Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
రాధ ఎంత తేలిగ్గా కీలు బొమ్మ అయింది! అమె ఎన్నడూ తనను బాధ పెట్టలేదు. ఇతర భార్యలంత తేలిగ్గా రాధను వదిలివేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రాధా అలాంటిది కావడం తన అదృష్టం. ఆమె తాళి కోసం అంతగా పరితపిస్తుందనే విషయంలో అతనికి ఎలాంటి సందేహము లేదు. అయినప్పటికీ ఆ గౌరవం కావి బట్టలు మ్రుచ్చుకే దక్కాలి. తన నిశితదృష్టి మంచివాణ్ణీ పట్టుకుంది. రాధ ఏమన్నా తెలివి తక్కువదా? అయినా విశ్వసించింది. ఇదంతా విభూతి మహత్యం. దొంగ గాడిద. ఎక్కువ డబ్బే కాజేశాడు. వేయి రూపాయలు! అయినా తనకేమీ విచారం లేదు. చంద్రలేఖను చూడగానే తనలో పెల్లుబికిన ఆనందాన్ని తల్చుకుంటే ఆ ఖర్చు ఒక లెక్కా? ఒంటరిగా రాధతో పోరాడ్తే తనకు ఇంత విజయం ఇంత కొద్ది సమయంలో లభించేది కాదేమో!
నగరం జగన్మాతను కోల్పోతుంది. కాని తన ప్రతిష్ట ఆకాశం అంటుతుంది. జగన్మాత పాత్రలో తానూ పాలుపంచుకొని నాటకం అవిచ్చిన్నంగా సాగిస్తే !
చాల మంది యోచన! అద్భుతమైన ఆలోచన! ఎంత తీక్ష బుద్దయితే దాన్ని గ్రహించాలి? తాను స్వయంగా కొత్త వేషం వేసినట్లు ఊహించుకున్నాడు. పారమార్ధికరంగం మొత్తంలోనూ తాను ఏకైక పాత్రధారియా అనుకునేంత సమర్ధంగా నటించగలడు. తన ఆ విగ్రహాన్ని తల్చుకున్నాడు. పరవశుడైనాడు. తన పాద ధూళి తానే తల మీద పెట్టుకునేంత పని చేశాడు. పెద్దగా నవ్వాడు. మెరిసే అతని పళ్ళు బైటపడ్డాయి. మంచి యోచనే. ఉత్త,మమైన ఆలోచనే. కాని ఆచరణ సాధ్యం అయ్యేది కాదు. కావి బట్టలు కట్టుకున్నా అనేక అవాంతరాలు ఉన్నాయి. అందులో మొదటిది తన వ్యాపారం. వ్యాపారాన్ని మేనేజరు చేతులో గానీ, భాగస్వామి చేతిలో గాని పెట్టాలి. అలా అవుతే తన జీవితంలో పస చచ్చిపోదూ?
వెంటనే ఇంకో సమస్య జ్ఞాపకం వచ్చింది. ఆ సమస్య తన ప్రస్తుతపు మామకు సంబంధించింది. రాధ తన జీవితం నుంచి నిర్గమిస్తే అతడు కుట్ర చేయవచ్చు. అతణ్ణి నమ్మడం ఎలా? ఆ స్థానంలో వేరే వాణ్ణి నియమించాలి. ఎవరిని ఏర్పాటు చేయాలి? అసిస్టెంట్ మేనేజర్ చోటా లాల్ నా? ఆ విషయం కూడా నిర్ణయం జరగాలి. నాటకం అడ్డానికి వీల్లేకుండా ఠాకూర్ దాస్ కు అమాంతంగా నోటీసు ఇవ్వాలి. ఇంకా బోలెడు విషయాల్లో నిశ్చయం జరగాల్సి ఉంది.
* * *
ముహూర్తం సమీపించింది.
ఆలస్యంగా లేవడానికి అలవడ్డ పెద్ద పెద్ద అతిధులు సహితం పెందరాళే మేల్కొని కార్లలో గుడికి వచ్చేస్తున్నారు. బాగా పొద్దెక్కింతర్వాత గాని లేవని ఆబాలబంధు సహితం చీకటితోనే లేచి కాల్యాలు తీర్చుకొని , శుచి అయి, బంధు సమేతంగా సమయానికి హాజరు అయినాడు. సర్వం సిద్దంగా ఉంది. మంగల్ అధికారి ఉపన్యాసానికి సర్వ సన్నాహాలు జరిగాయి.
కాలూ, చంద్రలేఖా సహితంగా మండపు మెట్లు ఎక్కుతున్నాడు. మోతీచంద్ తన ఇరువురు భార్యలు ధరించిన ఏడు పేటల అచ్చముత్యాల హారం ఆమె చేతికి అందించాడు. లేఖ ముఖంలో నిశ్చలత్వమూ, కళ్ళలో కాఠిన్యామూ కనిపిస్తున్నాయి. మోతీచంద్ అర్ధం చేసుకున్నాడు.
"గుండె దిటవు చేసుకో, ఇంకెన్నాళ్ళు ఈ కావి బట్టలు కట్టబోవు. స్త్రీ హృదయం బీటలు వారుతుంది. తిరగబడుతుంది. నలుగురు పెళ్ళాల భర్తను నాకు తెలియకుంటే ఆ విషయం ఇంకెవరికి తెలుస్తుంది? కాస్త ఓపిక పట్టు. భానుడు తన బంగారు కిరణాల్తో మన వివాహదినాన్ని పునీతం చేయనీ" అందామను కున్నాడు మోతీచంద్.
అధికారి ఆలోచనామగ్నుడై ఉన్నాడని గ్రహించాడు. ఎన్నో రాత్రుల నుండి నిద్ర లేనట్లు అతని కండ్లు కణతల్లోకి పీక్కుపోయాయి. గొప్ప అతిధుల్ను సహితం అభినందించలేదు. అతడు ఇక్కడలేడు. ఎక్కడో ఉన్నాడు.
సర్ ఆబాలబంధు , మోతీచంద్ ను 'ఏ? మంగల్ అధికారి అలా ఉన్నాడు. పెనుభూతంలా తయారైనాడు. ఎందుకూ?" అనడిగాడు.
"అతిదూరం సయనించిన బాటసారి, అలసిపోయాడు పాపం. అలా తల వంచుతే అభినందించినట్లు కాదూ?"
ధవళసనధారియైన అర్చకుడు, పొంకోళ్ళ కాళ్ళతో ముందుకు నడిచాడు.
యజ్ఞాగ్ని రగుల్తుంది.
మోతీచంద్ మండపపు చివరకు నడిచాడు. చేతులు జోడించి హృదయానికి ఆనించాడు. "సోదరులారా! దయచేసి కూర్చోవాలి" అన్నాడు.
జనం కూర్చున్నారు. గోప్పవారంతా బొర్రలకూ, వీపులకూ విశ్రాంతి లభించడానికి దిండ్లు దగ్గరికి లాక్కున్నారు.
"స్వప్నంలో శివుని దర్శించిన దేవాలయ నిర్మాత తమ అమూల్య సందేశాన్ని అందజేయాలని అర్దించే అవకాశం లభించినందుకు ధన్యుణ్ణి. ఈ విషయం మీ అందరికీ సమ్మతమేననుకుంటా."
"అవును, సమ్మతమే , సమ్మతమే"
కాలూ ఇంకా దిండునానుకొని కూర్చొనే ఉన్నాడు. మెల్లగా లేచాడు. సభను కలయజూశాడు. చేతితో నున్నటి తల గోక్కొని కొంతసేపు అలాగే నుంచున్నాడు.
కొంతసేపు నిశ్శబ్దం.
మాటలు ఆగిఆగి వస్తున్నాయి. తూచి తూచి మాట్లాడినట్లుంది. "మీకు చెప్పతగినంతవాణ్ణి కాను, నాకు అతి స్వల్పమైన జ్ఞానం ఉంది. మంత్ర తంత్రాలు నాకు రావు. అర్ధం కావు ..........' ఆగిపోయాడు.
"వింటాం అధికారీ . నువ్వు చెప్పింది వింటాం. "ఒక పరిచిత కంఠం అతన్ని ప్రోత్సహించింది.
కాలూకు నిద్రలోంచి లేచి నట్లైంది. ఏదో అమాంతపు వత్తిడి అతన్ని పట్టేసింది. బాల భానుడి కిరణాలు చలవరాతి మండపం వెనక్కు నడుస్తూ అతని ముఖానికి నీడ పెంచుతున్నాయి.
"వేదకాలం నాటి నుంచీ - మన జీవన విధానం ప్రారంభం అయిన్నాటి నుంచీ -- వేల సంవత్సరాల నుంచీ -- నా కులం వారికీ వేద హక్కులు అలవడ్డాయి. ఆచారం అయినాయి. ప్రస్తుతం మీముందున్న నేను, ఈ శివాలయం నిర్మించిన నేను ........." ధ్వని తగ్గింది. కాని ధ్వని బరువు తగ్గలేదు. "ఈ దేవాలయ నిర్మాతనైన నేను పుట్టుకతో బ్రాహ్మన్ని కాను!"
సభలో కేకలూ, నవ్వులూ చెలరేగాయి. సభ హాస్య మందిరం అయిపొయింది. "అబ్బ! ఎంత పెద్ద హాస్యం! ఇలాంటి హాస్యం ఎన్నడూ వినలేదు.' "అది హాస్యం కాదు. బౌతిక వాంచలను త్యజించిన పరిపక్వ హృదయం లోంచి వచ్చే పలుకులు." అందులో ఎంతో గంభీరమైన అర్ధం ఇమిడి ఉంది."
కాలూ సభాసదుల్ను తీక్షణంగా చూశాడు. అతని కళ్ళు సలసలాకాగాయి. సమయం ఆసన్నం అయింది. ఈ శుభముహూర్తం కోసం, కొన్ని నెలల నుంచీ కఠినంగా ప్రయత్నిస్తున్నాడు.
తాను ఎన్నడూ ప్రేమించడం గానీ, గౌరవించడం గానీ ఎరుగని వ్యక్తీని పెళ్ళాడతాననడంలో లేఖ తన రుణం తీర్చుకోదలచుకుందనే ధ్వని ఉంది. షరతులు పెట్టి జీవితాలు కొని వేయడమే తన పని అని లేఖ భావించింది. ఆమె దృష్టిలో తానెంత నీచుడైనాడు!
తమ ఇద్దరి మధ్యా అగాధం ఏర్పడడానికి గల కారణం గ్రహిచాడు. తన్ను తాను చూచుకొని వణికిపోయాడు.
తాను ఎక్కింది పులి. దిగడం అసాధ్యం. పులి స్వేచ్చగా గాండ్రిస్తూ పరుగెత్తుతుంటే నిస్సహాయుడై కూర్చున్నాడు. పులి నేక్కెప్పుడు సహితం అతనికి తెలుసు, పులిని చంపడం వినా మార్గాంతరం లేదని.
అనందం, సౌఖ్యం, సౌకర్యం నిశ్చింతా ఝుర్నా లోని శ్రమ జీవనం నుండి తప్పుకోవడం, వీటిని తలచుకుంటే అతని వళ్ళు ఝల్లుమంది. దాంతో దుర్బలుడై పోయాడు. కాళ్ళు తన్ని పట్టడంతో స్థలం ఇరుకైంది.
మున్నెన్నడూ ఎరుగని మహాశక్తి తన్ను ఆవరించింది. ఆ శక్తి పులిని చంపాల్సిన అవసరాన్ని గురించి నొక్కి చెప్పింది. ప్రజల స్థితి గతుల్ను కూలంకుషంగా అవగాహనం చేసుకోవడం వల్ల వచ్చిన శక్తి అది. తాను గొప్పవాళ్ళ జీవితాల లోతు పాతుల్ను చూశాడు. తన నీడ సహితం గిట్టని మరో లోకపు జనులతో కాలూ సమానుడైనాడు. వారి జీవితాల్ను కొలచి, తూచి చూచాడు.
ఝుర్నా లో కాలూ పడ్డ బాధలన్నీ మంగల్ అధికారి స్మరణకు వచ్చాయి. జేలు, బోగం కొంప, గుడి, బాధ, లజ్జ, గౌరవం ఇంకెన్నడూ కమ్మరిని అసహ్యించుకోవడం గానీ, వెక్కిరించడం గానీ, ఉక్కు పాదాలతో తొక్కి వేయడం గానీ జరుగదు. అలా జరగడానికి వీల్లేదు. అతని మనసును బంధించి ఉంచిన శృంఖలాలు పటాపంచలైనాయి. అతని కనుచూపు స్వచ్చంగానూ నిర్మలంగానూ మెరుస్తుంది.





