Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    మరొక విషయము పరిశీలించవలసి ఉన్నది. సభా మంటపమునకు దుర్యోధనుడు ధర్మరాజును మాత్రమే తోడ్కొని వచ్చినాడు. పాండవులు అతనితో వచ్చినట్లు చెప్పబడలేదు. దుర్యోధనుడు భేదతంత్రమును ప్రయోగించినాడు. ధర్మరాజు కసాయి వానికి లొంగిన మేకవలె లోంగినాడు.
    పిలిచినది స్నేహా జూదమునకు . ధర్మరాజు పందెపు జూదమాడినాడు. అన్యుల కొఱకు అన్యులు జూదమాడుట పాపమని ధర్మరాజు ఎరుగును. అయినను దుర్యోధనుని పక్షమున శకుని జూదమాడుటకు అంగీకరించినాడు.
    జూదమున ధర్మరాజు వివేకమును కోల్పోయినాడు. అవేశమున నిగ్రహము వదులుకున్నాడు. తమ్ములు సంపాదించిన రాజ్యమును, తమ్ములను, తనను, అర్జునుడు సాధించిన ద్రౌపదిని సహితము కోల్పోయినాడు.
    ఇది మానవ దోషము. దైవ దోషము కాదు.
    జూదపు కధ చెప్పి వ్యాస మహర్షి మానవులను హెచ్చరించుచున్నాడు. ఎంతటి వివేకవంతుడయినను జూదము : వంటి వానికి లొంగి సర్వనాశనమగునని అతని హెచ్చరిక. ఈ కాలమున గుర్రపు పందెములందు సకల సంపదలు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్న మహానుభావులున్నారు.
    మరొక విషయమును శాస్త్రజ్ఞులు పరిశీలించవలసి ఉన్నది. ధర్మరాజు రాజ్యమును ఓడినాడు. భూములను ఓడినాడు. ప్రజలను ఓడినాడు. అని వేరు వేరుగా చెప్పబడినవి. రాజ్యము, భూమి, ప్రజలు వేరు వేరు వ్యవస్థలుగా ఎట్లుండెనో రాజకీయ శాస్త్రజ్ఞులు పరిశీలించవలెను.

                                                    వస్త్రాపహరణము

    ధర్మరాజు సకల రాజ్యమును ఓడినాడు. తమ్ములను ఓడినాడు. తన్ను ఓడినాడు ద్రౌపదిని సహితము ఓడినాడు. దీనుడయినాడు. మూర్తీభవించిన దుఃఖమయినాడు. ఖిన్నుడయినాడు. మాటాడలేని ప్రతిమ వలె కూర్చున్నాడు.
    ధర్మరాజును చూచిన భీష్మ, ద్రోణ, కృపులకు దుఖము ముంచుకొని వచ్చినది. దుఖమున మాటరాలేదు. విదురుడు పెడముఖము పెట్టివాడు. తలవంచుకుని దుఃఖించినాడు. సభలో  ఉన్నవారందరు కన్నీరు రాల్చినారు. సభలోని దుఖధ్వనులు సముద్ర ధ్వనుల వలె ఉన్నవి. దుశ్శాసన , కర్ణ, సైంధవులు మాత్రము అపరిమిత ఆనందమున ఉన్నారు. ఒకరిని ఒకరు చూచుకొని నవ్వుచున్నారు.
    ధృతరాష్ట్రుడు సభా క్షోభమును విన్నాడు. అందుకు కారణమేమని విదురుని అడిగినాడు. నోటమాటరాక విదురుడు మాట్లాడలేదు.
    "విదురా! చూచితివా! పాండవులు అయిదుగురు నాకు దాసులయినారు. నేను ద్రౌపదిని సహితము గెలిచినాను. ఇప్పుడు ద్రౌపది నాకు దాసీ అయినది. దానితో చాకిరి చేయింతును ఇండ్లు ఊడ్పింతును" అని వికటముగా నవ్వినా దుర్యోధనుడు "విదురా! వెళ్ళుము. నీవే వెళ్ళుము ద్రౌపదిని సభకు తీసు కొనిరమ్ము. ఈ పని నీ చేతుల మీదుగానే కానిమ్ము" అన్నాడు.
    విదురుడు దుఃఖపరితప్తుడయి అన్నాడు. దుర్యోధనుని మాటలు మరింత కాల్చినవి. అన్నాడు:-
    "దుర్యోధనా! అజ్ఞానమున నిన్ను మించువారు లేరు. నీకు సమానులు కూడలేరు. దుర్మార్గమునకు సహితము హద్దులు ఉన్నవి. నీవు వాటిని సహితము అతిక్రమించినావు. గర్వబుద్ది గల దుర్మార్గునకు సంపదలు నిలువవు. అతడు చేసిన అధర్మము వలన మొదటి సంపదలు కూడ నశించును. ఇది సత్యవాక్కు. ఇది జరిగి తీరవలసినదే" విదురుని నోట శాపము వంటి పదములు వచ్చినవి. "ద్రౌపదికి సకల సామ్రాజ్య మహోత్సవపు యోగ్యత ఉన్నది. ద్రౌపది పాండవులకు ధర్మపత్ని. పాండవులు సామాన్యులు కారు. అసమాన శౌర్యపత్రాపములు గలవారు. వారు కలసర్పముల వంటివారు. నీవు మూర్ఖుడవు. వారిని ఉసికొల్పుచున్నావు. చావు కొని తెచ్చుకోనుచున్నావు. జూదమాడి కుటుంబమును నాశనము చేయుచున్నావు. దుర్యోధనా! విజయ గారవమున వివేకము కోల్పోయినావు. ద్రౌపదిని సభకు తెచ్చుటకు నన్ను పంపుదువా! ఛీ" అని మాటలు లేక మౌనము వహించినాడు విదురుడు.
    దుర్యోధనుడు విదురుని మాటలకు మండి పడినాడు. గర్జించి ప్రాతిగామిని పిలిచినాడు. "ప్రాతగామీ! విదురునికిది అలవాటు. సర్వదా అనిష్టవాక్యములు పలుకును. మన గెలుపు సహించదు. విదురుడు పాండవులకు భయపడుచున్నాడు. నీవు వెళ్ళుము. ద్రౌపదిని సభకు తీసుకొని రమ్ము" అని ఆజ్ఞాపించినాడు.
    ప్రాతిగామి ద్రౌపది వద్దకు వెళ్ళినాడు. సవినయముగా నమస్కరించినాడు. విన్నవించినాడు :-
    "తల్లీ! ద్రౌపదీ! నీ భర్త జూదమందు సకల సంపదలను, రాజ్యమును , పుత్రులను, తమ్ములను తనను ఓడినాడు. తుదకు నిన్నును జూదమున ఒడ్డినాడు. ఓడినాడు. మహారాజు దుర్యోధనుడు నిన్ను సభకు తెమ్మని నన్ను పంపినాడు . నేను వచ్చినాను. నీవు ఆలస్యము చేయక దుర్యోధన మహారాజు వద్దకు రమ్ము."
    ద్రౌపది మనసు కుత కుత ఉడికినది. ఆమెలో దుఃఖము కోపము ప్రజ్వరిల్లినవి. అయినను నిగ్రహించుకున్నది. ఆమె ధర్మమును ప్రశ్నించినది. ధర్మరాజును ప్రశ్నించినది అడిగినది. "ప్రాతిగామీ! యుగములు ఎన్నో గడచినవి. ఏ యుగమందును ఇంతటి దుర్మార్గము జరుగలేదు. జూదరి ఎంత దుర్మార్గుడయినను భార్యను జూదమున ఒడ్డుట ఎరుగము. ధర్మరాజు నన్ను జూదమున ఒడ్డినాడు, ఓడినాడు అని చెప్పినావు. ఇది ఇంతకు పూర్వము జరుగనిది. అది అటుండనిమ్ము జూదమందు ధర్మరాజు నన్నోడి తానోడినాడో, తన్నోడి నన్నోడినాడో చెప్పుము. ఇది నీకు తెలియకున్న జూదరి అయిన ధర్మరాజునే ఈ విషయము అడిగి రమ్ము. అప్పుడు నేను సభకు వత్తును."
    ప్రాతిగామి సభకు వచ్చినాడు ద్రౌపది అడిగిన ప్రశ్నను ధర్మరాజును అడిగినాడు. ధర్మరాజు భిన్నుడయి ఉన్నాడు. దుఖమున మునిగి ఉన్నాడు. అతడు మౌనము వహించినాడు. మాట్లాడలేదు. తలదించుకున్నాడు. వంచుకున్నాడు. సభసాంతము చిత్తరువువలె ఉన్నది. గంభీరముగా ఉన్నది. దుఃఖతప్తమయి ఉన్నది. సభకు మాట పెకలలేదు. మూగది అయినది. "ప్రాతిగామీ! దుర్యోధనుడు అరచినాడు" తన సందేహము సభను అడిగి తేల్చుకొనుటకు ద్రౌపదికి ఇక్కడికి రమ్మనుము. భయపడకుము. త్వరగా వెళ్ళి ద్రౌపదిని తెమ్ము" అని గర్జించినాడు. ఆజ్ఞాపించినాడు.
    ప్రాతిగామి మరల ద్రౌపది వద్దకు వెళ్ళినాడు. "అమ్మా! నీవు అడిగిన ధర్మసంశయము నిర్ణయించుటకు నిన్ను తీసుకొని రమ్మని సభవారు నన్ను పంపినారు. నీవు సభకు రమ్ము" అని విన్నవించినాడు.
    ద్రౌపది అది విన్నది. ధర్మరాజు అశక్తత గ్రహించినది. దుర్యోధనుని దుర్మార్గము అర్ధము చేసుకున్నది. ఆమెలో కోపము పొంగినది. అప్పుడు ద్రౌపది రజస్వల అయి ఉన్నది. ఏకవస్త్రము ధరించి యున్నది. కన్నీరు రాల్చుచున్నది. నేలను చూచుచు ప్రాతిగామి వెనుక నడచినది. సభకు వచ్చినది. కురు వృద్దుల వద్ద నిలిచినది.
    తేజోహీనులయిన పాండవులు ద్రౌపదిని చూచినారు. ఆమె దీనస్థితిని చూచినారు. నిస్సహాయులయి తలలు వంచుకున్నారు. దుర్యోధనుడు పాండవులను చూచినాడు. ద్రౌపదిని చూచినాడు. సంతోషాతిరేకమున అరచినాడు. "తమ్ముడా! దుశ్శాసనా! ద్రౌపదిని సభా మధ్యమునకు ఈడ్చుకొని రమ్ము" అన్నాడు. దుశ్శాసనుడు ద్రౌపది వైపుకు నడిచినాడు. వానిని చూచి ద్రౌపది భయపడినది. గాంధారి వద్దకు ఉరికినది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.