Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    20. ప్రాజ్ఞులగు దేవతలారా! యజ్ఞము మీకు లభించుటకు గాను హవి సమర్పించువాడును, యజ్ఞగామియగు యజమానికి మీరు ప్రదానము చేసిన మంగళమయ గృహమునందే మిమ్ము పూజింతుము.

    21. సర్వధన సంపన్నులగు దేవతలారా! నేడు సూర్యోదయమున, మధ్యాహ్నము, సాయంకాలము హవ్యదాత, ప్రకృష్టజ్ఞాని, ఋషియగు మనువునకు రమణీయ ధనము ప్రసాదించండి.

    22. దీప్తిమంతులగు దేవతలారా! మేము మీ పుత్రసములము బహుజన భోగయోగ్యమగు ధనము మాకు లభించవలెను. ఆదిత్యులారా ! యజ్ఞము చేయుచు ఈ ధనము వలన మేము ఎంతో ధనవంతులమగుదుము.

   
                                  ఇరువది ఎనిమిదవ సూక్తము
         ఋషి - మనువు, దేవత - మినదేవతలు, ఛందస్సు - గాయత్రి

    1. ముప్పదిమూడు మంది దేవతలు కుశలమీద అసీనులయినారు. వారు మమ్ము గ్రహించవలెను. మరల మరల ధనము ప్రసాదించవలెను.

    2. మంచి హవ్యములిచ్చు యజమానులు - మిత్ర, వరుణ, ఆర్యమలను, దేవపత్నుల సహితముగా - నానా విధ వషట్కారములతో ఆహ్వానింతురు.

    3. వరుణాది దేవతలు  - తమ సకల అనుచరుల సహితులై - మమ్ము ముందు, వెనుక, క్రింద, మీద రక్షించ వలెను.

    4. అన్నియు దేవతలు అనుకున్నుట్లే జరుగును. దేవతలు కోరిన దానిని నష్టపరచగలవారు లేరు, దేవతలు అనుగ్రహించిన దాతకాని వానిని సహితము ఎవరును హింసించజాలరు.

    5. ఏడుగురు మరుత్తులకు ఏడువిధముల ఆయుధములు, ఏడు రకముల ఆభరణములు, ఏడు తీరుల దీప్తులు కలవు.

                                 ఇరువది తొమ్మిదవ సూక్తము
                  ఋషి - మరీచపుత్రుడు కశ్యపుడు లేక వైవస్వతమనువు,
                     దేవత - వివదేవతలు, ఛందస్సు - ద్విపద విరాజము.


    1. సోముడు బలవర్ణుడు, సవర్ణుడు రాత్రులనేత, యువకుడు. ఒక్కడే సోముడు బంగారు ఆభరణములను ప్రకాశింప చేయును.

    2. దేవతలందు దీప్యమానుడు, మేధావియగు అగ్ని ఒక్కడే తన స్థానమును నిలుపుకొనును.

    3. దేవతలందు నిశ్చల స్థానమున ఉన్న త్వష్ట చేతులందు ఇనుప గొడ్డలి ధరించును.

    4. ఇంద్రుడు ఒక్కడే చేత వజ్రము ధరించును వృత్రాదులను నశింపచేయును.

    5. సుఖములనందించువాడును పవిత్రుడును అగు ఉగ్రరుద్రునాకు తీక్ష్ణమగు ఆయుధము కలదు.

    6. పూష ఒక్కడే మార్గములను కాపాడును అతడు చోరుని వలె సకల ధనములు ఎరుగును.

    7. విష్ణువు ఒక్కడే అనేకుల స్తుతియోగ్యుడు అతడు తన మూడు అడుగులతో ముల్లోకములను ఆక్రమించినాడు.

    8. ఇద్దరు అశ్వినులు ఒకేసూర్యతో - ఇద్దరు బాటసారులవలె - కలసి ఉందురు. గుఱ్ఱముల మీద సంచరింతురు.

    9. తమ కాంతులచే పరస్పర ఉపమేయములగు మిత్రావరుణులు అత్యంత దీప్తివంతులు ఘృతరూప హవివంతులు.

    10. వారు ద్యులోక స్థానమును నిర్మింతురు. స్తోతలు మహా సామమంత్రములను ఉచ్చరించి సూర్యుని వెలిగింతురు.

                                    ముప్పదవ సూక్తము
   ఋషి - వైవస్వతమనువు, దేవత - విశ్వదేవతలు, ఛందస్సు - 1. గాయత్రి
                         2. ఉష్ణక్, 3. బృహతి 4. అనుష్టుప్


    1. దేవతలారా ! మీలో ఎవరును బాలురుకారు - కుమారులు కారు మీరందరు మహామహులు.

    2. శత్రుభక్షకులు, మనువునకు యజ్ఞార్హులగు దేవతలారా! మీరు ముప్పది ముగ్గురు మీరు ఆవిధముగనే స్తుతించబడినారు.

    3.మీరు  మమ్ము రాక్షసుల నుండి రక్షించండి. ధనాదులు ఇచ్చి మమ్ము పాలించండి. ధనాదులు ఇచ్చి మమ్ము పాలించండి. మాతో చక్కగా మాట్లాడండి. పితరుడగు మనువునుంచి వచ్చిన దారినుండి మమ్ము తప్పించవద్దు దూరమార్గము నుండి సహితము మమ్ము తప్పించవద్దు.

    4. దేవతలారా ! యజ్ఞమునుండి పుట్టిన అగ్నీ ! మీరు కర్మలకు నేతలు మీరందరు ఇచ్చట నిలువండి మాకు సర్వత్ర ప్రఖ్యాతమగు సుఖమును, గోవులను, అశ్వములను ప్రసాదించండి.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత ఆరవ అష్టకము ఎనిమిదవ మండలమున నాలుగవ అనువాకము సమాప్తము.)

                అయిదవ అనువాకము        ముప్పది ఒకటవ సూక్తము
            ఋషి - వైవస్వతమనువు, దేవత - యజమాని, ఛందస్సు - వివిధము

    1. యజమాని యజ్ఞము చేయును. పునఃయజ్ఞము చేయును. సోమమును అభిషవించును. పురోడాశము వండును మరల ఇంద్రుని స్తుతించగోరును.

    2. ఇంద్రునకు పురోడాశము, పాలు కలిపిన సోమము సమర్పించు యజమానిని ఇంద్రుడు నిశ్చయముగా పాపముల నుండి రక్షించును.

    3. దేవప్రేరితము, ప్రకాశవంతమగు రథము అట్టి యజమానిడే అగును. అతడు దానితో శత్రుబాధలను అంతమొందించును సమృద్ధుడగును.

    4. అతడు పుత్రాదియుక్తుడు, నాశపరహతుడు, ధేనుసహితుడు అగును. అతని ఇంటనిత్యము అన్నము లభించును.

    5. దేవతలారా ! ఏకమనస్కులై అభిషవించిన దంపతులు - దశాపవిత్రమున సోమమును శోభించు దంపతులు - మిశ్రణద్రవ్యములతో సోమమును కలుపునట్టి దంపతులు.

    6. అట్టివారికి భోజనయోగ్యమగు అన్నము లభించును కలవారు యజ్ఞములకువత్తురు వారు అన్నము కొరకు ఎక్కడికిని వెడలరు.

    7. వారు ఇంద్రాది దేవతలను ఆలాపించరు వారు దేవతల శుభంకర బుద్ధికి ఆటంకము కలిగించరు మహా అన్నమున దేవతలను సేవించెదరు.

    8. వారు పుత్రవంతులు, కుమారవంతులు అగుదురు వారు బంగారు ఆభరణములు కలవారగుదురు. పరిపూర్ణ ఆయుష్కులగుదురు.

    9. ప్రియ యజ్ఞవంతులగు అట్టిదంపతుల స్తుతులు దేవతలను కోరును వారు దేవతలకు సుఖప్రద అన్నము సమర్పింతురు. వారి వద్ద ఉపయుక్త ధనముండును. వారు అమరత్వము సంతాన ప్రాప్తికొరకు స్త్రీపురుష సంగమము చేయదురు. వారు దేవతలను సేవింతురు.

    10. మేము పర్వతముల సుఖము కొరకును, నదుల సుఖము కొరకును ప్రార్ధింతుము దేవతలతో పాటు విష్ణువు  సుఖము కొరకును ప్రార్ధింతుము.

    11. ధనములదాత, పూజనేయుడు, అందరిని పోషించా పూష రక్షణలతో రావలెను. వారి రాకతో మార్గములు విస్తరిల్లి మంగళప్రదములు కావలెను.

    12. శత్రువులు అణచలేని ప్రకాశకుడగు పూషస్తోతలు శ్రద్ధగల పర్యాప్తస్తుతులు గలవారగుదురు. ఆదిత్యుల దానము పాపరహితమగును.

    13. మిత్రవరుణులు, ఆర్యమ మాకు రక్షకులు అట్లేవారు యజ్ఞమార్గాములను సంగమములు చేయవలెను.

    14.  దేవతలారా! అగ్ని మీలో ముఖ్యడు ప్రకాశవంతుడు. ధనలాభమునకుగాను మేము అగ్నిని స్తుతివచనములతో స్తుతించెదము మిమ్ము సేవించు మానవుడు ఎల్లరకు ప్రీతిపాత్రుడగును. యజ్ఞసాధకుడగు మిత్రునితో సమముగా అగ్నిని స్తుతింతుము.

    15. శూరుడు సేనామధ్యమునాకు చొచ్చుకొని పోయినట్లు దేవవంతుని రథము వెంటనే దుర్గమున ప్రవేశించును దేవతల మనసులను స్తుతులతో పూజించి కోరు యజమాని యజ్ఞశూన్యుని ఓడించగలడు.

    16. యజమానీ! నీకు లోపము కలుగదు. సోమాభిపవ కర్తా! నీకు లోపము కలుగదు. దేవాభిలాషీ ! నీకు లోపము కలుగదు. దేవతల మనసులను స్తుతులతో పూజించగోరు యజమాని యజ్ఞశూన్యుని ఓడించగలడు.

    17. దేవతల మనసులను స్తుతులతో పూజించ గోరు యజమానిని కర్మము ద్వారా ఎవరును అధిగమింప జాలరు. అతడు ఎన్నటికిని తన స్థానము నుండి కదలడు. అతడు పుత్రాదులనుంచి విడిపోడు దేవతల మనసులను స్తుతులతో పూజించా గోరు యజమాని యజ్ఞశూన్యుని పరాభవించగలడు.

    18. దేవతల మనసులను స్తుతులతో పూజించగోరు యజమానికి వీరులగు పుత్రులు కలుగుదురు. అతనికి అశ్వయుక్త ధనము లభించును. యజ్ఞశూన్యులను పరాభవించగలడు.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత ఎనిమిదవ మండలము ఆరవ అష్టకమున రెండవ అధ్యాయము సమాప్తము)

        ఓం నతామినన్తిమయనో నధీరావ్రతా దేవానాం ప్రథమాధ్రవాణీ
        నరోదసే అద్రుహో వేద్యాభిర్న పర్వతాణి నమే స్ధివాంసః

                మూడవ అధ్యాయము        ముప్పది రెండవ సూక్తము   
                ఋషి - కాణ్వమేధాతిధి, దేవత - ఇంద్రుడు, ఛందస్సు -గాయత్రి

    ఓం ప్రకృతానృంజీషిణః కణ్వా ఇంద్రస్య గాథయామదే సోమస్య వోచత

    1. కణ్వగణములారా! ఇంద్రుని గాధలు పాడండి ఇంద్రుడు మత్తుడగును అప్పుడు ఋజీహి సోమపు కర్మలను కీర్తించండి.

    2. ఇంద్రుడు ఉగ్రుడు అయినాడు. జలమును ప్రేరేపించినాడు 'సృవింద' 'అనర్శన' 'పిప్రు' 'దాస' 'అహేశువ' లను వధించినాడు.

    3. ఇంద్రా ! మేఘము ఆవరించిన స్థానమును భేదించుము. ఈ వీరక్రమమును చేయుము.

    4. స్తోతలారా ! మేఘమును జలము కొరకు ప్రార్థిస్తాము అట్లే - శత్రుదమనుడు, సుందర హనువులు గల -  ఇంద్రుని మీ స్తుతులు వినవలసినదనియు, మిమ్ము రక్షించ వలసినదనియు ప్రార్థింతును.

    5. శూర ఇంద్రా! నీవు ప్రసన్నుడవగుము సోమయోగ్యమును, స్తోతల గోవులు, అశ్వములు ఉండుటకు శత్రునగరితో సమానమైన దానిని వెలువరింపుము.

    6. ఇంద్రా ! మేము సమర్పించు అభిషుతసోమము లేక స్తోత్రములందు అనురక్తుడవైనచో - నాకు అన్నము అందించువాడవైనచో - దూరదేశమునుండి అన్నముతో నా వద్దకు విచ్చేయుము.

    7. ఇంద్రా ! నీవు స్తుతియోగ్యుడవు. మేము నీ స్తోతలము నీవు మమ్ము సంతోషపెట్టుదువు.

    8. ధనవంత ఇంద్రా ! నీ వద్ద విశేషధనము ఉన్నది ప్రసన్నుడవగుము. మాకు తరగని అన్నము ప్రసాదించుము.

    9. నీవు మమ్ము గోవులు, అశ్వములు, హిరణ్యముతో సంపన్నులను చేయుము మేము అన్నవంతులమగుదుము.

    10. లోకరక్షణకు ఇంద్రుడు భుజములు చాచునుమ్ పాలించుటకు సాధు కార్యములు చేయును. అతడు మహాఉక్ధవంతుడు మేము ఇంద్రుని ఆహ్వానించుచున్నాము.

    11. ఇంద్రుడు యుద్ధమున బహుకర్మలు చేయును శత్రువును, వృత్రుని వదించును స్తోతల కొరకు బహుధాన వంతుడగును.

    12. అతడే ఆశక్రుడే - మమ్ము శక్తిశాలురను చేయవలెను. ఇంద్రుడుదాత అతడు సకల రక్షణలతో మా లోపములను పూరించును.

    13. ఇంద్రుడు ధనరక్షకుడు సర్వోత్తముడు శోభన పారణవంతుడు సోమాభిషవకారికి మిత్రుడు అట్టి ఇంద్రుని స్తుతించండి.

    14. ఇంద్రుడు రానున్న యుద్ధక్షేత్రములందు నిశ్చలుడు అన్న వాజేత బలవంతుడు విశేష ధనములకు ఈశ్వరుడు.

    15. ఇంద్రునితో మహాకార్యములు చేయంచువాడులేడు. ఇంద్రుడు దాతకాదు అనువాడు లేడు.

    16. సోమాభిషవకారులు, సోమపాయలగు బ్రహ్మణులకు రుణములేదు విశేషధనవంతుడు మాత్రమే సోమపానము చేయగలడు.

    17. స్తుత్యుడగు ఇంద్రునకు పాటలు పాడండి. స్తుత్యిందరునలు స్తోత్రములు ఉచ్చరించండి స్తుత్య ఇంద్రునకు స్తుతులు రచించండి.

    18. ఇంద్రుడు స్తుత్యుడు బలశాలి అతడు వందల, వేల శత్రువులను వధించినాడు శత్రువులు ఇంద్రుని పట్టజాలరు అతడు యజ్ఞకర్తలను వర్థిల్లచేయును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.