Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"దౌపది ! నిన్ను నీ భర్త ఓడినాడు. నీవు మాకు దాసివి. నీవు తప్పుకోనలేవు. నిన్ను రక్షించువారు లేరు" అని దుశ్శాసనుడు ద్రౌపది వైపుకు సాగినాడు.
ద్రౌపది దుశ్శాసనుని చూచి గడగడలాడింది. "ఒయీ! దుశ్శాసనా! నేను రాజస్వలను అయి ఉన్నాను. ఏకవస్త్రను, నన్ను తాకకుము. అంతేకాక సమస్త గురుజనులు బంధువులు ఉన్న సభకు నేను రాకూడదు" అని చేతులోడ్డి మరొక ధర్మ సందేహము విసరినది.
"ద్రౌపదీ! ఓసీ దాసీ! నీవు ఏకవస్త్రవు అయినను వివస్త్రవు అయినను మాకు అక్కరలేదు. నిన్ను సభా మధ్యమునకు ఈడ్చుట నాపని" అని ద్రౌపది కొప్పు పట్టి దుశ్శాసనుడు సభా మధ్యమునకు ఈడ్చినాడు.
ఆవనజాననం గురుకులాడముడట్లు గడంగి రాజ సూ
యావభ్రుధంబునందు వసుధామర మంత్ర పవిత్రవారి ధా
రావళీ జేసి పావనములైన శిరోజములం దెమల్చి పా
పావహుడిడ్చి తెచ్చె సభకందరుం సంభ్రమమంది చూడగన్
ఇట్లు వాతావదూతంబయిన పతాకయుంబోలె దుశ్శాసనా పకృష్టమై ద్రౌపది వికీర్ణకేశము వివర్ణవదనయువై కర్ణ దుర్యోధన శకుని సైందవాది దుష్టభూయుష్టంబయిన సభకు వచ్చి కోప లజ్జా పరవశయయి" సభవారిని ప్రశ్నించినది.
"సభసదులారా! ధర్మారాజు సంపదలను విడుచునే గాని ధర్మము తప్పదు. ఇప్పుడు ధర్మరాజునకు దైవబలము లేకున్నది. అట్టి ధర్మరాజు ఎదుట ఈ దుశ్శాసనుడు నాజుట్టుపట్టి సభకు ఈడ్చుకొని వచ్చినాడు. ఇది కూడని పని అని తలపక నన్ను నిండు సభలో అవమానించినాడు. పూర్వము ఈ భారతవంశ వీరులందరు సర్వ ధర్మవేత్తలవి. ప్రసిద్ది చెందియుండిరి. నేడు భరత వంశము ధర్మమూ వీడినది. ప్రఖ్యాతి వీడినది. నిందాస్పదమగుచున్నది."
ద్రౌపది అట్లు సభను ప్రశ్నించినది. సభను చూచినది. సభ కిమ్మన లేదు. భీష్మాది కురువృద్దులను చూచినది. వారి నోట మాటరాలేదు. ముల్లోకములను జయించ సమర్దులయిన భర్తలను చూచినది. వారు తలలు వంచుకున్నారు. సభలో తనను రక్షించువారు లేరనుకున్నది. అపద్భంధవుని , శరణాగత రక్షకుని శ్రీకృష్ణుని మనసున మౌనముగా ప్రార్ధించినది.
నిరపరాధియై, నిస్సహాయ అయి, దుఃఖమూర్తి అయి కోపజ్వాలలకు కందిపోయిన ద్రౌపదిని చూచినాడు. భీమునిలో రోశాగ్ని జ్వాలలు రగిలినవి. ధర్మరాజును నిందించినాడు.
"అన్నా! శకునిది మాయాజూదమని తెలిసి అడినావు. పాపము చేసినావు. మేము నీసోత్తని మమ్ము ఓడినావు. కానిమ్ము. కోమలిని , మన భార్యను ద్రౌపదిని ఓడినావు. ఆమెను అవమానములకు గురి చేసినావు. నీవు చేసిన అపరాధము క్షమించరానిది. జూడమాడిన నీ చేతులను అగ్గితో కాల్చవలెను. అని అగ్గి కురిపించినాడు. అర్జునుడు అది విన్నాడు. భీముని శాంతింప చేయడలచినాడు. అన్నాడు:- "అన్నా! భీమా! ధర్మరాజు ధర్మమార్గము తప్పడు. అట్లు తప్పినచో భూమి తల్లడిల్లును. స్నేహ జూదమునకు, ధర్మ యుద్దమునకు పిలిచినపుడు నిరాకరించరాదమనది నీతి శాస్త్రము. అందును అనుసరించి ధర్మరాజు జూదమాడినాడు. దైవము అనుకూలించలేదు. ఓడినాడు. అందుకు ధర్మరాజును నిందింపరాదు. అర్జునుని మాటలకు భీముడు శాంతించినాడు.
ద్రౌపది విసరిన ప్రశ్నలకు సభలో ఎవరును సమాధానము చెప్పలేదు. సభలో ఎల్లరును ప్రాణము లేని ప్రతిమల వలె ఉన్నారు. అది చూచినాడు వికర్ణుడు, కౌరవులలో చిన్నవాడు. దుర్యోధనునకు తమ్ముడు. వికర్ణుడు లేచినాడు. సభను ఉద్దేశించి ప్రసంగించినాడు:-
"సభాసదులారా! బుద్దిమంతులు, యోగ్యులు ద్రౌపది అడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పవలసి ఉన్నది. సభలో ఉన్నవారు యుక్తాయుక్తా,ములను ఆలోచించవలసి ఉన్నది. అట్లు చేయకున్న పాపము కలుగును. కురువృద్దులు, భీష్మ, ద్రోణ, కృపులు న్యాయము చెప్పకున్నారు. సభలోని వారందరు కామ క్రోధములను విడిచి ద్రౌపది ప్రశ్నలను గురించి ఆలోచించవలసి ఉన్నది."
వికర్ణుని మాటలు విన్నారు. అయినను సభలోని మహామహులు ఎవ్వరును పెదవి కదల్చలేదు. అప్పుడు వికర్ణుడు "ఈ సభలో న్యాయము చెప్పువారు ఉన్నట్లు లేరు. నేనే ధర్మము నిర్నయింతును" అని ధర్మమును వివరించినాడు.
1. "జూదరి , వేటకాడు, త్రాగుబోతు , తిండిబోతు అగు నలుగురి కార్యములు న్యాయమునకు కట్టుబడవు. ధర్మరాజు జూదమునందు ఆసక్తి కలిగి ద్రౌపదిని ఓడినాడు. కాబట్టి ద్రౌపదిని ఓడినట్లుకారు.
2. ద్రౌపది ధర్మరాజు భార్య మాత్రము కాదు. భీమార్జున నకుల సహదేవులకు భార్య అగును. కాబట్టి ధర్మరాజు ఆమెను ఓడుట న్యాయముకాదు.
3. ఏకవస్త్ర అయిన ద్రౌపదిని సభకు ఈడ్చి తెచ్చుట అధర్మము. అన్యాయము.
వికర్ణుని మాటలు విన్న కర్ణుడు సుర్రుమని లేచినాడు. వికర్ణుని నిందించినాడు.
"ఒరే! వికర్ణా! వేలెడంతలేవు. నీకింత గర్వమా! ఇందరు పెద్దలున్న సభలో నీవు ఎందుకురా వాగేదవు?" అని కర్ణుడు వికర్ణుని ఖండించినాడు.
1. ద్రౌపది ధర్మరాజు ధనమగును. ఇంతమంది సభికుల ఎదుట ధర్మరాజు ద్రౌపదిని ఓడినాడు.
2. పాండవులు అయిదుగురును ధర్మరాజు జూదమున ఓడినాడు.
3. స్త్రీకి దైవము ఏర్పరచిన భర్త ఒక్కడే. ద్రౌపదికి అయిదుగురు భర్తలున్నారు. ఆమె బంధకి, అటువంటి దానిని మొండిమొలతో సభకు తెచ్చినను ధర్మమునకు విరోధము కలుగదు.
కర్ణుని మాటలు విన్నాడు దుర్యోధనుడు. మరింత గర్వము పెంచుకున్నాడు. దుశ్శాసనా ! పాండవుల వస్త్రములు గుంజుకొనుము. అని అరచినాడు.
పాండవులు ఆ మాటలు విన్నారు. జూదము వారి బలమును అపహరించినది. దుర్బలులు అయినారు. బలహీనులు అయిన పాండవులు కట్టుపుట్టములను విప్పి ఇచ్చినారు. పరాక్రమశాలురు అయిన పాండవులు పనికిరాని వారివలె సభలో కూలబడినారు.
అది చూచినాడు దుశ్శాసనుడు. గర్వాందుడు అయినాడు. నిండు సభలో ద్రౌపది కట్టుబట్టను లాగుటకు ప్రారంభించినాడు.
ద్రౌపదికి అంత సభలో రక్షించువారు కనిపించలేదు. మహదాపద సంభవించినపుడు శ్రీహరిని ప్రార్ధించమని పూర్వము వశిష్టుడు ఆమెకు ఉపదేశించినాడు. ద్రౌపది అది గుర్తుకు తెచ్చుకున్నది. మానరక్షణ బాధ్యత శ్రీకృష్ణునకు అప్పచెప్పినది. చేతులెత్తి ప్రార్ధించినది:-





