Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||
ఇరువది ఏడవ అధ్యాయము
1. సమాస్త్వాగ్న ఋతవో వర్ధయంతు సంవత్సరా ఋషయో యానిసత్యా|
సం దివ్యేన దీదిహి రోచనేన విశ్వా ఆభాహి ప్రదిశాశ్చతస్రః||
అగ్నీ! వర్షము, ఋతువులు, సంవత్సరములు, ఋషులు, సత్యము నిన్ను వర్ధిల్లచేయవలెను. నీవు నీదివ్య ప్రభచే దేదీప్య మానుడవగుము. సంపూర్ణముగ నలు దిశలను ప్రకాశింపచేయుము.
2. అగ్నీ! సమింధితుడవు అగుము. యజమానిని ప్రబోధితుని చేయుము. మహాసౌభాగ్యము కొరకు నిలువుము.
అగ్నీ! యజమాని నీకు దగ్గరగా కూర్చుండును. అతనిని బాధించకుము. నీ ఋత్విజులే యశోవంతులు అగుదురు గాత - ఇతరులు కాదు - మాన్యే.
3. అగ్నీ! ఈ ఋత్విజులు నిన్ను కీర్తించుచున్నారు. వినుము. మాకు కళ్యాణ కారివి ఆగుము.
అగ్నీ! నీవు శత్రుహంతవు. మా శత్రువును జయించువాడవు. నీవు ప్రమాద రహితుడవగుము. యజ్ఞగృహమున నిరంతరము ప్రజ్వరిల్లుము.
4. అగ్నీ! నీవు ఇచట ధనమును వహింపుము. పూర్వము అగ్ని చయనము చేసినవారు నీచే తిరస్కరింపబడకుందురు గాత. క్షత్రియులు నీ అధీనమున ఉందురు గాత. నిన్ను ఉపాసించు యజమానికి బాధలు ఉండరాదు. అతడు వర్ధిల్లవలెను.
5. దీర్ఘాయువు అగ్నీ! క్షత్రియుల ద్వారా ఉద్దీప్తుడవు అగుము. మిత్ర సూర్యుని కలసి నీ మిత్రుడగు యజమానికి హితము చేకూర్చుము.
అగ్నీ! మా సజాతుల మధ్య నిలువుము. వర్ధిల్లుము. నీవు రాజుల యజ్ఞములకు వివిధ రూపముల ఆహ్వానించబడువాడవు. దేదీప్యమానుడవగుము. "దీదిహీహ"
6. అగ్నీ! నిహంతలను, హింసకులను, అన్య మనస్కులను అదాతలను లంఘింపుము. పాపములను పారద్రోలుము. తదుపరి మాకు వీరపుత్రయుక్త ధనమును ప్రసాదించుము.
7. జాతవేద అగ్నీ! నీవు ఆహింసితుడవు. అక్షయుడవు. విశేషరూపమున శోభాయమానుడవు. క్షత్రియులచే ఉద్దీప్తుడవై దేదీప్యమానుడవగుము. మానవులకు గల మృత్యుభయాదులను సకల దిశలనుండి తొలగించుము. నీ యొక్క శుభంకర జ్వాలలచే మమ్ము పాలింపుము. వర్ధిల్లచేయుము.
8. సవితా, బృహస్పతులారా! ఈ యజమానిని ప్రబోధితుని చేయండి. ఇతడు సుమతి. ఇతనిని మరింత సుమతిని చేయండి. ఇతనిని మహా సౌభాగ్యమున వర్ధిల్లచేయండి. ఇతని యజ్ఞమున విశ్వేదేవతలు తృప్తులు అగుదురు గాత.
9. బృహస్పతీ! పరలోక సంబంధములును, యముని నరకాది పాపముల నుండి మాకు విముక్తి కలిగించుము.
దేవ భిషక్కులు అశ్వినులు తమ యుక్తులచే మానుండి మృత్యువును తొలగింతురు గాత.
10. అగ్నీ! మేము పరంజ్యోతిని దర్శింతుము గాత. అంధకారమును దాటుడుము గాత. దేవతలకు ఒకే దేవతయు ఉత్తమ జ్యోతియు అగు సూర్యుని చేరుకుందుము గాత.
11. ఈ అగ్ని సమిధలు ఉన్నతములు కావలెను. ఇతని స్వచ్ఛకాంతి జ్వాలలు ఉన్నతములు కావలెను. యాజమానపుత్రుల ముందు ఈ దీప్తి శిఖలు ఉన్నతములు అగును గాత.
12. అగ్ని జలములకు పౌత్రుడు. ప్రాణవంతుడు. సర్వ ధనవంతుడు. దేవతలకు ఇతడే ద్యోతమానుడు. అగ్ని మా మార్గములను ఘృత, మధుమయములు చేయును గాత. "పథో అనక్తు మధ్వా ఘృతేన"
13. అగ్నీ! నీవు ఋత్విజులచే స్తుతించబడువాడవు. మధుర ఘృతమూలమున యజ్ఞమున వ్యాపించువాడవు. సవిత పుణ్యవంతుడు. లోకములచే కీర్తించబడువాడగును.
14. యజ్ఞము ప్రారంభమైనది. యజ్ఞ నిర్వాహకుడగు అధ్వర్యు జ్ఞానమూర్తి స్తుతించుచు బయలుదేరినాడు. ఘృతము, హవి, స్రువము మున్నగు వానిచే యజ్ఞమునకు వచ్చుచున్నాడు.
15. అధ్వర్యుడు మహిమాన్వితుడగు అగ్నిని యజించును. అగ్ని హవియుతుడు. వాసయితుడు చేతనాప్రదుడు. ధనదాత. అధ్వర్యు అగ్నికి బాలకార హవిస్సులు అర్పించవలెను.
16. ద్వార దేవేరుల వ్రత ధారిణులు. స్థానము గ్రహించినంత యజ్ఞమును ఐశ్వర్య వంతము చేయుదురు. వారు అగ్నికర్మములు వహించి యజ్ఞమును రక్షింతురు. విశ్వే దేవతలు వీరి కార్యములను రక్షింతురు.
17. ఉషా రాత్రులు దేవతాస్త్రీలు, ఈ అగ్నికి భార్యలు వారు. గార్హపత్యాగ్ని యందున్న మమ్ము శాస్త్రోక్తమగు ఈ యజ్ఞమును రక్షింతురు గాత.
18. దైవీహోతలు, అగ్ని, వాయువులు, మా యజ్ఞమును మహోన్నతము చేయుదురు గాత. వారు అగ్ని జ్వాలలణు నుతింతురు గాత. మా యజ్ఞమును సఫలమును చేయుదురు గాత.
19. స్తూయమానలగు ముగ్గురు దేవేరులు - ఇడ, సరస్వతి, భారతి - దర్భాసనమున ఆసీనలగుదురు గాత.
20. శీఘ్రముగా లభించునదియు - అద్భుతమును - అనేక స్థానము లందున్నదియు వీర్యశాలి యగు ధనమును త్వష్టదేవుడు మా నాభి స్థానముల పడవేయును గాత.
21. స్రుకమా! అత్యంత హవిర్దానము చేయుము. దేవతలను హవిర్భుక్తులను చేయుము. శాంతియుత అగ్ని హవిని సంస్కరించుచున్నాడు.
22. జాతవేద అగ్నీ! ఇంద్రునకు హవిన్వేకరింపుము. ఈ హవిని విశ్వే దేవతలు ఆస్వాదింతురు గాత.
23. అన్నమున బలిసినవియు ధనవర్ధకములగు నియుతాశ్వములను సుప్రజ్ఞ, శ్వేత వాయువు అధిష్ఠించును. ఆ నియుతములు వాయువు ముందు వచ్చి నిలుచును. అప్పుడు యజమానాదులందరు, సుపుత్ర ప్రాప్తి కలుగు యజ్ఞాది కర్మలు చేయుదురు.
24. ద్యావాపృథ్వులు ధనము కొరకని వాయువును సృష్టించినారు. ఆ ద్యోతమాన వాయువును వాగ్దేవి స్వయముగా స్వీకరించినది. జనాకీర్ణ మార్గములందు శ్వేత, ధనస్వామి వాయువునకు నియుతాశ్వములు లభించును.
25. జలము లోకములన్నింటిని తన గర్భమున దాల్చినది. అట్లు గర్భము దాల్చిన జలము తనలోన వేడిని పుట్టించినది. అప్పుడు దేవతలకు ఏకమాత్ర ప్రాణమగు హిరణ్యగర్భుడు అవతరించినాడు. అతనికి మేము హవిస్సులర్పింతుము. "కస్మైదేవాయహవిషా విధేమ"
26. ఏ అంతర్యామి తన మహిమచే దక్ష ప్రజాపతిని గర్భమున దాల్చినాడో, ఎవడు యజ్ఞమును కల్పించినాడో - ఎవడు సమస్తజలమును సర్వదిశల నుండి చూచి తెలిసినాడో, ఎవడు దేవతలకు ఏకమాత్ర దేవతయగువో "కస్మైదేవాయహవిషా విధేమ"
27. వాయువా! నీవు నియుత అశ్వముల మీద యజ్ఞము కొరకని యజమాని ఇంటికి వెళ్లుదువు. అచటి నుండి వచ్చి మాకు అన్నము, సరిపడునంత ధనము, పుత్రులు అశ్వగోధనమును ప్రసాదించుము.
28. వాయువా! నీవు నీ శత, సహస్రక నియుతములతో యజ్ఞమునకు విచ్చేయుము. ఈ తృతీయ సవనమున తృప్తి చెందుము. దేవతలారా! నిరంతరము శుభములు కలిగించి మమ్ము రక్షించండి.
29. వాయువా! నియుతాశ్వ సహితుడవై విచ్చేయుము. శుక్రమను పానపాత్ర నీ కొరకు వేచియున్నది. నీవు సదా అభిషుత గృహమునకు వెళ్ళువాడవు కదా!
30. ఇది దేవయజ్ఞము. శుక్ర గ్రహము నిండుగా సోమపాత్ర సమర్పించుచున్నాను. వాయువా! నియుతాశ్వయుక్తుడవై సోమపానమునకు, ఈ యజ్ఞమునకు విచ్చేయుము.
31. వాయువు అగ్రగంత, యజ్ఞము వలన సంప్రీతుడు, కళ్యాణకారి. అతడు నియుతాశ్వములను, శుభములను వెంటపెట్టుకొని యజ్ఞమునకు రావలెను.
32. వాయువా! నీకు వేనవేల రథములున్నవి. వానిమీద నియుతవంతుడవై సోమపానమునకు విచ్చేయుము.
33. వాయువా! నీవు జగత్ స్వరూపుడవు. నీవు ఒకటి, రెండు, పది, ఇరువది, మూడువందల అశ్వములపై పాత్రలను, ధనమును యజ్ఞమునకు తెచ్చెదవు. వానిని ఇచటనే వదలి వెళ్ళుము.
34. వాయువా! నీవు ఋతపతివి. త్వష్టకు జామాతవు. నిన్ను మేము అన్నములు యాచించు చున్నాము.
35. శూరఇంద్రా! పాలు పితుకని ఆవులు దూడల కొరకు అంబారావము చేసినట్లు, మేము నిన్ను సంస్తుతించుచున్నాము. స్వర్గద్రష్ట, చరాచర జగత్తునకు స్వామిని స్తుతించుచున్నాము.
36. ఇంద్రా! నీవంటివాడు దేవలోకమున లేడు. భూలోకమున లేడు. ఇప్పటికి పుట్టలేదు. ముందు పుట్టబోడు.
ధనవాన్ ఇంద్రా! మేము అశ్వకాములము. హవి సహితులమై గోకామియగు నిన్ను ఆహ్వానించుచున్నాము.
37. ఇంద్రా! అన్నలాభము కొరకు ఋత్విజులు నిన్ను ఆహ్వానించుచున్నారు.
వృత్రహంత ఇంద్రా! మేము వర్షము కోరియు అశ్వములు కోరియు యజ్ఞకర్తలమై, శ్రేష్ఠ పాలకుడవగు నిన్ను ఆహ్వానించుచున్నాము.
38. వజ్రహస్త, పూజనీయ ఇంద్రా! నీ తేజము వలననే నీవు స్తుతించబడుచున్నావు. నీవు గోవులు, రథములు కలవాడవు. జయశీల అశ్వమునకు అన్నము ఇచ్చినట్లు - మాకు అశ్వమునిమ్ము.
39. ఇంద్రుడు విచిత్రుడు. నిత్యము వర్ధిల్లువాడు. అతడు ఏ స్తుతులకు, ఏ అభిషవాడి కేఇయలకు ప్రసన్నుడై మాకు మిత్రుడు కాగలడు?
40. ఇంద్రా! బలములందు అత్యంత బలము కలిగించు హవిరన్నమేది? దేనివలన నీవు బలయుతుడవై గూఢముగా దాచిన గోధనాదులను వెలికి తీయగలవు?
41. ఇంద్రా! నీవు మా మిత్రులకు - నీ స్తోతలకు రక్షకుడవగుము. రక్షించుటకు గాను నీవు వందల రూపములు ధరించువాడవు కదా!
42. అగ్నీ! నీవు అమరుడవు. బలయుతుడవు. జాతప్రజ్ఞవు. నిన్ను యజ్ఞ యజ్ఞమందును, స్తుతి స్తుతియందును, ప్రియమిత్రుని స్తుతించు రీతి కీర్తించుచున్నాను.
43. అగ్నీ! అన్నముల స్వామీ! వాసయితా! నీవు ఒకటి - రెండు - మూడు - నాలుగు స్తుతులచే సంస్తుతుడవగుము. మమ్ము పాలించుము - పాహి.
44. అధ్వర్యులారా! జలపౌత్రుడగు అగ్నికి తృప్తి కలిగించండి. అతడు మన హవిని ఆశించుచున్నాడు. దేవతలకు హవి అందించుటకు మేము అగ్నినే సంకల్పించుచున్నాము.
అగ్ని మమ్ము అన్నములకగు యుద్ధములందు రక్షించును గాత. మమ్ము వర్ధిల్ల చేయును గాత. మా పుత్రులను రక్షించును గాత.
45. సంవత్సర్కోసి. పరివత్సర్కోసి, ఇద్వాత్సరోసి. వత్సరోసి
ఉషస్తే కల్పయన్తామ్. అహోరాత్రాస్తే కల్పయంతాం. మాసాస్తే కల్పయంతాం. అర్ధమాసాస్తే కల్పయంతాం. ఋతవస్తే కల్పయన్తామ్. సంవత్సరస్తే కల్పయంతామ్.
అగ్నీ! జనన మరణముల కొరకు వికాస సంకోచములనందుము. నీవు స్వయముగా ప్రసరించుము.
అగ్నీ! నీవు సుపర్ణచిత్తవు. సూర్యుని అనుమతిని అంగిరుల యజ్ఞమునందు వలెనే మాయగణమున సహితము స్థిరపడుము.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
ఆగ్నికమను ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము.
పథో అనక్తు మధ్వా ఘృతేన





