Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    ద్యావాపృథ్వులకు ఇంద్రుడు వరములు ఇచ్చిన విషయము తెలిసికొన్న వానికి వరములు లభించును.

    ద్యావాపృథ్వుల అనుగ్రహముననే ఇంద్రుడు వృత్రుని సంహరించినాడు.

    8.  వృత్రుని వధించిన ఇంద్రుని చుట్టు దేవతలు కూడినారు. వారు తమకొరకు హవిస్సు వహించవలసినదని అగ్ని సోములను అర్థించినారు.

    "మేము చిరకాలము వృత్రుని దంతముల క్రింద నలిగినాము. మాతేజస్సును కోల్పోయినాము. ఆ తేజస్సు వృత్రుని వద్దనే ఉన్నది" అన్నారు అగ్నిసోములు.

    వృత్రుని నుండి ఆ తేజస్సు తేగల సమర్థులెవరు? అని దేవతలు తమలో తాము చర్చించుకున్నారు. గోవు అందరకు మిత్రము. అదియే వృత్రుని లోనికి చొచ్చి తేజస్సుకొని రాగలదని నిశ్చయించినారు. వారు గోవును అర్థించినారు.

    "నేను వృత్రుని నుండి అగ్నిసోముల తేజస్సు తెచ్చెదను. కాని ఆ తేజస్సు నాయందే నిలువవలెను. ఆ ఉభయ తేజస్సులు నాయందలి ఆహారములందు చేరవలెను" అను వరమును గోవు కోరినది.

    దేవతలు ఆ వరమును ఇచ్చినారు. గోవు వృత్రుని నుండి తేజస్సు తెచ్చినది. ఆ వరము వల్లనే గోవు నందలి పాడి పదార్థములు ఆహారపదార్థములు అయినవి.

    ఆజ్యము అగ్నియొక్క తేజస్సు పాలు సోముని యొక్క తేజస్సు. అగ్ని సోముల తేజస్సును ఈ విధమని తెలిసికున్నవాడు తేజస్వంతుడు అగును.

    9.  పౌర్ణమాస కర్మకు దేవత ఎవరు? అని విద్వాంసులు చర్చించినారు. అది ప్రజాపతి దేవతాకమని నిర్ణయించినారు.

    ఇంద్రుడు ప్రజాపతికి జ్యేష్ఠపుత్రుడు. ప్రజాపతి ఈ కర్మచేతనే తన పుత్రుడగు ఇంద్రునకు స్థిరనివాసము కల్పించినాడు. అందువలననే లోకము నందలి తండ్రులందరు తమ జ్యేష్ఠ పుత్రునకు అజీవన పర్యంతమునకు ధనము చేకూర్చుచున్నారు.

                                      నాలుగవ అనువాకము

    1.  ఇంద్రుడు వృత్రుని సంహరించినాడు. వృత్ర సంబంధులు కోపించినారు. ఇంద్రుని ముట్టడించినారు. ఇంద్రుడు భయపడినాడు. గడగడలాడినాడు.

    ఇంద్రుడు అప్పుడు వైమృధకర్మను గుర్తించినాడు. పూర్ణిమనాడు ప్రధానకర్మ తదుపరి వైమృధ పురోడాశమును నిర్వాపము చేసినాడు. ఆ పురోడాశము చేతనే ఇంద్రుడు శత్రువులను దూరము చేసినాడు.

    2. అది పూర్ణిమ కావలెను. ప్రధాన కర్మ పూర్తి కావలెను. అప్పుడు వైమృధమును నిర్వాపము చేయవలెను. అందువలన యజమాని శత్రువును దూరము చేయును.

    3. ఇంద్రుడు వృత్రుని వధించినాడు. భయపడినాడు. పారిపోయినాడు. అందువలన తనతోటి దేవతలను, తన సామర్థ్యమును దూరము చేసికొన్నాడు.

    అప్పుడు ఇంద్రుడు అగ్ని దేవతాకమగు అష్టాకపాల పురోడాశమును - ఇంద్ర దేవతాకమగు దధిని నిర్వాపము చేసినాడు. అందువలన ఇంద్రుడు తనదేవతలను, తన సామర్థ్యమును తిరిగి పొందినాడు.

    4. అమావాస్యనాడు అగ్ని దేవతాకమగు అష్టాకపాల పురోడాశమును, ఇంద్రసంబంధమగు దధిని నిర్వాపము చేయవలెను. అందువలన దేవతల అనుగ్రహము, సామర్థ్యము కలుగును.

    5. ఇంద్రుడు వృత్రుని వధించినాడు. అప్పుడు అతని సామర్థ్యము భూమి మీద వివిధ ఓషధుల, లతల రూపము దాల్చినది.

    ఇంద్రుడు ప్రజాపతికి తన సామర్థ్యము ఓషధులు గను, లతలుగను రూపుదాల్చుటను గురించి చెప్పినాడు. ప్రజాపతి ఆ సామర్థ్యమును తెచ్చి ఇంద్రునకు ఇవ్వవలసినదని పశువులను ఆజ్ఞాపించినాడు.

    పశువులు ఓషధుల, లతల సామర్థ్యమును తనలో చేర్చుకున్నవి. దానికి 'సాంనాయ్య' మని పేరు. దానిని గోవుల నుండి ఇంద్రుని కొరకు పితుకుట వలన అది 'ప్రతిధుక్' అయినది.

    6. "ప్రజాపతీ! నీ ఆజ్ఞవలన పశువులు వృక్షలతాదుల నుండి సామర్థ్యమును ధరించినవి. క్షీరరూపమున నాకు అందించినవి. నాకు ఆ సామర్థ్య రూపక్షీరము జీర్ణముకాలేదు" అని ఇంద్రుడు అన్నాడు.

    సామర్థ్యరూపక్షీరమును ఇంద్రునియందు పక్వము చేయుడని ప్రజాపతి పశువులను ఆజ్ఞాపించినాడు. అందు ననుసరించి పశువులు ఇంద్రుని యందు క్షీరములు పక్వము చేసినవి. ఆ ఇంద్రియ సామర్థ్యరూప క్షీరమే ఇంద్రునియందు నిలిచి ఉన్నది.

    7. పశువులు ఇంద్రియ సామర్థ్యము తెచ్చినవి. పితికినవి. పక్వము చేసినవి. అయినను తనకు తృప్తి కలుగలేదని ఇంద్రుడు ప్రజాపతితో చెప్పినాడు. పిండిన పాలను పెరుగు చేయమని ప్రజాపతి చెప్పినాడు. వారు పాలను దధిగా మార్చినారు. పెరుగువలన ఇంద్రునకు తృప్తి కలిగినది. సంతృప్తి నిచ్చినందువ దానికి 'దధి' అను స్థారక నామము కలిగినది.

    8. పెరుగు క్రితపు రాత్రి కూర్చబడును. కావున పాలకన్న ముందు పెరుగును జుహువులోనికి అవదానము చేయవలెనని పెద్దలు చెప్పుచున్నారు.

    9. తొలుత పెరుగును అవదానము చేయుటమాని ముందు పిండిన పాలనే అవదానము చేయవలెను. అందువలన యజమానికి ఇంద్రియ సామర్థ్యరూప క్షీరములను ఇచ్చినట్లగును. తదుపరి దధినిచ్చినందున సంతోషము కలిగించినట్లగును. అందువలన 'ముందు పాలు' తదుపరి పెరుగు అను ఉత్పత్తి క్రమమును పాటించినట్లగును.

    10. పూతీకాదులను తీవలచే తోడుపెట్టిన పెరుగు సోమాదులకు ప్రియమగును. పాలలో పెరుగు తోడు పెట్టినది ఇంద్రునకు ప్రియము. కావున ఇంద్రుని కొరకు పాలలో తోడుపెట్టి పెరుగు చేయవలెను.

    11. యజ్ఞము అవిచ్చిన్నముగ సాగుటకు అగ్ని హోత్రయాగమునందు మిగిలిన 'యవాగు' తో పాలలో తోడు పెట్టవలెను.

    12. ఇంద్రుడు వృత్రుని వధించినాడు. అసురులకు అపరాధము చేసినాను అనుకున్నాడు. భయపడి చాల దూరము వెళ్లిపోయినాడు. ఇంద్రుని వెదకి మొదలు తెచ్చినవారికి ప్రథమ హవిర్భాగము నిత్తునని ప్రజాపతి ప్రకటించినాడు. పితృదేవతలు ఇంద్రుని వెదకి మొదట తెచ్చినారు. అందువలన యజ్ఞమునకు పూర్వ దినమున పితృదేవతలకు పిండపితృయజ్ఞము చేయబడుచున్నది.

    13. పితృదేవతలు వెదకి తెచ్చిన ఇంద్రుడు అమావాస్య నాడు మరలి వచ్చినాడు. దేవతలు ఇంద్రునకు ఎదురేగినారు. మనకు శ్రేష్ఠమగు ధనము లభించినది అనుకున్నారు. ఇంద్రుడే కదా దేవతలకు ధనము! అందువలన అమా అనగా ఇంద్రుడనెడి శ్రేష్ఠధనము వసతి ఉంటున్నది అను అమావాస్యార్థము అయినది.

    14. సాంనాయ్యమను హవిస్సునకు దేవత ఎవరు అని శాస్త్రజ్ఞులు చర్చించినారు. విశ్వేదేవతలు ఆ భాగధేయమును అభిలషించి వచ్చిరి కదా! అందువలన అది విశ్వేదేవతాకమని పెద్దలు చెప్పినారు.

                                     మరొకపక్షము ఏమనగా: -

    ఇంద్రునకు గల భయము పోగొట్టి అతనిని సమాధాన పరచి తీసికొని వచ్చుటకే దేవతలందరు అతనికి ఎదురేగినారు. కాని సాంనాయ్య హవిస్సునందలి కోరికతో కాదు. కావున ఈ హవిస్సు ఇంద్ర దేవతాకమనియే చెప్పవచ్చును.

                                     నాలుగవ అనువాకము

    1. దర్శపూర్ణమాస యాగములను ఇంద్రసహితముగ చేసిన వాస్తవముగా దర్శపూర్ణమాస యాగము చేసినవాడు అగును అని బ్రహ్మవాదులు చెప్పుచున్నారు. పూర్ణిమనాడు ప్రధానకర్మ తరువాత విమృద్దేవతాక ఏకాదశ కపాలపురోడాశమును నిర్వాపము చేయవలెను. ఆ విధముగా నిర్వాపము చేసినందున పూర్ణమాస యాగము ఇంద్రసహితము అగును. అమావాస్య నాడు ఇంద్రదేవతాకమగు దధిని నిర్వాపము చేయవలెను. అందువలన దర్శపూర్ణయాగము ఇంద్రసహితము అగును. ఆ విధముగా చేసిన యజమానికి ఉత్తరోత్తర ధనాధిక్యత కలుగును.

    2. దేవతలు అనుష్ఠించిన యజ్ఞములనే అసురులు కూడ అనుష్ఠించినారు. అందువలన దేవాసురులు సమానముగా ఉన్నారు. అందుకని దేవతలు పూర్ణమాస యాగమునందు మరొక ఇష్టిని చేర్చినారు. అందువారు అగ్ని, విష్ణు దేవతాకమగు ఏకాదశ కపాల పురోడాశమును, సరస్వతీ, సరస్వద్దేవతలకు చరు హవిస్సును నిర్వాపము చేసినారు. ఇందువలన దేవతలు విజయులు అయినారు. అసురులు పరాజితులు అయినారు.

    3. శత్రువులున్న వాడు పూర్ణమాస యాగమును అనుసరించి అగ్ని వైష్ణవ ఇష్టిని ఆచరించవలెను. అనగా ప్రధానకర్మ తరువాత అగ్నావైష్ణవ హవి నిర్వాపము చేయవలెను. పూర్ణమాస యాగము వలన శత్రువు మీద వజ్రప్రహారము జరుగును. అగ్నావైష్ణవము వలన శత్రువు యొక్క దేవతలు, వారి యజ్ఞము, సరస్వతీ, సరస్వద్దేవతలకు సంబంధించిన పశుమిథునములు నశించును. శత్రువు యొక్క ధనము సాంతము నశించును.

    4. శత్రువులు కలవాడు పూర్ణమాస యాగమునే చేయవలెను. అమావాస్యనాడు దర్శయాగము చేయరాదు. అందువలన శత్రువును సంహరించినట్లును - దర్శయాగ పరిత్యాగము చేత శత్రువు ఆప్యాయమును పరిత్యజించినవాడగును.

    5. పశువులు కోరువాడు 'సాకంప్రస్థాయి' యాగము చేయవలెను.

    రాజునకు స్వల్పద్రవ్యము ఇచ్చుటవలన అతడు తృప్తి చెందడు. ఇతరులకు ఇవ్వజాలడు. రాజునకు అధిక ద్రవ్యము పన్నుగా చెల్లించిన రాజు తృప్తిచెందును. ఇతరులకు ఇవ్వజాలును.

    అట్లగుట వలన ఇంద్రునకు అధికక్షీరద్రవ్య యుక్తమగు హోమము చేయవలెను. అందువలన ఇంద్రుడు తృప్తి చెందును. యజమానికి సంతృప్తి కరమగు సంతానమును, పశువులను ప్రసాదించును.

    6. చెక్క పాత్రతో హోమము చేయవలెను. మట్టి పాత్ర ఆహుతులను అందుకొనదు.

    7. దారుపాత్ర మేడి కర్రది కావలెను. మేడి బలస్వరూపము. పశువులు బలస్వరూపములు. కావున ఔదుంబర పాత్రవలన యజమానికి బలము గల పశువులు లభించును.

    8. సంపద లేనివాడు మహేంద్ర యాగము చేయరాదు.

    వేదత్రయము తెలిసినవాడు, గ్రామాధ్యక్షుడు, రాజు ఈ ముగ్గురే సంపద కలవారు.

    తన దేవతను విడిచి ఇతర దేవతకు యాగము చేయువాడు తనదేవత అనుగ్రహమును కోల్పోవును. అన్యదేవతల అనుగ్రహము పొందజాలడు. అతడు సంపద లేనివాడు అగును.

    9. సంవత్సర కాలము ఇంద్రుని యాగము చేయవలెను. అంతకు మించి చేయరాదు. అందువలన తనదేవతయే యజమానికి యాగములకు అవసరమగు సంపదను చూపును. అతడు మిక్కిలి ధనవంతుడు అగును.

    10. సంవత్సర కాలపు యజ్ఞము పూర్తి అయినంత వ్రతపతి యగు అగ్ని కొరకు అష్టాకపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను. అందువలన యజమాని సంవత్సర ఇంద్ర అనుష్ఠానము వలన వృత్రుని సంహరించినట్లగును. అందువలన యజమానికి మహేంద్ర యాగానుష్ఠాన అర్హత కలుగును.

    11. వ్రతపతి ఇష్టి చేసిన తరువాత యజమాని ఇంద్ర, మహేంద్ర యాగములలో దేనినైన చేసికొనవచ్చును.

                                       అయిదవ అనువాకము

    1. దర్శయాగము చేసిన యజ్వ సోమయాగము చేయక ముందు సాం నాయ్యము చేయరాదు. సోమయాగము చేయక ముందు అతని పయస్సు సరిపోదు. సోమ యాగము చేయకముందు సాంనాయ్యము చేసినవాడు దొంగతనము చేసిన వాడు - అన్యాయము చేసినవాడు అగును. కావున అతడు నశించును.

    అందువలన సోమయాజియే సాంనాయ్యము చేయవలెను. పయస్సే సోమము. పయస్సు సాంనాయ్యము అగును. కావున సోమయాజి పయోరూప సోమము చేతనే పయస్సును తనయందు ధరించును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.