Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    2. సవితా ! నీవు ఆజానుబాహుడవు. ప్రకాశవంతుడవు. లోకములకు ఆనందము ప్రసాదించుటకు ఉదయింతువు. బాహువులు చాచెదవు. అతని కార్యమునకుగాను పవిత్ర జలసమూహములు ప్రవాహించును. వాయువు సర్వత్ర వ్యాపించును. అంతరిక్షమున విహరించును.

    (ఉదయించి బాహువులు చాచిన సూర్యుని బొమ్మదింపి చూపినాడు !)

    3. సవిత దిగిపోవునపుడు వేగవంతములగు కిరణములు విడిచివేయును. నిరంతరము పయనించు బాటసారిని సహితము విరమింపచేయును. శత్రువునకు వ్యతిరేకముగా సాగువారి కోరికలకు సహితము కళ్లెము వేయును. సవిత పనితీరిన తరువాత రాత్రి అవతరించును.

    4. బట్టలునేయు పడతి నేతకుగాను తిరిగి నూలు పరచినట్లు రాత్రి మరల లోకములను కప్పివేయుము. పనులు చేయుట ఎరిగిన బుద్ధిమంతులు కార్యసమర్థులు అయినను మధ్యలో నిలిపివేసెదరు. విరామము ఎరుగనివాడు, ఋతు విభాగము చేయువాడు, ప్రకాశకుడు సవిత ఉదయించినపుడు జనులు పడకలు విడుతురు.

    5. అగ్ని గృహమున నిలిచి ప్రభవించిన తేజస్సు యజమాని యొక్క వేరు వేరు గృహములను సమస్త అన్నములను అధిష్ఠించును. ఉషామాత సవిత ద్వారా ప్రేరితమయి ప్రజ్ఞాపక యజ్ఞపు శ్రేష్ఠభాగము, తన పుత్రుడు, అగ్నికి దానము చేసినది.

    6. సవిత తన వ్రతవిధి ముగించినపుడు యుద్ధయాత్రకు సాగిన రాజు తిరిగివచ్చును. సకల జంగమములకు ఇంటిధ్యాస కలుగును. సర్వదా కార్యరతులయిన వారు సహితము పనులను సగములో వదిలి ఇంటిదారి పట్టుదురు.

    7. సవితా ! నీవు అంతరిక్షమున జలభాగమును ఏర్పరచినావు. జలాన్వేషకులకు అవి నలుదెసల లభించుచున్నవి. నీవు పక్షుల కొఱకు వృక్ష విభాగము చేసినావు. సవిత కార్యమును ఎంతటివారయినను నివారింపజాలరు.

    8. సవిత అస్తమించినపుడు సర్వదా గమనశీలుడగు వరుణుడు సమస్త జంగమములకు సుఖకరము, వాంఛనీయము, సుగమమగు నివాస స్థానములు ప్రదానము చేయును. సవిత సకల భూతములను తావు తావున వేరు చేసినప్పుడు పశుపక్షులు సహితము తమ తావరములకు చేరుకొనును.

    9. సూర్యుని వ్రత విధిని ఇంద్రుడు హింసించడు. వరుణుడు, మిత్రుడు, అర్యమ, రుద్రులు హింసించరు. శత్రుగణములు సహితము హింసించవు. అట్టి సవితను శుభముల కొఱకుగాను ఈ విధముగా నమస్కరించి ఆహ్వానించుచున్నాము. 

    10. సకల జనులు స్తుతించువాడు, దేవ పత్నులను రక్షించువాడగు సవిత మమ్ము రక్షించవలెను. భజనీయుడు, బహు ప్రజ్ఞావంతుడు, ధ్యానయోగ్యుడగు సవితకు మేము బలములు కలిగింతుము. ధనము, పశువుల ప్రాప్తి కొఱకును, సంచయన సంబంధమునను మేము సవితకు ఇష్టజనులము కావలెను.

    11. సవితా ! నీవు మాకు ప్రదానము చేసిన ధనము ప్రసిద్ధము, రమణీయము. అది ద్యులోక, భూలోక, అంతరిక్ష లోకములనుండి మా వద్దకు రావలెను. స్తోతల వంశజులకు శుభములు. కలిగించిన ధనమునే నాకు ప్రసాదించవలసినదని నిన్ను పదే పదే స్తుతించుచున్నాను.

                           ముప్పది తొమ్మిదవ సూక్తము

        ఋషి-శౌనక గృత్సమదుడు, దేవత-అశ్వినులు, ఛందస్సు-త్రిష్టుప్.

    1. అశ్వినులారా ! శత్రువు మీదకు ప్రేరేపించిన ప్రస్తర ఖండ ద్వయమువలె శత్రువును బాధించుడు. రెండు పిట్టలు చెట్టుమీద వాలినట్లు మీరు యజమానివద్దకు విచ్చేయుడు. మంత్రోచ్చారక బ్రహ్మనామక ఋత్విజులవలెను, రాజునకు వలసిన ఇద్దరు దూతలవలెను మీరు బహుజనుల ఆహ్వానయోగ్యులు.

    "ఋత్విజులు, దూతలను సహితము అనేకమంది ఆహ్వానించువారు ఉన్నారని అర్థము. విద్వాంసులు అరుదు కదా !"

    2. అశ్వినులారా ! ఉదయమున వెడలు ఉభయరథికులవలె మీరు వీరులు. రెండు మేకలవలె మీరు యుగళములు. ఇద్దరు యువతులవలె మీరు స్ఫురద్రూపులు. దంపతులవలె కలిసి ఉండువారు. మీరు సమస్తజనుల కర్మజ్ఞాతలు. మీరు ఉభయులు భక్తుని వద్దకు విచ్చేయండి.

    3. అశ్వినులారా ! మీరు దేవతలందు ప్రథములు. పశువుల రెండు కొమ్ములవలె, రెండుగా చీలిన గుఱ్ఱపు డెక్కవలె కలిసి వేగవంతులయి మా ముందుకు విచ్చేయండి. శత్రుహంతకులు, సర్వ కర్మ సమర్థులగు అశ్వినులారా ! చక్రవాక దంపతులవలెను, ఇద్దరు రథికులవలెను కలిసి మా ముందుకు విచ్చేయండి.

    4. అశ్వినులారా ! నౌకవలె మమ్ము దరి చేర్చుడు. రథయుగళమువలె రథ చక్రపు నాభిఫలకమువలె దాని పార్శ్వ ఫలకమువలె చక్రపు బయటి బలియవలె మమ్ము దరిచేర్చండి. రెండు కుక్కలవలె మా దేహములను హింసనుంచి రక్షించండి. ఇద్దరు అంగరక్షకులు తనువును కాపాడినట్లు మమ్ము వార్థక్యము నుండి రక్షించండి.

    5. అశ్వినులారా ! మీరు రెండు వాయువులవలె అక్షయులు. రెండునదులవలె శీఘ్రగాములు. రెండు మంత్రములవలె దర్శనీయులు. మీరు మా ముందుకు విచ్చేయండి. మీరు కాళ్లు చేతులవలె శరీరమునకు సుఖప్రదాతలు. మీరు మమ్ము ఉత్తమ ధనములవైపు నడిపించండి.

    6. అశ్వినులారా ! రెండు పెదవులవలె మధుర వాక్యములు ఉచ్ఛరించుడు. రెండు స్తనములవలె, బతుకు నిలుచుటకు పాలు త్రాగించుడు. రెండు నాసా రంధ్రములవలె మా దేహ రక్షకులు కండు. రెండు చెవులవలె మా మాటలు వినుడు.

    7. అశ్వినులారా ! రెండు చేతులవలె మాకు సామర్థ్యము ప్రసాదించండి. ద్యావాపృథ్వులవలె జలములు ప్రసాదించండి. ఈ స్తుతులన్నియు మిమ్మే వరించుచున్నవి. పదును పట్టు యంత్రమున మీ కరవాలములను తీక్ష్ణములు చేయండి.

    8. అశ్వినులారా ! గృత్సమదుడు మీ అభ్యుదయమునకుగాను ఈ స్తోత్రములు, మంత్రములన్నింటిని రచించినాడు. మీరు నేతలు, అత్యంత ప్రీతివంతులు. ఈ స్తుతులన్నియు మీ వద్దకు చేరవలెను. మేము పుత్ర, పౌత్రుల సహితులమయి ఈ యజ్ఞమున ప్రభవించిన స్తోత్రమును గానము చేసెదము.

                             నలుబదియవ సూక్తము

    ఋషి-శౌనక గృత్సమదుడు, దేవత - సోమపూషలు, అదితి; ఛందస్సు - త్రిష్టుప్.

    1. సోమపూషలారా ! మీరు ధనము, ద్యులోకము, పృథ్వియొక్క జనకులు. జన్మించగానే సకల జగత్తులకు రక్షకులు అయినారు. దేవతలు మిమ్ము అమృతత్వపు కారణము చేసినారు.    

    2. సోమపూషలు జన్మించగానే ద్యుతిమంతులయినారు. దేవతలు వారిసేవ చేసినారు. వారు అప్రియమగు అంధకారమును నాశము చేసెదరు. వీరి సహితుడయి ఇంద్రుడు గోవుల చన్నులలో పాలు కలిగించినాడు.

    3. సోమపూషలారా ! మీరు లోకములకు ప్రభువులు. ఇది సప్తచక్రమగు లోకము. దీని కొఱకుమీరు అవిభాజ్యులు. మీరు సర్వత్ర వర్తించువారు. పంచరశ్ములు. కోరిక కలుగగనే రథము సజ్జితము చేయుడు. మా వద్దకు విచ్చేయుడు.

    (సప్త చక్రము అనగా ఆరు ఋతువులుధౌపదమూడు మాసముల సంవత్సరము. సప్తచక్ర రథము. పంచరశ్ములు పంచ ప్రాణములు అని దయానందుడు. హేమంత శిశిరములు కలిసి ఒక ఋతువు గాకా పంచ ఋతువులు అని శాయణుడు)

    4. సోమపూషలారా ! మీలో పూష ఉన్నత ద్యులోకమున ఉండును. రెండవ సోమము ఓషధి రూపమున పృథ్విమీదను, చంద్రరూపమున అంతరిక్షమునను ఉండును. మీరు బహుజన వరణీయులు. కీర్తిశాలురు. భాగ్యకారకులు. మాకు పశురూప ధనమును ప్రసాదించండి.

    5. సోమపూషలారా ! మీలో సోమము సకల భూతములను సృజించినాడు. రెండవ పూష సకల జగత్తులను పర్యవేక్షించుచున్నాడు. మీరు మా కార్యములను రక్షించండి. మీ ద్వారా మేము సమస్త శత్రు సేనలను పరాజితులను చేసెదము.

    6. జగములను ప్రసన్నము చేయు పూష మా కార్యములకు తృప్తి చెందవలెను. ధనపతి సోముడు మాకు ధనమును ప్రసాదించవలెను. ద్యుతిమతి, శత్రురహిత అదితి మమ్ము రక్షించవలెను. మేము పుత్రపౌత్రవంతులమయి ఈ యజ్ఞమున ప్రభవించు స్తోత్రమును గానము చేసెదము.

                         నలుబది ఒకటవ సూక్తము

    ఋషి - శౌనక గృత్సమదుడు, దేవతలు - వేరు వేరు ఛందస్సు 1-15, 19-21
                       గాయత్రి, 16-17 అనుష్టుప్, 18 బృహతి.

    1. వాయూ ! నీవద్ద వేల రథములు ఉన్నవి. వానిద్వారా నియుతగణ యుక్తుడవయి సోమపానమునకు విచ్చేయుము.

    (నియుతములు వాయువు వాహనములు)

    2. వాయూ ! నియుతగణ యుక్తుడవయి విచ్చేయుము. నీవు దీప్తిమంతమగు నామము ధరించినావు. నీవు సోమాభిషవకారి యజమాని ఇంటికి వెళ్లెదవు.

    3. నేతలగు ఇంద్ర వాయువులారా ! నేడు మీరు నియుతగణములతో విచ్చేయుడు. గావ్య మిశ్రితమగు సోమము సేవించండి.

    (గవ్యము గోవు పాడి. పాలు, పెరుగు, కావచ్చును)

    4. మిత్రావరుణులారా ! మీ కొఱకు సోమము సిద్ధముగా ఉన్నది. సత్యవర్ధకులగు మీరు మా ఆహ్వానములు ఆలకించుడు.

    5. శత్రుతాశూన్యులు, రాజులు మిత్రావరుణులు. వారు స్థిరము, ఉత్కృష్టము అగు వేయిస్తంభముల స్థానమున ఆసీనులు కావలెను.

    6. సమ్రాట్టులు. ఘృతాన్న భోజులు, అదితి పుత్రులు, దాతలు, మిత్రావరుణులు యజమానిని అనుగ్రహింతురు.

    7. అశ్వినీ ద్వయము, నాసత్యద్వయము, రుద్రద్వయము, సోమమును సేవింతురు. ఆ సోమమును ధేను, అశ్వయుక్తము చేసి రథముమీద తీసికొనిరండు.

    (నాసత్యులు:- ఎన్నడును అసత్యము పలుకనివారు)

    8. ధనము వర్షించు అశ్వినులారా ! దూరమునందు ఉన్నది కాని, దగ్గరిదికాని, మృత్యువు, శత్రువు హరింపరానట్టిది, మిత భాషియగు ధనమును ప్రసాదించండి.

    9. జ్ఞానార్హులగు అశ్వినులారా ! మీరు మావద్దకు నానారూపకము, ధన ప్రాపకము అగు ధనమును తీసుకొనిరండు.

    10. ఇంద్రుడు స్థిరప్రజ్ఞావంతుడు. అతడు అధికమగు పాప భయమును దూరము చేయును.

    11. ఇంద్రుడు మనకు సుఖములు ప్రసాదించిన, పాపములు మనసు వెన్నంటవు. మనకు శుభములు కలుగును.

    12. ప్రజ్ఞావంతుడు, శత్రుంజయుడు ఇంద్రుడు నలుదిశలనుండి మమ్ము భయరహితులను చేయవలెను.

    13. విశ్వదేవతలారా ! మా ఆహ్వానములు మన్నించండి. విచ్చేయండి. కుశాసనమున ఆసీనులు కండి.

    14. విశ్వ దేవతలారా ! తీవ్రమధుకరి, రసవంతము, హర్షకారకమగు సోమము గృత్సమద వంశీయుల వద్ద ఉన్నది. ఈ శుభంకరమగు సోమమును పానము చేయుడు.

    15. ఇంద్రశ్రేష్ఠులు, పూష దాతగాగల మరుత్తులు మా ఆహ్వానమును ఆలకించవలెను.

    16. సరస్వతీ ! నీవు మరుత్తులలో శ్రేష్ఠవు. నదులలో శ్రేష్ఠవు. దేవతలలో శ్రేష్ఠవు. మేము దరిద్రులము. మాకు ధనము ప్రసాదించుము.

    17. సరస్వతీ ! నీవు ద్యుతిమతివి. నీ ఆశ్రయమున అన్నము ఉన్నది. శౌనక గృత్సమదులవద్ద సోమము స్వీకరించుము. తృప్తినొంది మాకు పుత్రులను ప్రసాదించుము.

    18. సరస్వతీ ! నీవు అన్నవతివి. జలవతివి. ఈ హవ్యములు స్వీకరింపుడు. ఇది మానవులకును దేవతలకును ప్రియమైనది. గృత్సమదులు దీనిని నీకు సమర్పించుచున్నారు.

    19. యజ్ఞ సుఖమును ఆర్జించు ద్యావాపృథ్వులారా ! మీరు విచ్చేయండి. మేము మిమ్ము ప్రార్థించుచున్నాము. హవ్యవాహనుడు అగ్నిని కూడ ప్రార్థించుచున్నాము.

    20. ద్యావాపృథ్వులారా ! మీరు స్వర్గాదుల సాధకులు, దేవతలవద్దకు వెళ్లువారు. మా యజ్ఞమును దేవతల వద్దకు చేర్చండి.

    21. శత్రుతాశూన్యులగు ద్యావాపృథ్వులారా ! యజ్ఞార్హులగు దేవతలు సోమపానము కొఱకు మా వెంట ఆసీనులు కావలెను.


                           నలుబది రెండవ సూక్తము

    ఋషి శౌనక గృత్సమదుడు దేవత - శకుంతము, కపింజలరూపి ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. తేప తేప శబ్దముచేయు భవిష్యత్తును వచించు కపింజలుడు కర్ణధారి నౌకను నడిపినట్లు వాక్యమును ప్రేరేపించుము.

    2. శకుంతమా ! శుభ సూచకమవు అగుము. ఏ దిక్కునుండియు, ఏవిధమైన పరాజయము నిన్ను చేరరాదు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.