Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
2. దర్శయాగము చేయువాడు అమావాస్యనాడే ప్రాతరగ్ని హోత్రాదికమును నిర్వర్తించవలెను. కృష్ణచతుర్దశినాడు అమావాస్యయను భ్రాంతిచే నిర్వర్తించరాదు. ఒకవేళ ఆ విధముగా చేసి రాత్రి తూర్పున చంద్రుడు కనిపించినచో - చంద్రుడు అమావాస్య కానినాడు యాగము నిర్వర్తించిన వానిని పశుశూన్యుని చేయును.
ఒకవేళ ఈ స్థితి కలిగినచో తన అభ్యుదయము కోరిన యజమాని తండులములను తీసికొనవలెను. వానిని స్థవిర, మధ్యమ, అణిష్ఠములు అని మూడుగా విభజించవలెను. వానిలో మధ్యమములను అష్టాకపాల పురోడాశముగ చేసి ప్రదాతయగు అగ్ని కొరకు నిర్వాపము చేయవలెను. స్థవిర తండులములతో చరును చేసి ప్రదాతయగు ఇంద్రునకు నిర్వాపము చేయవలెను. అణిష్ఠ తండువులతో చరువును పక్వము చేసి - కిరణములచే వ్యాపించి ఉన్న విష్ణువునకు నిర్వాపము చేయవలెను.
అప్పుడు యజమానికి అగ్ని సంతానము నిచ్చును. ఇంద్రుడు సంతానమును వృద్ధి చెందించును. విష్ణువు పశుసమృద్ధి కలిగించును.
3. దర్శపూర్ణమాస యాగములు రెండేసి పర్యాయములు చేయరాదు. చేసిన యెడల పూర్వయాగము చక్కగా అనుష్ఠించబడిన రెండవ యాగము వ్యర్థమగును. ఉత్తరయాగము బాగుగా అనుష్ఠింపబడినచో మొదటి యాగము వ్యర్థమగును. ఇష్టి అధికావృతము కావలెనను నియమము లేదు. కావున దీనిని ఇష్టి అనుటకు వీలులేదు. అగ్ని ష్టోమాదికముల వలె దీనిని యాగము అనుటకు వీలులేదు.
రెండేసి పర్యాయములు చేసిన వానికి లజ్జాముఖుడు, ధైర్యహీనుడగు పుత్రుడు కలుగును. కావున దర్శపూర్ణ యాగము ఒక పర్యాయమే చేయవలెను. ఆ విధముగా చేసిన వానికి ధీరుడగు పుత్రుడు కలుగును.
4. పూర్వము చెప్పిన పద్ధతిని ఆదరించనక్కరలేదు. యజమాని రెండు పర్యాయములు చేయవచ్చును. పూర్వము అనుష్ఠించిన దానివలన యజ్ఞమును, ఉత్తరమున చేసిన దానివలన ప్రకృతి యాగ సంపూర్తిని చేసిన వాడగును. పూర్వేష్టి వలన దేవతలను, ఉత్తరేష్టి వలన ఇంద్రియ సామర్థ్యమును పొందుచున్నాడు. పూర్వేష్టివలన మానవ లోకమును - ఉత్తరేష్టి వలన దేవలోకమును జయించును. రెండు ఇష్టులను ఆచరించుట వలన యజమాని బహు యజ్ఞఫలమును పొందును. పెరుగుచున్న చంద్రుడు సౌమ్యనస్యతకు ప్రతీక. అందువలన పూర్వఇష్టి 'సుమనస్' అగుచున్నది. ఉత్తరేష్టియందు చంద్రుడు అభివృద్ధి చెందును. కావున యజమానికి ఈ లోకమునందే ధనసమృద్ధి కలుగుచున్నది.
5. స్వర్గము కోరువాడు దాక్షాయణ యజ్ఞము చేయవలెను.
6. పూర్ణమాస యాగము నందు సాంనాయ్యమును నిర్వాపము చేయవలెను. అమావాస్యయందు మిత్రావరుణ దేవతాక అమిక్షయాగము చేయవలెను.
7. పూర్ణమాస యాగమున దేవతలకు సోమము అభిషుత మగుచున్నది. పూర్ణమి నుండి అమావాస్య వరకు సోమము నిత్యము అభిషుతమగుచున్నది.
8. ఉత్తర దర్శేష్టి యందు అనుష్ఠితమైన అమిక్ష దేవతలకు వశము, అనుబంధితము అగుచున్నది. అది ఎట్లన: -
యజమాని శుక్లపాడ్యమి నాడు వేదిని ఏర్పరచును. ఆనాడే వత్సాపాకారణ హవిర్దాన మంటపము నిర్మించును. ద్వితీయనాడు ప్రాతః కాలమున ఆగ్నేయము, పురోడాశము, దేవతలు కోరునట్టి సుత్యను సంపాదించును.
అందువలన ఆ యజమాని ఈ పక్షము రోజులు దేవతలతో కూడి సంతోషముగా సోమము సేవించిన వాడగును.
అమావాస్యనాడు మిత్రావరుణ దేవతాకమగు అమిక్షాయాగము చేయును. ఆ అమిక్షయే దేవతలకు వశమైనదియు, అనుబంధమైనదియు అగును. ఆ అమీక్షయే యజమానికి వశమగును.
9. ఈ యజ్ఞమును చేసిన వానికి దేవతల సాక్షాత్కారము లభించును. గొప్పపదవులు అధిష్ఠించును. కోరుకున్నవి కోరుకున్నట్లుగా జరుగును.
10. యజమాని చేసిన యజ్ఞములందు లోపము జరిగిన అతడు ఇతర యజమానుల కన్న తక్కువ వాడగును. లోపము లేనిచో ఇతర యజమానులతో సమానుడు అగును. ఇతరుల కన్న అధికుడు కాదలచినవాడు ఈ దాక్షాయణ యజ్ఞమును చేయవలెను. ఈ యజ్ఞము కరవాలము వలె పదునైనది. అది ఈ యజమానిని అందరిని మించిన వానిచేయును. చేయనివాడు తక్కువ వాడగును.
11. దాక్షాయణ యజ్ఞకర్త అబద్దమాడరాదు. మాంసము తినరాదు. స్త్రీ సంగమము చేయరాదు. బట్టలు ఉతుకు సాధనముల చేత ఉతుకరాదు. ఇది దాక్షాయణ కర్త వ్రతము.
దేవతలు అబద్దమాడుట మున్నగునవి చేయరు కదా! (దీక్షలో ఉన్నప్పుడు అతడు దేవత అగునని అర్థము.)
ఆరవ అనువాకము
1. దర్శపూర్ణ యాగము దేవతల రథము వంటిది. దర్శపూర్ణయాగము చేసి, సోమయాగము చేసిన వానికి దేవతల రథముల నడకలచే స్పష్టమై, నిశ్చయముగా కనిపించు మార్గము కలుగును.
2. సంవత్సరమునకు దర్శపూర్ణమాసములు అవయవముల వంటివి. ఈ విషయమును తెలిసికొని దర్శపూర్ణ మాసయాగములు చేయువాడు సంవత్సరపు అన్ని అవయవములను అనుష్ఠించిన వాడగును.
3. దర్శపూర్ణయాగములు సంవత్సరములకు నేత్రముల వంటివి. అది తెలిసికొని దర్శపూర్ణ యాగము చేసిన వాడు దర్శపూర్ణ యాగమనెడి నేత్రములచే స్వర్గమును దర్శించును.
4. దర్శపూర్ణ యాగములు దేవతల పరాక్రమ స్వరూపములు. అది తెలిసి కొని దర్శపూర్ణ యాగము చేసినవాని యందు దేవతల పరాక్రమము చేరుచున్నది.
5. దర్శపూర్ణ యాగములు దేవమార్గములు. ఈ విషయము తెలిసి దర్శపూర్ణయాగము చేసిన యజమాని దేవమార్గమున పయనించగలడు.
6. దర్శపూర్ణ యాగములు దేవతల అశ్వముల వంటివి. ఈ విషయము తెలిసి దర్శపూర్ణ యాగము చేసినవాడు అశ్వముల చేతనే దేవతల కొరకు హవ్యము వహించును.
7. దర్శపూర్ణ యాగములు దేవతలకు నోళ్లవంటివి. ఈ విషయము తెలిసి దర్శపూర్ణ యాగము చేసినవాడు వ్యవధానము లేకుండనే దేవతల నోళ్లయందు హోమము చేసిన వాడగును.
8. ఉదయ, సాయంత్రములందు అగ్నిని గూర్చి హోమము చేసిన దర్శపూర్ణయాజి సోమయాజి అగును. అగ్ని హోత్ర - దర్శపూర్ణముల వలన దేవతలకు సోమాభిషవము జరుగును. తాను సోమయాజిని అగుచున్నానని జ్ఞానము కలిగి అగ్నిహోత్ర యుక్త దర్శపూర్ణయాగము చేసిన యజమాని అన్ని యాగము లందును ఇవ్వదగిన వాడు అగుచున్నాడు.
9. దేవతలు పూర్వము దర్శమాసము చేయవలసిన తిథిని తెలసికొనలేకపోయినారు. తరువాత పరిశోధించి పూర్ణిమ, అమావాస్యలందు యాగము చేయవలెనని నిర్ణయించినారు. ఈ విషయము తెలిసికొని, దర్శపూర్ణ మాసయాగములు చేసినవాడు శోధితములు, యజ్ఞార్హములగు పూర్ణిమ, అమావాస్యలందు ప్రవేశించి యజ్ఞము చేసినవాడు అగును.
10. దర్శపూర్ణమాసయాజి పూర్ణిమ, అమావాస్యలందు స్త్రీసంగమము చేయరాదు. చేసినచో అతడు ఇంద్రియ రహితుడు అగును.
11. చంద్రుడు రాజు. అతనికి ఉభయ - శుక్ల - పక్షముల రాత్రులు భార్యలు అయినవి. చంద్రుడు అమావాస్య, పూర్ణిమ రాత్రులను కూడలేదు. ఆ రాత్రులే చంద్రుని తమతో సంభోగము జరుపుటకు నిర్బంధించినవి. ఆ నిర్బంధ సమాగమము వలన చంద్రునకు క్షయవ్యాధి కలిగినది. చంద్రుడు రాజు. అతనికి యక్ష్మ కలిగినది. అందువలన అది రాజయక్ష్మ అయినది. చంద్రుడు ఒక శపథము చేసినాడు. దానిని ఉల్లంఘించినాడు. ఆ పాపము వలన అతనికి యక్ష్మవచ్చినది కావున అది పాపయక్ష్మ అయినది. చంద్రునకు అది జాయవలన కలిగినది. అందువలన అది జాయేక్ష్మ అయినది.
ఈ వ్యాధులు, అవి కలిగిన విధము తెలిసికొనవలెను. ఆ విధముగా తెలిసికొనిన వానికి ఈ వ్యాధులు కలుగవు.
ఆ విధముగా యక్ష్మ వ్యాధి గల చంద్రుడు అమావాస్య పూర్ణిమ రాత్రులు వద్దకు వెళ్లినాడు. వాటికి నమస్కరించినాడు.
"మేము ఉభయులమే దేవతల హవిస్సులు వహింతుము. మమ్ము ఆశ్రయించియే దేవతల యాగములు జరుగవలెను. మాకు ఈ వరము ప్రసాదించుము" అని ఆ రాత్రులు కోరినవి.
అందువలననే అమావాస్య పూర్ణిమలందు మాత్రమే దేవతలను ఉద్దేశించిన యాగములు జరుగుచున్నవి. అమావాస్య, పూర్ణిమలే కదా దేవతలకు హవిస్సులు అందించునవి!
ఈ విషయములు తెలిసిన వారందరు దేవతలకు హవిస్సులు అర్పించినవారు అగుచున్నారు.
12. మనుష్యాది ప్రాణి జాలములన్నియు ఆకలిని తీర్చుకొనుచున్నవి.
మానవులు నిత్యము ఆహారము భుజించుచున్నారు. ఆకలిని చంపుచున్నారు.
దేవతలు పక్షమునకు ఒకసారి భుజించుచున్నారు. దర్శపూర్ణమాస యాగములందలి హవిస్సులే కదా దేవతలకు ఆహారము! ఆ విధముగా వారు ఆకలిని చంపుతున్నారు.
పితృదేవతలు మాసమునకు ఒకసారి భుజించుచున్నారు. నెలకొకసారి చేయు పిండపితృ యజ్ఞమే కదా వారికి ఆధారము. ఆ విధముగా వారు ఆకలిని చంపుచున్నారు.
మామిడి, పనస మున్నగు చెట్లు సంవత్సరమునకు ఒకసారి ఫలించి భుజించుచున్నవి. ఆ విధముగా అవి ఆకలిని చంపుచున్నవి.
య ఏవం వేద హన్తి క్షుధం భాతృవ్యమ్ - ఇది తెలిసినవాడు ఆకలి అను శత్రువును చంపినవాడు అగుచున్నాడు.
ఏడవ అనువాకము
1. పూర్వము దేవతలు ఋక్కులకు సంతోషించలేదు. యజుస్సులకు సంతోషించలేదు. సామమునందే వారికి సంతోషము కలిగినది. అందువలన హోత మూడుమార్లు 'హిం' శబ్దమును ఉచ్చరించవలెను. అందువలన సామమును పఠించిన వాడగును.
మొదటి 'హిం' శబ్దమున సామగానము చేసినట్లు అగును.
రెండవ 'హిం' శబ్ద ఉచ్ఛారణ వలన దేవతలను సంతోషపెట్టును.
మూడవ 'హిం' శబ్ద ఉచ్ఛారణము సోమాశ్రయమైన ఋగ్రూప వాక్కునకు సంబంధించినది అగును.
మూడవ హుంకారమున యజమానికి సంతానము కలుగుచున్నది.
2. మొదటి సామిధేనీ ఋక్కును మూడు మారులు ఉచ్చరించవలెను. చివరి సామిధేనీ ఋక్కును మూడు మారులు ఉచ్ఛరించవలెను. అందువలన యజ్ఞమును జారిపోకుండునట్లు బంధించిన వాడు అగును.
3. నిరంతరము సామిధేనీ ఋక్కు ఉచ్ఛారణ వలన ప్రాణరక్షణ, భోజ్యవస్తు ప్రాప్తి, సంతాన ఫలము కలుగును. ఇంకను రాక్షస వినాశము అగును.
4. మొదట రథంతరి ఋక్కును మూడుమారులు చదవవలెను. ఈ లోకము రథంతరము అగును. కావున యజమాని ఈ లోకమంతటిని జయించును.
5. మూడవ సామిధేనీ ఋక్కును మూడు మారులు జపించవలెను. ఈ లోకములు మూడు. అందువలన యజమాని మూడు లోకములను జయించును.
6. బార్హతి పేరిటిది ఉత్తమ ఋక్కు. దానిని ఉచ్చరించవలెను. ద్యులోకమునకు బార్హతమని పేరు. అందువలన యజమాని స్వర్గలోకమునే జయించినట్లగును.
7. విశేషదేవనామము గల 'ప్రవోవాజా ఇతి' అను ప్రజాపతి దేవతాకమగు సామిధేని ఋక్కును అనుసంధానము చేయవలెను. యజ్ఞము ప్రజాపతి రూపము. అందువలన ప్రజాపతి యజ్ఞమును ప్రారంభించిన వాడగును.
8. అన్నం వై వాజః - అన్నమే వాజ శబ్దమగును. "ప్రవోవాజాః" ఋక్కును ఉచ్చరించుట వలన యజమాని అన్నవంతుడు అగును.





