి ఉన్నారు. వారు కుశలుపరచి, నీకు యోగ్యమగు యాగ గృహమున నిన్ను సేవింతురు. వారికి ధనము ప్రసాదించుము.
7. అగ్ని ద్యావాపృథ్వులను పూరించినాడు. విశాల ఆకాశమును సహితము పూరించినాడు. నవజాత అగ్నిని యజమాని ధరించినాడు. సర్వత్రవ్యాప్తుడు, అన్నదాత అగ్నిని అన్నలాభము కొఱకు అశ్వమునువలె తీసికొని వచ్చెదరు.
8. అగ్ని దేవతల సమ్ముఖమున ఉపస్థితుడు అయినాడు. అతడు హవ్యదాత. శోభన యజ్ఞవంతుడు. గృహముల హితైషి. నేత మరియు మహా యజ్ఞ ప్రేక్షకులు అట్టి అగ్నిని పూజించవలెను. పరిచర్యలు చేయవలెను.
9. అమరులగు దేవతలు అగ్నిని అభిలషించినారు. వారు మహంతము, జగత్ వ్యాపకమగు అగ్నియొక్క ప్రార్థన, వైద్యుత, సూర్యరూపములగు మూడు మూర్తులను ఏర్పరచినారు. ఆ దేవతలు ఆ మూడు మూర్తులలో జగత్పాలకమగు పార్థివమూర్తిని మర్త్యలోకమున ఉంచినారు. మిగిలిన రెండింటిని అంతరిక్షమునకు చేర్చినారు.





